నారాయణ మూర్తి గారి మొహం నల్లబడింది. ప్రసాద్ లో తెగింపు అయన గుర్తించారు. 'అయితే యింతకీ ఏమంటావు....?" నిబ్బరంగా ఏం జరగనట్టు ప్రశాంతంగా అన్నారాయన.
"ఏం లేదు, నాకు డబ్బు కావాలి. ఏ డబ్బు కోసం యీ పెళ్ళి చేసుకున్నానో ఆ డబ్బయినా నాకు దక్కాలి. మీరిస్తానన్న ఆ డబ్బు నాకు యివ్వండి" ఖచ్చితంగా అన్నాడు.
పరిస్థితి గ్రహించి అయన ప్రసాద్ ని మరింత రెచ్చగొట్టడం మంచిది కాదని "అలాగే లలతో చెపుతాను" చూడు బాబూ, యిదంతా మీ కోసం కాకపోతే మరెవరి కోసం ....ఏదో మీ కడుపునా నలుగురు పుడితే చూసి అనందించాలన్న కోరిక తప్ప మరేం లేదు నాకు....నా కోరికల్లా లత నీవు హాయిగా వుండాలన్నదే.
అయన ధోరణికి ప్రసాద్ ఆవేశం దిగజారింది. తను పెద్దాయనతో అంత దురుసుగా మాట్లాడక పోవాల్సింది అనిపించింది. అయన మంచివాడే. ఆ కూతురు అలాంటిదయితే ఈయనేం చేస్తాడు అనుకున్నాడు. సరే డబ్బు యిస్తానన్నాడు కదా అని తృప్తి గా నిట్టూర్చాడు.
* * * *
'అక్కా.....మూర్తిగారిని ఏమన్నావు....ఆయన పాపం ఏదో ఘోరాపరాధం చేసినవాడిలా మొహం తిప్పుకుని వెళ్ళిపోతున్నారు. అదేం అలా వున్నారని అడిగాను ఓరోజు ...." మాలతి ఓరోజు సాయంత్రం వసంతని అడిగింది.
"ఏం, ఏం చెప్పాడు ....ఏమన్నానన్నాడు?" కుతూహలంగా అడిగింది.
'అతనేం అనలేదే పాపం. ఈమధ్య మనయింటికి రావడం లేదు. రోడ్డు మీద ఇదివరకు కనిపిస్తే నవ్వుతూ పలకరించేవాడు. ఇప్పుడు మొహం తిప్పుకుని వెళ్ళిపోతున్నాడు పాపం మొహం వాడిపోయింది. ఈ రోజు నేనే పలకరించి "ఏమండీ అలా చూసి చూడనట్టు వెళ్ళి పోతున్నారేం , ఏదో దెయ్యాన్ని చూసినట్టు జడుసుకుని.....పారిపోతున్నారేం" హాస్యంగా అన్నాను. పాపం అతను మరింత మొహం మాడ్చుకుని " ఎందుకు లెండి . మీ వసంతగారు....ఆవిడకి నేనంటే కోపం, నేనేదో అల్లరి చిల్లర వాడిననుకొంటున్నారావిడ. నేనలాంటి వాడిని కాను. నాకలాంటి ఉద్దేశం లేదండి.... ఆవిడ అంగీకరిస్తే పెళ్ళాడాలనుకున్నాను" అంటూ మొహం తిప్పుకుని గబగబా వెళ్ళిపోయాడు. అతన్నేం అన్నావు మాలతి కాస్త కోపంగా అంది.
"మధ్య నీకెందుకే కోపం.....పెద్ద హీరోననుకుని వెధవ ఫోజులు కొడితే నాలుగు దులిపెసరికి తోక ముడిచాడు. ఈయన గారి జిడ్డు మొహం, చేసే ఉద్యోగం చూసి ఆడపిల్లలు మొహిన్చేస్తారనుకున్నాడు గాబోలు. పబ్లిక్ గార్డెన్ కి రమ్మని పిలిచాడు. వెడితే ప్రేమిస్తానంటూ పిచ్చి వేషాలు వేసేవాడు....నాలుగు దులపగానే ఆరోజు నించి వెంటబడడం మానాడు..... పీడ వదిలింది ..." అంది వసంత.
"ఎందుకు పిలిచాడో , వెళ్ళి అడిగితె తప్పేముంది.....అతనలాంటి వాడు గాదు. పాపం అమాయకుడు, మంచివాడు, నీకంటికి అతనానలేదు. లేకపోతే.....ఏ పెద్ద ఉద్యోగం చేసేవాడో అయితే మహా చక్కగా వెళ్ళేదానివి...."
మాలతి మాటల్లో నిజం ముల్లులా గుచ్చుకుంది. చివుక్కున తలెత్తి పౌరుషంగా 'నిజమే, నాకు నచ్చితే ఎందుకు వెళ్ళను....నీవు నాకేం చెప్పనక్కర లేదు. పాపం అతనంటే అంత జాలి , ప్రేమ వుంటే చక్కగా పెళ్ళాడు ...." ఉక్రోషంగా అంది.
"అతను నన్నడిగి వుంటే తప్పక చేసుకునేదాన్ని నీకిష్టం లేకపోతే మర్యాదగా అక్కడికి వెళ్ళి తిరస్కరించవచ్చు. నడిరోడ్డు మీద దులపడం ఎందుకు. పెద్ద ఏదో పతివ్రతలా....
"నా యిష్టం....వెధవని చెప్పుచ్చుకు కొట్టనందుకు సంతోషించమను. నీతో కంప్లయింట్ చేస్తాడా ....వాడి మీద నీకు సానుభూతా....నా నా యిష్టం వచ్చినట్లుంటాను నాకిష్టం లేకపోతే , అడగటానికి నువ్వెవరు ?" వసంతకి ముక్కు మీదకి కోపం వచ్చేసింది.
నేనెవరిని కాను....కాని...ఏదో సామెత లాగ పిలిచి పిల్లనిస్తే అన్నట్టు అతను నీమీద యింటరెస్టు చూపించాడని చుల్కన చేశావు ఏం అతని కంటే గొప్పవాడిని నాన్న తెగలరనుకుంటున్నావా......కావాలని కట్నం అది లేకుండా చేసుకునేవాడు . యిద్దరు, ఉద్యోగాలు చేస్తున్నారు చక్కగా.
"ఆ....మహాచక్కగా వుండేవాళ్ళం. ఆయనగారి కొచ్చే జీతం నా జీతం ఈరోజుల్లో తిండికే సరిపోదు. యింతకీ అబ్బ, ఆ జిడ్డు మొహం వాంతి మొహం ' డొకోస్తున్నట్టు యాక్షన్ చేసింది వ్యంగ్యంగా నవ్వుతూ. అమె ధోరణికి మాలతి నిట్టూర్చి లోపలికి వెళ్ళిపోయింది.
ముందు నించి వసంత మూర్తిని చుల్కన చేస్తూ ఎగతాళి గా మాట్లాడడం అది మాలతికి తెలుసు. మూర్తి అంటే ఆమెకి కొద్దిపాటి పరిచయం లోనే సదబిప్రాయం కల్గింది. సింపుల్ గా, స్నేహంగా, అభిమానంగా మాట్లాడే అతను వసంతకి ఎందుకు నచ్చలేదో, ఎందుకలా దులపరించుకుంటుందో అర్ధం కాలేదు. అతనింటికీ వస్తే ముళ్ళ మీద కూర్చున్నట్టు రెండు నిమిషాలు మాట్లాడి ఏదో వంకతో లోపలి కెళ్ళి పోయేది. ఒక్కడిని వదిలి వెళ్ళిపోవడం మర్యాద కాదని మాలతో శంకరో కూర్చుని మాట్లాడే వారు. ఆవిధంగా వసంత కంటే మాలతి కె అతనితో చనువు ఎక్కువయింది. మూర్తి యింటరస్ట్ ఏమిటో, అతనింటికీ ఎందుకు వస్తున్నాడో మాలతి ఊహించింది. కాని వసంత అది పడనీయదని తెలుసు. అయినా ఈరోజు మూర్తి మొహం చూస్తుంటే వసంత అహంకారాన్ని క్షమించలేక పోయింది. తల్లి దగ్గిర ఆ మాట చెప్పకుండా వుండలేక పోయింది.
"అయ్యొయ్యో ....దీని కెంత పొగరు.....ఆ అబ్బాయి పాపం మంచి వాడు, అతనంతట కావాలని చేసుకోవాలనుకుంటే దీనికేం తెగులోచ్చింది. పెద్ద అందగత్తెననుకుని విర్రవీగుతుంది. నిక్షేపంలా ఉద్యోగం చేస్తున్నాడు, మంచి కుటుంబం .... ఏం వచ్చింది దీనికి లోటు, ఈవిడ గారి అందానికి ఏ జమీందారు బిడ్డో వస్తాడనుకుంటుందా ఏమిటి...' ఆవిడకి చాలా కోపం వచ్చి వసంత ని పిలిచి చెడామడా తిట్టింది.
వసంత ఉక్రోషంగా మాలతిని మింగేసేట్టు చూసింది. నీ పని చెప్తానుండు అన్నట్టు చూసింది....."నేను లక్ష సార్లు చెప్పాను, చెపుతున్నాను ఆ జిడ్డు మొహాన్ని చచ్చినా చేసుకోను. పెళ్ళి లేకపోతే పీడా పోయింది గాని గుమస్తా ని చేసుకోను.....లోకంలో యింకేవడూ దొరకడని, అయనగారడగగానే కతాక్షించావు అని కాళ్ళ మీద పడాలా.....అమ్మా మీ అందరికి అంతగా నచ్చితే మూడో కూతురి నిచ్చి చేయి పెళ్ళి ఆవిడగారు బోలెడు సానుభూతి చూపిస్తుంది పాపం, నన్ను మాత్రం యింకోసారడగవద్దు....ఛా..... వెధవ టెస్టులు వీళ్ళూనూ, శుభ్రంగా వుద్యోగం చేసుకుంటున్నానని ఏడుపు" మాలతి వంక కోపంగా చూసి విసవిస వెళ్ళిపోయింది వసంత. తల్లి కూతుళ్ళు మొహాలు చూసుకున్నారు.
"లాభం లేదమ్మా, దాని కోర్కెల స్థాయిని మీరందుకోలేరు. అది ఏ ఆఫీసరునో కాని పెళ్లాడదు. దాని పెళ్ళి అదే చేసుకుంటుంది. మీరు మాట్లాడక వూరుకోండి" రొట్టెలు వత్తుతూ కమల అంది.
"నిక్షేపం లాంటి సంబంధం వచ్చినపుడు చెడగొట్టుకుంది. తరువాత అదే అనుభవిస్తుంది. ఏమిటో వీళ్ళ పెళ్ళిళ్ళు ఎలా అవుతాయో దేముడి కెరిక" ఆవిడ నిట్టూర్చింది.
* * * *