కుడియెడమల దగాదగా
సునీతకి ఆరో పెళ్ళి చూపులు ఆరోజు! ఆ పిల్ల కాస్త నోరు మూసుకుంటే బాగుండు. ఈ సంబంధమైనా కుదురుతుంది. అని కన్నతల్లి ఆరాటం! చదువుకుని, ఉద్యోగం చేస్తూ, ఐదువేలు సంపాదించుకుంటున్న కూతురు అభిప్రాయాలతో తండ్రిగా ఏకీభవించినా లోకం పోకడకి వ్యతిరేకంగా కూతుర్నీ అర్ధం చేసుకునే వరుడు, వరుడి తరుపువారు ఇప్పటివరకు తటస్థపడనందుకు , కూతురి వయసు మీరిపోతుందని లోలోపల బెంగపడే తండ్రి ఆరాటం! నాకేవరికి అభిప్రాయాలతో పనిలేదు. నా అభిప్రాయం నాది. నాకు వ్యక్తిత్వం ఉంది. నా అభిప్రాయాలు నచ్చిననాడే చేసుకుంటాడు. లేదంటే పెళ్ళి కాకపొతే, ఆలస్యం అయితే కొంపెం మునిగిపోదని సునీత భరోసా!
పెళ్ళివారు వచ్చారు. చూశారు . సునీత కుండబద్దలు కొట్టినట్టు అన్నమాటలు విన్నారు. మొహాలు చూసుకున్నారు. "వెళ్ళి వస్తాం' అంటూ జారుకున్నారు. "నీకీ జన్మకు పెళ్ళి కాదు. నీ పద్దతి మార్చుకోకపోతే...!!"" కూతురి మీద అంతెత్తు ఎగిరింది సావిత్రి పెళ్ళి వారు ముఖాలు మాడ్చుకు వెళ్ళగానే .
"నా పద్దతి ఏం మార్చుకోవాలంటావు?: సునీత తల్లి మీద అంతకంటే ఎగిరింది.
'అదే పొగరుమొత్తనం తగ్గించుకోకపోతే ఏ తలమాసినవాడు కూడా చేసుకోడు. ఆడపిల్లని కాస్త నమ్రత అలవరచుకోకపోతే 'చూపులనాడే ఇలా మాట్లాడింది. రేపు కాపురం ఏం చేస్తుంది?' అన్న సందేహం వస్తుంది. ఎవరికన్నా నీ ధోరణి చూస్తె, పిల్లాడి సంగతి నీవు చూసుకో, మిగతావి మేం చూసుకుంటాం. అంటే పెద్ద ఆదర్శవాడిలా ఈవిడగారికే లోకంలో ఎక్కడా లేని ఆదర్శాలున్నట్టు మహా తనే ఉద్యోగం చేసి సంపాదిస్తున్నానన్న పొగరుతో.....ఆడదాని కింత పొగరు వుండకూడదే!' సావిత్రి గొంతు కోపంతో వణికింది.
"ఓహో మగాడికే పోగరుండవచ్చుననన్నమాట! చదువుకున్న నీవు ఇలా మాట్లాడబట్టే ఎన్నాళ్ళయినా మనం ఇలాగే ఉన్నాం. ఇంతకీ నేనేం తప్పు మాటన్నానో వివరిస్తారా...." వ్యంగ్యంగా అంది.
'లోకంలో నీవోక్కర్తినే పెళ్ళాడుతున్నావా? అచ్చట ....ముచ్చట....సంప్రదాయరీతిలో వాళ్ళ కొడుకు పెళ్ళి జరగాలని వాళ్ళనుకుంటే అది తప్పా? నాకంటే సరదా చట్టుబండలు లేవు. అవతలివారికి ఉండకూడదంటే ఎలా?' తీక్షణంగా అంది.
"అమ్మా , పెద్ద ఆదర్శ వాదుల్లా ఫోజు పెట్టి "అబ్బే మాకేం కట్నాలు అక్కరలేదు. పెళ్ళి బాగా చేయండి' అంటూ మొదలు పెడతారు. కట్నాలు లేకపోయినా కాస్త అచ్చటా ముచ్చటా ఉండాలిగా ... కాస్తయినా ఇచ్చి పుచ్చుకోడాలు తప్పవు గదా అని ఓ వెకిలి నవ్వు పారేస్తారు. అప్పగింత బట్టలన్నా ఉండాలిగా ....అంటూ ఇంటిల్లిపాదికి బట్టల లిస్టు అబ్బాయికి సూటు, ఉంగరం, తప్పదు కదా.... ఒక్కతే ఆడబడుచు, మళ్ళీ మళ్ళీ అన్న పెళ్ళి ముచ్చట ఉంటుందా , వెయ్యి నూటపదార్లు , వెండి బొట్టు, పెట్టె అత్తగారికి , ఆడపడుచుకి ఇవ్వండి . అని దీర్ఘాలు . ఇద్దరం ఇక్కడే ఉన్నాంగా రెండుసార్లు డిన్నర్లు ఎందుకు? ఇద్దరం కలిసే ఇద్దాం అంటూ ఉదారంగా మాట్లాడేసి సగం మనచేత ఖర్చు పెట్టించి వాళ్ళ వాళ్ళు ఓ ఐదువందల మంది వస్తారు అంటారు కాస్త మంచి హాలు బుక్ చేయండి బాత్ రూములు బాగుండాలి. అమ్మాయి అల్లుడు అమెరికా నుంచి వస్తారు. ఈ నీళ్ళు అవీ తాగరు. మినరల్ వాటర్ ఉండాలి. పెద్దపెద్ద వాళ్ళు వస్తారు మెనూ బాగుండాలి. కట్నం వద్దన్నవాళ్ళు ఇచ్చే పెద్ద లిస్టు ఇది. అంతా కలిసి రెండు లక్షలవుతుంది...."
'చూడు సునీతా, ఇదంతా ప్రతి ఆడపిల్ల తల్లిదండ్రులు చేస్తున్నదే కదా. మనం ఒక్కరమే కాదు కదా!' తల్లి కూతుళ్ళ వాదన విన్న చలపతిరావు అందుకున్నాడు మధ్యలో.
'అదే నాన్నా నేనంటున్నది.....కట్నం లేకుండా ఈ లక్షల ఖర్చేమిటి? రోజురోజుకీ ఖర్చు తగ్గడం అటుంచి కాంపిటీషన్లు మాదిరి డెకరేషన్లు, లైట్లు, ఇవి అవి అంటూ మరింత పెరిగిపోతోంది. పెళ్ళి సింపుల్ గా చేసుకుందాం అంటే నేనేదో నేరం చేసినట్లు చూస్తారేమిటి? రిజిస్టరు పెళ్ళి చేసుకుని అంతగా కావాలంటే గుళ్ళో పూస్తే కట్టించుకుని, దగ్గర వాళ్ళకి పార్టీ ఇచ్చుకుందాం అన్న నా పాయింటుని అర్ధం చేసుకోకుండా నన్ను తప్పుపడతారేమిటి?" తీక్షణంగా అంది.
"ఆ....మా అమ్మాయిని మీ ఇంటికి కట్టు బట్టలతో పంపిస్తాం, తీసికెళ్ళండి.....అంటే మహాభాగ్యం అనుకుని ఈ మాత్రం పిల్ల దొరకదన్నట్లు తీసుకెళ్ళే విశాల హృదయులు ఈ తరంలో ఉండరులే! నీ పిల్లలకి అలా చేద్దువు గాని ' సావిత్రి వ్యంగ్యంగా అంది.
"మన ఆలోచనల ధోరణి మార్చుకుంటే ఈ తరంలోనే చేసి చూపించవచ్చు. నేనేం కట్టుబట్టలతో వెళ్ళడం లేదు. ఐదు వేలరూపాయల ఉద్యోగంతో వేడ్తున్నాను. అతనితో సమానంగా ఉద్యోగం చేస్తున్నాను. ఇంకా మీరు నా కోసం లక్షలక్షన్నరా ఎందుకు ఖర్చు పెట్టాలి?' రెట్టించింది.
"సునీతా ఐ అగ్రీ విత్ యూ....కాని ఇప్పటికి ఆరుగురు వచ్చి చూశారు . నీ మాటలకి ఎవరన్నా అంగీకరించారా? ఆ అబ్బాయిలూ చదువుకున్న వారే! నీ మాటల్లో మంచిని గ్రహించి వాళ్ళవాళ్ళని ఒప్పించి ముందుకు వచ్చారా?"
'అదే నాన్నా నేను అనేది. ఈ కాలం అబ్బాయిలకు పెళ్ళి వేళకి వచ్చేసరికి అమ్మ, నాన్న సంప్రదాయాలు కావాలి. వేడుకలు కావాలి. కనీసం చదువు, ఉద్యోగం , ఉన్న అమ్మాయిలన్నా ఈ సంప్రదాయాల పేరిట ఈ దోపిడీని అరికట్టాలని నా ఉద్దేశం. అంతగా మీకందరికీ డబ్బు ఎక్కువైతే ఇటు వాళ్ళు ఒకలక్ష, అటువాళ్ళు ఒక లక్ష , ఇచ్చి కొత్త కాపురం వాళ్ళకి సామాను కొనుక్కోడానికి సాయం చేయండి అనడం తప్ప ఇంతకీ ఈ సంప్రదాయం పెళ్ళిళ్ళు ఎంత బాగా జరుగుతున్నాయో చూస్తున్నాం కదా! చచ్చి చెడీ అన్ని ఏర్పాట్లు చేసి షామియానాలు , లైట్లు, భోజనాలు , డెకరేషన్లకి వేలకివేలు ఖర్చు పెడితే పెళ్ళికి వచ్చిన వాళ్ళు జీలకర్ర బెల్లం నెత్తిన పెట్టగానే పొలోమని లేచి వచ్చి వధూవరుల నెత్తిన ఇన్ని అక్షింతలు జల్లి, తెచ్చిన బహుమతి చేతిలో పడేసి, తోసుకుతోంటూ భోజనాలకి వెళ్లి తినేసి పోతున్నారు. కనీసం మంగళసూత్రం కట్టేవరకన్నా ఉండకుండా బంధువులు సయితం జారుకుంటారు. మన హడావుడి చూసి పురోహితుడు ముచ్చటగా ముప్పై నిమిషాల్లో అన్ని తంతులు జరిపేసి, ఏదీ వదలకుండా అన్నీ మూట కట్టుకుని జారుకుంటాడు. చచ్చి చెడి చేసిన ఏర్పాట్లు , లక్షల ఖర్చు అన్నీ రెండు గంటలలో ముగుస్తాయి. ఇలా సంప్రదాయాన్ని పూర్తిగా పాటించక, అటు అన్నీ కాదని సింపుల్ గా రిజిష్టరు మారేజీ చేసుకోలేక ఈ తరం నలుగుతోంది. ఎవరో కొంత ముందయినా ఇలాంటి వాటికి మంగళం పాడాలని చూస్తె తప్పు పడ్తారేమిటి?"
"నీవు చెప్పింది అంతా నిజమేనమ్మా. కాని అర్ధం చేసుకునేవారెవరు? ప్రతివాళ్ళు మొహాలు చూసుకుని ఈపాటి సంబంధం మనకిండ దొరకదా! అని లేచిపోతున్నారు. పోనీ ఆ చెప్పేది ఏదో పిల్ల నచ్చిందన్నాక నెమ్మదిగా నచ్చజెప్పవచ్చుకదా!"
"ముందే చెప్పాలమ్మా! ఇష్టం అయినవారు చేసుకుంటారు లేదంటే మానతారు. పిల్ల నచ్చిందన్నాక ఇంకా ఆశాభంగం...."
"నీ ఖర్మ....నీకింక పెళ్ళి కాదు. ఇరవై ఏడు నిండాయి. ఇంకో రెండేళ్ళు నిండితే అప్పుడింక పెళ్ళి అక్కరలేదులే! ఇంక సంబంధాలు చూడడం మా వల్ల కాదు తల్లీ.... చేసుకుంటావో మనకుంటావో నీ ఇష్టం ' సావిత్రి నిస్పృహగా అంది.
"నేనేం మిమ్మల్ని చూడమన్నానా? మీరు చూస్తుంటే సరే అనుకున్నాను. ఇకముందు మీరు ఎవరిని పిలవవద్దు. నాకెవరన్నా నచ్చితే , నా అభిప్రాయం నచ్చి ముందుకు వస్తే నేనే చెబుతాను." సునీత ఖచ్చితంగా అని గదిలోంచి వెళ్ళిపోయింది.