Previous Page Next Page 
కాలాన్ని వెనక్కి తిప్పకు పేజి 23


    ఇంత చేసిన సునందకి 'నేనేం చేసి నీకు కృతజ్ఞతలు చెప్పను' అంటుంది. రోజుకోసారన్నా శారద. వండుకోనక్కరలేకుండా రోజూ టిఫిను, భోజనాలు , రకరకాలుగా తినిపిఅస్తున్నావు. ఇంతకంటే నాలాంటి వాళ్ళకి గొప్ప సాయం ఏముంటుంది అంటుంది నవ్వుతూ సునంద.

                                                  *    *    *    *
    
    'శారదా!' ఓనాడు సునంద హడావుడిగా పరిగెత్తుకు వచ్చింది. "శారదా! మీ అయన జాడ తెలిసింది. మస్కట్ లో ఉన్నాడట. మొన్న మా అడబడుచుకి ఓ షాపింగ్ కాంప్లెక్స్ లో కనపడ్డాడుట. వెంట ఎవర్తో ఉందిట. ఇప్పుడే ఫోను చేసి చెప్పింది" ఆయాసపడుతూ అంది.
    సునంద ఆడపడుచు, భర్త రెండు మూడు సార్లు వచ్చినప్పుడు శారదతో పరిచయం అయ్యారు. ప్రకాశరావునీ, చూశారు. వాళ్ళు గత ఏడాది మస్కట్ లో ఉద్యోగం వచ్చి వెళ్ళారు.
    "అప్పుడు ఇంక మన తడాఖా చూపిద్దాం. ఎక్కడ ఉద్యోగం చేస్తున్నదీ వాకబు చేసి చెప్పమన్నాను. మనం ఎలాగో పోలీస్ కంప్లైట్ ఇచ్చాంగా . మనిషి ఫలానా చోట ఉన్నాడని చెప్పి, భార్యా బిడ్డల్ని వదలి, వేరే ఆడదానితో ఉన్నాడని 'బైగమీ' చట్టం కింద ప్రొసీడవుదాం . అక్కడ మన ఇండియన్ ఎంబసీ లో కంప్లయింట్ ఇద్దాం. అతను పనిచేసే కంపెనీకి కూడా కంప్లయింట్ ఇద్దాం. వెంటనే ఉద్యోగం ఊడబీకి డిపార్ట్ చేసి పంపిస్తారు. అప్పుడు రోగం కుదురుతుంది. భార్యని ఇంత మోసం చేసిన వాడిని మనం వదలకూడదు" ఉద్రేకంగా అంది సునంద.
    సునంద అన్నంత పనీ చేసింది. లాయర్ల సలహాతో, పోలీసుల జోక్యం , ఇండియన్ ఎంబసీ సహకారంతో అతని ఉద్యోగం ఊడబీకించి దేశం నుంచి పంపేటట్లు చేసి ప్రకాశరావు అంతం చూశారు సునంద, శారద. ప్రకాశరావును ఇండియా రప్పించి 'బైగమీ' చట్టం కింద కోర్టులో కేసు వేయించింది.
    దురదృష్టవశాత్తూ శారద అమాయకంగా, తెలివి తక్కువతనంతో ప్రకాశరావు చెప్పిన చోట కొన్ని కాగితాల మీద సంతకాలు పెట్టింది అప్పుడు. 'ప్లాటు నీ పేర మారుస్తున్నాను. రిజిస్ట్రేషన్ చేయించాలి' అంటూ సంతకాలు పెట్టించాడు.
    'ఎంత మోసం, మొగుడు కదా అని ఆ కాగితాలు సరిగ్గా చూడను కూడా చూడకుండా స్టాంప్ పేపర్లని చూసి సంతకాలు పెట్టాను. ఇంత దగా చేస్తాడని ఎలా అనుకుంటాను' శారద విలవిల్లాడింది. తాను రెండో పెళ్ళి చేసుకోవడానికి శారదకి అభ్యంతరం లేదనీ, దానికి ప్రతిగా ఇల్లు ఆమెకి చెందేట్లు రాస్తున్నాని ఉన్న స్టాంప్ పేపరు కోర్టులో ప్రొడ్యూస్ చేయడంతో శారద లాయరు ఎంత వాదించినా కేసు నిలవలేదు.
    "స్కౌండ్రల్ , ఎంత తెలివిగా నాటకం ఆడి నన్ను మోసం చేశాడు. చదువులేని దాన్నని నా తెలివి తక్కువతనాన్ని బాగా ఉపయోగించుకున్నాడు. సర్లే చావనీ, ఇప్పుడు వాడేవర్తీతో ఉంటే నాకేం! ఉద్యోగం ఊడింది. పరువు పోయి, బజారున పడ్డాడు. మనకది చాలు. ఆ శాస్తి చాలు వాడికి" కసిగా అంది శారద.

                                                             ***

    ఓవారం తర్వాత, శారద ఆఫీసు కాగితాలు చూసుకుంటుంటే ప్రకాశరావు వచ్చాడు. "శారదా! జరిగిందేదో జరిగింది. అంతా మరిచిపోదాం. ఎంతైనా నీ భర్తని , నీ పిల్లల తండ్రిని. నిజమే! నీకు అన్యాయం చేశాను. ఏదో మోజులో పడి నిన్నూ, పిల్లలనీ వదలి వెళ్ళాను గాని తప్పు చేసిన భావం ఒక్క రోజూ నన్ను సంతోషంగా బతకనీయలేదు. నీకు, పిల్లలకీ దూరమై వెనక్కీ రాలేక, నీకు ముఖం చూపలేక ఉండిపోయాను. మనం భార్యాభర్తలం. ఈ బంధం తెంపుకుంటే పోయేది కాదని అర్ధం అయింది."
    సిగ్గు, లజ్జ, లేకుండా రావడమే కాక , తనని ఇంకా నమ్మించాలని తాపత్రయపడుతున్న ప్రకాశరావు వంక చూసి , తాపీగా రాస్తున్న పెన్ను పక్కన పెట్టి, చాలా శాంతంగా ఓ నవ్వు నవ్వింది శారద.
    'చూడు మిష్టర్ ప్రకాశరావు!"'భర్త' అన్న పదానికి అర్ధం తెలుసా? భార్య పిల్లలని పోషిస్తూ సంసార భారం వహించేవాడు అని అర్ధం! పెళ్ళి, భర్త అన్న పదాలకి అర్ధం తెలిసి ఉంటే ఆ పదం ఇంకా వాడి ఉండేవాడివి కావు. 'భరించువాడు భర్త! మరి 'భరించనివాణ్ణి ' ఏమంటారో నాకు తెలియదు. రోడ్డున వెళ్ళేవాడికి, నీకూ ఇప్పుడు ఏం తేడా లేదు. నా దృష్టిలో నీ నా సంబంధం అంతే ఇప్పుడు. అంత బాధ్యతారహితంగా దొంగచాటుగా కట్టుకున్న భార్య, చిన్న పిల్లలు ఎలా బతుకుతారు అన్న ఆలోచన లేకుండా వదలి వెళ్ళిననాడే నీవు నాకు చచ్చినవాడితో సమం అయ్యావు. ఇప్పుడు ఈ ఇంటినీ, సంసారాన్ని భరిస్తున్న నేనే ఈ ఇంటికి భర్తని, భార్యని అన్నీ! ఇప్పుడైనా నీవు నా సంపాదన చూసి వచ్చావన్నది అర్ధం కానంత వెర్రిదాన్ని కాదు. చూడు! పూర్వం గాంధారి అనే మహాపతివ్రత భర్త చూడాలేనివి తాను చూడరాదని కళ్ళకి గంతలు కట్టుకుందట! ఈనాడు మేం గంతలు కట్టుకోకుండానే, ఇంతింత కళ్ళుండీ మీరేం చేస్తున్నా చూస్తూ ఊరుకోవాలని మీరు ఆశిస్తే అది అత్యాశ! మేం గుడ్డివాళ్ళమై మీరేం చేస్తున్నా చూడనట్లు పడుండి, మహా పతివ్రతల లిస్టులోకి వెళ్ళాలన్న కోరిక లేదు. మహాపతివ్రతల మన్న బిరుదులూ అంతకంటే అక్కర లేదు. మీరు పడేసే తిండి మా అంతట మేం సంపాదించుకోగలం అన్నది నా కధ నిరూపించింది. బతకడానికి మాకు చాలానే తోవలున్నాయి. ఆపాటి దానికోసం నే గాంధారిని కాదలచలేదు. నౌ యు గెటౌట్ ఫ్రమ్ హియర్! మళ్ళీ ఈ చాయలకీ వచ్చే ప్రయత్నం ఎన్నడూ చేయకు" శారద చాలా శాంతంగా గుమ్మం వైపు చేయి చూపిస్తూ అంది.

                                                  *ఇండియా టుడే, 6 జులై - 1999

 Previous Page Next Page