Previous Page Next Page 
చీకటికి అవతల పేజి 24


    మసక వెన్నెల్లో సైతం పౌర్ణమి చంద్రుడిలా మెరిసిపోతున్న ఆమెను చూస్తూ రాలేనని ఎలా చెప్పగలడు? అందుకే "తప్పక వస్తాను" అని చెప్పి వచ్చేశాడు.

 

    వచ్చిన రోజునుంచి పదిహేనో తారీకు ఎప్పుడొస్తుందా అని క్యాలెండర్ కు కళ్ళను వేలాడదీశాడు.

 

    ఆ రోజు రానే వచ్చింది. నిద్ర లేవడమే ఆ ధ్యాసతోనే లేచాడు. ప్రకృతంతా తన ఫ్రెండ్ అయిపోయి పలకరిస్తున్నట్టు తోస్తోంది. సాయంకాలం వరకు ఆ ఊహలతోనే గడిపి కావలికి బయల్దేరాడు.

 

    నెల్లూరు దాటాడో లేదో వర్షం ప్రారంభమైంది.

 

    చుట్టూ వాన తెర దించేసినట్టు ఆకాశమంతా పొగమంచులా తయారయింది. గాలి ఎవరిమీదో అలిగి వెళ్ళిపోతున్నట్టు ఉధృతంగా వీస్తోంది.

 

    ఉరుములు ఆకాశాన్ని చీల్చుతుంటే మెరుపులు వెల్డింగ్ ఆర్క్ లా వెలుగుతూ చీలిపోయిన ఆకాశాన్ని తిరిగి కుడుతున్నట్టున్నాయి.

 

    "తుపాను" పక్కన వున్న వారు ఈ బీభత్సాన్ని చూసి చెబుతున్నారు.  

 

    చంద్రహాస్ గుండెల్లో రాయి పడింది. తుఫానైతే ఆ ఊరెలా వెళ్లడం? కొద్దిపాటి వర్షం కురిసినా ఆ రూట్లో బస్సులు వెళ్ళవని తెలుసు. మధు తనకోసం కాచుక్కూర్చునుంటుంది.

 

    తను వెళ్ళేవరకు తినకుండా ఒంటరిగా ఆ ఇంట్లో ఒళ్ళంతా కళ్ళ క్రింద మార్చేసుకొని చూస్తుంటుంది. కానీ ఎలా వెళ్ళడం?

 

    వర్షం క్షణక్షణానికి ఎక్కువవుతుందే తప్ప తగ్గడం లేదు. రైలు మధ్య మధ్యలో ఆగుతూ ఎనిమిది గంటలకి కావలికి చేరుకుంది.

 

    స్టేషన్ నుండి బస్టాండ్ కి రావడమే కష్టమైపోయింది అతనికి. ఆటోలు రాలేదు. రిక్షాలయితే అప్పటికి ఛిన్నాభిన్నం అయిపోయి వికారంగా కనిపిస్తున్నాయి.

 

    ఇక ఆలస్యం అయిపోతే బస్సు మిస్సవుతుందేమోనన్న అనుమానంతో అలా వర్షంలో తడుచుకుంటూనే బస్టాండ్ కి బయల్దేరాడు.

 

    వర్షం ఒక్కసారి ఎలిమెంటరీ స్కూల్ మాస్టారైపోయి చెంపలు వాయగొడుతోంది. గాలి శరీరాన్ని తునాతునకలు చేస్తోంది. అయినా లెక్క చేయలేదు. మధ్యలో ఎక్కడా ఆగక బస్టాండ్ కి వచ్చాడు.

 

    బస్సులన్నీ వర్షంలో నాని, నీళ్ళలో కరిగిపోతున్నట్టు కనిపిస్తున్నాయి.

 

    బస్టాండ్ లో నిలబడ్డ జనం కూడా జల్లులకు తడిసిపోయి, ముద్దలుగా కుదించుకుపోయారు.

 

    చంద్రహాస్ తుంగరాజు పాళెం వెళ్ళే బస్సు కోసం చూశాడుగానీ అది ఎక్కడా కనపడలేదు. కొంపదీసి వెళ్ళిపోయిందేమోనన్న శంక బయల్దేరింది. ఎంక్వయిరీ దగ్గరికి వెళ్ళి విచారించాడు.

 

    "ఎక్స్ ప్రెస్ బస్సులే వెళ్ళడం లేదు. ఇక ఆర్డినరీ బస్సులు రెండు మూడు రోజులు ఆగితేగాని వెళ్ళవు" అని చిరాకుగా చెప్పాడు ఎంక్వయిరీలో వున్న మనిషి.

 

    ఏం చేయాలో తోచడం లేదు.


    
    అప్పటికి టైమ్ పదకొండయింది.

 

    ఇక ఆగలేకపోయాడు.

 

    అక్కడి నుంచి ఆ వర్షంలోనే బయల్దేరాడు.

 

    తంగరాజు పాళెం వెళ్ళే రోడ్డుకి చేరుకున్నాడు. ఏమైనా వెహికల్ వస్తుందేమోనని చూశాడు గానీ ఒక్కటీ అటువైపు రాలేదు.

 

    చిన్నగా ఆ రోడ్డంట నడవడం మొదలుపెట్టాడు.

 

    వర్షం ఇంకా ఎక్కువైంది.

 

    గాలి పిచ్చి పట్టినట్టు అటూ ఇటూ ఊగుతోంది. చినుకులు శరీరం మీద పడి గిల్లుతున్నాయి.

 

    చలి ఒంటిని చుట్టేస్తోంది.

 

    ఇక వెహికల్ కోసం వెనక్కి చూడడం మానేశాడు. వేగంగా అడుగులు వేయడం ప్రారంభించాడు.

 

    మనిషి పూర్తిగా తడిసి ముద్దయిపోవడంతో బాగా బరువుగా తయారయ్యాడు.

 

    ఈజీగా నడవలేకపోతున్నాడు. అయినా పట్టువదల్లేదు. ఒంట్లోని శక్తినంతా కాళ్ళల్లోకి తెచ్చుకొని బలవంతాన నడుస్తున్నాడు.

 

    దారి కొత్త, సరిగా కనపడటం లేదు. మెరుపు మెరిసినప్పుడు తార్రోడ్డు ఓ క్షణంపాటు మెరిసి మాయమౌతోంది. దాన్నే కళ్ళల్లో ముద్రించుకుని దారి తప్పకుండా అడుగులు వేస్తున్నాడు.

 

    దారి చుట్టూ వున్న పొదలు అంత వర్షానికి భయపడి తలదాచుకోవడానికి ఎక్కడికైనా వెళ్ళాలని గింజుకుపోతున్నట్టు ఊగుతున్నాయి. చీకటంతా చెట్ల వెనక దాక్కున్నట్టు నల్లటి ముద్దలా వున్నాయి. చినుకుల్లో అతనో చినుకై పోయినట్టు నడుస్తున్నాడు.

 

    మరో రెండు గంటలకు కాబోలు తంగరాజు పాళెం రోడ్డు మలుపు తిరిగాడు. గాలి చల్లదనంతో మరింత బిగుసుకుపోయింది. వాన చినుకులు శరీరం మీద నుంచి జారకుండా లోపలికి ఇంకిపోతున్నట్టు చలి కడుపులోంచి పుడుతోంది.

 

    ఇక ఒక్క అడుగువేసే ఓపిక కూడా లేదు. ఓ పదినిముషాల పాటు ఏ చెట్టుకిందైనా నిలబడితే బావుండుననిపిస్తోంది. కానీ మనసొప్పడం లేదు. అవతల మధుమతి తన కోసం వెయిట్ చేస్తూ వుంటుంది. అందువల్ల ఓ పదినిముషాలైనా వేస్ట్ చేయడానికి ఇష్టపడడం లేదు. అందుకే ఆగకుండా నడుస్తున్నాడు.

 

    కళ్ళు పొడుడుకున్నా కానరాని కటిక చీకటి.

 

    వర్షానికి చీకటి కరిగిపోవడానికి బదులు గట్టి పడుతున్నట్టుగా వుంది.

 

    అలా నడుస్తూ ఒక్కసారిగా "అమ్మా" అంటూ కూలబడిపోయాడు చంద్రహాస్.

 

    చదునుగా వుందని కాలువేసిన అతను గుంటలో పడ్డాడు. పాదం మెలికపడి పట్టేసింది.

 

    పాదం దగ్గరున్న కీలు విరిగిపోయినట్టు బాధ మెదడుకు తగులుతోంది.

 

    కిందపడిన అతను పైకి లేచి కాసేపటికి సర్దుకున్నాడు. కానీ పాదం నొప్పి తగ్గలేదు. కాలుకింద పెడితే బాధ నరాలను మెలిపెడుతోంది.

 

    కానీ అతను ఆగలేదు. అలా నడుస్తూనే వున్నాడు.

 

    వర్షానికి కరెంట్ సరఫరా ఆగిపోయినట్టుంది.

 

    వూర్లో ఎక్కడా దీపాల్లేవు.

 

    వూరు వూరంతా తలంటి పోసుకున్నట్టు రోడ్లమీద కాలువలు పారుతున్నాయి.

 

    ఓ ఇంట్లో మాత్రం కిరసనాయిల్ దీపం చీకటికి భయపడి భయంగా వెలుగుతోంది.

 

    అతను ఇళ్ళన్నీ దాటి మధుమతి ఇంటికెళ్ళాడు. వెనుక నుంచి వెళ్ళి దొడ్డి దారి తలుపు దగ్గర నిలబడ్డాడు. లోపల దీపమైనా లేదు. మధుమతి తన కోసం చూసీ చూసీ నిద్రపోయిందేమోననుకున్నాడు. తిరిగి వెళ్ళిపోవాలని ఒక్క క్షణం అనిపించింది.

 

    కానీ మధుమతికి పుట్టినరోజు గ్రీటింగ్స్ చెప్పాలన్న కోరిక ఆ ఆలోచనను తుడిపేసింది. అలవాటు ప్రకారం తలుపుమీద ఏడుసార్లు కొట్టాడు.

 

    ఠక్కున తలుపు తెరుచుకుంది.

 

    అప్పుడే ఓ మెరుపు మెరిసింది.

 

    నీటి మూటలాగా నిల్చున్న అతన్ని ఆమె అలా చూస్తుండిపోయింది.

 

    "ఎలా వచ్చావ్? ఒకటే తుఫాను"

 

    "కావలి నుండి నడిచే- బస్సు లేదు- ఇంకేం చేయను" అన్నాడు చంద్రహాస్.

 

    ఆమెకి మొత్తం అర్థమైంది. ఒక్క కుదుపుతో అతని చేయి పట్టుకుని లోపలికి లాగింది.

 Previous Page Next Page