Previous Page Next Page 
చీకటికి అవతల పేజి 23


    "సార్! సార్!" బేరర్ పిలుస్తుంటే ఉలిక్కిపడి తల పైకెత్తాడు చంద్రహాస్... గతం గొలుసు తెగింది.

 

    "ఏడుస్తున్నారా సార్!"

 

    "కన్నీళ్లు లేకపోతే నేను బతికున్నానని నాకు తెలియదు. ఏడ్వడానికే నేను బతికున్నానంటే నమ్ముతావా?" అన్నాడు చంద్రహాస్.

 

    పాపం ఆ బేరర్ కేమీ అర్థం కాలేదు. తాగినవాళ్ళతో మాట్లాడటం శుద్ధ దండగ అనుకుంటూ అతను మరో టేబుల్ దగ్గరికి వెళ్ళిపోయాడు.

 

    తాగినదంతా మెదడులో పేరుకుపోయింది చంద్రహాస్ కి. భార్య మధుమతి, ఆరేళ్ళ కూతురు చిన్నూ గుర్తుకొచ్చారు. వెంటనే ఇంటికెళ్ళి చూడాలనిపించింది. ఇక ఒక్కక్షణం ఆగలేకపోయాడు.

 

    పైకి లేచి కౌంటర్ దగ్గర మరో ఫుల్ బాటిల్ తీసుకుని డబ్బు చెల్లించి ఇంటికి బయలుదేరాడు.

 

    గేటు తీసే ఉంది. కారును పక్కగా పార్కు చేసి తలుపుకున్న నాబ్ ను తిప్పాడు.

 

    "వస్తున్నాను బావా" అంది మధుమతి గొంతు. ఎక్కడో వంటింట్లో వున్నట్టు ఆమె వాయిస్ లాగా, చాలా సన్నగా వినిపిస్తోంది.

 

    "నాన్నా" ఆనందం చిన్నూ గొంతులో కేరింతలు కొట్టడం తెలుస్తూనే వుంది.

 

    మండుతున్న ఎండలో మల్లెపూల పొదలకింద చేరినంత హాయిగా వుందతనికి.

 

    "ఇంత ఆలస్యం అయిందేం బావా? రా! భోజనం చేద్దువుగాని" వంటింటిలోంచి వచ్చిన మధుమతి డైనింగ్ టేబుల్ దగ్గిరికి వస్తూ పిలిచింది.

 

    "త్వరగా తిను నాన్నా! నీ కథ వింటే తప్ప నాకు నిద్ర రాదని తెలుసుగా" చిన్నూ అంటూ వుంటే అతను డైనింగ్ టేబుల్ దగ్గరికి నడిచాడు.

 

    గిన్నెలన్నీ సర్ది వున్నాయి. ప్లేటు ఒకదాన్ని ముందుకు లాక్కుని తనే అన్నం వడ్డించుకున్నాడు.


    
    మధుమతి, చిన్నూ అతని ముందు నిలబడి ప్రేమగా చూస్తున్నారు.

 

    "కూరలు బావున్నాయా బావా?"

 

    "త్వరగా తిను నాన్నా"

 

    భార్య కూతురు మాట్లాడుతుంటే అతను భోజనపు ముద్దను నోటిలో పెట్టుకోబోయాడు.

 

    సరిగ్గా అప్పుడే ఫ్యాన్ కదలడంతో దానిమీదున్న బల్లి నిలబడి వున్న ఆ తల్లీకూతుళ్ళ మీదపడి గెంతింది. బల్లి మీదపడ్డా వాళ్ళలో చలనం లేదు. భయం లేదు. అసలు తనమీద ఏదో పడ్డదన్న స్పృహయినా లేదు.

 

    కారణం వాళ్ళు మానవరూపంలో వున్న బొమ్మలు.

 

    దూడ చనిపోతే ఆవు పాలివ్వదని, దూడ చర్మంలో గడ్డిని కూర్చి బొమ్మను చేసినట్టు అతను చేసుకున్న బొమ్మలు అవి.

 

    ఎప్పుడయితే భ్రమ తొలగిందో వాస్తవం కళ్ళల్లో బ్రహ్మజెముడు చెట్టయి లేచింది. ఆ చెట్టు ముళ్ళు ఎండి రాలిపోతున్నట్టు నీళ్ళు కారుతున్నాయి. ఎత్తిన చేయి కిందకి దిగిపోయింది. ఒక్క ముద్దయినా తినకుండానే చంద్రహాస్ డైనింగ్ టేబుల్ నుంచి పైకి లేచాడు.

 

    "ఏంటి బావా- ఒక్క ముద్దకూడా నోట్లో పెట్టకుండా అలా లేచిపోతున్నావ్? భోజనం తిను" అని మధుమతి గానీ, "నాన్నా- అన్నం తినకపోతే శక్తి రాదంట- అమ్మ చెబుతుంది" అని చిన్నూగాని అనలేదు.

 

    కారణం ఆ బొమ్మలు. స్పాంటేనియస్ గా మనుషుల్లా మాట్లాడలేవు అలా మాట్లాడేందుకు అంతకుముందే కంప్యూటర్ లో ప్రోగ్రామ్ ఫీజ్ చేసి వుండాలి.

 

    కానీ అట్లా జరగలేదు.

 

    అతను తన గదిలోకి వెళ్ళిపోయాడు. బార్ నుంచి పార్సిల్ తెచ్చిన ఫుల్ బాటిల్ ఓపెన్ చేశాడు.

 

    నీళ్ళు కలుపుకోవాలన్న ధ్యాస కూడా లేకుండా పోయింది. డైనింగ్ టేబుల్ దగ్గరే నిలిచిపోయిన బొమ్మలు మరో ఆజ్ఞ కోసం చూస్తున్నాయి. పదినిమిషాల తర్వాత గుడ్ నైట్ చెబుతాయి. వాటికి ఫీడ్ చేసిన ప్రోగ్రాం అంతే. దాని ప్రకారం కదులుతాయి, మాట్లాడతాయి.

 

    అతను వాటిని చూస్తూ- 'రా' తాగాడు. గొంతుతోపాటు గుండె కూడా మండింది. ఆ మంటే అతనికి హాయిగా వుంది. మనసులోని మంటలను మరికాస్త ఎగదోస్తేనే అతనికి బాగుంటుంది.

 

    గ్లాసు పూర్తికాగానే కింద పెట్టాడు. క్షణంలో నిషా మెదడును కమ్ముకుంటోంది. కళ్ళు ఎర్రగా తగలబడి పోతున్న కనకాంబరాల పూలతోటల్లా వున్నాయి.

 

    అతను బొమ్మలవేపు చూస్తుంటే గతం మళ్ళీ మనసు పొరల్లోంచి పైకి లేస్తోంది.

 

    మధుమతి ఆరోజు తామిద్దరూ ప్రశాంతంగా కలుసుకునే ఉపాయం చెప్పడంతో ఇక నిలవలేకపోయాడు చంద్రహాస్. ఎలాగోలా బలవంతంగా వారం రోజులు మనసును నిగ్రహించుకున్నాడు గానీ ఆ తర్వాత వీలు కాలేదు. వెంటనే కావలికి బయలుదేరాడు.

 

    కావలినుంచి లాస్ట్ బస్ తొమ్మిది గంటలకి.

 

    ఆ బస్సులో ఎక్కి కూర్చున్నాడు. బస్సులో క్రిక్కిరిసిన జనం వున్నా తనను ఒంటరిగా మధుమతికి దగ్గరికి తీసికెళ్ళడానికి దేవదూతలు పంపిన పూలపల్లకిలా వుంది బస్సు అతనికి.

 

    మరో అరగంటకు బస్సు దిగాడు. అతనితోపాటు మరో నలుగురు కూడా వున్నారు. వాళ్ళతో వెళితే యక్షప్రశ్నలు వేస్తారన్న భయంతో వాళ్ళు ముందుకు సాగగానే వెనక బయలుదేరాడు.

 

    'మరో పదినిమిషాలు- మధుమతి దగ్గరుంటాను' అనుకుంటూ నడక సాగించాడు.

 

    ఆకాశంలో చంద్రవంక వెండితీగ వేలాడుతోంది. చల్లటిగాలి ఒంటినంతా రాసుకుంటూ చుట్టూ ప్రదక్షిణలు చేస్తోంది. దూరంగా కనిపిస్తున్న లైట్లు రాత్రి కప్పుకున్న చీకటి ఫాల్ లోని చమ్కీల్లా వున్నాయి.

 

    'మరో ఐదు నిమిషాలు' అతని గుండె రక్తంతోపాటు ఆనందాన్ని కూడా పంప్ చేయలేక నానా తంటాలు పడుతోంది. రక్తం మామూలుగా ప్రసరించడం లేదు- పరుగులు పెడుతోంది.

 

    వెనకింటి తలుపు దగ్గిరికి వెళ్ళి నిల్చున్నాడు.

 

    'ఇంకొక నిమిషం' అనుకుంటూ ఏడుసార్లు తలుపు తట్టాడు. అతను వూహించినట్లే నిమిషంలోపే తలుపు తెరుచుకుంది. ఎదురుగా మధుమతి. అప్పటికే ఆమె కళ్ళల్లో సంతోషం ఎగదన్నుకొచ్చింది. ముఖాన్నంతా నవ్వులో ముంచి లోపలికి రమ్మన్నట్టు తలూపింది.

 

    అతను లోపలికొచ్చాడు.

 

    అప్పుడు వాళ్ళిద్దరూ మొదలుపెట్టిన మాటలు తెల్లవారుజాము నాలుగ్గంటల వరకు సాగాయి.

 

    "ఇక టైమైంది- వస్తాను" అంటూ లేచాడు.

 

    ఇద్దరికీ విడిచిపెట్టాలని లేదు. కాకుంటే తప్పదు. అతను వెళ్ళే ముందు ఓ చిన్న ముద్దు అడగాలనుకున్నాడు. కానీ పెగలడం లేదు. ఏదో తెలియని భయం మాటల్ని మింగేస్తోంది.

 

    అంత మధురమైన రాత్రికి గుర్తుగా అతనికి ముద్దివ్వాలని ఆమెకి అనిపించింది. కానీ ఏదో తెలియని సిగ్గు పెదవుల్ని ముందుకు తోయడం లేదు.

 

    అలా మొదటిసారి వాళ్ళిద్దరూ విడిపోయారు.

 

    అతను తలుపు దాటుతుండగా ఆమెకు గుర్తువచ్చింది. "బావా! పదిహేనో తేదీ నా బర్త్ డే. ఆ రాత్రికి వచ్చేసెయ్. ఏదో సాకుతో ఆ రాత్రి భోజనం చేయను. వండినవన్నీ ఇక్కడికి తెచ్చి నీకోసం వెయిట్ చేస్తుంటాను. తప్పక రావాలి సుమా" అంది.

 Previous Page Next Page