అతను అంటున్నదేమీ అర్థం కాకపోయినా పరాంజపే మౌనంగా వెళ్ళిపోయాడు.
సాయంత్రం అయిదుగంటలు-
తన బెడ్ రూమ్ కి ఎడమవైపు గోడకున్న స్విచ్ ను ప్రెస్ చేశాడు విశ్వాత్మ.
రహస్యంగా అమర్చిన చిన్న డోర్ తెరుచుకుంది.
లోపలికి ప్రవేశించి డోర్ క్లోజ్ చేయబోతూ బయటకు ఒకసారి తలపెట్టి ఆ బెడ్ రూమ్ లోని నలువైపులా చూసి, భారంగా నిట్టూర్చి డోర్ క్లోజ్ చేసేశాడు. ఆ ప్రదేశం ప్యాలెస్ కు సరిగ్గా మధ్య భాగంలో వుంది. దాదాపు 200 అడుగుల లోపలికి దారితీసే మెట్లు. త్వరత్వరగా దిగుతూ వెళ్లాడు కిందకి.
దాదాపు పదిహేను నిముషాల పైనే పట్టిందతనికి.
భూగర్భంలో అతి పటిష్టంగా నిర్మించిన ఆ రెండు గదుల్లో ఒక గది తలుపు తెరవగానే ఆ శబ్దం వింతగా ధ్వనించింది. మొదటి గది దాటి రెండో గదిలోకి ప్రవేశించాడు విశ్వాత్మ.
సరిగ్గా గది మధ్యలో అమర్చబడిందా పరికరం.
"క్రిప్టోగ్రాప్"
ప్రపంచానికి విచిత్రమయిన సవాలుని విసరబోయే కంప్యూటర్ మెషీన్.
దానివైపు తీక్షణంగా చూస్తూ దానిని వణుకుతున్న వేళ్ళతో స్పృశించాడు అతను. తన జీవితంలో సాధించిన అద్భుతాలన్నింటిలోకి తనకు పూర్తిగా సంతృప్తినిచ్చిన విజయం అదే అనుకున్నాడు.
సున్నితంగా కీ బోర్డ్ ఆపరేట్ చేశాడు.
అంతా తన అధీనంలో అనుకొన్నది అనుకోన్నట్టుగానే జరుగుతోంది.
కొన్ని క్షణాలు గడిచాక ఒక కోడ్ అందించాడు దానికి. అయిదు నిమిషాలు గడిచాక అతను సూచించిన కోడ్ ప్రింట్ క్యారేజీలోంచి బయటికొచ్చింది.
ఆత్రంగా అందుకొని తదేకదీక్షతో దాన్ని అపురూపంగా మననం చేసుకున్నాడు.
మనోఫలకంపై నిక్షిప్తం చేసుకున్నాక లైటర్ తో కోడ్ కాగితాన్ని బూడిద చేశాడు విశ్వాత్మ.
తరచుగా తనకొచ్చే కల... ఆ కలలో ఒక యుద్ధవీరుడిగా తను వుండటం.
ప్యాలెస్ ను ఏ సంవత్సరంలో తను నిర్మించడానికి పూనుకున్నాడో ఆనాటి విశేషాలు, వైదేహితో తన పెళ్ళి, క్యాన్సర్ వ్యాధితో ఆమె మరణించిన రోజు...
ఇండస్ట్రియలిస్టుగా తన ఎదుగుదలలో తను మర్చిపోలేని కొన్ని అరుదయిన రోజులు...
'పునర్జన్మ' అనే ఆలోచన మొదటిసారిగా తన మెదడులో మెదిలిన రోజు, అందుకోసం విస్తృతంగా తను జరిపిన పర్యటన, పరిశోధన, గ్రంథపఠనం.
వైదీశ్వరన్ కోయల్ కి వెళ్ళి శివస్వామిని కలవడం...
అరకులోయలో సిద్ధముని స్వామిని కలవడం....
అమర్ నాథ్ గుహలో హిమలింగస్వామిని కలవడం....
పారాసైకాలజీ ప్రొఫెసర్ రామకృష్ణారావు గురించి రామకృష్ణారావుకు పుట్టబోయే మనవడికి తను 'ధృతకుమార్' అని పేరు పెట్టడం-
అటార్ని సాత్యకి తయారుచేసిన వీలునామాలో నిక్షిప్తం చేసిన విశేషాలు....
మరీ ముఖ్యంగా-
గోల్కొండ కోట, రాజమహల్ గుహాంతర్భాంగంలో అరుదయిన నాణాలను భవిష్యత్ జ్ఞాపకాలుగా దాచడం-
అన్నిటినీ తను మాత్రమే అర్థమయ్యేటట్టుగా కోడ్స్ ద్వారా కంప్యూటర్ లోకి ఫీడ్ చేశాడు.
ప్రతి పాయింట్ కు ఒక ప్రత్యేకమైన కోడ్.
మొత్తం ఇరవై ప్రశ్నలు- వాటికి సమాధానాలు- ఆపైన మరోటి- మొత్తాన్ని ఆ మెషీన్ కి ఫీడ్ చేశాడు.
స్క్రీన్ మీద కనిపిస్తున్న ఆ మ్యాటర్ వైపు, తను నిబద్ధం చేసిన కోడ్స్ వేపు తదేక దీక్షతో చూడసాగాడు.
విశ్వాత్మ బ్రెయిన్ లో కంప్యూటర్ లో ఫీడ్ చేసిన మ్యాటర్. ఆ కోడ్స్, ప్రశ్నలు, వాటి సమాధానాలు స్థిరనివాసం ఏర్పరచుకున్నాయి.
పది నిమిషాలు గడిచాక-
స్క్రీన్ మీద మ్యాటర్ ని మెమొరీలో వుంచి తన బ్రెయిన్ లో నిక్షిప్తమైన మ్యాటర్ని కోడ్స్ తో సహా ఎంట్రీ చేసి, మెమొరీలోని మాటర్ తో తను ఫీడ్ చేసిన మ్యాటర్ని టాలీచేసి చూసుకున్నాడు.
ఎక్కడా 'రాంగ్ బైట్' లేదు.
ఎవ్విరిథింగ్ పర్ ఫెక్ట్...
చిన్నగా నవ్వుకున్నాడు విశ్వాత్మ.
ఆ మ్యాటర్ని కూడా ప్రింట్ అవుట్ తీసి లైటర్ తో మొదట చేసినట్టుగానే ఆ కోడ్ కాగితాన్ని బూడిద చేసేశాడు.
ఎక్కడా ఏ రకమైన అనుమానం లేదు.
మరోసారి దీక్షగా కంప్యూటర్ కనెక్షన్లన్నీ పరిశీలించి చూశాడు. కంప్యూటర్ వెనుక రూమ్ లో ప్రత్యేకంగా అమర్చిన ఎక్స్ ప్లోజివ్ సిలిండర్ కనెక్షన్లు మరోమారు చెక్ చేశాడు. అంతా సవ్యంగా వుంది.
విశ్వాత్మ ముఖంలో సంతృప్తికరమైన ఫీలింగ్.
చివరిసారిగా తన క్రిప్టోగ్రాఫ్ వైపు చూస్తూ, సేఫ్ డోర్ లాక్ చేశాడు.
అతడు ప్యాలెస్ లోని తన బెడ్ రూంలోకి వచ్చేసరికి రాత్రి 10.35 నిమిషాలైంది.
దాహంగా వుంది అతనికి.
దాహంగా వున్నప్పుడు విశ్వాత్మ వైన్ తాగుతాడు. సరాసరి లిక్కర్ కాబినెట్ వైపు నడిచాడు.
ఎందుకో అతని కాళ్ళు ఒక్కసారిగా తడబడ్డాయి. చూపులో ఏదో అస్పష్టత.
అంటే- తనను మృత్యువు సమీపిస్తోందా? అతి సమీపానికొచ్చి హెచ్చరిస్తోందన్న మాట. అది తలుచుకుని నవ్వుకున్నాడు విశ్వాత్మ.
గబగబా లిక్కర్ కాబినెట్ లోంచి వైన్ బాటిల్ ని తీసి ఆ డ్రింకుని గ్లాసులో పోసుకుని నెమ్మదిగా చప్పరించడం ప్రారంభించాడు.
సరిగ్గా పదకొండు గంటలైంది.... చూస్తుండగానే వైన్ బాటిల్ ఖాళీ అయింది.
హిమలింగస్వామి చెప్పిన తన మృత్యురహస్యం గుర్తుకొచ్చింది.
తన సహజ మరణం జనవరి 27 రాత్రి అర్థరాత్రి పన్నెండుగంటల పది ఘడియలకు రాసి వుందన్నది గుర్తుకొచ్చింది విశ్వాత్మకు.
అంతకు ముందు తను చనిపోలేడా? ప్రస్తుతం తన మృత్యువు తన చేతిలోనే వుంది.
తను ఏ క్షణంలోనైనా మృత్యువుని ఆహ్వానించగలడు. ధీమాగా అనుకున్నాడతను.
ప్యాలెస్ చీకట్లో కొట్టుమిట్లాడుతోంది. కిటికీ తెరిచి... గార్డెన్ వైపు చూశాడు. తోటలోని చెట్లమీద వెన్నెల వెలుగు వెండిరజనులా మెరుస్తోంది. మరో పదినిమిషాలు గడిచాయి. ఆ సమయంలో విశ్వాత్మ మెదడులో చిన్న కోరిక తలెత్తింది.
ముహూర్తం ప్రకారం తను సరిగ్గా పన్నెండు గంటల పది ఘడియలకు చనిపోతాడు. కానీ... అంతకంటే ముందుగానే తను చనిపోయి, మృత్యువు నిర్ణయం కన్నా, తన నిర్ణయమే గొప్పదని నిరూపిస్తే?