Previous Page Next Page 
అహో! విక్రమార్క పేజి 23


    కాసేపయ్యాక- ఆ గోడ వెంబడి క్రిందకు దిగడం ప్రారంభించాడు. మరో పదినిమిషాలు గడిచాయి.

 

    రాజభవన్ కి పాతిక అడుగుల దూరంలో, దట్టంగా పెరిగిన చెట్ల మధ్యకు చేరాడు.

 

    ఒకప్పుడు ఆ చెట్ల మధ్యలోంచే గుహ లోపలికి వెళ్ళడానికి మెట్లుండేవి. ప్రస్తుతం ఆ గుహ ముందు భాగం మూసుకుపోయింది.

 

    రెండు పెద్ద బండరాళ్ళు.... చెద పురుగులు.... నిలువెత్తున కట్టిన మట్టిగోడ. తన శక్తినంతా వుపయోగించి ఆ మట్టిగోడను గట్టిగా కొట్టాడు.

 

    పెళ్ళు పెళ్ళునా మట్టిగోడ కూలిపోయింది.

 

    అంతా చీకటి. రెండు బండరాళ్ళను కదపడానికి ప్రయత్నించాడు. దశాబ్దాల తరబడి ఎండకు ఎండుతూ, వానకు తడుస్తూ గుహకు అమర్చిన రాతిద్వారాల్లా స్థిరంగా వున్న ఆ రాళ్లను కదపడం తన శక్యం కాదని తేలిపోవడంతో-

 

    రెండు రాళ్ళ మధ్యనుంచి లోనికి వెళ్లడానికి ప్రయత్నిస్తున్నాడు. చాలా కష్టంగా వుంది. అయినా తప్పదు. శరీరాన్నంతా వంచి, నేలమీద, రాళ్ళ మధ్య నుంచి లోపలివైపుకు పాకడం ప్రారంభించాడు.

 

    రాళ్ళు... రప్పలు... ముళ్ళు.... చిన్న చిన్న పురుగులు....

 

    ఒక పక్క శరీరాన్ని ఎడతెగకుండా కుడుతున్న గండుచీమలు... అయినా బాధను సహిస్తున్నాడు. తనలోనే అణుచుకుంటున్నాడు. ముళ్ళ తాకిడికి అతని ఒళ్ళు చీరుకుపోతోంది.   

 

    పదిహేను నిమిషాల తర్వాత విశ్వాత్మ శ్రమ ఫలించింది. చిన్నగా గుహ లోపలికి చేరుకున్నాడు.

 

    దట్టమైన మకిలివాసన.... ఆ సొరంగం ఒకప్పుడు ఒక మనిషి నిలువుగా వెళ్ళడానికి వీలుగా వుండేది.

 

    ప్రస్తుతం... అంతెత్తున మట్టి... ముళ్ళకంపలు... అయినా ఉక్కుమనిషిలా ముందుకు దూసుకుపోతున్నాడు విశ్వాత్మ.

 

    చీకటి.... చీకటి....

 

    ఎక్కడ ఏమీ కన్పించడం లేదు.

 

    తొందరలో కనీసం టార్చిలైటును కూడా తెచ్చుకోవడం తను మర్చిపోయాడు.

 

    అయినా- ఆశావాదికి పిరికితనం, చీకటి ఎప్పుడూ అడ్డంకులు కానేరవు.

 

    పది నిమిషాలు...                      

    

    పదిహేను నిముషాలు....

 

    అరగంట గడిచింది....

 

    రానురానూ సొరంగం ఇరుకైపోతున్నది.

 

    సరిగ్గా అదే సమయంలో-

 

    అతనికో వింత చప్పుడు విన్పించింది.

 

    ఆ చప్పుడు గలగల పారుతున్న నీటి చప్పుడుగా గుర్తుపట్టడానికి అతనికి అట్టే సమయం పట్టలేదు.

 

    ప్రకృతి చాలా విచిత్రమైంది. రాళ్ళ అడుగున నీరు- రాళ్ళ మధ్య నీరు- చర్మం లోపల కన్నీరు.

 

    వేదాంతం నిండిన తన ఆలోచనలకు తనలో తనే నవ్వుకున్నాడు విశ్వాత్మ.

 

    విశ్వాత్మ ఊపిరి చప్పుడు, దూరం నుంచి విన్పిస్తున్న నీటిచప్పుడు ఒక్కలాగే వుంది.

 

    చీకటికి అలవాటుపడిన విశ్వాత్మ కళ్ళు మట్టిగోడలవైపు నిశితంగా చూస్తున్నాయి.

 

    కొంచెం దూరంలో ఎడమపక్కన వరుసగా పేర్చిన రాతిబండలు- ఆ బండల మాటున తన భవిష్యత్ జ్ఞాపకాల్ని భద్రపరచాలని నిర్ణయించుకున్నాడతను.

 

    ముందుకు కదిలి-

 

    ఒక రాతిబండను కదపడానికి ప్రయత్నించాడు. కదల్లేదు. తన దేహంలోని శక్తినంతా ఉపయోగించి, ఎట్టకేలకు నలుచదరాకారంలో వున్న ఆ రాతిబండను బయటకు లాగాడు. తలకిందకు వంచి, లోపలికి చూసి కుడిచేత్తో తడిమాడు.

 

    పుస్తకాల ర్యాక్ లో ఏర్పడ్డ ఖాళీస్థలంలా వుంది.

 

    సంతృప్తిగా తన కుడిజేబులోంచి దంతపు పెట్టెను తీసి ఆ ఖాళీస్థలంలో వుంచి, దాని చుట్టూ మట్టివేసి, ఆ రాతిబండను యధాస్థానంలోకి నెట్టివేశాడు బలంగా.

 

    మామూలు మానవమాత్రులెవరూ ఈ ప్రదేశంలోకి రాలేరు. ఎప్పుడో, ఏ పురావస్తు శాస్త్రజ్ఞులెవరైనా తవ్వకాలు సాగిస్తే.... తన 'భవిష్యత్ జ్ఞాపకాల్ని' తప్పకుండా వాళ్ళు భద్రపరుస్తారు.

 

    వెళ్ళిన దారంటే వెనక్కి మరలాడు విశ్వాత్మ.

 

    పెద్ద బండరాళ్ళ మధ్య నుంచి బయటికొచ్చిన విశ్వాత్మ అలసటగా కాసేపు నేలమీద కూర్చుండిపోయాడు. మనసారా, స్వేచ్చగా గాలి పీల్చుకున్నాడు.

 

    అరగంటసేపు సేద తీరాక నడవడం ప్రారంభించాడు. శిథిల రాజభవనం ప్రాంగణం మీంచి దూరంగా కనిపిస్తున్న నగరంవైపు చూశాడు.

 

    ఇప్పుడు హైదరాబాద్ దీపాల తోరణంలా లేదు- దీపాలన్నీ మిణుకు మిణుకు మంటున్నాయి.

 

    అంతవరకు వాచీవైపు చూడని విశ్వాత్మ చేతి వాచీవైపు చూశాడు. మూడు గంటలు దాటింది.

 

    నెమ్మదిగా నడుచుకుంటూ, గోల్కొండకోట బయటికొచ్చి రోడ్డుకు ఎడమ ప్రక్కన పార్కుచేసిన కారు దగ్గరకొచ్చి, ఫ్రంట్ డోర్ తెరిచి డ్రయివింగ్ సీట్లో కూర్చున్నాడు. మరో నిమిషం తరువాత కారు నగరం దిశగా మరలింది.

 

                                                   *    *    *    *

 

    ఆ రాత్రి కంటిమీదకు నిద్ర రాలేదు విశ్వాత్మకు.

 

    నిన్నటివరకూ మృత్యువును రెండు చేతుల్తో ఆహ్వానించిన విశ్వాత్మ, నేడు ఆ ఆలోచన వచ్చినప్పుడల్లా చిగురాకులా వణికిపోతున్నాడు.

 

    అది భయము కాదు, సందేహం కాదు.

 

    ఎత్తయిన రెండు కొండల మధ్య ఇనుప తీగ మీద నడుస్తున్న అనుభూతి...

 

    అయిదు గంటలకల్లా స్నానాదికాలు పూర్తి చేసుకుని, పట్టుబట్టలు కట్టుకుని, సమీపంలోనున్న శివాలయానికి వెళ్ళి పూజ చేసుకుని ప్యాలెస్ లో కొచ్చాడు.

 

    ఆ ప్యాలెస్ అంతా కలయదిరిగాడు. తనకు సంబంధించిన ప్రతి వస్తువును పదే పదే చూస్తున్నాడు. దేశ విదేశాల్లో తను తిరిగినప్పుడు తీయించుకున్న ఫోటోలు- ఆయా సందర్భాల్లో యిచ్చిన జ్ఞాపికలు గొప్ప ఇండస్ట్రియలిస్టుగా గుర్తించి రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలిచ్చిన పతకాలు, ప్రశంసా పత్రాలు.

 

    ఒక్కొక్కటి ఒక్కో మధురానుభూతికి నిదర్శనం.

 

    జీవితమంటే ఒక వ్యామోహం- మృత్యువంటే ఆ వ్యామోహంలో నుంచి బయటపడటం.

 

    ఎస్టేట్ వ్యవహారాలకు సంబంధించి అతి ముఖ్యులయిన వ్యక్తులు వచ్చి విశ్వాత్మను కలిసి వెళ్ళిపోయారు.

 

    అందులో పరాంజపే ఒకడు. అతను వెళ్ళే ముందు-

 

    "పరాంజపా... నన్నెవరూ ఈ క్షణం నుంచి డిస్ట్రబ్ చేయడానికి వీలులేదు. రేపుదయాన్నే నువ్వు రా. అప్పుడు ఏం చేయాలో నీకు తెలుస్తుంది" అని చెప్పేశాడు విశ్వాత్మ.     

 Previous Page Next Page