Previous Page Next Page 
అహో! విక్రమార్క పేజి 25


    తను తన అంతిమ ఘడియల్లో కూడా విధి నిర్ణయాన్ని కొన్ని నిముషాలసేపు మార్చగలుగుతున్నందుకు చాలా ఆనందంగా వుంది విశ్వాత్మకు.

 

    పదకొండు పది నిమిషాలైంది.

 

    లిక్కర్ క్యాబినెట్ డీప్రెజ్ లో పెట్టిన చూపుడు వేలు సైజులో వున్న బాటిల్ ని బయటకు తీశాడు.

 

    ద్రవరూపంలో వున్న అతి ప్రమాదకరమైన సైనైడ్ డ్రగ్ అది. ఏదో ట్రాన్స్ లో వున్నవాడిలా, గ్లాసులోకి అ ద్రవాన్ని ఒంపుకొని, వైన్ బాటిల్లోని కొంత వైన్ ని పోసుకుని, నెమ్మది నెమ్మదిగా సిప్ చేయడం ప్రారంభించాడు విశ్వాత్మ.

 

    శరీరం గాలిపటంలా అలా అలా తేలిపోతున్నట్లందతనికి. నల్లని ముసుగులా మైకం కప్పేస్తోంది.

 

    నరాలన్నిటినీ ఎవరో బిగలాగుతున్నట్లుగా అనుభూతి. రెండు చేతులతోనూ గుండెను ఎవరో దగ్గరగా అదుముతున్నట్లు బాధాకరమయిన భ్రాంతి...

 

    పదకొండు ఇరవై నిమిషాలైంది.

 

    బాటిల్లో వున్న మిగతా సైనైడ్ ని గ్లాసులో వేసుకుని, నిండా వైన్ ని నింపుకున్నాడు. అ వెంటనే గ్లాసునెత్తి గడగడా తాగేశాడు.

 

    అతని మదిలో ఇప్పుడు ఏ ఆలోచనలూ లేవు. మనసంతా ప్రశాంతంగా వుంది. బతుకంతా అనేక ఛాలెంజెస్ తో గడిపిన విశ్వాత్మ చివరికి మృత్యువును కూడా ఛాలెంజ్ చేస్తూ నిశ్వాస తీసుకుంటున్నాడు.

 

    గోడ గడియారం వైపు చూసుకున్నాడు.

 

    నిముషాల ముల్లు ముందుకు జరుగుతోంది.

 

    మరొకవైపు, నిలువుటద్దంలో తనని తాను చూసుకుంటున్నాడు. తన మృత్యువుని తను ఆహ్వానిస్తూ, తన చివరి బాధని తను చవిచూస్తూ చనిపోవడం ఎంత అరుదు?

 

    అది అదృష్టమైనా, దురదృష్టమైనా తనకే దక్కింది. శరీరమంతా నడిసముద్రంలో నావలా అతలాకుతలమై పోతోంది. బాధ.... నర నరంలో నిండుకుంటున్న బాధ. అయిపోయింది.... విశ్వాత్మ అధ్యాయం ఈ జన్మకు సమాప్తమైపోయింది. గోడగడియారం వైపు చూశాడు.

 

    సరిగ్గా 11.45 నిమిషాలు. పన్నెండు గంటలకల్లా తను చనిపోతున్నాడు. విధి రాసిన మృత్యు ముహూర్తానికి పది ఘడియలకి ముందే తను చనిపోబోతున్నాడు. విధి కన్నా తనే గొప్పవాడు.

 

    ఎస్.... ఐ యామ్.... ఏ గ్రేట్ .... మ్యాన్... విశ్వాత్మ ఈజ్ ఏ గ్రేట్ మ్యాన్. అతని కనురెప్పలు తెరవడానికి వీల్లేనంతగా మూతలు పడిపోతున్నాయి.

 

    గుండెల్లో లబ్ డబ్ మనే ధ్వని మందగిస్తోంది. నరాల్లో రక్తం ఇంకిపోవడం ప్రారంభమయింది. ఇలాంటి అరుదైన సన్నివేశాన్ని శాస్త్రజ్ఞులు గానీ, సైన్సు పరికరాలుగానీ నిశితంగా పరిశీలిస్తే...? మనిషిలో ప్రాణజ్యోతి ఏ రూపంలో వుందో తెల్సిపోయేదేమో...!

 

    విశాలమైన డబుల్ బెడ్ మీద నిలువుగా పడిపోయాడు విశ్వాత్మ. అతని గర్భంలో వేదన... అది ద్రవ రూపంలో డ్రగ్ తీసుకున్న ఫలితంగా కలిగిన బాధో... మృత్యుసర్ప పరిష్వంగమో అర్థం కావటం లేదు.

 

    "విశ్వాత్మ.... గుడ్ నైట్.... అండ్ గుడ్ బై టు దిస్ ప్రెజెంట్ లైఫ్..." తనలో తను గొణుక్కున్నట్టుగా అన్నాడు ఆఖరిసారిగా.

 

    సరిగ్గా 11-45 నిముషాలకు విశ్వాత్మ ప్రాణం అనంతవాయువుల్లో కలిసిపోయింది.  

 

    కిటికీలోంచి కన్పిస్తున్న ఆకాశంలో మిరుమిట్లు గొలుపుతూ ఒక తార.

 

    ఆ తార బహుశ విశ్వాత్మ ప్రాణజ్యోతి కావచ్చు.

 

    ఆ ప్రాణజ్యోతికి మాటలు వస్తే...

 

    మరణ తుది ఘడియల్లో కూడా విశ్వాత్మ పునర్జన్మ గురించి వలవరించాడని, కలవరించాడని చెపుతుంది. ఇది జరిగిన సరీగ్గా ముప్పై సంవత్సరాల తరువాత తిరిగి కథ ప్రారంభం కాబోతోంది. ప్రపంచానికి ఒక కొత్త సవాల్ విసరబోతోంది. ప్రపంచ మానవాళి ఆలోచనల్లో, అన్వేషణలో కొత్త కోణాల్ని జొప్పించబోతున్న పెనుసవాల్ ముప్పై ఏళ్లుగా నిద్రపోయి తిరిగి మేల్కొనబోతోంది.

 

    1996 జనవరి 17 అర్థరాత్రి పన్నెండు గంటల పది ఘడియలకు మరో అధ్యాయానికి అనూహ్యమైన నాంది కాబోతోంది.

 

                                 *    *    *    *

 

    న్యూఢిల్లీ...

 

    రాత్రి 1.25 నిమిషాలు.

 

    పాలమ్ రోడ్ మీద ఎనభయ్ కిలోమీటర్ల స్పీడ్ తో ఓ పోలీస్ జీప్ జెట్ లా దూసుకుపోతోంది. నీరవ నిశ్శబ్ద సమయంలో ఆ జీప్ చప్పుడు తప్ప, మరే చప్పుడూ విన్పించడం లేదు.

 

    "డ్రైవర్.... క్విక్... ఉయ్ ఘట్ బీ ఎట్ ద పాయింట్. విత్ ఇన్ సెవెన్ మినిట్స్."

 

    డ్రయివరు పక్కన కూర్చున్న వ్యక్తి కంగారుగా హెచ్చరించాడు. అతని ముఖం అప్పటికే అలసటతోనూ, చిరుచెమటతోనూ నిండి వుంది.

 

    ఆ వ్యక్తి సి.బి.ఐ. ఆఫీసర్ అన్వేషి. అయిదడుగుల ఏడంగుళాల పొడవుంటాడు. వెడల్పాటి ముఖం. చిందరవందరగా నుదుటిమీద పడే జుత్తు, మగఠీవికి నిదర్శనంగా ఎత్తయిన మీసాలు... వెడల్పాటి పెదాలు- కండలు దీరిన ఉక్కు శరీరం...  

 

    డిపార్ట్ మెంట్ లోకి వచ్చిన రెండేళ్ళలోనే ముక్కుసూటిగా, నిజాయితీపరునిగా పేరు పొందాడు. దానికి కారణం... నేరస్తుడు ఎంత గొప్పవాడైనా, ఎలాంటి రాజకీయ పార్టీల అండదండలున్నాయని తెలిసినా భవిష్యత్ లో జరిగే పరిణామాలను ఊహించకుండా ఎదుర్కోవడం, న్యాయస్థానానికి అప్పగించడంలో "డేర్ డెవిల్ ఆఫీసర్" గా పేరు పొందాడు అన్వేషి.

 

    ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ మీదుగా జీప్ దూసుకు పోతోంది.  

 

    "మనం వెళ్ళేసరికి ఆ ఫ్లయిట్ వెళ్ళిపోయిందో నిన్ను నిర్దాక్షిణ్యంగా కటకటాల వెనక్కి తోసేస్తాను. గుర్తుంచుకో" డ్రయివర్ తో సీరియస్ గా అన్నాడు అన్వేషి చేతి వాచీవైపు చూసుకుంటూ.

 

    ఇంకో పదినిమిషాలు మాత్రమే టైముంది. ఓన్లీ టెన్ మినిట్స్.

 

    అన్వేషి సంగతి తెలిసిన డ్రయివర్ స్పీడ్ పెంచాడు.

 

    దూరంగా ఎయిర్ పోర్ట్...

 

    "యాదగిరీ! మెయిన్ రోడ్ లోంచి వెళ్ళొద్దు. బ్యాక్ డోర్ లోంచి వెళదాం... క్విక్...." తలెత్తి నలువైపులా చూస్తూ అన్నాడు అన్వేషి.

 

    "బ్యాక్ డోరా... ఆ డోర్లోంచి వెళితే, మనకు రన్ వే వస్తుంది సార్" అన్నాడు యాదగిరి.

 

    "గో... స్ట్రయిట్ రన్ వే... నో మోర్ క్వశ్చన్"

 

    "పర్మిసన్ లేకుండా- రన్ వే మీదకు... వెహికల్స్..."                

     

    "దిసీజ్ మై ఆర్డర్... నీకు ఉద్యోగం పోతుందని భయమా... సీట్లోంచి తప్పుకో...." అంటూ రన్ వే మీద కనిపిస్తున్న ఫ్లయిట్ వైపు చూశాడు.

 

    ఆ సమయంలో న్యూఢిల్లీ నుంచి దుబాయ్ వెళ్ళే ఫ్లయిట్ మాత్రమే వుంది. ఆ విషయం అన్వేషికి స్పష్టంగా తెల్సు. నేరస్తుడ్ని ఈ సమయంలో కనుక పట్టుకోలేకపోతే, మరెప్పుడూ పట్టుకోలేం... అన్న విషయం అన్వేషికి బాగా తెలుసు.   

 Previous Page Next Page