Previous Page Next Page 
ముగ్ధ పేజి 23

 

     "అతనిలో కొన్ని క్వాలిటీస్ నాకు నచ్చాయే. టెస్టు చెయ్యడం మన ఎక్స్ పర్ మెంట్లో ఒక భాగమేకదా! టెస్టు చేసొస్తాను" లేచి నిలబడింది ముగ్ధ.
    
    "ఎక్కడుంటాడో ఎలా కనుక్కుంటావ్?" సందేహంగా అడిగింది అలక.
    
    "మనసుంటే కాటేజ్ కి మార్గమే దొరకదా?" నవ్వుతూ మెట్లు దిగి ఎడమవేపు మలుపు తిరిగిన ముగ్ధవేపు చూస్తున్నారు అలక, సురభి.
    
    అదే సమయంలో కుడివేపునుంచి వస్తున్న ఆ వ్యక్తిని చూసి ఆశ్చర్యపడింది సురభి.
    
                                        *    *    *    *    *
    
    శ్రీ కాళహస్తి ఐదు కిలోమీటర్లు దూరం వుండగా సడన్ గా ఆగిపోయింది పోలీసు జీపు.
    
    "ఏమయింది?" అసహనంగా అడిగాడు ఇన్ స్పెక్టర్.
    
    "పెట్రోలు అయిపోయినట్టుంది సార్" కిందకు దిగి చెక్ చేసి "పెట్రోలు ప్రాబ్లమ్ సర్" అన్నాడు డ్రైవర్ తిరిగి.
    
    "బయల్దేరేముందు చూసుకోవాల్సిన అవసరం లేదా?" చికాకు పడ్డాడు ఇన్ స్పెక్టర్.
    
    "అర్జంటుగా కాళహస్తి కేంప్ అంటిరి" గొణిగాడు డ్రైవర్.
    
    "ఇప్పుడెలా?"
    
    "ఇంకో రెండు కిలోమీటర్లు వెళితేనేగాని పెట్రోలుబంక్ రాదు."
    
    "ఇద్దరు పి.సిల్ని నీకిస్తాను. బండి తీసుకుని వెళ్ళిళ్లి పెట్రోలు పోయించండి. మేం ఏదో బస్సెక్కి కాళహస్తి వెళ్తాం" చెప్పాడు ఎస్.ఐ.
    
    డ్రైవర్, ఇద్దరు పి.సి.లు జీపును ముందుకు తోసుకెళ్ళారు.
    
    రోడ్డు పక్కనే నిలబడ్డ ఇన్ స్పెక్టర్ ముఖం దూరంగా ఓ లారీ కనబడడంతో విప్పారింది. లారీని ఆపి ఇన్ స్పెక్టరూ, పోలీసులూ ఎక్కారు.
    
    ఆర్టీసీ బస్సు కాళహస్తీశ్వర ఆలయం రోడ్డు దగ్గర ఆగగానే అందులోంచి దిగింది నీలిమ.
    
    అటూ ఇటూ చూస్తున్న నీలిమ దగ్గరకు ఓ పదిహేనేళ్ళ కుర్రాడొచ్చాడు.
        
    "మీ పేరు నీలిమేనా?" అడిగాడు.
    
    అవునన్నట్టు తలూపింది నీలిమ.
    
    "అయితే మీ ఫ్రెండ్ దగ్గరకు తీసుకెళ్తాను రండి" అంటూ మెయిన్ రోడ్ కి ఆనుకుని వున్న ఓ సందులోకి తీసుకెళ్ళాడు ఆ కుర్రాడు.
    
    ఓ తలుపు తట్టాడు.
    
    రెండు నిమిషాల తర్వాత తలుపు తెరచుకుంది. ఇల్లు చూపించిన కుర్రాడు వెళ్ళిపోయాడు.
    
    తలుపు తీసిన అరవింద్, నీలిమను చూసి నవ్వాడు.
    
    "రండి."
    
    నలువేపులా చూస్తూ లోనకు అడుగేసింది నీలిమ. తలుపేసేసి, లోనకు తీసికెళ్ళాడు నీలిమను అరవింద్.
    
    పేరుపేరునా ఫ్రెండ్స్ అందర్నీ పరిచయం చేసాడు. ఆపైన ఇంకో గదిలోకి తీసికెళ్ళాడు.
    
    ఆ గదిలో పాతకాలపు కుర్చీల్లో కూర్చున్నారిద్దరు.
    
    "రారనుకున్నాను. వచ్చారే" నవ్వుతూ అన్నాడు అరవింద్.
    
    "ఫోన్ చెయ్యరనుకున్నాను. చేసారే..." తనూ నవ్వుతూ అంది నీలిమ.
    
    "మిమ్మల్ని నేనెలా మర్చిపోతాను. మనం ఎవరెవరిమో ఒకరికొకరు తెలీకపోయినా, మీరు నాకు హెల్ప్ చేసారు. మీ రేగనక నాతో వుంటే, విజయం నాదే. ఈ పొలిటీషియన్లను మూడు చెరువుల నీళ్ళు తాగించగలను."
    
    "పొగడకండి. అతి చిన్న హెల్ప్ ను మేగ్నిఫై చేసి చూస్తున్నారు మీరు."
    
    "మీరు నిన్నా హెల్ప్ చెయ్యకపోతే నేనూ, నా ఫ్రెండ్స్ నిర్దాక్షిణ్యంగా పోలీసులకు బలైపోయేవాళ్ళం. ప్రస్తుతం పోలీసులు మా గురించి సీరియస్ గా వెతుకుతుంతారు. ఈ పాటికి తిరుమల పోలీసులు దగ్గరున్న పోలీస్ స్టేషన్ల కన్నిటికి ఇన్ ఫామ్ చేసుంటారు. ఇవాళ కొన్ని పేపర్లలో మా ఫ్రెండ్స్ ఫోటోలు కూడా వేసారు. ఎలా తప్పించుకోవడం అని ఆలోచిస్తున్నాం. మీరేదైనా ఎడ్వయిజ్ ఇవ్వగూడదూ."
    
    "నిజంగానేనా." అడిగింది నీలిమ.
    
    "మీతో జోకులేస్తున్నాననుకుంటున్నారా ఇంకా మీతో పరిచయం పెరగలేదు కూడా జోకులెయ్యడానికి..." నవ్వుతూ అన్నాడు అరవింద్.
    
    "ఓ పని చేస్తే బాగుంటుంది. వున్నది అందరూ మగవాళ్ళేకదా. చీరా జాకెట్లు కట్టుకోండి. హేర్ స్టయిల్ కన్పించకుండా, పైటలు ముసుగేసుకోండి."
    
    "ఫెంటాస్టిక్ బ్రహ్మాండమైన అయిడియా" అంటూ గదిలోంచి బైటకొచ్చి ఆ అయిడియాను ఫ్రెండ్స్ అందరితో చెప్పి, మాట్లాడి మళ్ళీ లోనకొచ్చాడు అరవింద్.
    
    "మా వాళ్ళక్కూడా ఈ అయిడియా నచ్చిందండి. థ్యాంక్స్ ఫర్ యువర్ గ్రేట్ అయిడియా మీరొచ్చేవరకూ గింజుకు ఛస్తున్నామనుకోండి అందుకే అన్నారు పెద్దలు, ఒకడు ఎన్నిసార్లు చారు తయారు చేసినా అందులో టేస్ట్ రాలేదట. కానీ ఒకమ్మాయి వచ్చి చిన్న కరివేపాకు వేసిందట. అంతే చారు బహురుచిగా అయిపోయిందట. ఎంతైనా ఆడవాళ్ళు ఆడవాళ్ళే ఆడవాళ్ళు లేకుండా మగవాళ్ళు లేరండి" అరవింద్ మాటల్లోనే, అరవింద్ ని తనొక అద్బుతమైన వ్యక్తిలా తయారు చెయ్యగలనన్న నమ్మకం, అందుకు అతడు సహకరిస్తాడన్న నమ్మకం ఏర్పడింది నీలిమకు.
    
    యాన్టీ సోషల్ ఎలిమెంట్ గా ముద్ర వేసుకోబోతున్న అరవింద్ ని మార్చడం ఎలా? తనూ అతనితో, కొన్నాళ్ళపాటు పనిచేయక తప్పదు. తన తండ్రిని బలి తీసుకున్న వ్యవస్థను తను క్షమించలేదు. సమాజమ్మీద కక్ష తీర్చుకుంటూనే, సమాజంలో ఒక ఉన్నతమైన స్థానంలో అరవింద్ ని ఉంచగలగాలి.
    
    "ఏమిటి ఆలోచన్లో పడ్డారు?" నీలిమ ఆలోచనలకు బ్రేక్ వేసాడు అరవింద్.
    
    "ఏం లేదు చెప్పండి."
    
    "తిరుపతిలో ఎక్కడుంటున్నారు."
    
    "హాస్టల్లో..."
    
    "ఎడ్యుకేషన్ అయిపోయింది కదా ఇంకా హాస్టల్ కూడేన ఇంటికి వెళ్ళరా."
    
    "ఆ ప్రయత్నంలోనే వున్నాను."
    
    "అయితే మీరెక్కడున్నా నేను ఫోన్ చేస్తుంటాను. మీరు వీలు చూసుకుని హైద్రాబాద్ రండి కొన్నాళ్ళు నా గెస్టుగా వుందురుగాని, ఏమంటారు."
    
    "అలాగే థాంక్స్ ఫర్ యువర్ ఇన్విటేషన్."
    
    అదే సమయంలో లోనికో కుర్రాడొచ్చాడు. ఏదో చెప్పడానికి సందేహిస్తున్నాడా కుర్రాడు.
    
    "ఏం పర్వాలేదు చెప్పు మనఫ్రెండే."
    
    "చీరల ప్రోబ్లమ్ పైసలు సరిపోతాయో లేదో" గొణిగాడు.
    
    అరవిందే లేచి అతనితోపాటు బైట గదిలోకెళ్ళి, మళ్ళీ లోపలకొచ్చాడు.
    
    "అయిదుగురం వున్నాం కదా పైసలు తక్కువగా వున్నాయ్." అన్నాడు అరవింద్.
    
    "మనీ ఎడ్జస్ట్ చెయ్యనా?" అభిమానంగా అడిగింది నీలిమ.
    
    "వద్దులెండి, మీరు కట్టుకున్న శారీ ఎడ్జస్ట్ చెయ్యగలరా?"
    
    ఒక్క నిమిషంలో ఆలోచనల్లో పడింది నీలిమ.
    
    "నీవెలాగూ బ్యాగీ ఫేంటూ, షర్టూ మీకు సరిపోతాయనుకుంటాను. ఎంతో హెల్ప్ చేసారు. ఈ హెల్పూ చెయ్యండి. మీ పేరు చెప్పుకుని, మీ శారీ కట్టుకుని తప్పించుకుని హాయిగా వెళ్లిపోతాం."

 Previous Page Next Page