Previous Page Next Page 
అందమైన అపశృతి పేజి 23


    అదేం దురదృష్టమో ఏనాడూ జిర్రున చీది ఎరుగని రాజాగారికి కొద్దికాలం క్రితం పెరాలిసిన్ వచ్చి ఓ కాలూ, చెయ్యి వచ్చుబడింది. ఒకటి వారి వైద్యాలు చేయించినా కించిత్ ప్రయోజనం కలుగలేదు.

    శృతికి రాజాగారి విషయంలో మరో అంచనాకూడా పొరపాటు అయింది. ఒకటి వారి వయసు. మరొకటి వారి ఆరోగ్యం.

    రాజాగారు కూతురిని పలుకరిస్తూ శృతినికూడా పలకరించారు.

    దెబ్బతిన్న బెబ్బులిలా మంచంలో వున్న రాజాగారిని చూస్తె ఎవరికైనా కళ్ళల్లో నీళ్ళు తిరుగుతాయి. రాజాగారి రూపం అలాంటిది.

    ఆ యింట్లో తలోరకం మనుషులు, తలకో కథ అనిపించింది శశృతికి.

    మొదట్లో వారానికి ఓ కార్డ్ ముక్క నాలుగే వాక్యాలు రాసేది తల్లికి, తను రాసిన లెటర్ ఎవరైనా చూస్తే! అందుకే ముందు జాగ్రత్త పడించి. తర్వాత ఎవరి కంతా పడకుండా రాసిన రెండుకావుల లెటర్ ని పోస్టు చేసింది. ఆ లెటర్ శ్రీదేవికి రాసింది. ఈ ఇంటి విషయాలన్నీ రాస్తూ, తనకేం ప్రమాదం లేదని, కొన్నాళ్ళాగితే తను నిజం చెప్పగలుగుతుందని, స్వాతి తనని అర్థం చేసుకుంటుందని రాసి ఫోన్ నెంబరుకూడా రాసింది. ఫోన్ చెయ్యవద్దని హెచ్చరిక చేసింది.

    స్వాతి ఒకోసారి అతి అమాయకంగా వుండేది. మరో సారి చాలా మేథావి అనిపించేది. అలగడం, చిన్నపిల్లలా పేచీ పెట్టడం చేసేది. శృతి అప్పుడు బుజ్జగించో, లాలించో దారికి తీసుకొచ్చేది.

    ఆలాంటప్పుడు స్వాతి "నువ్వుత్త చెడ్లపిల్లవి" అనేది.

    "ఉన్నమాటే" అంటూ నవ్వేది శృతి.

    "నీ కసలు కోపం రాదా?" అదేదో చాలా పెద్ద విషయమైనట్లు ఆశ్చర్యపోయేది స్వాతి.

    వెంటనే తల్లి గుర్తుకు వచ్చేది. శృతికి. "ముక్కు చివరే వుంటుంది కోపం, పిలిస్తే పలుకుతుంది, ఆడపిల్లకి అణుకువ వుండాలి" శృతికి కోపం వచ్చినప్పుడల్లా తరుచుసీతమ్మ అనే మాట యిది.

    "ఏమిటి ఆలోచిస్తున్నావ్! శృతిని కదుపుతూ అడిగింది స్వాతి.

    "కథ" అంది శృతి.

    "కథా? అయితే చెప్పు చెప్పు." అంటూ ఉత్సాహం చూసించింది స్వాతి.

    తరుచు స్వాతికి సినిమా కథలు, తనకు తెలిసిన కథలు చెపుతుండేది శృతి. కథలు, చదువు__ఈ మూడూ ప్రాణం స్వాతికి.

    శృతి కథ మొదలుపెట్టింది.

    "పూర్వం ఓ రాజుగారి దగ్గర బుద్దిమంతుడైన ఓ నౌకరు వుండేవాడు. ఆ నౌకరుకి కోకంరాగా రాజుగారు చూడలేదు. ఇదేమాట గొప్పగా అందరితో చెప్పేవాడు రాజుగారు. ఇదంతా చూస్తుంటే మంత్రిగారికి వళ్ళు మంటగా వుండేది. నౌకరు లేకుంటా చూసి గాజుగారితో పందెం వేశారు మంత్రిగారు.

    "ఎమని?"

    "నౌకరుకి బోలెడంత కోపంవుంది, నిరూపిస్తానని"

    "నిరూపించాడా!"

    "ఆ....మంత్రిగారు చెప్పినట్లే ఆ పూట ప్రతిదానికీ నౌకరుమీద విసుక్కుని కోపం ప్రదర్శించారు రాజుగారు. నౌకరు చిరునవ్వుతో ఎంతో ఓర్పుగా వున్నాడు. రాత్రయింది. కొలువు చాలించి నౌకరు ఇంటికి వెళ్ళాడు. మారువేషాలతో రాజుగారు, మంత్రిగారు నౌకరు వెనుకనే వెళ్ళారు. ఇంటికివెళ్ళిన నౌకరు పెళ్ళాంమీద అనవసరంగా కేకలువేస్తూ కోప్పడుతున్నాడు......

    "ఆ......అర్ధమైంది. ఆ తర్వాత కథ నే ఊహించి చెప్పగలను" అంది స్వాతి.

    "చెప్పు చూద్దాం." అంది శృతి.

    "అప్పుడు రాజుగారు, మంత్రిగారు మారు వేషాలు తొలగించి నౌకరు ముందుకొచ్చి "నీ ఓర్పంతా ఏమైందిరా? నీకు కోపమే లేదనుకున్ననే" అంటారు. అప్పుడా నౌకరు "మహా రాజా! నేను మీ దగ్గర నౌకరుని. యజమాని ఎన్ని అన్నా నౌకరు ఓర్పుగా పడివుండాలి. అందుకేవుంటున్నాను" అంటాడు. "బాగానేవుంది, నీ భార్యమీద అంతకోపం ప్రదర్శిస్తావేమిరా?" అని రాజుగారు అడిగారు. "నా భార్యకి నేను యజమానిని, మీరు మీ నౌకరుమీద కోపం ప్రదర్శించిన్నప్పుడు నేను నా నౌకరుమీద కోపం ప్రదర్శించడంలో వింతేముంది." అంటాడు అంతేనా కధ?"

    "కరెక్టుగా చెప్పావు స్వాతీ!" అని మెచ్చుకుంది శృతి.

    కధలు చదివి, చదివి కొత్తకధల ముగింపు తెలిసిపోతున్నది."

    "చదివినా అందరూ ముగింపు చెప్పలేరు. నువ్వు మేధావి అనే చెప్పవచ్చు."

    "మేధావి అంటే గుర్తొచ్చింది. నీకు చెస్ తెలుసా?"

    "ఛస్సా!"

    "చెస్! అదే చదరంగం"

    "చెస్సు తెలుసు, చదరంగము తెలుసు-రెండూ ఒకటేనని తెలుసు"

    "ఆడడం"

    "అదీ తెలుసు"

    "మరి ఇంతకాలం చెప్పలేదేం శృతీ! నాకు చెస్ ఆడటం చాలా బాగా వచ్చు, నాతో ఆడేవారు లేక మూలనపడేశాను. చదరంగం కనిపెట్టింది ఎవరోగాని మా గొప్ప ఆట. ఒక్కో కాయికి ఒక్కో పవర్, ఏ కాయకి  ఆ కాయే గొప్ప. అన్ని కాయిన్స్ లో దేనికి పవరెక్కువ?'

    "మంత్రికి" టకీమని జవాబిచ్చింది శృతి

    "కాదు రాజుకి, మంత్రి చనిపోయినా మిగతా కాయిన్స్ తో ఆట ఆడవచ్చు రాజుని కట్టేస్తే - అదేలే చంపేస్తే ఎన్ని బలగాలుండీ ఏం లాభం?"

    "నేనంత ఆలోచించలేదు స్వాతీ! నీవు చెప్పిందే కరెక్టు.

    ఇదయినా పూర్తి కరెక్టు కాదు శృతీ! రాజులేని ఆటలేదు కాబట్టి మంత్రికే పవరెక్కువ అనుకోవాలి. పేరుకి రాజేగాని ఒక గడినిమించి జరగలేడు. తనని చంపేవాడిని చంపగల శక్తివుండికూడా ఒక్కోసారి  చంపలేడు. ఎదుటి పార్టీ సిపాయిలు రెండు మూలాలుగా వుండివుంటే ముందు సిఫాయిని చంపితే రెండో సిపాయి రాజు ప్రాణం తీస్తుంది. అందుకని ఆప్టరాల్ ఒక సిపాయిగాడికున్న పవర్ రాజుగారికి లేనట్టే"

    "ఇదీ కరెక్టే అన్నింటికన్నా కరెక్టు నీమేధ. అవునన్నది కాదని, కాదన్నది అవునని మాటల చతురతతో నిరూపించగలవు." మెచ్చుకోలుగా అంది శృతి.

    "నన్ను పొగడడం తప్ప మరేపనీ లేడు నీకు" అంటూ అప్పటికప్పుడు మూలపడేసిన ఛస్ బోర్డు, కాయిన్స్ తెప్పించింది స్వాతి.

    శృతి నాలుగు కాయలు జరిపిందోలేదే స్వాతి గ్రహించింది.

    "నువ్వు చాలా బాగా ఆడగలవు" అంది మెచ్చుకొలుగా.

    "నీ కన్నానా స్వాతీ!" అంది శృతి గుర్రపు ఎత్తువేస్తూ.

    "జయాపజయాలు దైవాధీనం" అంటూ గుర్రం బారి నుంచి తన మంత్రిని తప్పించింది స్వాతి.

    ఆట చాలా పదునుగా సాగిపోతున్నది.

   

                                                                    20


    శృతి తన క్షేమ సమాచారాలు చిన్నమ్మకి రాస్తున్నట్లుగా శ్రీదేవిపేర రాస్తున్నది. అలాగే చిన్నమ్మపేరుతో రాస్తున్నది శ్రీదేవి. వారి ఉత్తర పత్యుత్తరాలు పరాయి వాళ్ళకి అతి సామాన్యమైన  విషయం మాదిరిగా కనిపిస్తాయి కాని వీరిరువురికి మాత్రమే వాటి స్పెషల్ కోడ్ అర్థమవు ఆరోజు శ్రీదేవి దగ్గరనుంచి అలాంటి ఉత్తరమే అందింది.

    "చి|| శృతికి____

    చిన్నమ్మ వ్రాయునది. ఈ నెల నీవు పంపిన డబ్బు అందినది. అయిదో తారీఖు తర్వాత అందే విధంగా పంపించావు. నీకోసం నేనంత ఖర్చు పెట్టానో కాస్త ఆలోచించు. ఇహపై ఆలస్యం చేయవద్దు.

    నాకీళ్ళ నొప్పుల బాధ అలాగే వున్నాయి. వయసు మీద పడుతుంటే ఆరోగ్యం ఎక్కడనుంచి వస్తుంది? నా చాదస్తంకొద్దీ రాయడంమేగాని  నాయిది ఎవరికి కావాలిలే.

    నాలుగు రోజులక్రితం సిద్దయ్య తిరిగివచ్చాడు సిద్దయ్య అసలు నీకు గుర్తున్నాడా? అదే సీతాలు పెద్దకొడుకు సిద్దయ్య. కొన్నాళ్ళక్రితం ఇంట్లోవాళ్ళు తనమీద నేరం మోపారని కోపమొచ్చి ఇల్లు విడిచిపోయాడు వాడు.

    ఉన్న ఉద్యోగమూ పోయింది. ఇప్పుడు దిగులో ఏమిటో ఇల్లు కదలడంలేదు. రాగానే నిన్ను అడిగాడు. నీకేం హాయిగా వున్నావని చెప్పాను, నిన్ను చూడాలని వుందట. వెధవ చనువు నాలుగు కేకలేశాను. లేకపోతే వచ్చినా వస్తాడు. దేశదిమ్మరి కేముంది? ఇదెందుకు రాస్తున్నానంటే ఇదివరకు నాపెంపకంలో వున్నావు కాబట్టివాడిని అన్నయ్యా అని, వీడిని తమ్మయ్యా అని పూసుకు తిరిగినా నేను జాగ్రత్తలు చెపుతూ వుండేదాన్ని. ఇప్పుడు వంటరిగా వున్నావ్? ఆడపిల్లవి ఎవరితో ఎంతవరకుండాలో అంతవరకే వుండు. ఈ ముసలిదాని మాట వివేదేమిటిలే అని నిర్లక్ష్యం చేయకు.

    నీ కాళ్ళపై నీవు నిలబడగల శక్తి వచ్చిందికదా అని పిచ్చివేషాలూ వేయకు.

    నీ చిన్నమ్మదయే లేకపోతే వీధులపాలయేదానిని.

    "ఇంట్లో అందరికీ తలో రోగము, అడ్డెడు తప్పాలకే రోగమూలే" దని ఓ సామెత వుంది. అలా వుంది నా పరిస్థితి. ఇందరు పిల్లలువున్నారు. ఇంకా ఒక్కరూ చేతికి రాలేదు. నువు పంపే ఆ నాలుగురాళ్ళే కొంత ఆధారము నెలనెలా తొందరగా అందేలా డబ్బు పంపుతూ వుండు. ఉన్నచోట మంచి అనిపించుకుని మెలుగు. నీ కేఖర్చు లేకపోతే కాస్త ఎక్కువ డబ్బు పంపు.

                                                                                                               ఇంతేసంగతులు
                                                                                                                     ఇట్లు       
                                                                                                                నీచిన్నమ్మ."


    ఒకసారి కాదు. రెండుసార్లు కాదు, పైనుంచి కింద దాకా గబగబ ఏ పదిసార్లో ఆ లెటర్ చదివింది శృతి.

    ఆ లెటర్ మరొకరి చేతిలో పడ్డా ఎవరూ అనుమానించారు.

    ఆ జాగ్రత్త ముందే తీసుకుంది శృతి.

    చిన్నమ్మకి ఎక్కువమంది పిల్లలని, చిన్నమ్మ భర్త పోయాడని, తనపై జాలితో చేరదేసిందని, ఆ పిల్లలందరికీ చాకారి చేస్తూ చదువుకున్నానని, ఇప్పుడు నెలనెలా తన జీతం మూడొంతులు పంపిస్తానంటేనే తన్నిక్కడకి  పంపిందని, తను చచ్చినా ఆవిడకి ఏ దిగులూ లేదని చెప్పివుండబట్టి ఇలాంటి లెటర్ ఎవరిచేతిలో పడ్డా ప్రమాదంలేదు. పైగా లెటర్స్ లో కూడా ఈ పిల్లమీద సాధింపులు, అధికారం చేలాయించటమూనా అనుకుంటారు.

    లెటర్ బాగానే అర్థమైంది శృతికి.    

 Previous Page Next Page