మరోసారి కళ్ళు మూతలు పడ్డాయి జాస్మిన్ కి. బలవంతాన తల విదిలించింది. ఆ విదిలింపుకే శరీరం కదిలి గాయాలు తీవ్ర బాధకు లోనయ్యాయి. రక్తస్రావం మళ్ళీ మొదలయింది. మూలుగుతూ వుండిపోయింది.
నందితాదేవికి కాళ్ళూ చేతులూ ఆడటం లేదు. చేతులు నలుపుకుంటూ కాస్త వంగి ఆమె ముఖంలోకి చూస్తూ వుండిపోయింది.
ఆగి ఆగి చెపుతూ ఆ యింటి అడ్రస్ వివరంగానే చెప్పింది. తర్వాత నాలుకతో పెదవి రాచుకుంది.
మంచినీళ్ళు పోద్దామని నందితాదేవి గ్లాసు తీసుకుంది. గ్లాసులో నీళ్ళు ఇందాకే అయిపోయాయి. లేచి కిచెన్ లోకి నడిచింది.
కిచెన్ లోంచి మంచినీళ్ళ గ్లాసుతో వస్తుండగా లైటు ఆరిపోయింది. కరెంట్ పోయి వుంటుంది. గాడాంధకారం. తడుముకుంటూ గదిలోకి వచ్చిన నందితాదేవి కాలికి జాస్మిన్ తగిలింది. తూలి పడబోయింది. అంతలోనే సర్దుకుంది. "సారీ జాస్మిన్" అంటూ కిందకూర్చుని జాగ్రత్తగా జాస్మిన్ పెదవి దగ్గరకు గ్లాసు తీసుకువెళ్ళి రెండు గుక్కల నీరు నోట్లో పోసింది. "కొవ్వొత్తి వుందా జాస్మిన్" అని అడిగింది.
జాస్మిన్ జవాబు ఇవ్వలేదు.
"జాస్మిన్...జాస్మిన్" ఆమె శరీరాన్ని కదిలిస్తూ ఆందోళనగా పిలిచింది నందితాదేవి.
జాస్మిన్ శరీరం కట్టెలా బిగుసుకుపోయి చల్లగా తగిలింది. "జాస్మిన్" అంటూ పక్కకు పడిపోయింది నందితాదేవి.
కొద్దిసేపటికి తెలివి వచ్చింది నందితాదేవికి. కరెంటు వచ్చేసిందేమో గదంతా మెర్క్యురీ లైటు వెలుతురు కాంతివంతంగా పరుచుకుని వుంది. తెలివి వస్తూనే గబుక్కున లేచి కూర్చుంది. జాస్మిన్ ని చూస్తూనే కెవ్వున అరచి శబ్డంపైకి వినిపిస్తుందేమో అని చేతితో గట్టిగా నోరు నొక్కుకుంది.
జాస్మిన్ నోరు తెరచి వుంది. కరెంటు పోయినప్పుడు తను పోసిన నీళ్ళు అలాగే సగం నోరు నిండి వున్నాయి. " నా కిచ్చిన మాట నిలబెట్టుకుంటావు కదూ?" అన్నట్లు రెండు కళ్ళూ తెరుచుకుని అలాగే వుండిపొయ్యాయి. చుట్టూతా రక్తం మడుగు. క్రీమ్ కలర్ నైట్ గౌను మీద మందార పువ్వుల్లా ఇంతంత వెడల్పు రక్తం మరకలు. భయంకరంగా వుంది ఆమె.
"జాస్మిన్!" అంటూ దోసిటిలో ముఖం దాచుకుని ఏడుస్తూ వుండిపోయింది నందితాదేవి.
రాజు తలుపు తీశాడు.
రూమ్ సర్వీసుబాయ్ మెకానిక్ తో తలుపవతల నుంచొని వున్నాడు.
"ఈ రూమ్ లో ఫోను సరీగా పనిచేయటం లేదు. ఇతను చూసి వెళతాడు" రూమ్ సర్వీసుబాయ్ చెప్పాడు.
రాజు మాట్లాడలేదు. పక్కకు తొలగి నుంచున్నాడు.
పది నిమిషాలలో మెకానిక్ పని పూర్తయింది.
"మీకు ట్రబులిచ్చాము" నమ్రతగా పలికి సెలవు తీసుకుని వెళ్ళిపోయారు వాళ్ళు.
వాళ్ళిద్దరికీ తెలియదు. వచ్చినతను ఫోను రిపేరు చేయటానికి కాదు వచ్చింది. ఫోను రిపేరు చేసే నెపంతో వచ్చి మైక్రోఫోను పెట్టటం జరిగింది. ప్రమాదానికి పది అడుగులదూరంలో వున్నామని గ్రహించలేదు. గ్రహించలేరు కూడా.