ఈ తఫా వాళ్ళు యాత్రల నుంచి వస్తూ ఎర్రరంగు ట్రంకు పెట్టె అంత పెద్దది కొనుక్కురావటం మనకి ఆశ్చర్యం కలిగించింది. ఆ పెట్టె ధర అడిగితే బాబాయిగారు ఓ ధరచెప్పారు పిన్నిగారు మరోధర చెప్పారు. పెట్టె చాలా బరువుగా వుంది అని మనం అనంగానే ఎవరికో అందించాల్సిన సామాను అందులోవుంది అన్నారు. ఆ సామాను బైటకి తీసి ఆ ఎవరికో చేర్చటం మనం చూడలేదు. మరో విషయం ఏమిటంటే యాత్రల నుంచి వచ్చేటప్పుడు పిన్నిగారు బాబాయిగారి ముఖాలు కళకళలాడుతున్నాయి. తెల్లారి లేస్తూనే చూసేసరికి కళ తప్పి ఆ ముఖాలు వెలాతెలా పోతున్నాయి.
అదలా వుండగా....
ఈ ఉదయం ఇంట్లో పొయ్యి రాజేయలేదు. 'మేము ఊళ్ళో లేనప్పుడు ఏమైనా విశేషాలు జరిగాయా!' అని అడగలేదు. తెలిసిన బంధువుల ఇంటికి పోతున్నామని చెప్పి వెళ్ళారు. వంట సామానులు తీసుకెళ్ళలేదు. గుడికి వెళ్ళి వస్తున్న రాజమ్మగారు వీధిలో ఎదురయి 'మీ ఇంటివాళ్ళు యాత్రల నుంచి వచ్చినట్లున్నారే, గుడి ఆవరణలో కూర్చుని మాట్లాడుకుంటుంటే చూశాను. నేను వాళ్ళని చూశాను గాని వాళ్ళు నన్ను చూడలేదులే" అంది. "వాళ్ళిద్దరేనా, ఇంకెవరైనా పక్కన ఉన్నారా!" అంటే లేరు అంది.
"అదీగాక__
వాళ్ళు మనతో గుడికి వెళుతున్నాము అని చెప్పలేదు. తెలిసిన వాళ్ళు రమ్మంటే అటునుంచి అటు వెళ్ళారులే అని సర్దుకుందాము. పిన్నిగారు, బాబాయిగారూ హోటల్లో భోంచేయటం స్వయంగా మా వారి కళ్ళతో మావారే చూశారు. ఆ విషయం గప్ చిప్ గా వచ్చి నాతో చెప్పారు. అర్ధరూపాయి పెట్టి మిరపకాయ బజ్జీలు కొని తినటానికి అర్ధగంట ఆలోచించే బాబాయిగారు ఊళ్ళో ఇళ్ళు పెట్టుకుని హోటల్లో డబ్బు పెట్టుకుని భోంచేయడమా? ఇంపాజిబుల్, అంటే ఏదో వున్నట్లే కదా! వాళ్ళు ఇంటికి వచ్చిన తరువాత అడిగితే వాళ్ళు బలవంతం పెడితే అక్కడ భోంచేసి వచ్చాము అన్నారు.
"అప్పటి నుంచీ__
మనకి వాళ్ళపై అనుమానం వచ్చింది. వాళ్ళ చర్యలు, వింత ప్రవర్తన మౌనంగా ఓ కంట గమనిస్తూ వున్నాము. నాలుగు గంటలవరకూ భార్యా భర్తలు ఇరువురూ మాటా పలుకు లేకుండా పడుకున్నారు. మూడు గంటలకి బాబాయిగారు బైటికి వెళ్ళివచ్చారు. ఆ సీను మనం చూడలేదుగాని 'మాట్లాడుకున్న డబ్బు ఇచ్చాను. ఖాళీ పెట్టెకు కూడా డబ్బు ఇవ్వాలా?' అన్నారు. 'పెట్టెకి కాదు బాబుగారూ! దూరం చూసి మరో పావలా డబ్బులు అడుగుతున్నాను' అన్నాడు. అదేమిటో అని మనం వాకిట్లోకి వచ్చి చూస్తే ఏ పెట్టె కనపడలేదు గాని రిక్షా, రిక్షా అబ్బి కనిపించారు. రిక్షా అబ్బికి పావలా ఎక్కువ ఇవ్వటంతో వెళ్ళిపోయాడు. రిక్షా వాళ్లంత ఆశపోతులు లేరని బాబాయిగారు తిట్టుకుంటూ ఇంట్లోకి వెళ్ళి తలుపు వేసుకున్నారు.
"అవన్నీ అలా వుంచి__
ఎంతో అవసరం పడితే తప్ప రిక్షా ఎక్కని బాబాయిగారు రిక్షా ఎక్కి రావటం, మధ్యాహ్నం మూడు గంటల ప్రాంతంలో మనం తలుపులేసుకుని పడుకున్న వేళ బాబాయిగారు ఎక్కడికి వెళ్ళివచ్చారు? 'పెట్టె మేమే కొన్నాము, లోపల సామాను ఎవరివో' అన్నారు. ఒకవేళ ఆ పెట్టె తీసుకువెళ్ళి దానిలో సామాను వాళ్ళకి ఇచ్చి ఖాళీ పెట్టె తిరిగి తీసుకువచ్చారు అనుకుందామంటే ఖాళీ పెట్టె. దానిలో రిక్షా. ఆపనులు ఆయన చేయరు. సామాన్లు రిక్షాలో పెట్టుకెళ్ళి రిక్షా డబ్బులు వసూలు చేసి వస్తూ నడిచివస్తారు.