Previous Page Next Page 
ఇంటింటి కధ పేజి 22


    "ఏది కాదు ప్రతివాడికి యిదో వేషం . కాస్త చదివి, ఉద్యోగం చేసే అమ్మాయిని చూడగానే బరితెగించిన దానిలా కనిపిస్తుంది గాబోలు. తమ వెంట రమ్మంటే తలాడించి వస్తుందను కుంటారు కాబోలు.... చాలు.... మరెప్పుడూ యిలా నన్ను అవమానించకండి....వెళ్ళండి . యింకా మీరేదో మర్యాదస్తులనుకున్నాను" వసంత తీక్షణంగా అంది. పూర్తిగా మాడిపోయిన మొహాన్ని దించుకుని ఆమె కింకేం చెప్పి లాభం లేదని మూర్తి చరచర వెళ్ళిపోయాడు. వసంత తేలిగ్గా నవ్వుకుంది.

                                                 *    *    *    *
    ప్రసాద్ గత నాల్గు రోజులుగా మామగారిని ఏబై వేలు ఏరకంగా అడగాలో తనలో తాను పదిసార్లు వల్లించుకున్నాడు. ప్రతిసారి ఎంతో ధైర్యంగా అయన గదిలోకి వెళ్ళేవాడు. తీరా వెళ్ళాక అడగలేక నీళ్ళు నమిలి యింకేదో ఆఫీసు విషయాలు మాట్లాడి వచ్చేసేవాడు. ఏమన్నా సరే ఈరోజు అడగాల్సిందే! తన వాళ్ళకి మొహం చూపాలంటే సిగ్గుగా వుంది. ఎన్నెన్నో ఆశలు పెట్టుకున్నారు వాళ్ళు తన మీద. ఒక్క రూపాయి కూడా యివ్వలేకపోయాడు. ఈ మూడు నాల్గు నెలలుగా. యిదే ఇంకో కానింటి పిల్లను చేసుకున్నా కట్నం రూపేణా కనీసం నాలుగు అయిదు వేలు చూసేవారు. తను రాజభోగాలు అనుభవిస్తున్నాడు ఆనందంగా. హాయిగా వున్నా లేకపోయినా, సుఖాలు, దర్జాలు జరుగుతున్నాయి. ఆడపిల్లలు సంపాదించి తండ్రిని అదుకొంటుంటే తన చేతకాని తనానికి అతనికి చాలా సిగ్గు పడుతున్నాడు. ఏమయినాసరే ఆ ఏబై వేలు వాళ్ళాకి ఇవ్వాలి, అడగాలి.... మాటలు కూడ దీసుకుని , ధైర్యం తెచ్చుకుని గదిలోకి వెళ్ళాడు. "రావోయ్ రా, ఏమిటిలా వచ్చావు అన్నాడు నారాయణమూర్తిగారూ.
    "ఏం లేదండీ మీతో ఒక్కమాట చెప్పాలని మా చెల్లెళ్ళీద్దరికి మా నాన్నగారు పెళ్ళి చెయ్యాలనుకుంటున్నారు."
    "శుభం సంబంధాలు కుదిరాయా ఏమిటి  ఏం చేస్తున్నారు యిద్దరికీ ఒకేసారి చేస్తారా."
    "కుదిరితే యిద్దరికీ చేసేస్తారు. సంబంధాలు చూసే ముందు డబ్బు సిద్దం చేసుకోవాలి గదా. ఎంత హీనపక్షం చూసినా పెళ్ళి ఖర్చు, కట్నం అది అంతా కల్సి చేరి పదిహేను పైన అవుతుంది. యిల్లోకటి బొత్తిగా పాడయింది రిపేరు చేయించాలి. చాలా ఖర్చుంది . డబ్బు కావాలంటున్నారు నాన్నగారు. మీరు.....మీరిస్తానన్నా ఏభై వేలు యిస్తే యీ ఖర్చులకి...."
    "ఏ ఏబై వేలు ? అయన కాస్త ఆశ్చర్యంగా అడిగారు.
    "అదే పెళ్ళికి ముందు అన్నారు గదా, ఏబై వేలు క్యాష్ యిస్తానని "
    "అదా, ఎప్పుడో అది మీ ఇద్దరి పేరా కల్పి ఫిక్సిడ్ డిపాజిట్టు లో వేసేసానే. లతకి తెలుసు. ఆ డబ్బు మీది. మీరెలా ఖర్చు పెట్టుకుంటారో మీ ఇష్టం. మీ భార్య భర్తలిద్దరూ ఆలోచించుకోవాల్సిన విషయం మధ్యలో నాదేముంది" తేలిగ్గా అన్నాడాయన.
    ప్రసాద్ గుండె ఒక్క క్షణం లయ తప్పింది. ఈ డబ్బు లతతో ముడిపడి వుందన్నమాట. అంటే దాన్లోంచి లత యిష్టం లేకుండా నయాపైసా తను తీయలేడు. లత చచ్చినా ఆ డబ్బీయదు. ప్రసాద్ ఆశలన్నీ నీరు గారి పోయాయి. మామగారి గడుసుధనానికి వళ్ళు మండిపోయింది. అంతా మీదే అంటూ ఒకరూపాయి తను స్వంతంగా ఖర్చు పెట్టుకునే వీలు లేకుండా కూతురికి అంటగట్టి ఆ కూతుర్ని తనకు అంటగట్టిన అయన తెలివి తేటలకి విస్తుపోయాడు. లతనించి తన డబ్బు రాబట్టలేడు. తండ్రి ఎంతో ఆశ పెట్టుకున్న ఆ డబ్బు ఆశ అయిపోయిందన్న మాట. ప్రసాద్ కి కోపం, ఆవేశం వచ్చేశాయి. కసిగా మామగారి వంక చూశాడు. "మీకు మీ అమ్మాయి సంగతి తెలుసు. ఆమె నా కోసమే డబ్బీయదు, మా వాళ్ళ కంటు యిస్తుందా, నా జీవితం కూడా నాకు దక్కండ చేసింది. ఆఖరికి సినిమా కి వెళ్ళలన్నా రూపాయి లేకుండా తన మీద ఆధారపడేట్టు చేసింది. ఆమె స్వభావం తెల్సి ఆమె యిస్తుందనుకోడం వెర్రి. దయచేసి మీరు మీ అమ్మాయితో మాట్లాడి ఆ డబ్బు నాకిచ్చే ఏర్పాటు చెయ్యండి. నాకు చాలా అవసరం" ప్రసాద్ నిర్మొహమాటంగా ఖచ్చితంగా చెప్పేడు. అయన మొహం రంగు మారింది ఆ మాటలాడే తీరుకి.
    "భర్తవి దాన్ని నీవు అర్ధం చేసుకుని నీవైపు తిప్పుకోడంలో వుంది చాకచక్యం....'
    ఆయన మాట పూర్తి కాక ముందే ప్రసాద్ గయ్ న లేచాడు. "ఏమిటండీ అర్ధం చేసుకోడం --- పెళ్ళయిన మర్నాటి నుంచి నన్నో పురుగులా, తన కింద పనివాడి కన్న హీనంగా చుల్కన చేస్తూ , హేళన చేస్తుంటే సహించాను. తనమాటే అన్నింటా చెల్లాలన్న పంతాన్ని చూసి చూడనట్లూరుకున్నాను. అడుగడుగునా అవహేళనలని, అవమానాలని దులిపేసుకున్నాను. పౌరుషం,  ఆత్మాభిమానం చంపుకుని పడున్నాను. డబ్బు కోసం చేసుకున్నాను యీ పెళ్ళి అని అన్ని అవమానాలని నోరుమూసుకు భరిస్తున్నాను. ఎన్నడన్నా ప్రేమగా, అభిమానంగా, భార్య కుండాల్సిన మమత, అనురాగం చూపించిందా? అడుగడుగునా తన డబ్బు దర్పం చూపించడం తప్ప నన్నేడన్న అర్ధం చేసుకుందా? ఒక రూపాయి కోసం తన మీద ఆధారపడ్డట్టు చేసి అవమానించింది. కష్టపడి సంపాదించిన జీతం నయా పైసా నాకు దక్కుండా చేసింది. అలాంటి భార్యని ఏం అర్ధం చేసుకొమ్మంటారు. ఎలా అర్ధం చేసికొమ్మంటారు. మొన్న సినిమాకి వెళ్ళాలని తనకి లేదని - ఎంత రాద్దాంతం చేసి యింట్లో వస్తువులన్నీ నా మొహన విసిరి వేసిందో మీకు తెలియదా ...."
    "ప్రసాద్ ....దాని స్థితిలో నీవుంటే దాని పరిస్థితి ఎల వుంటుందో తెలిసేది. అన్నీ వుండి అనుభవించలేక పోతున్నాననే దాని బాధ అర్ధం చేసికోవాలి. తాననుభవించ లేనివి యింకోరు అనుభవిస్తుంటే మనిషన్న తరువాత అసూయ వుండదా ---- దాని మీద జాలి, సానుభూతి చూపడం పోయి" మొహం ఎర్రబడగా అన్నారాయన.
    "జాలి, సానుభూతి, - హు .... తను నమ్రత, అభిమానం, అనురాగం చూపించితే తప్పకుండా నానించి జాలి, సానుభూతి లభ్యమయ్యేవి. ఈ పెళ్ళి చేసుకునే ముందు అమ్మాయికి కాళ్ళు లేకపోతేనేం నాకున్నాయి, హృదయం వుంటే చాలనుకున్నాను. మీ అమ్మాయికి కాళ్ళోక్కటే కాదు లేనిది హృదయం కూడా..." ప్రసాద్ కసిగా అన్నాడు.
    "ప్రసాద్" గర్జించినట్టే అన్నారు నారాయణమూర్తి గారు. "నా కూతురిని, నా ప్రాణాన్ని నాముందే అవమానించడానికి నీకెన్ని గుండెలు" ఆవేశంతో వణికిపోతూ అన్నారు.
    ప్రసాద్ నిర్లక్ష్యంగా చూసాడు. అతనికీ మూడు నాల్గు నెలల్లోనే ప్రాణం విసిగిపోయింది. ఈ బంగారు పంజరం బతుకుకంటే, పూర్వపు బతుకే బాగుందనిపించింది అనేకసార్లు. అప్పుడు కనీసం స్వాతంత్యం వుండేది. యిప్పుడు కనీసం సినిమాకి వెళ్ళే స్వాతంత్యం కూడా లేని బతుకు అయిపొయింది. లతతోటి జీవితం నరకప్రాయంగా తయారయ్యాక అతనికి ఏదో కసి, నిర్లక్ష్యం, ఏం చేస్తారు, మహా అయితే యింట్లోంచి పొమ్మంటారు అన్నా తెగింపు వచ్చేసింది. అడుగడుగునా యీ జులుం, యీ బానిస బతుకు కంటే నిరుద్యోగిగా బతికే బతుకే నయం అనిపించింది.... అందుకే నిర్లక్ష్యంగా చూసాడు. "మీ కూతురు మీకు ప్రాణం అవచ్చు మీ రక్తం కనుక. మధ్యలో వచ్చిన భర్త భార్యని ప్రాణం అనుకోవాలంటే భార్య ప్రవర్తన వుండాల్సిన రీతి యిది గాదని మీకు తెలిసీ మీ అమ్మాయిని కనీసం మందలించనైనా మందలించారా? ప్రేమ, అనురాగం, యిచ్చి పుచ్చుకోవాల్సినవి, భర్తగా నన్ను గౌరవిస్తే భార్యగా అభిమానించేవాడిని, ఆమె స్థితికి నా సానుభూతి వుండేది. అప్పుడు ఆమె పొందలేని అనుభావించలేని సుఖాలని నా అంతట నేనే వదిలేవాడిని....యింట్లో వున్న ప్రతిక్షణం నాకు నరకం చూపిస్తుంది. యింట్లోంచి పోయినా నరకం సృష్టిస్తుంది. సినిమాకి కూడా వెళ్ళకుండా ఆమెను అంటి పెట్టుకుని అనుక్షణం కూర్చునే టంత అనురాగం పొందే అర్హత మీ అమ్మాయికి లేదు" ప్రసాద్ అనదల్చినంతా ఆవేశంగా అనేశాడు.

 Previous Page Next Page