Previous Page Next Page 
తల్లి మనసు కధలు పేజి 23


                                       ముందు - వెనక
    
    సుమిత్ర, సుదర్శన్ పోర్టికోలో కారు దిగేసరికి లోపల్నుంచి నవ్వులు, మాటలు అట్టహాసంగా వినిపిస్తున్నాయి. ఇల్లంతా దీపాలతో, కళకళలాడుతుంది.
    గుమ్మంలోనే ఎదురొచ్చి చేతులు కలిపి సాదరంగా ఆహ్వానించాడు జార్జి. "మీట్ మై కొలీగ్ అండ్ డియరెస్ట్ ఫ్రండ్ సుదర్శన్. దిసీజ్ మిసెస్ సుదర్శన్' అంటూ లోపల మిగతా అతిధులకి అందరికి పరిచయం చేశాడు జార్జి. నమస్కారాలు, ప్రతి నమస్కారాలు, పలకరింపులు , ఫార్మాలిటీస్ అయ్యాక ఇద్దరికీ కుర్చీలు చూపించి ఇంకెవరో వస్తే ఎదురేళ్ళాడు జార్జి.
    సుమిత్ర చుట్టూ చూసింది. అందంగా, ఆధునికంగా అలంకరించిన డ్రాయింగ్ రూము. పార్టీ కోసం వేసిన కుర్చీలతో నిండి వుంది. గుమ్మాలని తెరలు, గోడలకి పెయింటింగ్ లు, బుక్ కేసు మీద డెకరేషన్ పీసెస్ . అంతా జార్జి అభిరుచినేకాక అంతస్థు ని కూడా చాటుతుంది. బ్రహ్మచారైనా యిల్లు చక్కగానే పెట్టుకున్నాడను కుంది సుమిత్రా.
    జార్జి ఎంగేజ్ మెంట్ పార్టీ ఇది పార్టీ అంటే పెద్ద ఎక్కువమంది లేదు. సుదర్శన్ దంపతులు కాక యింకో ఆరేడు జంటలు వున్నారు.
    సుమిత్రకి అందరూ క్రొత్తవాళ్ళే. ఒక్క మిసెస్ నంబియార్ తప్ప.
    సుదర్శన్ , జార్జి ఇద్దరూ డాక్టర్లు! ఫారెన్ రిటర్న్డ్ డాక్టర్లు! యిద్దరూ ఒకే మందుల కంపెనీలో పెద్ద జీతాల మీద పనిచేస్తున్నారు మద్రాసులో.
    రావలసిన అతిధులందరూ వచ్చినట్లున్నారు.
    "ఏదోయ్ నీ ఫియాన్సీ దాచేసావా మాకు చూపిస్తే దిష్టి తగులుతుందని, లేక ఒక్కసారిగా సర్ ఫైజ్ చేయ్యాలనా.....సుదర్శన్ మిత్రుడిని హాస్యంగా అడిగాడు.
    జార్జి చిరునవ్వు నవ్వి లోపలి కెళ్ళాడు. మరునిమిషంలో కాబోయే భార్యతో చేతిలో చేయి కలిపి నెమ్మదిగా వచ్చాడు. అందరూ ఒక్కసారిగా చప్పట్లు కొట్టారు ఇద్దరూ గదిలోకి రాగానే. జార్జి వంగి అందరిని ఉద్దేశించి "మిస్ నీరజ! మైవుడ్ బి వైఫ్" అని పరిచయం చేశాడు అందరికి. నీరజ రెండు చేతులు కలిపి అతిధులకి నమస్కారం చేసింది నునుసిగ్గుతో ఎర్రబడిన మొహం కాస్త దించుకుని, తరువాత జార్జి ఎంగేజ్ మెంట్ రింగ్ నీరజ వెలికి తొడిగాడు. అందరూ మళ్ళీ చప్పట్లు కొట్టారు. కాబోయే వదూవరులకి తమ అభినందనలు తెలిపారు.
    తెల్ల బట్టలేసుకున్న బేరార్ ట్రేలో డ్రింక్స్ తీసుకువచ్చాడు. హాట్ కావాల్సినవారు హాట్ తీసుకున్నారు. ఆడవాళ్ళు అందరూ సాఫ్ట్ డ్రింక్స్ తీసుకున్నారు. సుదర్శన్ విస్కీ అందుకున్నాడు. సుమిత్ర ఎంచుకుని అరేంజ్ తీసుకుంది.
    కాబోయే దంపతుల ఆరోగ్యాన్ని, అనందాన్ని, సుఖాన్ని కోరుతూ గ్లాసుల తాటించి డ్రింక్స్ త్రాగటం మొదలు పెట్టారు అందరూ.
    సుమిత్ర నెమ్మదిగా అరేంజ్ సిప్ చేస్తూ నీరజ వంక చూసింది. మల్లెపూవులా వుంది నీరజ తెల్లటి సిల్కు చీర మీద వెండి జరీ బోర్డరు, తెల్లస్లివ్ లెస్ బ్లౌజు, ఆధునికంగా నడినెత్తిన చుట్టిన సిగ, ఒంటిపేట ముత్యాల హారం, తెల్లని చెప్పులు.... అన్నీ తెలుపే ! మల్లె పువ్వవంత స్వచ్చంగా నవ్వుతుంది. ప్రపంచంలోని అనందాని కంతా ప్రతినిధి లాగుంది.
    ఆమె మొహం సంతోషంతో, ఆనందంతో తృప్తిగా వెలుగుతుంది.
    తనూ యింతకీ ఎన్నో రెట్లు అనందం అనుభవించింది తన ఎంగేజ్ మెంట్ నాడు. తమదీ లవ్ మేరేజ్! ఇంతకంటే గ్రాండ్ గానే పార్టీ యిచ్చారు ఆనాడు తాము. మెడికల్ కాలేజీ స్టాఫ్ అందరూ వచ్చారు.
    సుదర్శన్ నీరజతో ఏదో చెపుతూ నవ్వుతున్నాడు.
    అతని నవ్వు అదే.....ఆ నవ్వే ఆమెని లోబరచుకుంది ఆనాడు. అతని అందచందాలకంటే, అతని డిగ్రీల కంటే, అతని హోదా కంటే .....అన్నింటికంటే ఎక్కువ నచ్చింది అతని నవ్వు! ప్రొఫెసరు సుదర్శనం చెప్పే పాఠం కంటే అతని నవ్వు కోసం శ్రద్దగా కాచుకు చూడడం తన కిష్టం అప్పుడు.
    దానికోసమే నా అన్నవాళ్ళనందరినీ కాదని, అందరి మాటలు నిర్లక్ష్యంగా పెడచెవిని పెట్టి, మెడిసిన్ చదువు కూడా సగంలో మానేసి పెళ్ళాడింది అతన్ని.
    "రాక్ హడ్సన్' లా వుండే సుదర్శన్ తన స్వంతం అయిపోతున్నాడని ఎంత గర్వించిందో తక్కిన అమ్మాయిలు యీర్ష్యతో ఎంత కుళ్ళారో!
    ఆరోజుల్లో ఎటు చూసినా సుదర్శనే! సర్వం సుదర్శన్ రూపం అయి కనిపించింది? తనకంటే అదృష్టవంతురాలు లేదని గర్వించింది.
    నీరజ ఏదో చెపుతుంటే శ్రద్దగా వింటున్నాడు సుదర్శన్ యితరుల వునికినే మరచి, ఆరాధన నిండిన కళ్ళతో ఆమె వంక చూస్తున్నాడు.
    సుమిత్ర మనసంతా యీర్ష్యతో  నిండింది.
    ఈ కళ్ళు యిలాగే చూసేవి తనవంక ఆ రోజుల్లో. తను మాట్లాడినా, నవ్వినా, అసలు ఏమనకపోయినా తనని అలా ఆరాధన నిండిన కళ్ళతో , మత్తుగా చూసేవాడి సుదర్శన్. ఆరోజు బీచిలో "సుమీ, నీవు ప్రక్కన వుంటే చాలు నాకు, ఆహారం కూడా అక్కరలేదు. అలాంటిది వెధవది నీకోసం మాంసాహారం మానలేననుకున్నావా....యింత చిన్న విషయం కోసమూ సందేహిస్తున్నావు ఈమాత్రం దానికోసం నిన్ను వదులుకుంటాననుకున్నావా, నన్ను నమ్ము సుమిత్రా. యింక అడ్డు చెప్పక" తన కళ్ళలోకి మత్తుగా చూస్తూ చేతిలో చేయి వేసి, నలుగురూ తిరిగే బీచి అని కూడా మరచి గుండెలకు హత్తుకున్నాడు ఆవేశంగా ఆ కనుచీకటి వేళ! 

 Previous Page Next Page