Previous Page Next Page 
తల్లి మనసు కధలు పేజి 22


    మద్రాసు చేరిన రెండోరోజున ఆవేదనగా, ఆత్రంగా ఎదురు చూస్తున్న రంగారావుకి ఓ రిజిష్టర్ పార్శిల్ అందింది. తొందరగా విప్పి చూశాడు. అందులో ఒక డైరీ పేజీల మధ్య ఉత్తరం దాగి ఉంది. ముందుగా వుత్తరాన్ని విప్పి చదవడం మొదలు పెట్టాడు.
    "పూజ్యులైన జమీందారు'గారికి,
    నేను మనసారా ప్రేమించి, గౌరవించిన భర్తగా చనువుగా పిలుచుకోడానికి అధికారం లేదు కాబట్టి, ఇలా పిలుస్తున్నందుకు ఏమనుకోకండి. టెలిగ్రామ్ కోసం ఎదురుచూస్తున్న మీకు ఇంత పెద్ద ఉత్తరం చికాకు కలిగిస్తుందేమో ! త్వరగానే ముగిస్తాను లెండి.
    చిన్నప్పటి నుంచి, అసలు పుట్టుక ముందునుంచీ కూడా దౌర్భాగ్యు రాలీని. అందుకే అలా దిక్కు మొక్కు లేకుండా అనాధగా , అనామకంగా ఏ ఆశలు కోరికలు లేకుండా గడ్డి పూవులా పెరిగాను నా అదృష్టమో , దురదృష్ట మో మీరు నన్ను అపురూపంగా ఎంచి ఆదరించారు ఎప్పటి పుణ్యమో ఏనాడు చేసిన మంచిపని ఫలితమో మీ అంతటి పరువు ప్రతిష్టలు కలిగిన ధనవంతుల ఇంట అడుగుపెట్టి, మీలాంటి వారిని భర్తగా చేపట్టగలిగాను. అది నా అదృష్టమని మురిసిపోయి పొంగిపోతున్న నా పొంగు ఎన్నాళ్ళో కాకుండానే చల్లారిపోయింది. నడమంత్రపు సిరిలాగా మధ్యలో వచ్చిన అదృష్టం మధ్యలోనే మట్టిలో కలిసింది.
    మీరు అడిగినప్పుడు నేను నిజం చెప్పలేకపోయాను. నా నోరు ఎందుకు మూగపోయిందీ, నే నెందుకు చెప్పలేక పోయిందీ, అసలు సంగతి ఏమైందీ మీతో వివరంగా చెప్పుకునే లోపలే నేను ఈ లోకం నుంచి శాశ్వతంగా నిష్క్రమించాలని మీరు నిర్ణయించారు. అంతకుమించి వేరే గర్యంతరం లేకుండా చేశారు. మీరింత తొందరగా, ఇంత కఠిన నిర్ణయానికి రాగలరని ఊహించని నేను నిజం దాచి మీ శిక్షకు పాత్రురాలినయ్యాను. నాలో నిజమా పూర్తి నమ్మకం , నేనంటే ప్రేమాభిమానాలు మీకుంటే ఇంత తొందరపడి ఉండేవారు కాదేమో! అవి లేకపోయాక ఇంక ఈ పైపై బంధాల కోసం ఆశపడి నేను బతకడం మంచిది కారు, నాకూ ఇష్టమూ లేదు. కాబట్టి సెలవు పుచ్చుకుంటున్నాను. బహుశా , ఇంక కొద్ది గంటల్లో ఇక్కడ ఎవరో మీకు టేలిగ్రామ్ ఇస్తారు. మీరు వచ్చేదాకా అంత్యక్రియలు చెయ్యరేమో! ఈ నా శరీరాన్ని ఆఖరుసారి చూడక తప్పదు మీకు.
    ఏమిటీ సోది అని విసుక్కుంటున్నారా, లేక అంతా అయిపొయింది కాబట్టి, అయ్యో పాపం ! అని జాలి పడుతున్నారా? మీ మనసు కరిగించాలన్న కోరిక నాకు లేదు. నా శీలం గురించి మీరు వెలిబుచ్చిన అనుమానం విన్నాక, నన్ను నిలువునా కాల్చే నా ఆత్మాభిమానం నా నిష్కలంకతని నిరూపించుకోమని ప్రోత్సహిస్తుంది. అంతకుమించి నాకింకే ఉద్దేశమూ లేదు.
    మీ తమ్ముడు నారాయణరావు మద్రాసులో చదివేరోజుల్లో అతని క్లాస్ మెట్ అయిన ఒక తక్కువ కులం అమ్మాయితో ప్రేమలో పడ్డారు. కులానికి , ధనానికి పేద అయినా, గుణానికి , అందచందాలకి ఏ పెద్ద కుటుంబాలకి తీసిపోదు ఆమె. మీరు వంశ ప్రతిష్టలకు ఎంత ప్రాముఖ్యత ఇస్తారో తెలిసిన మీ తమ్ముడు మీతో ఆ ప్రేమవ్యవహారం చెప్పే సాహసం చేయలేకపోయాడు. వాళ్ళ ప్రేమ ఫలం ఉష. ఉషని ఆస్పత్రిలో కనిన వెంటనే ఆమె చనిపోయింది. పెళ్లి కాకుండా 'నాకూతురు' ని ప్రకటించుకోడానికి, మీతో చెప్పడానికి మీ తమ్ముడికి ధైర్యం లేకపోయింది. ఉషకి ఒక అయాని ఏర్పాటు చేశారు, డబ్బిచ్చి పెంచమని . కాని, అలా ఆయా మీద బారం వదిలి నిశ్చింతగా ఉండడానికి మనసు ఒప్పలేదు అతనికి. ఆఖరికి ఒకసారి శలవులకు వచ్చినప్పుడు మీ అమ్మగారి కీ రహస్యం చెప్పి ఇద్దరూ ఒక నిశ్చయానికి వచ్చారు. ఆ పిల్లని ఇక్కడ అనాధ శరణాలయం లో ముందు చేర్పిస్తే , తరువాత నెమ్మదిగా ఏదో కారణంతో ఇంటికి చేర్చవచ్చని వాళ్ళ ఉద్దేశం. దానికోసం ఆ ఆయా భర్తకి కొంత డబ్బుచ్చి రహస్యంగా శరణాలయం మెట్ల మీద ఓ తెల్లవారు జామున వదిలి పెట్టించారు. వాళ్ళ ఆలోచనలు ఒక రూపుకి వచ్చి నేరేవెరేలోగానే , దురదృష్టవశాత్తూ మీ తమ్ముడు ప్రమాదంలో మరణించారు. మీ తల్లిగారు చిన్నకొడుకు మీది మమకారం కొద్ది మీ దృష్టిలో అతను దిగజారడం ఇష్టం లేక ఈ విషయం రహస్యంగానే వుంచారు. ఈలోపలే నేను మీ ఇంటిలో చేరడం, ఆమె చనిపోయేముందు ఈ రహస్యం చెప్పి, ఈ విషయం నాలోనే వుంచమని, ఉషని ఎలాగైనా ఇంటికి చేర్చి ఆదరించమని, తమ రక్తం పంచుకుని పుట్టిన బిడ్డ అనాధగా పెరగడం తను చూడలేనని , ఉష అలా దిక్కు లేకుండా పెరగడం తన చిన్నకొడుకు ఆత్మకి అశాంతిఅని, ఎలాగైనా ఉషని కనిపెట్టమని, ఈ రహస్యం మీతో చెప్పవద్దని నాతొ చెప్పి, నా దగ్గిర మాట తీసుకుని కన్ను మూశారు. నేను అవకాశం చూసి మిమ్మల్ని ఒప్పించి ఉషని ఇంటికి తీసుకువచ్చాక , ఆ దరిద్రుడు ఈ సంగతి మీకు తెలియదని కనిపెట్టి డబ్బాశ కొద్దీ నన్ను పీడించసాగాడు. ఏంచేయాలో తోచని నేను ఎలాగో సర్ధవచ్చని వాడు ఆడిగినప్పుడు ఒకటి రెండు సార్లు ఇచ్చాను. వాడికిది అలవాటయిపోయింది. మీరు చూసినప్పుడు అది మూడోసారి.
    నా అదృష్టం కొద్ది మీ తమ్ముడు వ్రాసుకున్న డైరీ నా వశం చేసారు మీ అమ్మగారు. అందులో ఈ వివరాలన్నీ ఏ రోజు కారోజు తబిసీలుగా వ్రాయబడి వున్నాయి. ఉష తల్లి పోటో కూడా వుంది అందులో. ఇవేం లేకపోతె ఏ దిక్కు మొక్కు లేక మీ పంచన చెరిన ఆడదాన్ని నేనేం చెప్పినా కట్టుకదే అయేదేమో!
    ఈ మాటలు మీకు కష్టం కలిగిస్తే క్షమించండి. కాని, నేనెంతగా కుమిలిపోతున్నానో, మీరడిగినప్పుడు నిజం చెప్పలేకపోయిన నా అశక్తత, తిరిగి నా కవకాశం ఈయకుండా నోరుమూసిన మీ మాటలు --- ఇవన్నీ నా గుండెనేలా తరుగుతున్నాయో మీరు ఊహించగలిగితే నా ప్రయత్నం ఫలించినట్టే.
    మీరు ఏమనుకోనంటే ఒకమాట చెబుతాను. మీకు నీతులు చెప్పాలని నా వుద్దేశం కాదు. కాని, మీ ఆగ్రహావేశాలకు బలియిన ఓ పేదరాలి కడపటి మాటగా సానుభూతితో దీన్ని అర్ధం చేసుకోండి.
    మీరు ధవంతులు, ఉన్నత కుటుంబంలోని వారు. ఆత్మవిశ్వాసం, మనసు స్థయిర్యం పట్టుదల వున్నవారు,  తలచుకున్నదేదైనా చేయగల సమర్ధులు. ఇన్నీ వున్నవారు కాబట్టి ఒక నిర్ణయానికి వచ్చేముందు మీరు కొంత సమయం వెచ్చించడం అవసరం. ఇకముందైనా ఈ అవసరాన్ని గుర్తిస్తారని ఆశిస్తాను.
    మీ అని చెప్పుకోడానికి మీరంగీకరించకపోయిన, గర్వంగా ఊహించుకునే ------
                                                                                                                            మీ
                                                                                                                          శ్యామల"
    ఆ తరువాత ఆ వుత్తరాన్ని చాలాసార్లు చదివారు రంగారావు. చదివి నప్పుడల్లా అయన కళ్ళ వెంట నీళ్ళు కారతాయి.
    "ఎంత పెద్ద శిక్ష వేశావు?" ఆయనలో అయన గొణుక్కున్నారు.

                                                                                               --------

 Previous Page Next Page