Previous Page Next Page 
తల్లి మనసు కధలు పేజి 24


    అందరూ భయపెట్టిన భయాలు, అనుమానాలు అన్నీ తొలగిపోయాయి ఆ క్షణంలో. సుదర్శన్ కళ్ళలోని ఆరాధనకి పరవశించి అతని గుండెల మీద వ్రాలిపోయింది.
    సుదర్శన్ తో పెళ్ళికి అందరూ తనని ఎన్నో విధాల అడ్డుకోవాలని చూశారు. తల్లి ఏడ్చింది. తండ్రి యింట్లోంచి పొమ్మన్నాడు. అక్కలు, అన్నలు వర్ణాంతర వివాహాల వల్ల వచ్చే అనర్ధాలను విడమర్చి చెప్పి నచ్చ చెప్పబోయారు. స్నేహితులందరూ ఎన్నో విషయాలు చెప్పి భయపెట్టారు, ఎవరు చెప్పినా, 'అతను మాంసాహారి, నీవు శాఖాహారివి, నిష్టానియమాలు గల కుటుంబంలో పెరిగావు , అతనికి నీకు సరిపోదు. మొదట కొన్నాళ్ళు సర్దుకున్నా, తరువాత మీ మధ్య కలతలు రేగి తీరుతాయి" అని.
    వాళ్ళు చెప్పడం వల్ల కాకపోయినా తనకి మాంసాహారం అంటే అదో రకం ఎలర్జీ ఎవరైనా తింటుంటే చూసినా భరించలేదు. అందుకనే ముందుగానే సుదర్శన్ దగ్గర మాట తీసుకుంది.
    సుదర్శన్ యిచ్చిన భరోసాతో అనుమానాలు తొలగి, మరుసటి నెలలోనే సుదర్శన్ భార్య అయిపొయింది రిజిష్ట్రార్ సమక్షంలో.
    పెళ్లి అయ్యాక మూడు నాలుగు నెలలు తామిద్దరూ చూట్టూ ప్రపంచాన్నే కాక తమని తాము మరచిపోయారు.
    డిన్నరు రెడీ అయిందని కబురొచ్చింది.
    "కమాన్. లెటజ్ గో" డైనింగ్ రూములోకి దారితీస్తూ అతను అతిదులందరినీ ఆహ్వానించాడు జార్జి.
    పెద్ద టేబిల్ మీద తెల్లని టేబిల్ క్లాత్ వేసి ప్లేట్ల నిండా రకరకాల పదార్ధాలు అందంగా అమర్చాడు. మధ్య కోడి, బాతు ఆకారాలని ఆపళంగానే స్టఫ్ చేసి వండి డెకరేట్ చేసి పెట్టారు. బఫే డిన్నర్. అందరికి తలో ప్లేటు , నేప్జ్ కిన్, స్పూన్ , ఫోర్క్ పెట్టి అందించాడు జార్జి, నీరజ.
    టేబిల్ మీద అమర్చిన నాన్ వెజిటేరియన్ డిషెస్ చూసి కాస్త వెనక్కు తగ్గి సందేహిస్తూ నిలబడింది సుమిత్ర. జార్జి చూశాడు. ఆమెని, "కమాన్ మిసెస్ సుమిత్రా! వెజిటేరియన్ వి కూడా ఉన్నాయి. అవన్నీ వేరుగానే చేయించాం వీటిల్లో కలపకుండా. మీరున్నారని తెలుసుగా నాకు. మీరే కాదు యింకా వున్నారుగా వేజిటేరియన్సు..... ' టేబిల్ దగ్గరికి తీసికెళ్ళి శాఖాహారపదార్ధాలు చూపించాడు జార్జి. "హెల్ప్ యువర్ సెల్ఫ్" అంటూ.
    యేవో రెండు మూడు రకాలు ప్లేట్లలో పెట్ట్టుకుని తప్పుకుంది సుమిత్ర. అందరూ ఆకోడిని, బాతుని ముక్కముక్కలుగా చేసి తలో ముక్కా తీసుకున్నారు. ఎంతో ఆప్యాయంగా , బాగుందని మెచ్చుకుంటూ తింటున్నారు. సుమిత్ర అదంతా చూస్తూ తన భోజనం తినలేకపోయింది. కడుపులో త్రిప్పసాగింది సుమిత్రకి.
    ఇప్పుడు నయం ఇంకా - అదే మొదటిసారి సుదర్శను యింట్లో తినడం చూసి భళ్ళున వాంతి చేసుకుంది.
    "హు.....సుదర్శన్! ఎంత ఆప్యాయంగా ఆ ఎముక పట్టుకుని చీకుతున్నాడు! 'ఆహారమే అక్కరలేదు నీవు ప్రక్కన వుంటే.....' అలాంటిది మాంసాహారం మానలేనా నీకోసం" అని తేలికగా అన్న మనిషి, ఈరోజు తన యెదురుగానే, తనకి అసహ్యమని తెలిసినా, లెక్కచేయకుండా తింటున్నాడు...... అవును తనంటే భయమేమిటి అతనికి? తనకి సంజాయిషీ యివ్వవలసిన అవసరం ఏముంది? భార్య ....భరించక ఏం చేస్తుంది .
    ఇంట్లో ఈ నరకం అప్పుడే ఆరు నెలలుగా భరిస్తూనే వుంది. ఈపాటికి నిజానికి తనకి అలవాటు అయిపోవలసింది. యివి చూడడం, యివి తింటుంటే సహించడం.....కాని ఖర్మ! దురదృష్టం! మొదతరోజు సుదర్శన్ తింటున్నాడని తెలిసిన రోజున ఎంత అసహ్యించుకుందో యీ ఆరు నెలలుగానూ అలాగే అసహ్యించుకుంటుంది.
    సుదర్శను యిలా మాట తప్పుతాడని తనకిచ్చిన వాగ్దానాన్ని అంత తేలిగ్గా మరచిపోతాడని ఊహించక పోవడం తన పొరపాటేనెమో! కాకపోతే ప్రేమ వేడిలో అమోజులో అన్నమాటకి తను విలువ యిచ్చి నమ్మడం తెలివి తక్కువ గదూ! మనిషి మాటకి కట్టుబడి ముప్పై ఏళ్ళుగా అలవాటయిన ఆహారం ఒక్కసారిగా తనకోసం మానుతాడని విశ్వసించడం తన తెలివి తక్కువనే చాటుతుంది! ఇంకోటి ఇంకోటి కాదు. ఆహారం విషయంలో ఎన్నాళ్ళని యిబ్బంది పడి మాట నిలబెట్టుకోడానికి కట్టుబడి ఉంటారు. కట్టుకున్న తరువాత ఆ మోజు, ఆ క్రొత్త వేడి తెలిపోగానే ....ఏ మగాడు భార్య కిచ్చిన మాటకి విలువ యిస్తాడు. అలా యిస్తాడని నమ్మడం తన బుద్ది హీనత చాటుతుంది.
    తన కిచ్చిన మాట పెళ్ళయిన మూడు నాలుగు నెలలు మాత్రమే అమలు జరిపాడు సుదర్శన్. ఆ మూడు నాలుగు నెలలు తను అంతగా గమనించక పోవడం వల్ల సుదర్శన్ చికాకు అర్ధం కాలేదు. సుదర్శన్ భోజనం ముందు కూర్చుని ఏం తినకుండా ఎందుకు లేచిపోతున్నాడో ముందసలు తనకి అర్ధమే కాలేదు. తరువాత నెమ్మదిగా భోజనం ముందు కూర్చున్న దగ్గరనించి సణగడం ప్రారంభించాడు...."యీ వేదవ కూరలతో అన్నం ఎలా తినడం . ఈ చచ్చుకూరలలో ఏం బలముంటుంది ! ఎంత మంచికూర చేసినా తినే వాడు కాడు. పప్పు పచ్చళ్ళు అవి అసలు ముట్టుకునేవాడు కాదు. అన్నం అంటా కెలికి ఇంత పెరుగన్నం మాత్రం తిని లేచి పోయేవాడు. అతని భోజనం ఒక సమస్య అయింది తనకి. రోజురోజుకి తగ్గిపోనారంభించాడు సుదర్శను. దాంతో పాటు అతనికి కోపం, చిరాకు ఎక్కువయింది. "నాజన్మలో నేను యెప్పుడూ యిన్నాళ్ళూ మాంసాహారం తినకుండా వుండలేదు తెలుసా, అసలు మాంసమో, చేపలో ఏదో ఒకటి లేకపోతె భోజనం ముందు కూర్చునేవాడినే కాదు. ఇంట్లో ఏ పూజలు అవి అయినా అమ్మ నాకోసం ప్రత్యేకం చేయించేది ' అనేవాడు. "ఈ వెధవ వంకాయి, బీరకాయలో ఏముంది ఎంత తింటే మాత్రం ఏం లాభం." అని విసుక్కునేవాడు. "బాగుంది, శాఖాహారం తిన్నవాళ్ళందరూ చచ్చిపోతున్నారా ఏమిటి?" అనేది తను నవ్వుతూ, "ఏమో మీ కలవాటు ! మొఖం చిత్లించేవాడు . "అలవాటు చేసుకుంటే మీకూ సహిస్తాయి. అసలు మీరు ప్రయత్నించడమే లేదు."
    "ఏం అలవాటవుతుందో ! ఆరు నెలలనింఛి తిండి కోసం మొహం వాచినట్లున్నాను." అన్నాడు. తనకీ జాలి అనిపించింది. పాపం ఒక్క సారిగా అన్నాళ్లుగా అలవాటయిన ఆహారం వదలడానికి యెంత కష్టంగా వుందో అనిపించింది. కాని సుదర్శనం తినడం భరించలేదు. అది చూస్తె తనకి అసహ్యం.... అందుకేగా ముందు సుదర్శన్ దగ్గిర మాట తీసుకుంది. తన తప్పులేదు.....
    రోజు రోజుకీ యింట్లో సుదర్శన్ భోజన సమస్య తీవ్రత దాల్చింది. సుదర్శన్ యింట్లో తినేదే ఒక్క పూట. మధ్యాహ్నం లంచ్ ఆఫీసుకే ఏసాండ్ విచేస్ లో, చపాతీ లో తీసి కెడతాడు. రాత్రికి మాత్రమే భోజనం! ఆ రాత్రి కూడా ఏం తినకుండా లేచిపోతుంటే ఎన్నాళ్ళు సహించగలదు. ఆరునెలల్లో సుదర్శన్ ఎంతో తగ్గిపోవడం గమనించి నోచ్చుకునేది. ఆమాటా అన్నాడు. "యీ ఆరునెలల్లో ఎనిమిది పౌనులు తగ్గాను తెలుసా. ఎన్ని మందులు తీసుకుంటే మాత్రం ఏం లాభం, ఆహారం సరిగా లేకపోతె! అయినా నీవు మరీనూ, ఇంత పట్టింపేమిటి, యీ రోజుల్లో బ్రాహ్మణులే ఎంతోమంది మాంసాహారం తింటున్నారు. నీ అంత చాదస్తం ఎవరికీ వుండదు" సగం విసుగు, సగం హాస్యంగా అన్నట్టు అన్నాడు." 'అయితే ఏమిటంటారు. మానడానికే మీకంత కష్టం అయితే, క్రొత్తగా నన్ను అలవాటు చేసుకోమంటే నాకెంత కష్టం"
    "నిన్నెవరు తినమన్నారు!"
    "మిమ్మల్ని తిననిస్తే చాలంటారు." సుదర్శన్ మాట్లాడలేదు. ఆ క్షణంలో తనకు కాస్త కోపం వచ్చింది. "యీ మాత్రం దానికి అంత పెద్ద వాగ్దానాలు , అంత తేలిగ్గా ఎందుకు చేయడం."
    అక్కడికీ సుదర్శన్ ఆరోగ్యం కోసం గుడ్లు, ఉడికించీ, అమ్లేట్లు చేసీ పెట్టేది. అంతకంటే  ముందుకు పోవడం మాత్రం నావల్ల గాలేదు.
    "అదేమిటి మీరు ఏం తినడం లేదు..... ఏం తీసుకోడం లేదేమిటి?" నీరజ దగ్గిరికి వచ్చి పలకరించింది సుమిత్రని. 'తింటున్నాను.....' నవ్వింది బలవంతంగా సుమిత్ర. "యీ స్వీట్ తీసుకోండి....బాగుంది" అంటూ ప్లేట్ లో వేసింది. "థాంక్స్ ' అంది సుమిత్ర.
    నీరజ ....పేరు బాగుంది. మనిషి బాగుంది. కాని నీరజ పేరు హిందూ పేరు , జార్జి !.... క్రిస్టియన్! ఇంటర్ కాస్ట్ మేరేజ్.... నీరజ వెజిటేరియనా! నాన్ వెజిటేరియనా....అడగాలి అనుకుంది సుమిత్ర.

 Previous Page Next Page