Previous Page Next Page 
కాలాన్ని వెనక్కి తిప్పకు పేజి 22


    సునంద , శారద ఎదురెదురు ఇళ్ళల్లో ఉండడంతో వారిద్దరి మధ్య మంచి స్నేహం కుదిరింది. సునంద చదువుకున్నది. బ్యాంక్ ఉద్యోగాస్తురాలనీ శారదకి గౌరవం. శారద అమాయకత్వం, ఆప్యాయంగా తనకి అన్నింట్లో సాయపడే ఆమె మనస్తత్వం సునందకి అభిమానం. ఆమె అఫేసుకు వెళితే పనిమనిషి. పాలవాడు. చాకలి ఎవరొచ్చినా తాళం తీసి పని చూసేది శారద. పిల్లలు స్కూల్ నుంచి రాగానే తాళం తీసి వాళ్ళ చేత బట్టలు మార్పించి సునంద పెట్టిన పాలు, టిఫిన్లు తినిపించేది. అలా ఒకరికొకరు అవసరాల్లో సాయపడే స్నేహమే తనని గట్టేక్కించింది అనుకుని సునందకి రోజూ మనసులోనే దేవుడికి దణ్ణం పెట్టుకున్నట్టు దణ్ణం పెట్టుకుంటుంది శారద.
    అంతా వెళ్ళాక వచ్చిన సుసందని పట్టుకుని బోరున ఏడ్చింది శారద. "చదువు లేదు. డబ్బు లేదు ఎలా బతకాలి? ఈ పిల్లల్ని ఏం చెయ్యాలి? ఎలా పెంచాలి' అని బెంబేలు పడి ఏడుస్తున్న శారదని ఓదార్చి, ధైర్యం చెప్పింది సునంద.
    "శారదా! బతకడానికి చదువే అక్కరలేదు. ఆఫీసులో చేసేదే ఉద్యోగం కాదు. జీవనోపాధికి లక్ష మార్గాలున్నాయి. నీకోచ్చిందే చేయచ్చు."
    "నాకేం వచ్చు వంట తప్ప." అయోమయంగా , నిస్పృహగా అంది శారద.
    "కరెక్ట్ . అదే చేయి. చదువు లేదని ఇప్పుడు వగస్తే ఏం లాభం! నీకొచ్చింది , నీ చేతిలో విద్య వంట. అదే చేయి."
    "వంకటలక్క పనా! వంట చేయాలా ఎవరింట్లోనో....! ఇంత బతుకు బతికి... అవమానంగా అంది శారద.
    "నీవెవరి ఇంటికీ వెళ్ళి చేయనక్కరలేదు. నీవు వండుకునేది మరో నలుగురికి సరిపోయేట్లే వండు. ఒంటరిగా ముసలి వయసులో పిల్లలకి దూరంగా ఉండి, ఆరోగ్యం సరిగా లేని ఇద్దరు దంపతులున్నారు నాకు తెలిసినవారు. వారు పిల్లల దగ్గరికి అమెరికా వెళ్ళరు. డబ్బుండి వంటమనుషులని పెట్టుకున్నా, ఎవరూ సరిగా చెయ్యక, ఇల్లు మ్యానేజ్ చేసుకోలేని ఆ ముసలి దంపతులకి నీవు రెండు పూటలా వండి పంపించాలి. వాళ్ళకి మడి, ఆచారం , బయటి భోజనం తినరు . తిన్నా ఈ వయసులో పడదు. అంచేత రెండు పూటలా మాములుగా పప్పు, కూర, పులుసు, పచ్చడి లాంటి వంట నీవింట్లో చేసి వారికీ క్యారియర్లో పెట్టి పంపితే చేరి పదిహేను వందలు ఇచ్చేటట్లు మాట్లాడాను. చూడు శారదా! మీ అయన ఇంట్లోంచి వెళ్ళిపోయాడని విన్న దగ్గర్నుంచి నీవెలా బతకాలి అన్న ఆలోచనే నన్ను నిలవనీయలేదు.ఆఖరికి నాకు తట్టిన ఆలోచన యిది. నీ సమస్యా, వారి సమస్యా తీరుతుంది. నెలకి మూడు వేలు వెంటనే వస్తుంది. నీవు రుచిగా, శుచిగా చేస్తే తెలిసి ఉద్యోగం చేసుకుంటూ ఒంటరిగా ఉండే అమ్మాయిలూ, బ్యాచిలర్ అబ్బాయిలు , ఇలాంటి ముసలివారు ఎందరో ముందుకి వస్తారు. ఏ పని అయినా నిజాయితీగా చేస్తే ఆత్మగౌరవంతో బతకవచ్చు. ఏ పనినీ ఆత్మన్యూనతగా అనుకోవద్దు. జీవనోపాది కోసం నీవీ పని చేస్తే నీకొచ్చిన అవమానం ఏమీ లేదు." అంటూ ప్రోత్సహించి, ధైర్యం చెప్పి ఇంటి ముందు 'ఇచ్చట ఇంటి భోజనం సప్లయ్ చేయబడును ' అన్న బోర్డు పెట్టించింది. తమ ఇంటి పురోహితుని కొడుకు చదువుబ్బక తిరుగుతుంటే , బ్యాంక్ లో పని ఇప్పించమని ఎప్పటి నుంచో పోరుతూ ఉంటే ఆయన్ని ఒప్పించి , క్యారియర్లు సప్లయ్ చేయడానికి పెట్టింది.
    రెండో నెలలోనే నలుగురు ఉద్యోగం చేసే అమ్మాయిలు, ముగ్గురు ఉద్యోగం చేసుకునే బ్యాచిలర్స్, నలుగురు స్టూడెంట్స్, ఇంకో ఇద్దరు ముసలి దంపతులు. ఆ పరిసరప్రాంతాల్లో ఉండేవారు శారద భోజన సప్లయ్ మాట విని వచ్చారు. ఉక్కిరిబిక్కిరి చేసేటన్ని ఆర్డర్లు రెండు నెలల్లోనే వచ్చాయి.
    ఇంటి భోజనం, రోజూ మార్పుతో , రుచిగా వండి క్యారియర్లో పెట్టి ఇంటికి పంపడంతో శారద భోజనం అందరికీ వరం అయింది. రెండో నెలలో ఖర్చులు పోను పదివేలు మిగిలేసరికి శారద నమ్మలేకపోయింది.
    బతకడం ఇంత సులువని ఎన్నడూ ఊహించని శారద ఆనందంతో ఉబ్బితబ్బిబ్బు అయింది. తన మీద తనకో నమ్మకాన్ని ఓ వ్యక్తిత్వాన్ని ఆపాదించిన సునంద మేలు మరిచిపోనంది. పాతిక, ముప్పై క్యారియర్లు పంపవలసి రావడంతో ఒక్కర్తీ చేసుకోలేక తన కింద ఓ బీద అమ్మాయిని సాయానికి పెట్టుకుంది.
    "శారదా! ఈనాటి క్వాలిటీ, శుచి, శుభ్రత నీవు ఎప్పటికీ మెయిన్ టైన్ చెయ్యగలిగితేనే నీ బిజినెస్ నిలబడుతుంది మర్చిపోకు. నాలుగు డబ్బులు రాగానే పనివాళ్ళ మీద వదిలేస్తే వచ్చిన పేరు పోవడానికి నిముషం పట్టదన్నది గుర్తుంచుకోవాలి" అని చెప్పేది సునంద.
    నెలకో కొత్త ప్రపోజల్ తో వచ్చేది సునంద. నాలుగు నెలలు గడిచేసరికి టిఫిన్ సెక్షన్ ఓపెన్ చేయించింది.
    ఇంట్లో చోటు చాలడం లేదని కింద ఓ గ్యారేజీ అద్దెకి తీయించి వంటపని అక్కడకి మార్పించింది. కొన్ని ఆఫీసులకి మధ్యాహ్నం లంచ్ టైం లో టిఫిన్లు, ఇడ్లీ, వడ, ఉప్మా లాంటివి సప్లయ్ చేసే ఓ కంట్రాక్టర్ కి శారద సరుకు సప్లయ్ చేస్తే, డిస్ట్రిబ్యూషన్ అతను చూసుకుంటాడు. వాళ్ళిచ్చిన హాట్ క్యారియర్ లో రెడీ చేసి పెడితే వాళ్ళు వచ్చి తీసుకునేటట్లు రేటు మాట్లాడి కుదిర్చింది సునంద. దానివల్ల ఎస్టాబ్లిష్ మెంట్ అక్కరలేకుండా కంట్రాక్టర్ కి లాభం డిస్ట్రిబ్యూషన్ చేసుకోవాల్సిన ప్రాబ్లం శారదకి ఉండదు.
    యాభై క్యారియర్లు, టిఫిన్ సెక్షన్ ఓపెన్ అయ్యాక ఓ వంటవాడు, ఓ హెల్పర్, ఓ పనిమనిషిని పెట్టుకోవాల్సి వచ్చింది. శారద వంట సంగతి తెలిసి చిన్న చిన్న ఫంక్షన్లు పుట్టిన రోజులు, బారసాలలు, చిన్న ఎంగేజ్ మెంట్ల కి'పాతిక ముప్పై మందే! వండితే మేమే వచ్చి తీసికేడతాం' అని ఆ చుట్టూ పక్కల వారంతా బలవంత పెట్టడంతో చిన్న వంటలు టేకప్ చేసింది.
    సంపాదన పెరిగి , గిరాకీ పెరగడంతో చోటు, పాత్రలు అవి చాలకపోవడంతో పక్క ప్లాట్ ఖాళీగా ఉంటే బ్యాంక్ లోన్ కి తాను పూచీ ఉండి, ఇంటి మీద అప్పు తీసి, అ ప్లాట్ కొనిపించి, పెద్ద పెద్ద స్టవ్ లు, గిన్నెలు, ఫ్రిజ్ లు, గ్రైండర్లు - అన్నీ బ్యాంక్ లోను మీద కొనేలా చేసింది సునంద. ఎస్టాబ్లిష్ మెంట్ పెద్దదై "శారదా కేటారర్స్ అండ్ సప్లయర్స్' అన్న కేటరింగ్ సంస్థ ఆవిర్బవించింది. పెద్ద పెద్ద పెళ్ళిళ్ళకి కూడా ఆర్డర్లు తీసుకోడం మొదలుపెట్టింది శారద.
    నాలుగేళ్ళు తిరిగేసరికి రెండొందల మంది పనివారితో ఊపిరి సలపని ఆర్డర్లతో 'శారదా క్యాటరింగ్ సర్వీసెస్' మేనేజింగ్ డైరక్టర్ అయింది శారద. ఆ ఊళ్ళో పేరున్న సంస్థలలో అదీ ఒకటయింది. సునంద ప్రోద్బలంతో 'స్పోకెన్ ఇంగ్లీషు కోర్సులో చేరి ఆరు నెలల్లో చకచకా ఇంగ్లీష్ మాట్లాడే స్థాయి కెదిగింది. ఈనాడు పెద్ద పెద్ద ఆఫీసులకి, కంపెనీలకి, కాన్పరెన్స్ లకి లంచ్, బ్రేక్ ఫాస్ట్ , డిన్నర్లు సప్లయ్ చేస్తోంది. ముందు రూము కంప్యూటరు, రిసెప్షనిస్టు, క్లర్కు, అకౌంటెంట్ లతో ఆఫీసుగా వెలసింది. అన్నీ స్వయంగా చూసుకుంటూ, సునంద చెప్పిన క్వాలిటీ మెయిన్ టైన్ చేస్తూ రాబడి లక్షల్లోకి పెంచుకుంది.
    కూతురు వంట పనులు మొదలెట్టిందని తెలీయగానే 'నీకు సాయంగా ఉంటానే' అంటూ తల్లి దగ్గర చేరింది. ఇల్లు, పిల్లల్ని ఆమెకి అప్పగించి శారద నిశ్చింతగా తన పని చూసుకునేది. శారద బిజినెస్ పెరిగేసరికి తమ్ముడు "నీ సప్లయ్ వ్యవహారాలు చూస్తాను. నీకు నమ్మకంగా ఎవరన్నా కావాలిగా' అంటూ వచ్చి చేరాడు. బిజినెస్ లో బంధువుల ప్రమేయం వద్దనుకున్నా జీతం ఇచ్చి పెట్టుకోమని సునంద సలహా ఇచ్చింది.
    పెద్ద బిజినెస్ ఎగ్జిక్యూటివ్ లా ఆఫీస్ రూమ్ లో కూర్చుని చకచకా స్టాఫ్ కి ఆర్డర్లు ఇస్తూ కాగితాలు , లెక్కలు చూస్తూ చెక్కుల మీద సంతకాలు పెట్టె శారదని చూస్తె తాను నాటిన మొక్క తన కళ్ళముందే పుష్పించి, ఫలించిన అనందం సునందది!

 Previous Page Next Page