"మిసెస్ మీనన్ ఇక్కడికి వచ్చింది. రమ్మంటుంది ఆవిడతో వెళ్ళనా?"
"వెళ్తావా? సరే వెళ్ళు ."
"తొందరగా వచ్చేస్తానులెండి . బై, బై."
* * * *
'అబ్బ ఇంతసేపు చేశావేమిటి? బాబు ఎందుకో ఏడ్చి ఏడ్చి ఇప్పుడే నిద్రపోయాడు. సుజా ఆకలి అని ఏడుస్తుంది" ఎనిమిది గంటలకి తిరిగి వచ్చిన శాంతిని చూసి కొంచెం చిరాకు పడ్డాడు రావు.
"ఏం ఎందుకు ఏడ్చాడు బాబు? పాలు పట్టి వెళ్లానే? ఆయా ఏం చేస్తుంది? బేబికి ఆకలంటే అన్నం పెట్టకపోయారా? వండి వెళ్ళాను!"
"ఇంతసేపూ అక్కడ కూర్చోడమెందుకు?" ఆఫీసులో పని భారం రావు మీద పని చేసింది.
"కార్డ్స్ లో కూర్చుంటే టైం తెలియలేదు. అందులో రమ్మీ మొదట అయిదు రూపాయలు పోగానే కసి ఎక్కువైంది. దాంతో ఇంకో పది రూపాయలు పోయాయి. అందులో సగమైనా రాబట్టాలని కూర్చుంటే ఈవేళ అయింది?"
'సరే, ఏదో ఒకటయింది! ఇకనైనా త్వరగా కానియ్యి."
"నిన్న పర్సులో నూటయాబై ఉండాలి. ఇప్పుడు ఏభయ్యే ఉన్నాయి. నీవేమైనా ఖర్చు చేశావా శాంతీ?" పర్సు చూసుకుంటూ అడిగాడు రావు.
డ్రస్సింగ్ టేబిల్ దగ్గిర కూర్చుని కనుబొమలు పెన్సిల్ తో దిద్దుకుంటున్న శాంతి నిర్లిప్తంగా, "నిన్న బాటాషాపులో షూస్ వచ్చాయంటే మిసెస్ దరువాలతో పాటు నేనూ తీసుకున్నాను. దానికో ఇరవై, టేయిలర్ కో యిరవై. మొన్న మిసెస్ తులాని కొన్నలాంటి చీర ఒకటి నలబై రూపాయలకి తీసుకున్నాను. ఎల్లుండి పార్టీకి ఎడ్వాన్సు వో ఇరవై ఇవ్వాల్సి వచ్చింది?"
రావు నుదురు చిట్లించాడు. "టైలర్ కి ఇరవై ఏమిటి? ఏం కుట్టించావు?"
"వీపు మీద రకరకాల డిజైన్లు కత్తిరించి స్లీవ్ లెస్ బ్లౌజులు కుట్టడానికి ఎవరో ఎక్స్ పర్ట్ టైలర్ ఉన్నాడంటే ఒక నాలుగు కుట్టమని ఇచ్చాను"
మిషన్ ఉందిగా , నువ్వు కుట్టుకోలేకపోయావా?"
"నాకా ఫాషన్లు తెలియవు, అదీకాక తీరుబడి లేదు."
ఇదివరకు ఇంట్లో పిల్లలవి, తనవి అన్నీ స్వయంగా కుట్టుకుని ఒక్క పైసా ఐనా దుబారా కాకూడదనే శాంతేనా అని అయోమయంగా చూశాడు రావు.
"ఎల్లుండి పార్టీ ఏమిటి?"
"మేమంతా వారానికి ఒకరింట్లో పార్టీ ఇచ్చుకోవాలనీ నిర్ణయించుకున్నాం. ఎల్లుండి నా వంతు, ఫక్తు ఆడవాళ్ళ పార్టీ. మీరా రోజు దయచేసి ఎక్కడి కైనా వేంచేయమని ప్రార్ధన' నవ్వింది శాంతి.
"రేపు ఇన్సూరెన్స్ ప్రీమియం కట్టాలని ఉంచాను. అది కాస్త నీ ఫాషన్లకి , సరదాలకి ఖర్చు పెట్టేశావన్నమాట" అదోలా అన్నాడు రావు.
"నాకేం తెలుసు , పోరపాటయింది. క్షమించండి" చిన్నపుచ్చుకుని అంది శాంతి.
"సర్లే....తప్పు నాది"
* * * *
వారం రోజులు ఏదో పని మీద డిల్లీ వెళ్ళాడు రావు. ఆరోజే తిరిగి వచ్చాడు రావు. వచ్చేసరికి రాత్రి ఏడయింది. ఇంట్లో అడుగు పెట్టేసరికి సుజాత ఒక్కర్తే కనిపించింది. మంచం మీద కూర్చుని ఆడుకుంటూ ప్రక్కలు అన్నీ రేగి ఉన్నాయి. ఇంటి నిండా బొమ్మలు, పుస్తకాలు, బట్టలు, అన్నీ పడి ఉన్నాయి. ఏవీ ఉండాల్సిన స్థానంలో లేవు. కాసేపటికి ఆయా తిరిగి వచ్చింది బాబు నెత్తుకుని.
"మేమ్ సాబ్ క్లబ్బుకి వెళ్ళారు! నేను బాబు ఏడుస్తుంటే అలా ఆడించడానికి తీసుకువెళ్ళాను. రాము బజారుకి వెళ్ళాడు. అమ్మాయి గారు అంతా చిందర వందర చేశారు."
"ఇల్లంతా ఇలా ఉందేమిటి? సుజాని ఒక్కర్తీని వదిలి అంతా ఏమయ్యారు. అని కేకలు వేసిన రావుకి భయపడుతూ పరిస్థితి వివరించింది.
తిన్నగా క్లబ్బుకి బయలుదేరాడు రావు.
అడుగు పెట్టగానే శాంతి కనిపించింది డాన్స్ ఫ్లోర్ మీద జంటల మధ్య. అతనెవరో రావుకి తెలియదు. ఫాక్స్ ట్రాచ్ వాద్యానికి లయగా అడుగులు వేస్తున్న శాంతి నేర్పుకి ఆశ్చర్యపోయాడు రావు. ఫాక్స్ ట్రాచ్ ఆగింది. వాల్ జ్ మొదలైంది. మళ్ళీ అతనితోనే అంత సులభంగానూ వాల్ త్జ్ చేసింది శాంతి.
రావు దగ్గర్లో ఒక ఫేం కుర్చీలో కూలబడి బేరర్ని "ఏక్ బడా ఏ.కె ' తెమ్మని ఆజ్ఞాపించాడు.
డాన్స్ కొద్ది నిమిషాల విరామం కోసం ఆగింది. మెడని పమిట చెంగుతో తుడుచుకుంటూ విలాసంగా నవ్వుతూ అతనితో టేబిల్ దగ్గిరికి నడుస్తున్న శాంతి రావుని చూసింది. అప్పటికి రావు బ్లాక్ నైట్ విస్కీ నాలుగు పెద్దవి రుచి చూశాడు.
"ఎప్పుడు వచ్చారు?' సంభ్రమంగా అడిగింది శాంతి ఎదురుగా కూర్చుంటూ.
రావు మాట్లాడలేదు. చేతిలో గ్లాసుని గుండ్రంగా తిప్పాడు. శాంతికి సగం అర్ధమయినట్టయింది. ఆ మౌనం.
"రండి , యింటికి వెడదాం' శాంతి లేచింది.
రావు ఆఖరి గుటక మింగి గ్లాసు బలంగా టేబిల్ మీద పెట్టి లేచాడు. రావు వెనకాల స్కూటర్ మీద కూర్చుని అతని భుజాలు రెండు గట్టిగా పట్టుకుని తలని అతని వీపు కానించింది శాంతి. అతను పోతున్న వేగంలో ఆ మౌనంలో అతని మనసులోని భావాలు ఎన్నో వ్యక్తమవుతున్నాయి.
కళ్ళు చెదిరే ఆవేశంలో ఎటూ చూడలేక కళ్ళు మూసుకుంది శాంతి. ఏదో ఆవేదన రేగింది. కళ్ళెదుట రంగురంగుల గీతలు నిలువుగా, వంకరగా అడ్డదిడ్డంగా , మెరుపుల్లా మెరిసి మాయమౌవుతున్నాయి. తను ఆ గీతల్లో బందీగా అనిపించింది.
తను గీత దాటిందా? వాటన్నింట్లో ఏది తను దాటగూడడని గీత? అంతా చెల్లా చెదురుగా ఉంది.
'అబ్బ ఏమిటా విసురు? తగ్గించండి' గట్టిగా అరచింది శాంతి, వాలు గాలిలో అతనికి వినపడదన్న భయంతో.
'అంత భయం దేనికి? యింత వేగంతో పోవడం ఇదీ ఫాషనే ?" పొడిగా అన్నాడు రావు.
శాంతి కళ్ళు మూసుకుని అతన్ని గట్టిగా పట్టుకుంది. ఆమె కళ్ళ ముందు ఎన్నో గీతలు మెరిశాయి వంకర టింకరగా, మెరుపుల్లా!
***