ఓడిపోయాను
కుమారస్వామి, కృష్ణశర్మ, సారధి, వెంకట్రావు - ఆ నల్గురూ ఒకే కాలేజీలో చదువుకున్నారు. సబ్జక్ట్స్ వేరయినా ముఖ పరిచయం కొందరికి, రూము స్నేహం కొందరికి వుండేది. ఆ తర్వాత ఎవరి పాటికి వారు ఉద్యోగాలలో ఇరుక్కుని అక్కడా ఇక్కడా తిరిగినా, కధాకాలం నాటికీ రాజధాని నగరం ఒకరి తర్వాత ఒకరు చేరుకున్నారు. రోడ్ల మీదో, ఆఫీసు ల్లోనో, హోటళ్ళ లోనో ఒకరికొకరు తటస్థపడ్డారు. హల్లో , హాయ్ అంటూ పలకరించుకున్నారు. పాత పరిచయం పునరుద్దరించికున్నారు. స్నేహం కలిసింది.
స్నేహం వృద్దయ్యాక నలుగురూ కలిసి ఒక యింట్లోనే మకాం పెట్టి చిన్న మెస్ రన్ చేసుకుంటే హోటలు మెతుకులు తినే ఖర్మ తప్పుతుందన్న ఆలోచన వచ్చింది. వెంటనే నల్గురూ అమితోత్సాహంతో ముందుకు వచ్చారు. ఇల్లూ, వంటవాడి కోసం అన్వేషణ మొదలైంది.
వెతగ్గా వెతగ్గా హిమాయత్ నగర్ లో ఆ యిల్లు కుదిరింది. నల్గురికి నాలుగు వేరే వేరే గదులు, ఉమ్మడిగా డైనింగు రూము, వంటగది వగైరా వగైరా అన్ని చక్కగా అమిరాయి.
అన్నిటికంటే బాగా అమిరింది పరిసరాలు. యింటి కెదురుగా ఓ అందమైన బంగళా! పెద్ద కాంపౌండు, చెట్లు , తోట.
అందమైన ఆ బంగళా కంటే కూడా ఆ సాయంత్రం తోటలో దర్శనం ఇచ్చిన ఆ యింటి యజమానురాలు మరింత ఆకర్షనీయం అనిపించింది. ఆమెను చూడ్డానికి రెండు కళ్ళు చాలవనిపించింది మిత్ర బృందానికి. తమలాంటి బ్రహ్మచారుల్ని దృష్టిలో పెట్టుకుని దేముడే ఆ చక్కని యింటిని చూపించాడని సంతోషపడ్డారు. కాలక్షేపానికి లోటుండదని ఆనందపడ్డారు. పరిమానంద భరితులయ్యారు.
వారం రోజుల లోపలే వంటవాడు మణి ఎదురింటి గురించి చాలా సమాచారం సేకరించి మిత్ర బృందానికి అందించాడు.
ఆ యింటి యజమానురాలు పేరు రమాదేవి. ఒక్కతే వుంటుంది.
నౌకర్లు, చాకర్లు యింటి నిండా వున్నారు. వంటమనిషి, బంట్రోతు , ఆయా, కారు డ్రైవరు వగైరా . ఆమెకు పెళ్ళయింది , కాని భర్త ఇక్కడ లేడు. ఎక్కడున్నాడో నౌకర్లకి సరిగా తెలియని విషయం! ఆ యింట్లో ఆమెదే రాజ్యం! రోజుకో చీర కడ్తుంది. నెలకోసారి ఫర్నిచర్ అటుదిటు ఇటుదటు మార్చడమే కాకా క్రొత్తవి కూడా చేరుస్తూంటుంది! ఉన్నట్టుండి ఏ సినిమాకో, క్లబ్బుకో వెడుతుంది. వెళ్ళకపోతే రోజుల తరబడి యిల్లు కదలదు. ఎవరెవరో కార్లలో వస్తుంటారు. పార్టీలు పెద్ద ఎత్తున జరుగుతాయి. అర్ధరాత్రి దాటినా సీసాలు, గ్లాసులు చప్పుళ్ళు నవ్వులు, కేరింతలు వినిపిస్తాయి. సంగీతమూ, వుంటుంది. క్లబ్బుల కెడుతుంది. పేకాడుతుంది.
ఏం చేసినా అడిగేవారు అడ్డేవారు లేరు. యీ విషయాలన్నీ స్నేహితులు నలుగురికీ వాళ్ళకే తెలియని ఉత్సాహాన్నీ ఉత్సుకతనీ కలిగించాయనాలి. అలా ఏ కిటికీ దగ్గరో నించుని ఆ యింటి వైపు చూపులు సారించేవారు, నలుగురూ కలిసి మాట్లాడుకొనేటప్పుడు తపప్నిసరిగా ఆమె సంభాషణలోకి వచ్చేది.
ఆమె వంటరితనం వాళ్ళకి మరింత ప్రోత్సాహకరంగా వుండేది.
మూడు నెలలు యిట్టే గడిచిపోయాయి. యీ మూడు నెలలు ఆమెను దూరం నించి చూడ్డం మాత్రమే జరిగింది. ఆమె పార్టీలకి వచ్చి పోయే పెద్ద మనిష్యులు, వాళ్ళ కార్లు, నౌకర్లు, డ్రైవర్లు, వగైరాలని చూడ్డం . ఆమె వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు గేటు తెరచి నౌకరు వినయ విధేయతలు. ఆమె కారులో వెళ్ళే తీరు మొదలయినవి పరిశీలించడం జరిగింది. ఆమె ఏబాల్కనీలోనో కనపడితే కరువు దీరా వీక్షించేవారు. ఏ సాయంత్రమో తోటలో ఆమె తిరిగిందంటే కన్నులపండుగే వాళ్ళకి.
ఓ మూడు నెలలు ఆమె సందర్శన భాగ్యంతోనే తృప్తి పడ్డారు. అంత కంటే ఏదో జరుగుతుందని, జరగాలని వాళ్ళాశించనూ లేదు.
కాని ఉన్నట్టుండి కధ మలుపు తిరిగింది. ఒకానొక వాన ముసురు రోజు ఉదయం.
అప్పటికి రెండు రోజుల నుంచి ఎడతెరిపి లేని వాన, గాలి! కరెంటు లేదు. బయట జీవితం స్తంభించినట్టుంది.
మిత్రులు నలుగురూ సావకాశంగా ఏడింటికి లేచి వేడి వేడి కాఫీలు త్రాగారు. వెచ్చగా సిగరెట్లు కాలుస్తూ ముందు గదిలో కూర్చున్నారు. వాతావరణం అనుకూలంగా వుందని పేక దస్తా తెరిచారు. రమ్మి మొదలు పెట్టారు.
హటాత్తుగా గుమ్మం దగ్గిర ఓ మెరుపు మెరిసినట్టు రమాదేవి ప్రత్యక్షమైంది. తెల్లటి చీర, తెల్లటి జాకెట్టు , చెదిరిన జుత్తు, చేతిలో గొడుగు ముడుస్తూ నలుగురి వంక చూసి చిన్నగా నవ్వింది.
మిత్రులు సంభ్రమాశ్చర్యాలలో మునిగిపోయారు. నలుగుర్లో ఒక్కరూ ఆమె నాహ్వానించడం గాని, ఎందుకొచ్చిందో అడగాలని గాని తట్టనంత దిమ్మెరపోయారు.
"లోపలికి రావచ్చునా?" ఆమె అడిగింది.
"ఆఫ్ కోర్స్' అన్నారు నలుగురూ ఒక్కసారిగా. అన్న వెంటనే గబగబ కుర్చీలు ఖాళీ చేశారు. ఆమెను లోపలికి రమ్మని కుర్చీలు చూపెట్టారు. పనున్నట్టు ఒక్కొక్కరూ హడావుడిగా లోపలికి వెళ్ళి లుంగీల వాళ్ళు పైజామాల్లోకి, బనీన్ల వాళ్ళు షర్టు లలోకి మారారు. రేగిన జుట్టుని నున్నగా దువ్వుకున్నారు.
రమాదేవి ఆ మార్పులు గుర్తించి నవ్వుకుంది.
"మిమ్మల్ని డిస్టర్బ్ చేసినట్టున్నాను."
"నో నో..... డిస్టర్బ్ న్స్ ఏముంది? మీరు మాయింటికి రావడం చాలా ఆనందంగా వుంది" అన్నాడు సారధి ఎలాగో నోరు పెగిలించుకుని మిగతావాళ్ళు యింకా మాటల కోసం వెతుక్కుంటున్నారు.
"మీరు కూర్చోండి" అంది రమాదేవి.
అప్పటిగ్గాని యింకా నిలబడే వున్నామని గుర్తురాలేదు నల్గురికి వెంటనే కుర్చీల్లో కూలబడ్డారు.
"ఈ వాన చూడండి రెండు రోజుల బట్టి పట్టుకుని ఎలా వదలడం లేదో, డర్టీ న్యూసెన్స్....
"యివాళ కరెంటు గూడా లేదు, చెడ్డ చిరాగ్గా వుంది...."
"అందుకే వచ్చాను, కష్టాలన్నీ ఒకసారే వస్తాయంటారు. వంటావిడకి జ్వరం మూడు రోజుల్నుంచి ముసుగుతన్ని పడుకుంది. డ్రైవరు కాస్తా శలవు పెట్టాడు. నౌకరు , పనిమనిషి కూడా యిప్పటివరకు రాలేదు. కాఫీ చేసుకుందామన్న అగ్గిపెట్టె లో వున్న పుల్లలు కాస్తా నానిపోయాయి. హీటర్ మీద చేసుకుందామంటే కరెంట్ లేదు. కాఫీ పడందే బండి నడవదు. సరే, ఎదురుగ్గా మీరున్నారు కదా, అని వచ్చాను. కాస్త అగ్గిపెట్టె వుంటే యివ్వండి."
వెంటనే నాలుగు చేతులు నాలుగు అగ్గిపెట్టెల్తో ముందుకి వెళ్ళాయి. రమాదేవి ఒక్కక్షణం ఏం చెయ్యాలో తోచనట్టు ఆగి, తరువాత నవ్వేసింది. రెండు చేతుల్తో రెండు రెళ్ళు నాలుగు అగ్గిపెట్టేలూ తీసుకుని "థాంక్స్ ఒక నెలపాటు అగ్గిపెట్టెల ఖర్చు లేదన్నమాట " అంది.
మిత్రులు నలుగురూ తెల్లబోతూ నవ్వేశారు.
"వెళ్తాను, " అంటూ లేచింది రమాదేవి.
"ఉండండి, ఉండండి, కాఫీ త్రాగి వెడుడురు గాని.....' నలుగురూ యించుమించు ఒక్కసారే అన్నారు. ఒకడు మణి కోసం కేకపెట్టాడు. మారాడు వంటింటి వైపు నడిచాడు. ఇంకోడు మణితో 'నారాయణాస్ కాఫీ పొడుంతో కాకుండా , ఎమర్జెన్సీ స్టాక్ నెస్ కాఫీ కలుపు సుమా' అని చెప్పి వచ్చాడు.
"థాంక్యూ , రక్షించారు. ఇప్పుడింటి కెళ్ళి కాఫీ కోసం గిన్నెలతో కుస్తీ పడే అవస్థ నించి తప్పించారు...." అంటూ నవ్వింది రమాదేవి.
ఆమె ధోరణిలో ఎన్నో ఏళ్ళ పరిచయం కనపడింది ముఖ్యంగా అలాంటి చొరవ యెంత చదువుకున్న ఆడవాళ్ళలో నైనా చూడం. ఠీవి హుందా వుంది. ఆమె మాటల్లో, చూపుల్లో ప్రవర్తనలో ఏదో ఉన్నత కుటుంబానికి చెందినదయి వుండాలి అనిపించింది నలుగురికి యివతలి వాళ్ళ సపర్యలు అందుకోడం తన హక్కు అన్నట్టుంది ఆమె ధోరణి.