ట్యూబ్ లైట్ల కాంతిలో క్లబ్బంతా వెలిగిపోతుంది. రకరకాల మనుష్యులు, రకరకాల ఫ్యాషన్లు . కొందరు అటూ ఇటూ తిరుగుతూ పరిచితుల్ని పరామర్శిస్తున్నారు. కొందరు నిల్చుని మాట్లాడుతున్నారు. కొందరు అక్కడ వేసిన కుర్చీల్లో కూర్చుని మాగజైన్లు తిరగేస్తున్నారు. పిక్చరు ఇంకా ఆరంభించలేదు. అది అక్కడ పనిచేసే ఆఫీసర్ల కోసం ప్రత్యేకించిన క్లబ్బు. ఓపెన్ ఎయిర్ దియేటర్లో వారానికి ఒకసారి సినిమా ఉంటుంది. రోజూ పేకాట, బిలియర్డ్స్, టెన్నిస్ .....అటల్తో బాటు అప్పుడప్పుడు డాన్సులూ డిన్నర్లూ కూడా జరుగుతుంటాయి.
రావుని, శాంతిని గమనించి కూడ ఎవరూ పట్టించుకోలేదు. ఆ రోజు మెస్ లో పరిచయం అయిన వారే కాకుండా యింకా చాలామంది ఉన్నారు. ఆడవాళ్ళ నవ్వుల్తో క్లబ్బు ఎగిరిపోతుంది. క్రితం సారికంటే యింకా ఎక్కువ ఆడంబరంగా తయారయారు అందరూ, ఒక్కొక్కరూ ఒక్కొక్క ఫాషన్ కి నమూనా అన్నట్లు.
రావు మొహం చూసి, అతని భావం అర్ధం చేసుకుని ఆడవారి గుంపులోకి నడిచింది శాంతి. అంతవరకూ పెద్దగా నవ్వుతూ కబుర్లు చెప్పుకుంటున్న వాళ్ళంతా ఒక్కసారి మౌనం వహించారు.
"ఇవాళ ఎంత సుదినం? మీరు క్లబ్బుకి వచ్చారు?" మిసెస్ తులాని అడిగింది. కొంత సేపటికి, హాస్యం, హేళన మిలాయించి. అంతా ముసిముసిగా నవ్వి కళ్ళతో మాట్లాడుకుంటున్నారు.
"రోజూ సాయంకాలం ఏం చేస్తారు? సాయంకాలం ఓ గంట క్లబ్బుకి రాకూడదూ?" మిసెస్ తివారి అడిగింది.
"వీలుని బట్టి చూస్తాను" వాళ్ళ అహంకారాన్ని సహించలేక అదోలా అంది శాంతి.
సినిమా మొదలైంది. లైట్లారిపోయాయి.
"చూశావా, యివాళ కూడ ఎవరూ నీతో సరిగా మాట్లాడలేదు .......నీ ధోరణి మారేవరకు మానని అందరూ యిలాగే ట్రీట్ చేస్తారు " త్రోవలో అన్నాడు రావు.
శాంతి మనసులో చెప్పలేని ఆందోళన చెలరేగింది. బలమైన శక్తులేవో తనకి ఇష్టం లేని దారి వెంట పొమ్మని తనని తోస్తున్నట్టయింది.
* * * *
'అరే......యిది కలా, మాయా? నన్నునుగ్రహించి దిగివచ్చిన అప్సరసా?" స్లీవ్ లెస్ బ్లౌజ్, షిఫాన్ శారీ, చెవులు కప్పుతూ నడినెత్తిన చుట్టిన సిగ, లిప్ స్టిక్, నాజూకు స్లిప్పర్స్, నవ నాగరికంగా కనపడిన శాంతిని చూడగానే ఆశ్చర్యపోయాడు రావు.
"ఏం, తృప్తి అయిందా మీకు?" ఇంకా ఏమయినా మిగిలాయా?" కొంచెం నిష్టూరంగా అన్నాడు శాంతి భుజం తడ్తూ-
"కోపమా శాంతీ! ఎంత బాగున్నావో తెలుసా యిలా?..... వాళ్ళందరి కంటే నీకు యీ స్టయిలు చాలా బాగా అమరింది ....గుడ్ గర్ల్! యు లుక్ వెరీ స్మార్ట్! ఇలా చెప్పినట్లు వింటే నాకెంత బాగుంటుందో తెలుసా?' మురిపెంగా చూస్తూ దగ్గరకు తీసుకున్నాడు.
"పదండి , క్లబ్బుకి వెడదాం ' కాఫీ ఇచ్చాక అంది శాంతి.
"ఏమిటి ఉప్పెన? యిదంతా నామీద అనుగ్రహమా? హాస్యమా, కోపమా?"
"ఎందుకంత ఆశ్చర్యపోతారు ? ఇకమీదట మీ యిష్టం వచ్చినట్టే ఉండదాల్చుకున్నాను .....శాంతి, మిసెస్ రావుగా క్రొత్త రూపం దాల్చదల్చుకుంది అంతే! ఇవాళ మిసెస్ తులాని దగ్గిరికి వెళ్ళి క్రొత్త రకం హెయిర్ స్టయిల్స్ నాలుగైదు నేర్చుకు వచ్చాను. ఆమె డాన్సు కూడా నేర్పుతానంది.....ఇకమీదట నాతొ రావడం మీకు తలవంపుగా ఉండదు?"
"తలవంపు అని నే నేప్పుడయినా అన్నానా? నన్నెందుకు అర్ధం చేసుకోవు?.....అందరి కంటే చదువు, అందం అన్ని ఎక్కువే అయినా అందరి ముందు తీసికట్టుగా ఉండడం ఎందుకన్నాను! అంతేగా?' అనునయంగా అన్నాడు రావు ఆమెని శాంతపరచాలని.
'సర్లెండి, మిమ్మల్ని నేనేమి అనడం లేదు. వూరికే అన్నాను....వెళ్దామా మరి" క్లబ్బులో అందరూ శాంతిని పరీక్షగా చూశారు. ఒకరి మొహాలు ఒకరు చూసుకున్నారు. ఆనాడు అందరి కళ్ళూ ఆమె మీదనే ఉన్నాయి.
* * * *
"ఇవాళ మిసెస్ దారువాలా ఫోన్ చేసింది. నాలుగు గంటలకి "లేడీస్ పార్టీ' ఉంది రమ్మని, వెళ్ళనా?" మధ్యాహ్నం డైనింగ్ టేబిల్ దగ్గర అడిగింది శాంతి.
ఎన్నడూ పార్టీలకి, వాటికి ఎన్నోమార్లు అడిగితేనే గాని రాని శాంతి తనంతట తానుగా అడగడం ఆనందం ఆశ్చర్యం కలిగించింది.
"తప్పకుండా వెళ్ళు . ఇందులో అడిగి వెళ్ళేందుకు ఏముంది శాంతీ! పిల్లల గొడవ నేను చూసుకుంటానులే!"
"తొందరగా వచ్చి, వచ్చాక చేస్తాను వంట"
'చూడు, తిండి అన్నది పెద్ద అలోచించాల్సిన విషయం గాదు. నువ్వక్కడ నించి వచ్చాక వంట చెయ్యక్కర లేదు! ఏ క్యాంటిన్ లోనో కానిచ్చేద్దాం ఇవాల్టికి!"
అర్ధం చేసుకున్నట్టు నవ్వింది శాంతి.
* * * *
"ఏం ఇంకా రావడం లేదా మీరు? ఏం చేస్తున్నారు ఇంత సేపు?" మామూలు వేళ దాటిపోయాక ఆఫీసుకి ఫోను చేసింది శాంతి.
"సారీ డియర్, ఇప్పుడిప్పుడే రావడానికి వీలవదు , ఏం?"
"{మీరు వస్తే క్లబ్బుకి వెడదామని రెడీ అయి కూర్చున్నాను."
"వెరీ సారీ, నా కివాళ వీలవదు. రేపు వెడదాం లే" ఫోను పెట్టేయబోయాడు.