"మరి మీ మేనత్త వాళ్ళింటికి వెళదామా? నీ మరదలు పిల్లని నువ్వు చూడచ్చు"
"అంత సాహసాలు చేయక్కర్లేదుగానీ పద"
ఇక వత్తిడి చేయలేదు సూరిబాబు. అదీగాక ఆరోజు వస్తున్నట్లు అతని తండ్రి పెళ్ళికూతురు వాళ్ళకు ఉత్తరం కూడా రాశాడు.
వాళ్ళిద్దరూ ఆ వూరు చేరుకునేసరికి సాయంకాలం నాలుగ్గంటలైంది.
ఆరుగంటలకి రిలాక్స్ అయ్యాక పెళ్ళిచూపుల ఏర్పాటు జరిగింది. ఓ గంట దాకా ఆ కార్యక్రమం సాగింది. గతికితే అతకదు అన్న సూత్రం ప్రకారం ఇద్దరూ తిరిగి బయల్దేరారు.
"ఇంతకీ ఈ అమ్మాయిని చేసుకుంటున్నావా?"
వూరు దాటాక చంద్రహాస్ అడిగాడు సూరిబాబుని.
"ఒక్క కారణం తప్ప మరేమీ కనిపించడం లేదు ఆ అమ్మాయిని చేసుకోవడానికి!"
"ఏమిటిది?"
"నువ్వు సరిగా చూశావో లేదో గానీ అమ్మాయికన్నా ఆమె తల్లే బావుంది. ఆమెలాంటిది అత్తయితే నా సామిరంగా బ్రహ్మాండంగా వుంటుంది."
అది నిజమే... ఆమె మతిపోయేంత అందంగా వుంది. ఎందుకనో గాని కూతురికి తల్లిపోలిక రాలేదు. తండ్రి పోలిక వచ్చింది. పెద్దగా ఇంప్రెసివ్ చేసే అందం కాదు పెళ్ళి కూతురుది.
"మా మామగారు ఒట్టి అర్భకుడిలా వున్నారు. లేకుంటే ఆ వయసులో కూడా ఆమె ఒంటి బింకాన్ని సడలించలేకపోయాడు."
ఇక వినలేకపోయాడు చంద్రహాస్.
అందుకే మాట మార్చడానికి "ఎనిమిదిగంటలకు లాస్ట్ బస్ అట. అది మిస్సయితే కష్టం- నడువ్" అని హడావుడి చేశాడు.
ఎనిమిదిగంటలలోపే బస్టాండ్ చేరుకున్నారుగానీ తొమ్మిదిగంటలయినా బస్సు రాలేదు.
బస్సు మార్గమధ్యంలో చెడిపోయిందని, ఇక ఆ పూటకి రాదని తెలిసింది.
"మరిప్పుడు ఎలారా? ఈ రూట్లో మరో వెహికల్ కూడా వచ్చేట్టు లేదు."
ఇద్దరూ చాలాసేపు ఆలోచించినా ఏమీ తట్టలేదు. చివరికి సూరిబాబుకే ఆ ఐడియా తట్టింది.
"రేయ్ చంద్రా! ఇంత చలిలో ఎక్కడో ఓ దగ్గర ఆశ్రయం పొందితే తప్ప బతకలేం. ఎంచక్కా మీ మేనత్త ఇంటికి వెళదాంరా..." అన్నాడు.
అతనికి వెళ్ళడానికి ఇష్టం లేదుగానీ అంతకంటే వేరే మార్గం కూడా లేకపోయింది. అయిష్టంగానే ఒప్పుకున్నాడు. ఇద్దరూ తిరిగి వెనక్కి మళ్ళారు. ఊర్లో ప్రవేశించి ఇద్దర్నీ అడిగి ఇల్లు తెలుసుకొని వెళ్ళారు.
అది రెండు పెంకుటిళ్ళు. మధ్యలో వున్న ఖాళీ స్థలంలో కూర్చోవడానికి అనువుగా వుంటుంది.
ఇంటి ముందు నిలుచుని తలుపుతట్టారు. వాళ్ళొచ్చి తలుపు తీస్తే ఏం చెప్పాలో, ఎలా మాట్లాడాలో రిహార్సల్స్ చేసుకుంటున్నాడు చంద్రహాస్.
మరి కాసేపటికి తలుపు తెరుచుకుంది.
దూరంగా వున్న స్ట్రీట్ లైట్ వెలుగు పలచగా పరుచుకుంది అక్కడ.
తలుపుకి అవతల నిలుచున్న అమ్మాయిని గుడ్లప్పగించి చూస్తున్నారు స్నేహితులిద్దరూ.
మెరుపుతీగ సరదాకి కాసేపు మానవరూపం ఎత్తినట్టుంది మధుమతి. ఆ మసక వెలుతుర్లో సైతం ఆమె శరీరంలోని ఒంపుసొంపులన్నీ స్పష్టంగా తెలుస్తున్నాయంటే అవి ఎంత పొందికగా వున్నాయో ఊహించుకోవచ్చు. మరీ కళ్ళయితే చారడేసికన్నా ఇంకాస్త పెద్దవే.
"బావ" అని లోపలికి ఆమె గెంతింది.
తనను ఎలా గుర్తుపట్టిందో చంద్రహాస్ కి అర్థంకాలేదు. ఆమె 'బావ' అన్నది తను గుర్తుపట్టాడు. మరి తనని ఎలా పోల్చుకోగలిగింది?
ఆమె చెప్పడంతో తల్లీ తండ్రీ బయటికి వచ్చి లోపలికి ఆహ్వానించారు.
చాలా ఏళ్ళ తరువాత కలుసుకోవడంతో మేనత్త చంద్రహాస్ ను వదల్లేదు. ఊర్లోని ప్రతిదీ వివరం అడిగి తెలుసుకుంది.
పదిగంటల ప్రాంతాన అప్పటికప్పుడు వండి వడ్డించింది మధుమతి.
తృప్తిగా తిని పడుకున్నారు. తనని ఎలా గుర్తుపట్టిందా అన్న ఆలోచన వదలకపోవడంతో చంద్రహాస్ కి చాలాసేపటివరకు నిద్ర రాలేదు. అందుకే ఉదయం లేచేటప్పటికి ఆరయింది. ఎనిమిది గంటలకి రెండో బస్సు. దానికి వెళదామని తయారయ్యారు.
తన సందేహం తీర్చుకోవాలని ఆరాటంగా వుంది చంద్రహాస్ కి కానీ మరదలు పిల్ల ఒంటరిగా దొరకడం లేదు. అందులోనూ ఆడపిల్లల్తో చొరవగా మాట్లాడే అలవాటు లేదు అతనికి.
ఇక లాభం లేదని అత్తామామలకి చెప్పి బయలుదేరాడు. మధుమతి ఎక్కడా లేదు. ఎక్కడికెళ్ళిందబ్బా అని కళ్ళు గాలించాయిగానీ, దొరక లేదు.
బస్టాండ్ చేరుకున్నారు.
దూరంగా బస్సు వస్తోంది.
జనమంతా లేచి నిలుచున్నారు.
అప్పుడు కనబడింది మధుమతి.
రోడ్డంట పరిగెత్తుకుంటూ వస్తోంది.
బస్సును గమనించిందేమో రెండు అంగల్లో చేరుకుంది. ఆయాసం మాట్లాడనివ్వకపోతే అతని కెదురుగా నిలబడిపోయింది. తన సందేహం అడగాలనుంది అతనికి. కానీ నోరు పెగలడం లేదు. ఆయాసంతో ఎగురుతున్న గుండెల ఎత్తు కళ్ళకు తగుల్తోంది.
"నీకోసమని- ఇవంటే నీకిష్టమటగా" అని పైటలో దాచుకున్న కుడిచేతిని బయటకి తీసింది. రెండు పెద్ద జొన్న కంకులు.
"కాల్చి తేవడానికి లేటయ్యింది"
అంతలో బస్సు వచ్చేసింది.
జనం తోసుకుంటూ ఎక్కుతున్నారు.
అతను చివరలో నిలబడ్డాడు. జనం ఎక్కేశారు.
తన బస్సు ఎక్కబోతూ అడిగాడు "నన్ను ఇంతకు ముందెప్పుడూ చూళ్ళేదు కదా ఎలా గుర్తుపట్టావ్?"
"ఇలా" అంటూ ఈసారి పైటలోంచి చేయిపోనిచ్చి గుండెలోంచి తీసి చూపిస్తున్నట్టు జాకెట్ లోపల దాచుకున్న ఫోటోను చూపించింది.
అతనికి మతిపోయింది. థ్రిల్లింగ్ లాంటి ఫీలింగ్ గుండెను కదుపుతోంది. ఆ అభిమానానికి అతని కళ్ళలో నీళ్ళు తిరిగాయి.
చివరిమెట్టు ఎక్కబోతుండగ "బావా! మరోసారి రావూ" అని అడిగింది.
వస్తానన్నట్టు తల ఊపాడు.
"నీకోసం ఎదురు చూస్తుంటాను"
ఆమె గట్టిగా అరిచింది. బస్సు స్పీడందుకుంది.
తిరిగి ఊరికి వచ్చారుగానీ గాలిపటం పూలచెట్టుకు తగులుకుని ఎంతకూ రానట్టు మనసు మాత్రం మధుమతికి చిక్కిపోయింది. కళ్ళు మూసినా తెరిచినా ఆమె తప్ప మరొకటి కనపడడం లేదు.
మరో పదిహేను రోజుల తర్వాత వెళ్ళాడు.
మేనత్త తనని వదలకపోవడంతో మధుమతితో మాట్లాడే అవకాశమే చిక్కలేదు. తిరిగి బయల్దేరుతుంటే బ్యాగ్ అందించడానికి వచ్చింది మధుమతి.
చుట్టుపక్కల ఎవరూ లేరు. "రమ్మన్నావ్. మాట్లాడడం లేదు. ట్రిప్ అంతా వేస్ట్" అన్నాడు.
"నాకూ బాధగానే వుంది. ఏం చేయమంటావ్- అమ్మా నాన్న నిన్ను వదలడం లేదు. అందుకే ఓ ప్లాన్ ఆలోచించాను. వచ్చే శనివారం రాత్రి లాస్ట్ బస్ కి వచ్చేసేయ్. కావలినుంచి తొమ్మిది గంటలకి బయల్దేరుతుంది. అరగంట ప్రయాణం. పదిగంటలకల్లా వచ్చేస్తుంది. ఊరంతా అప్పటికి నిద్రపోయుంటుంది. ముందు ఇంట్లో అమ్మా వాళ్ళు పడుకుంటారు.
వెనకింట్లో నేను పడుకుంటాను. అందువల్ల దొడ్డిదారి గుండా వచ్చి తలుపుమీద ఏడుసార్లు తట్టు. ఏడుసార్లు తలుపు చప్పుడు వినిపిస్తే వచ్చింది నువ్వేనని గుర్తున్నమాట. తలుపు తీస్తాను. ఉదయం అయిదు గంటలకి ఫస్ట్ బస్. దానికి వెళ్ళిపోవచ్చు. అమ్మా వాళ్ళకి సైతం నువ్వొచ్చావని తెలియదు సరేనా? రాత్రంతా మనం మాట్లాడుకోవచ్చు" అంది త్వర త్వరగా. ఆ ఆలోచన బాగా నచ్చింది అతనికి. మరోసారి ఫ్రీగా కలుసుకునేందుకు ఐడియా చిక్కినందుకు ఆనందిస్తూ బస్టాండు చేరుకున్నాడు.