Previous Page Next Page 
అందమైన అపశృతి పేజి 22


    "శృతి చాలా చక్కని పేరు."

    ఏదో ఒకటి కలివిడిగా మాట్లాడితేనే బాగుంటుందని "స్వాతి, మీ  పేరని తెలుసుకున్నాను. స్వాతి పేరుమేరీ చక్కనిది." అంది శృతి.

    "అలాగా!" అంటూ నవ్వి  "పాపం నీకెవరు లేరుట ఒక్క చిన్నమ్మ తప్ప!" అంది స్వాతి.

    శృతి ముఖం లిప్తపాటున బాధా  వీచిక చోటుచేసుకుంది. ముఖం నల్లబడింది.

    "ఈ భగవంతుడి సృష్టి ఎంత విచిత్రమో చూశావా శృతీ! నాకు అందరూ వున్నారు. ఏం లాభం? కాళ్ళుండి నడవలేని అవిటిదాన్ని."

    అంత క్రితం స్వాతీ "నీ కెవరూ లేరుట" అన్నప్పుడు భరించలేని బాధకలిగింది శృతికి. నాకు  అన్నయ్య, అమ్మ వున్నారని ఎలుగెత్తి అరిచి చెప్పాలినిపించింది. ఈదిక్కు మాలిన ఉద్యోగంకోసం తనకున్న తల్లిని చిన్నమ్మగా చేసుకుంది. ఆ వివేకమే ఆ క్షణాన శృతి నోరు మెదపకుండా చేసింది. ఇప్పుడు స్వాతి మామూలుగా తన అవిటితనం చెపుతుంటే మనసంతా జాలితో నిండిపోయింది.

    శృతి మాట్లాడకపోవడంతో స్వాతి పెదవి కదిపింది.

    "నా వైద్యానికి ఎంత ఖర్చయిందో తెలుసా శృతీ? ఊహించికూడా నువు చెప్పలేవు. అణా పైసల్తో లెక్క వేస్తె ఈజీగా పది బంగళాలు కట్టించవచ్చు. పది బంగళాలు మేం కటించకపోతేనేమిలే. నాకు నడక తెప్పిస్తామని మావద్ద డబ్బు గుంజిన వైద్యులు ఈ సరికి తలో మేడ మా డబ్బుతో కట్టేసే వుంటారు." అని పకపక నవ్వింది స్వాతి.

    "ఓహ్. ఎంత మనస్ఫూర్తిగా నవ్వగలుగుతున్నది ఈ పిల్ల?" అనుకుంది శృతి.

    "నాన్నగారు నాకోసం వీల్ చైర్ తెప్పించారు. కాని ఏం లాభం?__ మహా  అయితే ఓగంట చైర్ లో కూర్చోగలను. ఆ పైన వెన్నుపూసలో నొప్పి బైలుదేరుతుంది. ఆ నొప్పికి గిలగిల లాడిపోతాను. నడపలేను, కూర్చోలేనుకదా,  తమాషా ఏమంటే నేను ఈ విశాల ప్రపంచమంతా చూశాను. ఎలాగో చెప్పుకో చూద్దాం" పసిపిల్లలా అంది స్వాతి.

    వైద్యంకోసం వూరువూరు తిరిగి వుంటారు. అయినా ఈ మాట తాను అనకూడదు. తెలియదంటే సరి. స్వాతే చెపుతుందనుకుని "ఉహూ! నా వూహ కదండంలేదు." అంది శృతి.

    "రమణి, రాజి, శంకరి, జయమ్మ వీళ్ళందరికన్నా నువ్వే తెలివికలదానివి."

    "వాళ్ళెవరు?"

    "ఇదివరకు నీలాగే నా ఫ్రెండ్స్ గా వుంటానని వచ్చిన వాళ్ళు. వాళ్ళలో శంకరి మంచిది. ఉత్త అమాయకురాలు. తతిమ్మావాళ్ళు వాళ్ళకి గతిలేక వచ్చారు. నాకు గతిలేక ఫ్రెండ్ షిఫ్ చేశాను. ఈ విశాల ప్రపంచం చూశాను ఎలాగో చెప్పుకోండి! అంటే వాళ్ళేమన్నారో తెలుసా? నా వైద్యానికి వూరూరు తిరిగి వుంటారు అని. ఈప్రశ్న అడగగానే టకీమని నా ఆవిటితనం గుర్తుకొచ్చింది. పాపం! నిజం అదిగాదు. అలా చూడు శృతీ!" అంటూ స్వాతి వేలుపెట్టి చూపించింది.

    శృతి  వెనుతిరిగిచూసి ఆశ్చర్యపోయింది.

    శృతి వెనుకవేపు గోడకి అద్దాల బీరువాలున్నాయి. అన్ని బీరువాలు పుస్తకాలతో కిక్కిరిసి వున్నాయి.

    "మంచి పుస్తకాన్ని మించిన గొప్ప మిత్రుడు లేడన్నాడు ఓ మహాకవి. ఈ పుస్తకాలే కాదు శృతీ! ప్రక్కనే మరో గది వుంది. వేలగ్రంథాలు దాంట్లో వున్నాయి. కథలు, నవలలు, కవితలు, చరిత్రలు, రామాయణ భారతాలు, ప్రపంచపు వింతలు, ఎన్నో, ఒక లైబ్రరీలోకూడా దొరకనన్ని వున్నాయి. విడుదలై వున్న ఏ వార, మాస పత్రికన్నా చెప్పు. నా లైబ్రరీలో రెడీగా వుంటాయి. రాజకీయ పత్రికలు-డైలీ పేపరు, ఇవి చాలవా ఈ విశాలప్రపంచాన్ని చూడడానికి?"

    "చాలు, ఇవన్నీ చదివారు గాబట్టి మీజ్ఞానం అపారం."

    "నీ ప్రవర్తన నాకు నచ్చలేదు" చటుక్కున అనేసింది స్వాతి.

    ఇంతలో ఏం జరిగిందో తెలియక తెల్లబోయింది శృతి.

    "ఎక్కడ గౌరవముంటుందో అక్కడ భయభక్తులూ వుంటాయంటారు. స్నేహంలో  గౌరవము, భయభక్తులు కాదు కావాల్సింది. సమానత్వము, మనసువిప్పి మాట్లాడు కోవడము. మనం ఫ్రెండ్స్ గా వుండాలంటే ఇహ పై నన్ను మీరు మీరు అంటూ మన్నింపు చేయకు. స్వాతీ అని పిలువు. మీరు, గారు మానేసి నీవు అను. నా మాట ఈ ఇంట్లో ఎవరూ కాదనరు. సరేనా?"

    "చిన్నమ్మగారూ!" బైటనుంచి పిలుపు వినిపించింది.

    "మా పూజారి వస్తున్నారు." అని చెప్పింది శృతితో "రావచ్చు ఆచార్యులుగారూ!" అంది స్వాతి.

    ఎర్రటి గావంచా కట్టుకుని,  పంచపాత్ర, ఉద్దరిణతో పండు ముసలాయన లోపలికి వచ్చాడు.

    "మీ ఆరోగ్యంకోసం ఈరోజు చండీపూజ చేశామమ్మా! తీర్థమిచ్చి పోదామని...." అంటూ ఆచార్యులు తీర్థం ఇచ్చారు.

    తీర్థం చేతిలోకి తీసుకుని తాగింది స్వాతి.

    "ఆయురారోగ్య అయిశ్వర్య సిద్దిరస్తు" అని దీవించి ఓ ఉద్దరిణుడు తీర్థం శృతి చేతిలో వేసి శలవు తీసుకున్నాడు ఆచార్యులుగారు.

    "నాటక రంగంలో పాత్రలలాగా స్టేజీమీద తమపాత్ర అవసరమయినప్పుడు ఇలా వచ్చి అలా వెళ్ళిపోతున్నారు. ఈ ఇంట్లో ఎంతమంది వున్నారో? అయినా ఎంత నిశ్శబ్దంగా వుంది?" అనుకుంది శృతి.

    "ఈ యింట్లో అందరూ నా క్షేమం  కోరేవారు శృతీ! ఊరి పూజారి, గుడి పూజారి మాయింటి పూజారి ఈ ఆచార్యులుగారే. ఇహ మా చంద్రమతి.........."

    "ఆవిడెవరు?"

    "ఓహ్ , పేర్లు చెపితే నీకెలా తెలుస్తుంది, కొత్త కదా? చంద్రమతిని ఒక విషాదగాథ ఆవిడ మా యింట్లో వంటావిడ. భలే రుచిగా  వంట చేస్తుంది. ఓహ్ నాకు మనిషి కనపడితే వళ్ళూ పై తెలియదు. నీవు కాఫీ తాగావా?"

    "రాగానే తాగాను."

    "అయినా యిప్పుడేకదా వచ్చావ్, ఇహ రోజూ బోలేడు కబుర్లు చెప్పుకోవచ్చు. స్నానంచేసి కాసేపు విశ్రాంతి తీసుకుంటావేమో!"

    "కొద్దిసేపు ఆగి స్నానం చేస్తాను. విశ్రాంతి అక్కరలేదు." చిరునవ్వుతో అంది శృతి.

    "నాకో వీక్ నెస్ వుంది శృతీ! మాటలకి మొహం వాచినట్టు ఎవరైనా నాదగ్గర కూర్చుంటే చాలా వాళ్ళబదులు కూడా నేనే వాగుతాను."

    "ఇహముందు ఆ శ్రమ మీ.....నీకు లేకుండా నేనే వాగుతుంతాను స్వాతీ!" అంది శృతి.

    "ప్రామిస్?" ఎంతో సంతోషంగా అడిగింది స్వాతి.

    "గాడ్ ప్రామిస్" అంది మనస్ఫూర్తిగా శృతి.


                                                     19

     కాలప్రవాహంలో గిర్రునరెండు నెలలు తిరిగిపోయాయి.

    శృతికి ఇక్కడ బాగానే వుంది. "నా గతాన్ని అడగవద్దు. గతం తాలూకు ఊహలే నాకెంతో వ్యధను కలుగజేస్తున్నాయి" అంటూ స్వాతి నోరు మూయించింది. లేకపోతే మీ అమ్మ  నీ ఎన్నోఏట పోయింది? మీ చిన్నమ్మకి పిల్లలా? అని స్వాతి యక్షప్రశ్నలు వేసే అవకాశం బోలెడు వుంది.

    ఎప్పుడైనా స్వాతిని చూడాలనిపిస్తే రాజా నృసింహ భూపతిరావుగారు తన్నంటిపెట్టి వుండే నౌకరు చంద్రగౌడ్ చే కబురంపుతారు.

    చంద్రగౌడ్ అంటే శృతి ఆ ఇంటికి వచ్చిన రోజు చూపిన జెండా బొంగులా వున్న వికార స్వరూపుడు.

    చంద్రగౌడ్ గురించి స్వాతి చాలానే చెప్పింది. అతను కన్నడ దేశీయుడు. ఓసారి తన తండ్రిని రక్షించబోయి మంటల్లో చిక్కుకున్నాడు. ముఖమంతా వికారంగా కాలిపోయింది. అతనికి నా అన్నవారు లేరు. రాజాగారే చేరదీశారు. రాజాగారి వంటిమీద ఈగనైనా వాలనీయడు. నమ్మిన బంటులా వున్నాడు.

    రాజాగారి నుంచి కబురు రాగానే స్వాతి కోరికపై స్వాతిని వీల్ చైర్  లో కూర్చోండబెట్టుకుని రాజాగారి గదిలోకి శృతికూడా వెళ్ళింది.

    అదే మొదటిసారి రాజాగారిని చూడడం.

    నళినిదేవికి ముప్ఫై ఎనిమిదికి మించి ఏళ్ళులేవు. కాబట్టి రాజాగారికి  యాభై లోపే వయసు వుంటుందని అనుకుంది. శృతి అంచనా పొరపాటయింది, రాజాగారికి అరవై తొమ్మిదేళ్ళు అయితే దృఢకాయుడు కావడంవల్ల అంత వయసు వుందా? అనిదిస్తుంది. వెండితీగల్లాంటి జులపాల జుట్టు, విశాలమైన  నుదురు, పెద్దమీసాలు, తీక్షణమైన చూపులు సహజ గాంభీర్యంతో వున్న భారీమనిషి కావడంతో చూడగానే ఎవరికైనా గౌరవం కలుగుతుంది. ముందుగా పెదవి కదపడానికి ధైర్యం కలుగదు.

 Previous Page Next Page