Previous Page Next Page 
పెట్టితిసిచూడు పేజి 21

    పిల్లలు శలవులకి అమ్మమ్మ, తాతయ్యల వూళ్ళు వెళ్ళారు. మనోరమ భర్త, పంకజం భర్త ఇంగ్లీష్ మూవీస్ వెళ్ళారు వాళ్ళ ఫ్రెండ్స్ పార్టీ చేసి తీసుకెళుతున్నారు. అందుకే వీళ్ళు ఈ ప్లాను వేసుకుంది.

    మనోరమ, పంకజం ఇంటివాళ్ళతో చెప్పి వెళ్ళారు.

    "అమ్మయ్య" అన్నాడు కోదండరామయ్య.

    "మరే" అంది వెంకుమాంబ.

            12


    "రెండున్నర గంటలు" పంకజం అంది.

    "మనకి ఫ్రీ" అన్నది మనోరమ.

    వారిద్దరూ పార్క్ లో కూర్చున్నారు. తమ మాటలు ఎవరయినా వింటే రొంబ కష్టం అని పొదలు, చెట్లు, క్రోటన్స్ గుబుర్లు లేకుండా చూచి ఓ పక్కగా వున్న ఓపెన్ ప్లేస్ లో కూర్చున్నారు.

    "పిన్నిగారు మనతో సినిమాకి వస్తానని బయలుదేరితే చచ్చేవాళ్ళం" ఆ సినిమా మనం నాలుగు రోజులక్రితం చూసిందే" అంది పంకజం.

    "ఎందుకు చచ్చేవాళ్ళం?" మనోరమ అడిగింది.

    "చచ్చు సినిమాని మళ్ళీ చూడలేక"

    "పిచ్చి తల్లీ! పిన్నిగారు సినిమాకి బైలుదేరినట్లయితే యమర్జంటుగా నాకు కడుపులో నొప్పి వచ్చేది."

    "ఎలా వస్తుందేమిటి మరీ చోద్యం."

    "చోద్యమే. కావాలని తెచ్చుకుంటే సరి. పొట్ట మనది, బుర్ర మనది, మనిష్టం."

    మనోరమ యాక్షను చేస్తూ అనేసరికి పంకజం నవ్వకుండా వుండలేకపోయింది.

    "మనం కావాలని కడుపులో నొప్పి తెచ్చుకోనక్కరలేదు. పిన్నిగారురాదని నాకు అర్ధమైంది."

    "పిన్నిగారు, బాబాయిగారు ఊరి నుంచి వచ్చినప్పటినుంచీ అబద్దాలు ఆడుతున్నారు, కంగారు పడుతున్నారు. వింత పనులు చేస్తున్నారు, విచిత్రంగా ప్రవర్తిస్తున్నారు. ఎంత ఆలోచించినా నాకేమీ అర్ధం కావటంలేదు. కాస్త లోతుగా ఆలోచించగల శక్తి నీకే వుంది. అదేమిటో వివరంగా నీవే చెప్పు రమా!" అంది పంకజం.

    "ముందు వరస క్రమంలో చెపుతాను. తర్వాత ఇద్దరం కలసి ఆలోచిద్దాం" అంది మనోరమ.

    అలాగే అంది పంకజం.

    మనోరమ చెప్పటం మొదలు పెట్టింది.

    "మనం బాబాయి గారింట్లోచేరి దాదాపు తొమ్మిదేళ్ళు కావస్తున్నది. నీవు, నేనూ రెండు నెలల వారతో అద్దెకి దిగాము. ఇల్లు మనకి అన్నివిధాలా సౌకర్యంగా వుండటంవల్ల ఖాళీచేసి మరో ఇంటికి మారే ఉద్దేశ్యం మనం చేయలేదు. అదీగాక ప్రభుత్వం వారు డి.ఎ. ముఫ్ఫై రూపాయలు పెంచి మనకి ఉడతా భక్తితో తోడ్పడటం మనం కొనే దినపత్రికలో చదివి తరించిన మన ఇంటాయన- సారీ ఇంటిగల ఆయన-యమర్జంటుగాధరలు మండిపోతున్నాయని చెప్పి ఇంటద్దె యాభై పెంచండి అంటే మనం పెంచి...."

    "చూడండి కవయిత్రిగారూ! ఇప్పుడు ఈ గతమంతా తిరగతోడటం మన కథకి అవసరం అంటారా?" మనోరమ ఉషారుగా చెపుతుంటే పంకజం మధ్యలో అడ్డుతగిలి అంతకన్నా ఉషారుగా అడిగింది.

    "అమ్మమ్మమ ఎంతమాట! మొదటినుంచీ నరుక్కురావటం పద్ధతి. అడుక్కునే వాడికి అరవై ఆరు ఇళ్ళు. అలాగే అద్దెకుండే మారాజులకి కూడా అరవై ఆరు ఇళ్ళు అయినా మనం గబ్బిలాలలాగా ఆ ఇంటి చూరు పట్టుకుని వేళ్ళాడుతున్నామంటే అర్ధం ఏమిటి? మనకి ఇళ్ళు బాగుండటం. ఈ రెండు బాగులతో ఇంటి వాళ్ళము, మనమూ కలసిపోయాము.

    "వాళ్ళ పద్దతులు, గుణగణాలు మనకి, మన పద్దతులు, గుణగణాలు వాళ్ళకి చక్కగా తెలుసు. మనం ఆ ఇంటికి వచ్చినప్పటి నుంచీ చూస్తున్నాము. మధ్య మధ్య పిల్లల దగ్గరకు వెళ్ళి వస్తుంటారు. ఏడాదికి రెండు సార్లు పుణ్యక్షేత్రాలు దర్శించి వస్తుంటారు. యాత్రలుచేసి చూసి రావడం తప్పించి ముచ్చటపడి ఏ వస్తువు కొని తీసుకురారు. ఆఖరికి ప్రసాదం-తిరపతి లడ్డు లాంటిది కూడా ఒక లడ్డు తెచ్చి ప్రసాదం అంటూ ఇంటికోపలుకు పంచి మిగతాది వాళ్ళే తినటం మనకి బాగా తెలుసు.  

 Previous Page Next Page