వసంతకి వేగంగా గుండెలు కొట్ట్టుకున్నాయి. తను ఎప్పుడూ ఆలోచించే సంఘటన ఎదురయినా ఏం చేయ్యాలో , ఏం మాట్లాడాలో తెలియక కారులో ముడుచుకుని కూర్చుంది. ఎన్ని సార్లో అనుకుంది . తనలా బస్ స్టాప్ లో నిల్చుంటే బాస్ లిప్ట్ యిస్తాడని, తను మనోహరంగా చూస్తూ 'థాంక్స్' అంటూ దర్జాగా నడిచి వచ్చి సీటులో కూర్చుని నవ్వుతూ 'థాంక్స్ సార్, ఒక్కరోజయినా బస్సు కోసం వెయిట్ చేసే బాధ తప్పిచారు' అంటుంది. కారులో వేడ్తుంటే అతను తనని ఎన్నో విషయాలు అడుగుతాడు. యీలొగా ఓ పెద్ద హోటలు ముందు కారాపుతాడు. తనని అడగకుండానే 'కమాన్ వసంతా మ్ కాఫీ తాగి వెడదాం అంటూ పిలిచి కాఫీతో పాటు ఏవేవో ఆర్డర్ చేస్తాడు. తింటున్నంత సేపు తనవంకే మింగేసేట్టు చూస్తుంటాడు. తను సిగ్గుతో కళ్ళు వాల్చుకుంటుంది. మరోరోజు సినీమాకి టిక్కెట్లు బుక్ చేశాను రమ్మంటాడు. యింకోరోజు పుట్టిన రోజుకి పెద్ద పార్టీ యిస్తూ, ఆఫీసులో తనోకర్తినే పిలుస్తాడు. యిలా రకరకాలుగా ఊహించిన తను ఆ పరిస్థితి నిజంగా వచ్చేసరికి ఎందుకు తడబడుతుంది. ఛా....ఛా....ఎప్పుడూ కారెక్కని బైతులా అలా కూర్చుందేమిటి దర్జాగా విండో మీద చెయ్యి పెట్టి కూర్చోవాలి.....
"హలో.....ఏమిటలా కూర్చున్నారు.....మాట్లాడండి. యిది ఆఫీసు కాదు, బాస్ లా ట్రీట్ చెయ్యడానికి" చనువుగా అన్నాడు.
ఎంత మంచివాడు! బాస్ లాంటి అందగాడు , ధనవంతుడు , తన లాంటి మామూలు స్టెనో తోటి కూడా అంత మర్యాదగా, అభిమానంగా మాట్లాడుతున్నాడంటే తనంటే యిష్టం అన్నమాటే గదా! తను అతన్ని ఆకర్షించి వుండాలి. యిలాగే ఆరంభించిన పరిచయం కొన్నాళ్ళకి ప్రేమగా మారుతుంది. ఎన్ని పుస్తకాలలో , ఎన్ని సినిమాలలో జరిగిందో యిలాగా....తను మరీ ముడుచుకు పోకుండా ధైర్యంగా, చొరవ చేయ్యాలంతే ! ఏం మాట్లాడాలి, ఛా.....సమయానికి ఒకటీ గుర్తురాదేం ఖర్మ....ఉత్తినే కూచుని కలలు కంటుంది కాని సమయానికి ఏం చెయ్యాలో తోచదు గదా.....వసంత దైర్యం తెచ్చుకుని అతని వంక చూసి నవ్వింది.
"గుడ్ , అలా వుండాలి . ముడుచుకు పోయే ఆడవాళ్ళంటే నాకు చిరాకు, ఫ్రీగా చలాకీగా వుండాలి. మీరందుకే నాకు నచ్చారు" అన్నాడు.
వసంత గుండెలు ఒక్క క్షణం ఆ కాంప్లిమెంట్ కి కొట్టుకోడం మానేసింది. అతనికి నచ్చిందని చెప్పాడు. ఆ చెప్పడం ఎంత నాజూగ్గా చెప్పాడు. "థాంక్స్ సార్ మీరింత మంచివారని...యింత...యింత"
"ఏమిటింత ...ఇంత....ఎంత చెప్పండి...." నవ్వాడు.
వసంత ముసిముసి నవ్వులు నవ్వింది.
"వసంత గారూ ....ఏమిటి మీలో మీరే నవ్వేసుకుంటున్నారు. బస్సు వస్తుంది పదండి" చుట్టూ ప్రపంచాన్ని మర్చిపోయి తనలో తాను నవ్వుకుంటున్న వసంతని విచిత్రంగా చూస్తూ బస్సు వస్తుంటే పిలిచాడు మూర్తి.
వసంత ఉలిక్కిపడింది. ఎదురుగా మూర్తి . మొహం చిట్లించింది. యిదీ ఊహేనా! చక్కటి ఊహ చిత్రాన్ని భగ్నం చేసిన మూర్తి మీద కోపం ముంచుకు వచ్చింది. ఛీ.... యీ జోడ్డు మొహంగాడొకడు. ఎప్పుడూ వెనకాలే వుంటాడు. ఖర్మకాలి వాడిల్లూ తమ వీధిలోనే వుండాలా... ఛా.... ఈ బస్సుల కోసం వెయిట్ చేసి చేసి విసుగు పుడ్తుంది. కార్లలో ఝాం మని పోయేవాళ్ళు కాస్త లిప్ట్ ఇస్తే ఎంత బాగుంటుంది. అంత పెద్ద కారులో బాస్ ఒక్కడూ వెళ్ళకపోతే తమని కాస్త ఎక్కించుకుంటే ఏం పోతుంది. పరిచయం పెరిగాకే లిప్ట్ యిస్తాడు....ఏది యింకా తను కొత్తగా జాయిన్ అయింది కదా, ముందు నించే చనువు ఎలా చూపిస్తాడూ. తనని తాను నమ్మించుకుంటూ బస్సు ఎక్కింది వసంత.
"ఏమిటండీ.....ఆ జోకు , మీలో మీరే నవ్వుకోకపోతే నాకూ చెప్పకూడదా" మూర్తి చనువుగా అడిగాడు.
జోకుట! జోకు! వీడి పిండాకూడు ....మొహం అప్రసన్నంగా పెట్టి "ఆ ...ఏదో గుర్తుకొచ్చి : అంటూ మాట తుంచేసింది.
పాపం మూర్తి చిన్న పుచ్చుకున్నాడు. తనెంత చేరువవుదామంటే ఆమె అంత దూరం అవుతుంది. వసంత తనతో పరిచయానికి ఏమాత్రం ప్రోత్సాహం యివ్వడం లేదన్నది మూర్తికి మూడునెలలు గా అర్ధం ఆవుతుంది. అప్పుడప్పుడు వసంత మొహంలో కనిపించే అహంకారం, తృణీకారం చూసి ఏమిటీ అమ్మాయి పొగరు, ఏం చూసుకుని అంత గర్వం అనుకుని, ఛా....వెర్రి వెధవలా తనంటే లెక్కలేని ఆవిడ వెంటబడడం ఏమిటి అని తనని తాను మందలించుకునేవాడు. కాని అతడికి తెలియకుండానే వసంత కంటబడే సరికి అతని నిర్ణయం, పట్టుదల సడలిపోయేది. వసంత కోసం యింటి కెడితే ఆమె స్నేహం దొరకలేదు గాని మిగతా అందరూ చక్కగా మాట్లాడుతారు. అంటిముట్టనట్టుగా మాట్లాడే వసంతని చూసి అది ఆ అమ్మాయి స్వభావం ఏమో అనుకోడానికి మిగతావాళ్ళతో ఆఫీసులో చక్కగా మాట్లాడుతుంది. ఆ ఫతిమా , వసంత యిద్దరూ ఆఫీసంతా సీతాకోక చిలుకల్లా తిరుగుతూ, చిలక పిట్టల్లా వాగుతుంటారే..... తను అనవసరంగా ఆమె మీద లేనిపోని ఆశలు పెట్టుకున్నాడేమో..... ఓ సారి అడిగేస్తే ....అడిగేసి తెల్చేసుకుంటే ....ఏమని అడగాలి? అడిగే ధైర్యం లేక, ఏమడగాలో తెలియక, అడిగే అవకాశమూ దొరక్క మూర్తి తటపటాయించాడు. తనది వన్ సైడ్ అని రోజులు గడిచే కొద్ది అతనికే అర్ధమయినా ఏదో ఆశ యింకా అతన్ని వీడలేదు.
ఇల్లు సమీపిస్తుండగా ధైర్యం కూడ దీసుకుని "వసంతగారూ ఓ చిన్నమాట. మీతో ఒక్క విషయం మాట్లాడాలి. ....రేపు ఆదివారం అలా పబ్లిక్ గార్డెన్స్ వైపు రాగలరా.....' తడబడ్తూ మెల్లిగా అన్నాడు.
వసంత చిరుగ్గా అతని వంక చూసింది. "ఆ చిన్నమాట ఏదో చెప్పడానికి పబ్లిక్ గార్డెన్స్ దాకా ఎందుకు , యింటికి చేరడానికి ఐదు నిమిషాలు పడ్తుతుంది, నడుస్తూ మాట్లాడవచ్చుగా' అంది అతన్ని సూటిగా చూస్తూ. అతని మొహకవళికలు చూసి అతను అడగబోయేది ఏమిటో ఊహించింది వసంత. మూడునెలలుగా తన వెంటబడడం, తనని ప్రసన్నం చేసుకోడానికి అతను పడే తాపత్రయం అన్ని తెలిసీ కావాలని అతన్ని చిన్నచూపు చూస్తూ, నిర్లక్ష్యంగా మాట్లాడితే అతనే తప్పుకుంటాడని అనుకుంది. ఒకోసారి ఒక మగవాడిని తన వెంట అలా తిప్పుకుంటూన్నందుకు గర్వంగా అనిపించేది. ఈరోజు అతను అడిగేదేమిటో అర్ధం అయి కావాలని ఏడిపించడానికి అలా అంది.
మూర్తి పాపం మొహం మాడ్చుకుని "ఇక్కడ చెప్పేమాట కాదులెండి. పోనీ మీకు వీలుకాకపోతే " అన్నాడు.
'చెప్పండి ఫరవాలేదు. అంత రహస్యమా?" వేళాకోళంగా అంది.
మూర్తి మొహం మరింత చిన్నపోయింది ఆమె ధోరణికి. చిన్న పోయిన అతని మొహం చూస్తె వసంతకి మరింత చుల్కనభావం వచ్చింది. ఏదో అని అతన్ని మరింత తనవంక చూడకుండా చెయ్యడానికి తరుణం అని ఆలోచించింది. లేకపోతే , పీడ, రోజూ బోరు కొట్టించి చంపుతున్నాడు. ఈ జిడ్డు మొహం గాడు పబ్లిక్ గార్డెన్ కి పిలిచి ప్రేమిస్తున్నాడని చెప్తాడు కాబోలు, ఎంత ధైర్యం! అంత చవకగా కనిపిస్తుందా తను. ఏమనుకుంటున్నాడో తన గురించి, వీడి అందాన్ని, బోడి గుమాస్తా ఉద్యోగం చూసి వరించి పెళ్ళాడేస్తుందని ఆశ కాబోలు! యిలాంటివి మొగ్గలోనే తుంచేయాలి.
"ఏమిటండీ మీరు మాట్లాడాల్సిన అంత పెద్ద సంగతి. ఓ ఆడపిల్లని పబ్లిక్ గార్డెన్ కి పిలిచి మాట్లాడతారా. మీరు పిలవగానే ఓ అయినింటి ఆడపిల్ల పరిగెత్తుకు వస్తుందనుకుంటున్నారు. అంత మంచి మర్యాద లేని వాళ్ళం గాదు మేం. మీ చెల్లెల్ని ఎవడన్నా పిలిస్తే అలా పంపిస్తారా పబ్లిక్ గార్డెన్స్ కి పరాయి మగాడి వెంట. ఏమనుకుంటున్నారో మీ మగవాళ్ళు ఆడపిల్లల గురించి. మీరే మర్యాదస్తులయితే , మీకే సంస్కారం వుంటే నాతో మాట్లాడవలసినది వుంటే యింటికి వచ్చి మాట్లాడేవారు...." వసంత గట్టిగా దబాయిస్తున్నట్టు దులపడం మొదలుపెట్టింది.
మూర్తి మొహం నల్లబడిపోయింది. ఆమె హటాత్తుగా అలా కయ్యానికి కాలు దువ్వేసరికి తెల్లపోతూ, తడబడ్తూ వణికిపోయాడు. "తన ఉద్దేశం అది కాదని చెప్పాలనుకున్నా నోరు పెగలలేదు." బిత్తర పోయాడు. 'అదికాదు , అది కాదు .....వసంత గారు....' ఆఖరి కెలాగో అనగలిగాడు.