Previous Page Next Page 
తల్లి మనసు కధలు పేజి 21


    "నువ్వు అందమైన దానివి, తెలివైన దానివి అన్న సంగతి తప్పించి నీ గురించి గాని, నీ పుట్టు పూర్వోత్తరాలను గురించి గాని, నాకేం తెలియదు. తెలుసుకోవాలని ప్రయత్నమూ చెయ్యలేదు. అయినా నీలో నమ్మకం వుంచి , నీ ప్రవర్తన మీది విశ్వాసంతో నిన్ను పెళ్ళాడాను. నీ ఎడ నీకింత ఎలాంటి భావమున్నా లేకపోయినా, కేవలం మానవ ధర్మంగా , నేనుంచిన నమ్మకానికి, విశ్వాసానికి బదులివ్వాలి నువ్వు, అవునంటావా?"
    అతి సున్నితంగా, మెత్తగా మొదలైన ఈ సంభాషణ ఎక్కడికి దారి తీస్తుందో అన్న భయంతో వణికింది శ్యామల.
    "ఉష ఎవరు ?"
    శ్యామల మాట్లాడలేక పోయింది.
    'ఇప్పుడింక మాటలు మ్రింగి ప్రయోజనం లేదు. రహస్యం దాచి ప్రయోజనం లేదు. నేనేదో ఒక నిర్ణయానికి వచ్చేలోపల నువ్వు చెప్పదలచుకున్న దేదో చెప్పడం మంచిది. ఆ తరువాత విచారించినా ప్రయోజనం ఉండదు."
    శ్యామల కళ్ళలో నీళ్ళు తిరుగుతున్నాయి. తల వంచుకుంది.
    "ఉష ఎవరో నీకు తెలుసన్న సంగతి తెలుస్తూనే ఉంది. మధ్యాహ్నం జరిగింది చూశాక, విన్నాక ఏ మాత్రం బుద్ది ఉన్నవాడి కన్నా ఇంచుమించు కధ అర్ధం అవుతుంది. ఇంక ఇప్పుడు నేను వినగోరేది అది ఎవరికి పుట్టిందని?"
    శ్యామల ఒక్కసారి తలెత్తి చురుకుగా చూసింది. కళ్ళు నీటిపోరలతో మెరిశాయి.
    "మీరు ఊహించినది సరిగాడు. పోరాపాటు పడుతున్నారు."
    'పొరపాటు ఇప్పుడు పడడమేం? నిన్ను పెళ్ళాడి నప్పుడే పొరపడ్డాను. ముఖాన్ని మాటలను చూసి మోసపోయాను. నీ అందం లాగే  నీ మనసు నీ గతం నిర్మల మైనవని అనుకోవడం పొరపాటు గదూ? మట్టిలో అణిగిపోయిన వజ్రానివే అనుకున్నాను గాని, నిజరూపం బొగ్గని మరిచి పోవడం పొరపాటు గదూ? కానీలే, అయిపోయిన దానికి బాధపడే మనిషిని గాను నేను .'
    పరిస్థితి క్రమంగా మారుతుంది. రంగారావు గొంతు, కఠినం , తీవ్రం అవుతుంది.
    "మీరు నన్ను అర్ధం చేసుకోండి. ఇందులో నన్ను శంకించకుండానికి ఏం లేదు. నే పాపం ఎరగను . నా మాట నమ్మండి."
    "ఉష ఎవరు ? రోడ్లంట తిరిగే ఆ రౌడీ కూతురేనా? ఈ రహస్యం దాచడానికి ఇంతవరకు ఎంత డబ్బు తగలేశావు?"
    'ఉష ఎవరో చెప్పలేను. దయచేసి ఆ సంగతి అడక్కండి చెప్పలేను. మీ నుంచి దాచాలని కాదు. కాని చెప్పగల శక్తి నాకు లేదు. నిజం చెపుతున్నాను. ఉషకి వాస్తవంగా తల్లి తండ్రి లేరు. అతడెవరో నా కసలు తెలియదు, ఉష మనింటికి వచ్చిందాకా !"
    "వాడెవడో తెలియకుండానే రెండుసార్లు డబ్బిచ్చావన్న మాట. శ్యామలా! ఇంకా ఎందుకు నన్ను నమ్మించ చూస్తావు ? ఎందుకు నన్నింకా వంచించ చూస్తావు?"
    "దయచేసి నన్నర్ధం చేసుకోండి. తొందరపడకండి. దైవసాక్షిగా చెబుతున్నాను. అతనికి నాకు ఏ సంబంధం లేదు."
    'అయితే ఉష ఎవరో చెప్పు?"
    శ్యామల మౌనంగా తల దించుకుంది.
    "సరే?"
    ఇంక మాట్లాడవలసింది ఏం లేదన్నట్టు రంగారావు లైటార్పి మంచం మీద పడుకున్నారు.
    మరునాడు శ్యామల లేచేసరికి ఆయన లేవలేదు.
    ఓ గంట పోయాక మళ్ళీ వచ్చేసరికి, బట్టలు వేసుకుని ప్రయాణానికి సిద్దం అవుతున్నారు. మంచం మీద బెడ్డింగు, ఎటాచి తయారుగా వున్నాయి.
    శ్యామల మనసు పరిపరి విధాల పోయింది. ఆవేదన, ఆరాటం, గుండెల్లో అలజడి రేకెత్తి స్తుంటే బెరుగ్గా, బాధగా అడిగింది.
    "ఇంత అకస్మాత్తుగా ఎక్కడికి ప్రయాణం ?"    
    రంగారావు మాట్లాడలేదు. అయన చూపుల్లో నిశ్చలత, ఒక విధమైన స్థిరత్వం చూసి శ్యామలకు సగం అర్ధం అయింది.
    "శ్యామలా!"
    రంగారావు గొంతు దృడంగా వినపడింది.
    "నిన్న ఈ సంఘటన జరిగినప్పటి నుంచి నేను ఒక్కటే విషయం ఆలోచిస్తున్నాను. ఈ అవమానానికి పరిష్కారం ఏమిటని. ఇది నా ఒక్కడికే కాదు, మొత్తం ఈ వంశానికే ఘోరావమానం. ఇంత జరిగాక మనిద్దరి మధ్య ఇంక పాత భావాలకు చోటు వుండదు. అలా అని నిన్ను బయటికి పంపి నా పరువు ప్రతిష్టలకు భంగం కలిగించుకోలేను. ఈనిజం బయట పడ్డాక ఇంకొకరెవరన్నా అయితే ఏం చేసి ఉండేవారో! అయినా నిన్నింత అభిమానించిన ఈ చేతులతో అంతపని చేయాలేక పోయాను. ఆ అశక్తత నాది. కాని, రాత్రంతా ఆలోచించాక, నా కంత కన్న వేరే దారి ఏది కనపడలేదు. మనిద్దర్లో ఎవరో ఒకరే మిగిలి ఉండటం మంచిదని నిర్ణయించాను. నేను తిరిగి వచ్చేసరికి ఈ ఇంట్లో ఇదివరకటి శ్మశాన శాంతి కనపడాలి. రెండు రోజుల్లోగా నాకు టెలిగ్రాం అందకపోతే నువ్వు మొండి కేత్తితే సరే నువ్వింక నన్ను చూడలేవు....'
    అంటూనే వెనక్కి తిరిగి గబగబా అడుగులు వేస్తున్న రంగారావు మాటలను భిన్నురాలై వింటున్న శ్యామల అదిరిపడి అతని కాళ్ళకు అడ్డు పడింది.
    "నేను నిజం చెబుతాను, ఒక్క క్షణం వినండి. ఇంత కఠిన శిక్ష విధించ వలసినంత ఘోర పాపం నేనేం చెయ్యలేదు. నన్ను చెప్పనివ్వండి. తొందరపడకండి."
    గాభరాగా ప్రాధేయపడింది.
    "ఆ అవకాశం నిన్నరాత్రి నీ కిచ్చాను. ఇప్పుడింక నీ కట్టుకధలు వినడానికి నాకు ఓపిక లేదు.
    ఆమెని తప్పించుకొని వెళ్లి కారులో కూర్చున్నారు రంగారావు. వెంటపడ్డ శ్యామల ముఖాన ఇంత దుమ్ము కొట్టి పరుగెత్తింది కారు.

                                               *    *    *    *

 Previous Page Next Page