నీ చేతిలో విద్య
ఆ రోజు ఎనిమిదో రోజు ప్రకాశం ఇంట్లోంచి వెళ్ళిపోయి మొదటి రోజు రాత్రి ఇంటికి ఎంతకీ రాని మొగుణ్ణి తిట్టుకుంటూ పడుకుంది శారద. ఎవరితో కూర్చుని తాగుతున్నాడో, పెకాడుతున్నాడో అంటూ ఇల్లు పట్టని మొగుణ్ణి తిట్టుకుంది. మర్నాడు ఉదయానికి రాకపోతే ఏ స్నేహితుడింట్లోనో పడుకుని అట్నించి అటు ఆఫీసుకి పోయడేమోనని సరిపెట్టుకుంది. ఆ రాత్రీ ఇల్లు చేరకపోయేసరికి గాబరా పడింది.
పిల్లల్ని తెలిసున్న ఇళ్ళకి పంపింది. అతని స్నేహితులన్న వాళ్ళందరికీ ఫోన్లు చేసింది. నిన్న అతను వాళ్ళెవరి ఇళ్ళకీ వెళ్ళలేదన్నది విని గాభరాపడిపోయింది. ఊళ్ళో ఉన్న తమ్ముణ్ణి పిలిపించింది. ఇరుగు పొరుగు చేరారు. చర్చలు జరిపారు. నాలుగైదు ఆస్పత్రులకి యాక్సిడెంట్ కేసుల గురించి వాకబు చేశారు. అనుమానం వచ్చిన చోట వెళ్ళి చూసి, కాదని తెల్చుకున్నారు. రేపు ఆఫీసుకి వెళ్ళి వాకబు చేస్తానన్నాడు తమ్ముడు. పోలీస్ కంప్లయింట్ ఇమ్మన్నారు కొందరు. రేపు ఆఫీసులో అడిగి ఏదన్నా పని మీద ఎక్కడికన్నా పంపారేమో తెల్చుకున్నాక పోలీస్ కంప్లయింట్ ఇవ్వాలని నిర్ణయించారు.
మర్నాడు ఆఫీసు వాళ్ళు చెప్పింది విని నిర్ఘాంతపోయాడు తమ్ముడు. జాబ్ కి వారం కిందటే రిజైన్ ఇచ్చేసి, అతనికి ఆఫీసు నించి రావాల్సిన మొత్తాలని వసూలు చేసుకున్నాడుట. ఫారిన్ లో మంచి ఆఫర్ వచ్చింది వెళతానని చెప్పాడుట. ఫ్యామిలికి ఈ విషయం తెలియదని విని వాళ్ళూ ఆశ్చర్యపోయారు. ఏ దేశం? ఏ ఉద్యోగం అన్న వివరాలు తమకీ తెలియవన్నారు.
కబురు విని శారద మ్రాన్పడిపోయింది. మాట మాత్రమైనా చెప్పకుండా ఇలా హటాత్తుగా మాయమవడం ఎందుకు అన్నది ఎవరికీ అంతుబట్టలేదు. విదేశాలకి ఉద్యోగానికి వెళితే ఇంట్లో చెప్పకుండా వెళ్ళడం ఏమిటి? మళ్ళీ వస్తాడా? రాడా? భార్యాపిల్లల్ని ఇలా హటాత్తుగా వదిలేసి వెళ్ళడం ఎందుకు ఉద్యోగానికైతే? ఎన్ని రకాలుగా అంతా ఆలోచించినా ప్రకాశం చర్య ఎవరికీ అర్ధం కాలేదు . ఆఖరికి పోలీస్ రిపోర్టు ఇవ్వాలని నిర్ణయించారు.
'అతనంతటతను వెళితే ఏం చెయ్యగలం? ఎక్కడున్నాడని వెతుకుతాం? మిస్సింగ్ పర్సన్ కింద కేసు రాయండి. వీలైనంతవరకు ప్రయత్నిస్తాం' అన్నారు. గత వారం లోగా విదేశాలకి వెళ్ళిన వారి పేర్లు పరిశీలించారు. అందులో ప్రకాశం పేరు లేదు. మారు పేరుతొ వెళ్లాడా? వెళితే ఏ పేరు మీద వెళ్ళాడు? అసలింతకీ ఇలా ఇంట్లో చెప్పా పెట్టకుండా ఎక్కడికెళ్ళినట్టు?
పెద్దన్నగారింట్లో ఉన్న తల్లికి కబురేళ్ళీ ఆవిడ వచ్చింది. శారద రాగాలు ఆరంభించింది. ఎవరూ ఏం చెయ్యలేరన్నది అందరికీ అర్ధం అయింది.
ఇదంతా జరిగిన ఎనిమిదో రోజుకి ప్రకాశం నుంచి ఓ ఉత్తరం వచ్చింది. అందులో ముచ్చటగా మూడే వాక్యాలు. తన కోసం వెతకవద్దనీ, తాను ఏ దేశం, ఎక్కడికి వెళుతూన్నదీ ఎవరికీ చెప్పదలచలేదనీ , ఇంక తాను తిరిగి రాకపోవచ్చనీ , భార్యాపిల్లలకి ఆ ఇల్లు మాత్రమే తానివ్వగలిగిందని,ఇకపై వారి బాధ్యత తనది కాదనీ రాశాడు. ఎక్కడి నుంచి రాశాడో చిరునామా లేదు. బహుశా వెళ్ళే ముందు రాసి పడేసి ఉండవచ్చని ఊహించారు.
శారద ఆ ఉత్తరం చూసి ఘోల్లుమంది.
"ఇదేం విడ్డూరం కట్టుకున్న పెళ్ళాం పిల్లల్ని నట్టేట్లో వదిలి మీ కర్మ అంటూ తన దారి తాను చూసుకుంటాడా! పెళ్ళాడి పదేళ్ళు కాపురం చేసి ఇప్పుడు బాధ్యత నాది కారు అంటాడా!" తమ్ముడు ఎగిరాడు. తల్లి అల్లుణ్ణి శాపనార్ధాలు పెట్టింది.
"ఇదేం బొమ్మల పెళ్ళా/ ఊరుకుంటాం ఆనుకున్నాడా?' తమ్ముడు ఆవేశంగా అరిచినా ఎవరేం చెప్పగలరు? ఎక్కడికి వెళ్ళాడో , ఈ ప్రపంచంలో ఏ దేశంలో ఉన్నాడో తెలియకుండా ఏం వెదుకుతారు? ఏం బుద్ది చెపుతారు?
'ఇంకేవర్తితో మరిగినట్లున్నాడు. మళ్ళీ రానని చెప్తున్నాడంటే ఇంకేవర్తినో పెళ్ళాడి వెళ్తుంటాడు. లేకపోతే దొంగచాటుగా వెళ్ళాల్సిన అవసరం ఏమిటి? ఇక్కడుంటే భార్య ఉండగా ఇంకో పెళ్ళి నేరం అని చెప్పా పెట్టకుండా మారుపేరు పెట్టుకుని ఎవరినో పెళ్ళాంగా చూపించి తీసుకుపోయాడు.' దూరపు వరస పెదతండ్రి అన్నాడు.
"ఏడాది నుంచి అయన నాతొ సరిగా లేరమ్మా. అయన విసుగులు, కోపాలు , కనరడాలు, తిట్టడాలు రోజురోజుకీ ఎక్కువయ్యాయి. ఏమిటో అనుకున్నాను. అయన ఎవరితోనో సంబంధం పెట్టుకున్నారని ఊహించలేక'పోయాను. ఈ ఏడాదిలో నా ఒంటి మీద చెయ్యి కూడా వెయ్యలేదు. ముందు నుంచి నేనంటే అయానకి గిట్టదు. పల్లెటూరి మొద్దుననీ. చదువులేనిదాన్ననీ ఆయనకి లోకువ. ఇప్పుడింకా కాస్త ఎక్కువైందనుకున్నాను గానీ ఇలా నట్టేట ముంచుతారని అనుకోలేదు" శారద కళ్ళు తుడుచుకుంటూ అంది.
ఇప్పుడామెకి దుఖం స్థానే అవమానం, కసి చోటు చేసుకున్నాయి. ఆ దగా, మోసం సహించలేక ఉక్రోషం పెల్లుబికింది.
"ఈయన గారు నా అందం పెళ్ళి చూపులప్పుడు చూడలేదు గాబోలు . నాకే డిగ్రీలు లేవని, మెట్రిక్ ఫెయిలయ్యనని అప్పుడు తెలీదు గాబోలు. మాటకి ముందు 'అందరాడవాళ్ళూ చక్కగా చదువుకుని ఉద్యోగాలు చేస్తూ భర్తలకి సాయపడ్తా" రని చిన్నబుచ్చడం, హేళన చెయ్యడం , "మెట్రిక్ పరీక్షలకి కట్టి తగలడు' అని ఎత్తిపొడుపులు . ఓసారి కోపం వచ్చి పెళ్ళికి ముందు చూసి, నచ్చి చేసుకున్నారు, నచ్చకపోతే ఎవరు చేసుకోమన్నారు' అని తిరగబడ్డానని చేయి చేసుకున్నారు."
"ఇదంతా ఇప్పుడా చెప్పడం? నీతో తిన్నగా లేడని అమ్మతో అయినా చెప్పావా?" తమ్ముడు ఎగిరాడు.
'చెబితే ఏం చేసేవారెమిట్రా. 'సర్దుకోవాలమ్మా, మంచిగా మొగుణ్ణి మార్చుకోవాలమ్మా' అని నీతులు చెప్పేవారు. అమ్మే మీ ఇంట్లో పడి ఉంది. నన్నూ, పిల్లల్ని మీరేమన్నా అదుకునేవారా? ఇద్దరు పిల్లల తల్లిని కాపురం వదులుకుని ఎక్కడికి పోతానని అన్నీ సహించి పడున్నాను. నాతొ గతిలేక' ఉక్రోషంగా అంది శారద.
అంతా మౌనం వహించారు. ఆ మాట నిజమే తండ్రి లేడు . తల్లి అన్నాదమ్ములిద్దరి దగ్గరా ఉంటోంది. శారదని ఎవరు ఆడుకుంటారు? శారద పిల్లల గతి ఏమిటన్నది ఎవరికీ అర్ధం కాలేదు. ఉండడానికి ఇల్లంటూ ఉంది గుడ్డిలో మెల్లగా, కానీ, వీళ్ళు ఎలా బతకాలి? ఉద్యోగం చేసుకు బతికే చదువు లేదు. అన్నదమ్ములు ఎన్నాళ్ళు అడుకోగలరు?
ఊళ్ళో ఉన్న నేరానికి బాధ్యత తన నెత్తిన ఎక్కడ పడ్తుందోనాన్నట్టు "అన్నయ్యని పిల్చి మాట్లాడు, మళ్ళీ వస్తా" అంటూ జేబులోంచి అయిదు వందలు తీసి తల్లి చేతిలో పెట్టి జారుకున్నాడు తమ్ముడు.
'అన్నయ్యతో మాట్లాడి మళ్ళీ వస్తానే ' అంటూ తల్లి తానో నాలుగొందలు కూతురి చేతిలో పెట్టి వెళ్ళింది.
చేతిలో తొమ్మిది వందల రూపాయలతో, ఇద్దరు చిన్న పిల్లలతో వంటరిగా నడిసముద్రంలో తుఫానులో చిక్కుకున్న నావలా నిలబడింది ఆనాడు శారద.
* * * *
ఎదుటి ప్లాట్ లో ఉండే సునంద కనుక ఆనాడు తనకి ఆ సలహా ఇచ్చి ఉండకపోతే తన గతేమయ్యేది అని రోజుకి ఒసారన్నా అనుకుంటుంది శారద ఈనాటికీ, నాలుగేళ్ళు గడిచినా.