Previous Page Next Page 
డా || వాసిరెడ్డి సీతాదేవి రచనలు - 4 పేజి 22


    "చంద్రం"....! కృష్ణారావు ఏదో అడగాలని ఆగిపోయాడు.

 

    "ఊఁ" అన్నాడు చంద్రం, ఎలాంటి ఉత్సాహాన్నీ చూపించకుండానే.

 

    "పెళ్ళి చేసుకున్నావా?" కృష్ణారావు తను అన్న మాటలు అతనినే వెక్కిరించినట్లనిపించింది. తనేం ప్రశ్నవేశాడు? చంద్రం పెళ్ళి చెయ్యవలసిన బాధ్యత వున్న తనే ఈనాడు ఈ ప్రశ్న వేయవలసి వచ్చింది. ఈ పరిస్థితికి కారణం కూడా తనే. ఎంత హాస్యాస్పదం!

 

    "నాకు పెళ్ళా! పిల్ల నెవరిస్తారు,! చూసిచూసి ఒక దొంగకు?" అన్నాడు చంద్రం చురుకుగా.

 

    మళ్ళీ ఇద్దరిమధ్యా మౌనం.

 

    కృష్ణారావుకు తమ్ముణ్ణి గురించి ఎన్ని విషయాలో తెలుసుకోవాలని వుంది. కాని చంద్రం తన ప్రశ్నలకు దేనికీ సరయిన సమాధానం ఇవ్వటంలేదు.

 

    శరీరం కాలినప్పుడు మూడు రకాలుగా బాధ కలుగుతుంది. ఒకటి - ఆ కాలిన భాగంలో కలిగే బాధ. రెండు - దానివల్ల శరీరం అంతటా కలిగే బాధ. మూడు - గాయం మానుతుంది. కాని మచ్చ మిగిలిపోతుంది. ఆ మచ్చ చూచినప్పుడల్లా దాని తాలూకు పరిస్థితుల జ్ఞాపకంవల్ల కలిగే బాధ. అలాగే చంద్రం ఆనాడు పొందిన అవమానం, బాధను మళ్ళీ మళ్ళీ అన్నగారి ప్రతి ప్రశ్నా జ్ఞాపకం చేస్తున్నది. అందువల్లనే అన్నకు సరైన జవాబులు ఇవ్వలేకపోతున్నాడు.

 

                                                                                          12

 

    ప్రొద్దు వాటాలింది. పక్షులు గూళ్ళకు చేరుకుంటున్నాయి. పశువుల వెనక నడుస్తూ పాలవాళ్ళు రోడ్లమీద అక్కడక్కడ కనిపిస్తున్నారు.

 

    రింగు రోడ్డులోని కృష్ణారావు రెండంతస్తుల భవనం గేటు తెరిచి వుంది. ఎదురుగా వరండా గడపల మీద రజని రెండు అరచేతుల్లో గడ్డం ఆన్చి మోకాళ్ళమీద మోచేతులు పెట్టుకొని కూర్చొని వుంది. ఆ బాలిక చక్రాల్లాంటి గుండ్రని పెద్ద పెద్ద కళ్ళు తదేకంగా గేటువైపే చూస్తున్నాయి. ఆమె ముఖంమీద నీరెండ పడుతున్నది. ఆకుల మధ్య నుంచి సగం సగంగా కనిపిస్తున్న ముద్దమందార మొగ్గలా ఆమె ముఖం రెండు చెంపల్ని కప్పిన అరచేతుల మధ్యనుంచి కనిపిస్తున్నది.

 

    "ఎందుకే ఆ ఎండలో అలా కూర్చున్నావ్? ఇంతవరకూ వచ్చినవాడు ఇంటికిరాక ఎక్కడకు పోతాడులే! రా లోపలకు" అంటూ కేక పెట్టింది కాంతమ్మ. తల్లికేక వినిపించుకోనట్లే కూర్చుంది రజని.

 

    నల్లరంగు కొత్తమోడల్ ఫియట్ లోపలకువచ్చి ఆగింది. రజని కారుదగ్గరకు పరుగెత్తింది.  

 

    "చూశావా చంద్రం! రజని నీ కోసం ఎదురుచూస్తూ గేట్లోనే కూర్చుని వుంది" అన్నాడు కృష్ణారావు కారుడోర్ తెరుస్తూ.

 

    చంద్రం కారుదిగుతూనే రజనిని అమాంతంగా రెండు చేతులతో గుండెలపైకి ఎత్తుకున్నాడు.

 

    "ఎంత పెద్దదానివయావు రజనీ!" అన్నాడు ఆనందంతో ఉక్కిరిబిక్కిరవుతూ.

 

    "మరి! ఇంకా అలాగే మూడేళ్ళ పసిపాపలాగే ఉందనుకున్నావా?" అన్నాడు కృష్ణారావు ఆనందం ఉబికివస్తున్న స్వరంతో.

 

    రజని సిగ్గుపడిపోయింది తండ్రి మాటలకు. వరండాలోకి వస్తున్న వదినను చూచి రజని నొసటిమీద ముద్దు పెట్టుకొని దించేశాడు చంద్రం.

 

    "బాగున్నావా వదినా?" వదినను పలకరించాడు చంద్రం నవ్వుముఖంతో.

 

    "రా చంద్రం! ఎంత పెద్దవాడి వయావు? ఇంతకాలానికి మేము గుర్తొచ్చామా?" అంటూ ఎంతో ఆప్యాయత చూపిస్తూ ఆహ్వానించింది కాంతమ్మ.

 

    అంతవరకూ తన భార్య చంద్రంపట్ల ఎలా ప్రవర్తిస్తుందోనని భయపడుతూ వచ్చిన కృష్ణారావుకు తలమీదనుంచి పెద్దభారం దించినట్లయింది. ఆమె చూపుతున్న ఆదరణంతా నటన మాత్రమేనని తెలుసు కృష్ణారావుకు. కనీసం అలా నటించింది, అంతేచాలునని తృప్తిగా నిట్టూర్చాడు కృష్ణారావు.  

 

    కుశల ప్రశ్నలు పూర్తి అయాయి. కాంతమ్మ రెండు వెండిగ్లాసుల్లో కాఫీ తెచ్చి అన్నా తమ్ముళ్ళకు అందించింది. సరాసరి ఇంటికి రాకుండా ఎక్కడో దిగినందుకు చంద్రాన్ని ఎత్తిపొడిచింది. చంద్రం ఇంతకాలానికి తన ఇంటిలో తనవారిమధ్య కూర్చుని వున్నాడు. వదిన ఆప్యాయతను చూసిన చంద్రం హృదయంలో దాగివున్న ఆ కాస్తకోపం కూడా కర్పూరంలా కరిగిపోయింది. అతని మనస్సు నిండు సంతృప్తితో తొణికిసలాడుతున్నది.   

 

    గుళ్ళో దేవుణ్ణి తన్మయంతో తదేకంగా చూస్తున్న భక్తునిలా రజని ఒక్కమాటకూడా మాట్లాడకుండా బాబాయినే చూస్తూ కూర్చుంది. అది గమనించిన చంద్రానికి నవ్వు వచ్చింది. రజనికోసం తను ఏమీతేలేదు.

 

    అసలు తనకు ఆ భావమే తట్టనందుకు బాధపడ్డాడు.

 

    "అన్నయ్యా! కారులో రజనీ, నేనూ ఒకసారి బజారు వెళ్ళివస్తాం" అన్నాడు చంద్రం.

 

    చంద్రం భావాన్ని గ్రహించాడు కృష్ణారావు. "ఇప్పుడేం బజారు వెళతావు? రేపు వెళ్ళొచ్చులే. తొందరేం - ఇక్కడ వుండేవాడివేగా?" అన్నాడు కృష్ణారావు.    

 

    "ఏం అమ్మా, రజనీ! బాబాయికోసం అంత కలవరించేదానివి - తీరా బాబాయివస్తే మాట్లాడవేం?" అన్నాడు కూతురుతో. 

 

    "తను ఊహించుకున్నంత బాగాలేడేమో యీ బాబాయి" అంటూ నవ్వాడు చంద్రం. ఒక్కసారి కాంతమ్మ, కృష్ణారావు కూడా ఫక్కున నవ్వారు.

 

    రజని సిగ్గుపడిపోయింది.

 

    "బాబాయికి నీ పుస్తకాలూ అవీ చూపించమ్మా!" అన్నాడు కృష్ణారావు.

 

    రజని ఉత్సాహంగా లేచింది. చంద్రం లేచి రజని దగ్గరకు వచ్చి నెత్తిమీద చిన్నగా మొట్టాడు. రజని నవ్వుతూ బాబాయి చెయ్యి పట్టుకొని తన గదిలోకి తీసుకెళ్ళింది.

 

    అంత సిగ్గుపడ్డ రజని అంతలోనే బాబాయితో కలిసిపోయింది. ఊపిరి సలపనీయకుండా కబుర్లు చెప్పింది. తన పుస్తకాలన్నీ చూపించింది. అందులో డిటెక్టివ్ నవలలూ, చవకబారు కథల పుస్తకాలు చూసి చంద్రం ఆశ్చర్యపోయాడు. ఆ పుస్తకాలను గురించి రజని మాట్లాడుతుంటే చంద్రానికి ఆశ్చర్యంతోపాటు బాధకూడా కలిగింది. చంద్రం రాసిన 'భగ్నప్రేమ'ను గురించికూడా మాట్లాడింది. రజని వయస్సుకు మించి మాట్లడుతూందనీ, చాల చురుకైన పిల్లనీ కాని ఆ చురుకుదనాన్ని సరిఅయిన మార్గంలో పెట్టడానికి పెద్దవాళ్ళు ప్రయత్నించలేదనీ చంద్రం అర్థం చేసుకున్నాడు. ఆ వయస్సులో రజని ప్రేమ కథలను గురించి మాట్లాడుతుంటే చంద్రానికి కొంచెం ఎబ్బెట్టుగా తోచింది.  

 

    కొందరిలో శారీరక వయస్సుతోపాటు క్రమంగా మానసిక వయస్సూ పెరుగుతుంది. కొందరి పిల్లల్లో అసలు వయసుకంటే చాలా త్వరగా మానసిక వయస్సూ పెరుగుతుంది. ఇలాంటి పిల్లలే పెద్దలకు సమస్యలుగా తయారవుతారు. ఇలాంటివారికి సరైన అవకాశాలను కలిగించి, వాళ్ళ మెదడుకు సరిఅయిన మేత పెట్టి, మంచి మార్గంలో నడిపిస్తే ఇలాంటివారే గొప్పవారవుతారు. వారి తెలివితేటలకు సరి అయిన మార్గం దొరకనప్పుడు తప్పు మార్గంలో పడే అవకాశం వుంటుంది. బుద్ధులు వెర్రితలలు వేస్తాయి. ఎక్కువ తెలివైన పిల్లల విషయంలో తల్లిదండ్రులు ఎంతో శ్రద్ధ వహించాల్సి వుంటుంది. రజని ఈ కోవకు చెందిన పిల్లే. అతిగారాబంతో ఇది మంచి ఇది చెడు అనికూడా తెలుసుకొనే అవకాశం లేకుండా పెంచుతున్నారు తల్లిదండ్రులు.

 

    కొందరి పిల్లలకు అసలు వయస్సు పెరుగుతున్నా మానసిక వయస్సు మాత్రం చాలా మందకొడిగా పెరుగుతుంది.

 

    "బాబాయ్! హేమపిన్ని వచ్చింది" అంటూ రజని లేచి తుర్రున గదినుంచి పరుగెత్తింది.

 

    ఆలోచనల్లోవున్న చంద్రం ఎవరో వచ్చినట్లున్నారు. రజని వెళ్ళిందని మాత్రమే అర్థం చేసుకున్నాడు. యధాలాపంగా లేచి హాల్లోకి వచ్చాడు. ఎదురుగా ప్రసాదరావుగారు. అతని పక్కనే తెల్లని పట్టు దుస్తుల్లో తెల్లగా, సన్నగా, పొడవుగా, నాజూకుగావున్న ఓ యువతి నిల్చొని వుంది. ఆమెను చూస్తూనే చదువూ, సంస్కారమూ మూర్తీభవించాయన్నట్లనిపించింది. చంద్రానికి మరో క్షణంలో ఏదో భావం మెరుపులా బుర్రలో మెరిసి, గుండెలలో 'ధక్' మని నిలిచిపోయింది.    

 

    ఎవరామె? హేమ! అప్పుడే విచ్చిన మల్లెపువ్వులా వున్న ఈమె హేమా?

 

    చంద్రం హృదయం తన పని మర్చిపోయింది ఓ క్షణకాలంపాటు. వెంటనే ప్రమాదాన్ని గ్రహించి తన నడక సాగించింది. కాని ఆ నడక క్రమం తప్పింది. చంద్రం మంత్రంముగ్ధుడిలా హేమను అలాగే చూస్తూండిపోయాడు.     

 

    చంద్రాన్ని గుర్తించని ప్రసాదరావు కృష్ణారావు గదిలోకి వెళ్ళాడు.

 Previous Page Next Page