ఇద్దరూ ఎదురెదురుగా కూర్చున్నారు. కృష్ణారావుకు ఆనందంలో ఏం మాట్లాడాలో అర్థంకాలేదు. తమ్ముణ్ణి తనివితీరా చూస్తూ కూర్చున్నాడు. కృష్ణారావు కళ్ళలో అకస్మాత్తుగా నీరు తిరిగింది.
"ఇంతకాలం ఎక్కడ ఉన్నావు చంద్రం? ఏం చేస్తున్నావు?" అడిగాడు కృష్ణారావు, ఏం మాట్లాడాలో తోచక.
ఇంతసేపూ అన్నగారి ఆప్యాయతా, వాత్సల్యం చూస్తూ ప్రపంచాన్ని మర్చిపోయి ఉన్న చంద్రం, అన్నవేసిన ప్రశ్నతో ఉలిక్కిపడి ఈ లోకంలోకి వచ్చాడు.
"దేశమిమ్మరికీ, దొంగకూ, ఒక ఊరేమిటి? అన్ని ఊళ్ళూ అతనివే, అన్ని ఉద్యోగాలూ అతనివే!" చంద్రం గొంతులో వ్యంగ్యం తొంగిచూసింది. ఆ జవాబు విన్న కృష్ణారావుకు ఎవరో చాచి లెంపకాయ కొట్టినట్లయింది ముఖంలో బాధ స్పష్టంగా కనిపిస్తోంది.
చంద్రం జేబులో పది రూపాయల నోట్ల కట్ట ఒకటి తీసి కృష్ణారావు ఎదురుగా టేబిల్ మీద విసురుగా వేశాడు.
"తీసుకోండి! ఆనాడు మీ ఇంట్లో నేను దొంగిలించానన్న డబ్బు" అన్నాడు చంద్రం.
కృష్ణారావులోని చైతన్యం మంచులా గడ్డకట్టుకుపోసాగింది.
"అసలు నేను ఇక్కడకు వచ్చింది. ఈ డబ్బు ఇవ్వటానికే. ఇక నేను వస్తాను" అంటూ లేవబోయిన చంద్రం అన్నముఖం చూసి లేవలేకపోయాడు.
కృష్ణారావు శరీరంలో ఎక్కడా జీవం వున్నట్టు కనిపించలేదు. అప్పుడే ప్రాణంపోయిన శవాన్ని కుర్చీలో కూర్చోపెట్టినట్లు వున్నాడు. చంద్రం గబగబా లేచివెళ్ళి "అన్నయ్యా!" అంటూ కదిపాడు కృష్ణారావును. చంద్రం గొంతు కొంచెం వణికింది.
పీడకలనుంచి నిద్రలేచినట్లు ఉలిక్కిపడ్డాడు కృష్ణారావు. అంతవరకూ గడ్డకట్టిన చైతన్యం అతనిలో మళ్ళీ కరిగి ప్రవహించసాగింది. గబుక్కున లేచి తమ్ముణ్ణి కౌగిలించుకొని కుమిలి కుమిలి ఏడ్చాడు.
చంద్రం తను చాలా తప్పు చేశానని బాధపడ్డాడు. తను వచ్చీ రాకముందే, తనను చూసిన సంతోషంనుంచి అన్న కోలుకోక మునుపే తను అంత కఠినంగా ప్రవర్తించవలసింది కాదు.
"ఏమిటన్నయ్యా ఇది!" అన్నచేతులనుంచి తప్పుకొని అన్నాడు చంద్రం. కృష్ణారావు కొంచెం తమాయించుకున్నాడు.
"చంద్రం! ఈ ఏడు సంవత్సరాలలో ఈ ఆస్తి పదింతలు పెరిగింది దీనికి నీవు సమభాగస్తుడివి. ఆనాడు నీవు తీసుకున్న డబ్బు నీదే. పైగా, దాన్ని నీకు ఇవ్వాలనే అక్కడ దాచాను, మీ వదినకు తెలియకుండా."
"అదేమాట ఆనాడు ఎందుకనలేకపోయావు?" అందామనుకున్నాడు చంద్రం, కాని అనలేకపోయాడు.
"ఎప్పుడొచ్చావు?"
"పొద్దుట పాసెంజరుకు."
"అయితే ఇంటికి రాలేదేం? ఎక్కడ దిగావు?"
"నాకు ఇల్లు ఎక్కడుంది? ప్రకాశం ఇంటిలో దిగాను" అంటూ చంద్రం కృష్ణారావు ముఖంలోకి చూశాడు. కృష్ణారావు ముఖం పాలిపోవటం గమనించాడు.
"నా ఇల్లు - నీ ఇల్లు కాదురా? నాన్నా, అమ్మా వుంటే ఇలా అనేవాడివేనా?"
"నాన్నా, అమ్మా ఉంటే ఇలా ఇల్లువిడిచి అనాధగా పోవాల్సిన పరిస్థితి వచ్చేదేనా?" అన్నాడు చంద్రం ఎత్తుపొడుపుగా.
చంద్రం ఆనాటి తన ప్రవర్తనను ఎన్నటికీ క్షమించలేడని అర్థం చేసుకున్నాడు కృష్ణారావు.
కొంచెంసేపు విషయాన్ని మార్చాలనుకున్నాడు. వెంటనే బెల్ నొక్కి సెక్రటరీని పిలవమన్నాడు. రెండు నిమిషాల్లో ఒక స్త్రీ ప్రవేశించింది.
"ఈ అబ్బాయి నా తమ్ముడు. బయట ఊళ్ళో చదువుతూండేవాడు. ఇవ్వాళే వచ్చాడు. మన ఫ్యాక్టరీ చూపించు. చంద్రం! ఈమె నా సెక్రటరీ, మిస్ అనూరాధ. ఆమెతో వెళ్ళి ఫ్యాక్టరీ చూసి అర్ధగంటలో వచ్చేసేయ్."
అన్న మనసును అవసరమైనదానికంటే ఎక్కువ నొప్పించానేమోనని ఆలోచిస్తున్న చంద్రం మారుమాట్లాడకుండా అనూరాధ వెనకే బయలుదేరాడు.
తన అన్నకు ఒక ప్రయివేట్ సెక్రటరీ కూడా ఎందుకో? పైగా, ఆడమనిషిని ఎందుకు పెట్టుకున్నాడో! ఆమె వయసు అసలెంతో కాని దాదాపు ముఫ్పయ్ అయిదు సంవత్సరాలున్న మనిషిలా కనిపిస్తుంది. ఫ్యాక్టరీ చూపిస్తూ వివరాలు చెబుతుంటే ఆమెను ఎక్కడో చూసినట్లనిపించింది. ఆమెను చూస్తుంటే మంచి సంస్కారంగల మనిషిలా అనిపించింది. ఆమె అంటే అంతలోనే గౌరవభావం కలిగింది చంద్రానికి.
తమ్ముడు వెళ్ళగానే కృష్ణారావు పెద్దగా నిట్టూర్చాడు. వెంటనే ఇంటికి ఫోన్ చేశాడు.
కాంతమ్మకు కృష్ణారావు చంద్రం వచ్చిన వార్తను ఎంత సంతోషంగా వినిపించాడో, మరుక్షణంలోనే ఆవిడ ధోరణికి అంతగానూ కుంగిపోయాడు. భార్యమీద కోపం, అసహ్యం కలిగింది. ఇంటిబిడ్డ ఇంతకాలానికి తిరిగివస్తే సంతోషించని ఆడదికూడా వుంటుందా అనుకున్నాడు. ఆస్తికి వారసుడు మళ్ళీ తిరిగివచ్చాడనే అయివుండాలి. అంతకంటే ఆమె ప్రవర్తనకు వేరేకారణం కనిపించలేదు. కృష్ణారావుకు కోపం వచ్చింది.
"రాత్రికి నలుగురు భోజనానికి వస్తున్నారు - వంట చేయించు" అని చెప్పి విసురుగా ఫోన్ పెట్టేశాడు. మళ్ళీ వెంటనే ప్రసాదరావుకు ఫోన్ చేశాడు.
"ఆఁ- నేనే కృష్ణారావును. రాత్రికి మీరూ, హేమా - మా ఇంటికి భోజనానికి రావాలి. మీరే ప్రత్యక్షంగా చూద్దురుగాని, తప్పక రావాలి" అంటూ ఫోన్ పెట్టేశాడు కృష్ణారావు.
కృష్ణారావు ఇంటికి బయలుదేరటానికి సిద్ధంగా కూర్చున్నాడు. తమ్ముడికోసం ఎదురుచూస్తున్నాడు.
చంద్రం లోపల ప్రవేశించగానే కృష్ణారావుకూడా లేచి టేబిల్ మీద వున్న నోట్లకట్టను మళ్ళీ తమ్ముడి ప్యాంటు జేబులో పెట్టాడు. చంద్రం ఏమీ అనలేకపోయాడు. ఇంకోసారి వచ్చి అన్నగారి సెక్రటరీ చేతికిచ్చి వెళ్ళిపోవచ్చు ననుకున్నాడు.
"ఫ్యాక్టరీని చాలా వృద్ధిచేశావు, చాలా సంతోషం!" అన్నాడు చంద్రం మర్యాదకోసం అన్నట్లు. కృష్ణారావు జవాబివ్వలేదు. సిగరెట్టు పెట్టెతీసి జేబులో పెట్టుకుని బయలుదేరాడు.
"ఇక నేను వెళ్ళివస్తా" అన్నాడు చంద్రం, అన్న ఇంటికి బయలుదేరుతున్నట్లు తెలుసుకొని.
"వెళతావా? ఎక్కడకు?"
"నా ఇంటికి. నేను ఎక్కడుంటే అదే నా ఇల్లు."
"నేను ఊళ్ళో వుండగానే నువ్వు ఎక్కడో ముఖ్యంగా మన ఫ్యాక్టరీలో పనిచేసే కూలీ నాలీ జనం వుండేచోట వుంటావా? అది నా ఇల్లు కాదు నీ ఇల్లే. పద ఇంటికి. తరవాత కార్లో వెళ్ళి సామాను తెచ్చుకుందువుగాని" అన్నాడు కృష్ణారావు.
"అక్కర్లేదు. నన్ను అక్కడే వుండనివ్వు. ఆ పూరిగుడిసెల్లోనే నాకు ఒకనాడు ఆప్యాయతా, ఆదరణా దొరికింది. నేను మీ యింటినుంచి దొంగగా వెళ్ళిపోయాను. మళ్ళీ ఆ గడప తొక్కదలచుకోలేదు."
"నా ఇల్లేమిటిరా?" మందలింపుగా అన్నాడు కృష్ణారావు.
"నేను దొంగగా ఆ ఇల్లు విడిచిననాడే అది నా ఇల్లు కాదని నిర్ణయమయిపోయింది." ఉద్రేకంతో అన్నాడు చంద్రం.
తమ్ముడు చాలా ఆవేశంలో వున్నాడని, ఇప్పుడు ఇక ఎంత చెప్పినా లాభంలేదనీ అర్థం చేసుకున్నాడు కృష్ణారావు.
"సరే! నీ ఇష్టం వచ్చినచోటే వుందువుగానిలే. ఇప్పుడు నాతో పద! భోజనంచేసి వెళుదువుగాని. మీ వదిన ఎదురు చూస్తూ వుంటుంది."
చంద్రం వదినపేరు వినగానే అదోలా నవ్వాడు. కృష్ణారావు తల వంచుకున్నాడు.
"క్షమించు అన్నయ్యా, నేను రాలేను. ఇక నన్ను బలవంతం చెయ్యకు" అన్నాడు చంద్రం కొంచెం సౌమ్యంగా.
"మా కోసం కాకపోయినా కనీసం పలవరించే రజని కోసమయినా ఒక్కసారి రారా చంద్రం!" అన్న కృష్ణారావు గొంతులో బాధ ఎంత దాచుకోవాలన్నా కనిపించింది.
రజని పేరు వినగానే చంద్రం హృదయంలో పాలసముద్రం పొంగింది. కనీసం తను రజని ఎలా ఉందనయినా అడగలేదు. నిజంగా తనలో ఇంత కాఠిన్యం వుందని తనకే తెలియదు. పసిబిడ్డ రజని తనకేం అపచారం చేసింది? రజని ఎంత అయిందో? ఎలా వుందో? ఎన్ని కబుర్లు చెబుతుందో? చంద్రం మారుమాట్లాడకుండా కృష్ణారావు వెనకే బయలుదేరాడు.
కారు చాలా వేగంగా పోతోంది. కృష్ణారావు చాలా ఉద్రేకంగా వున్నాడు. చంద్రం తాపీగా కూర్చొని అన్ననే గమనిస్తున్నాడు. కాని అన్నమీద కలగవలసినంత గౌరవం కలగటంలేదు. అందుకే మనిషికీ మనిషికీ వుండే సున్నితమైన బంధాన్ని తెగేంతవరకూ లాగకూడదంటారేమో!