Previous Page Next Page 
కృష్ణ యజుర్వేదీయతైత్తిరీయ సంహిత పేజి 22


    పాత్రా! ఖరము నీకు స్థానమగుచున్నది. ఇంద్ర వాయువులు సమానప్రీతిగలవారు. వారికొరకు నిన్ను ఖరస్థానమున ఉంచుచున్నాను.

    (పాత్రను శుద్ధిచేసి ఖరప్రదేశమందు ఒకవైపున ఉంచవలెను.)

                                 అయిదవ అనువాకము

    మిత్రావరుణులారా! మీరు సత్యసంవర్థకులు. సోమరసము సిద్ధమై ఉన్నది. ఈ యజ్ఞమునకు మిమ్ము ఆహ్వానించుచున్నాము. వినండి.

    సోమరసమా! నిన్ను - భూమి భాగమగు - దారుపాత్రచే మిత్రావరుణుల కొరకు గ్రహించుచున్నాను.

    పాత్రమా! ఖరప్రదేశము నీకు స్థానమగును. మిత్రావరుణుల కొరకని నిన్ను ఈ స్థానమున ఉంచుచున్నాను.

    (మిత్రావరుణుల పాత్రయందు సోమరసము పోయవలెను. అందుపాలు కలుపవలెను. పాత్రను ఖరప్రదేశమున ఉంచవలెను.)

                                     ఆరవ అనువాకము

    అశ్వినులారా! మీవాక్కు పరుషరహితము. ప్రియము. అట్టి మీ వాక్కుచే ఈ యజ్ఞమును నిర్వహించండి.

    సోమరసమా! నిన్ను దారుపాత్రచే అశ్వినుల కొరకు గ్రహించుచున్నాను.

    పాత్రా! ఖరప్రదేశము నీకు స్థానమగును. అశ్వినుల కొరకని నిన్ను ఈ ఖరస్థానమున స్థాపించుచున్నాను.

    (అశ్వినుల పాత్రలో సోమరసము పోసి, ఖరప్రదేశమున ఉంచవలెను.)

                                         ఏడవ అనువాకము

    అశ్వినులారా! ఇది ప్రాతః కాలము. అన్యయజమానులను విడువండి. ఈ యజమాని వద్దకు - సోమపానమునకు - విచ్చేయండి.

    సోమరసమా! నిన్ను దారుపాత్రయందు అశ్వినుల కొరకు గ్రహించుచున్నాను.

    పాత్రా! ఖరప్రదేశము నీకు స్థానమగును. అశ్వినుల కొరకు మధుపూరితమగు నిన్ను ఖరస్థానమున ఉంచుచున్నాను.

    (అశ్వినుల పాత్రను ఖరప్రదేశమున పెట్టవలెను.)

                                     ఎనిమిదవ అనువాకము

    ఈ ఇంద్రుడు ఇష్టుడు. వెలుగులు చుట్టియున్న వాడు. అతడు మేఘపు ఉదరములందలి జలములను మట్టిగల భూమి మీద కురిపించుచున్నాడు. జలములు సూర్యునితో కలసినపుడు - ఋత్విజులు ఈ ఇంద్రుని మంత్రములచే - శిశువును వలె లాలించుచున్నారు.

    శుక్రపాత్రా! దారు నిర్మితమైన నీయందు - శుక్రపుత్రుడైన శండుని కొరకు - సోమరసము గ్రహించుచున్నాను. ఖరప్రదేశము నీకు స్థానమగును. యజమాని బలమును కాపాడుము.

                                   తొమ్మిదవ అనువాకము

    ఇంద్రా! నిన్ను పూర్వపు భృగువులు స్తుతించినారు. పితరులు స్తుతించినారు. పూర్వపు, ప్రస్తుత యజ్ఞకర్తలు స్తుతించినారు. నేను నిన్ను అట్లే స్తుతించుచున్నాను. నీవు దేవతలందు పెద్దవు. యజ్ఞకర్తలకు స్వర్గము నిచ్చుట తెలిసిన వాడవు. యజమాని వలన జరిగిన ఆలస్యాదులను మన్నించగల వాడవు.

    ఈ యజమాని యజ్ఞము విషయమున ఆతురుడు. అనుష్ఠానములందు ఇతర యజమానులకు మించినవాడు. ఈ యజమానిని కూడి సోమపానము చేయుము. స్తుతులు ఆలకించుము. వర్ధిల్లుము.

    మంధిపాత్రమా! దారు నిర్మితవైన నీయందు - శుక్రపుత్రుడగు మర్కుని కొరకు - సోమరసమును గ్రహించుచున్నాను. ఈ ఖరప్రదేశము నీకు స్థానమగును. ప్రజాఃపాహి - యజమాని సంతానమును రక్షించుము.

    (మంధి అనుపాత్రలో సక్తువులను వండి ఖరప్రదేశమున స్థాపించవలెను.)

                                      పదవ అనువాకము

    దేవతలారా! మీరు దివియందు పదకొండుగురు ఉన్నారు. భూమిమీద పదకొండుగురు ఉన్నారు. స్వమహిమచే ఉదకమును దాల్చిన అంతరిక్షమున పదకొండుగురు ఉన్నారు. తేదేవా యజ్ఞమిమం జుహధ్వం. అట్టి దేవతలందరు ఈ యజ్ఞమును అనుభవింతురు గాత.

    పాత్రమా! నీవు ఆగ్రయణ నామధేయమవు. నీవు శ్రేష్ఠత్వము పొందినదానవు. యజ్ఞమును సంబరపెట్టుము. యజ్ఞకర్తను సంబరపెట్టుము. విష్ణువు నిన్ను రక్షించును గాత. విష్ణు రక్షితవగు నీవు యజమాని సంతానమునకు సామర్థ్యము కలిగించి, కాపాడుము. ఈ ఖర ప్రదేశము నీకు స్థానమగును. సమస్త దేవతల కొరకు నిన్ను ఈ ఖర స్థానమున స్థాపించుచున్నాను.

    (ఆగ్రయణ పాత్ర యందు సోమము పోసి, దానిని ఖర ప్రదేశమున స్థాపించవలెను.)

                                 పదకొండవ అనువాకము

    దేవతలు మొత్తము మీద ముప్పది ముగ్గురు. వారు శత్రు నాశకులు. శత్రు స్త్రీలను ఏడిపించువారు.

    ఆ దేవతలందరు కొందరు స్వర్గమందున్నారు. కొందరు భూలోకమున ఉన్నారు. మిగిలిన పదకొండుగురు నీరు నిండిన అంతరిక్షమున ఉన్నారు. వారందరు తృతీయ సవనము నందలి అభిషుత సోమమును సేవింతురు గాత.

    "ఉపయామ గృహితోస్యాగ్రయణోసి స్వాగ్రాయణో జిన్వ యజ్ఞం జిన్వ యజ్ఞపతి మభిసవనాపాహి విష్ణు స్త్వాంపాతు విశం త్వం పాహి న్ద్రియేణైష తేయోని ర్విశ్వేభ్య స్త్వా దేవేభ్యః

    (1. అర్థమునకు పదవ అనువాకము రెండవ పరిచ్ఛేదము చదవండి. 2. ఆగ్రయణ పాత్ర యందు సోమము పోసి, దానిని ఖర ప్రదేశమున స్థాపించవలెను.)

                                     పన్నెండవ అనువాకము

    ఇంద్రుడు బృహత్సామ ప్రియుడు. సోమాన్నము కలవాడు. సామ ఉక్థముల అభిలాషి. సోమమా! నిన్ను ఉపయామగ్రహమున - ఇంద్రుని కొరకు - గ్రహించుచున్నాను.

    ఇంద్రా! నీకు సోమరసము ప్రియతమము కదా. నిన్ను అట్టి సోమపానమునకు ఆహ్వానించుచున్నాను.

    ఉపయామగ్రహమా! నిన్ను విష్ణువు కొరకు గ్రహించుచున్నాను. ఈ ఖర దేశము నీకు స్థానమగును. ఉక్థ, సామ ప్రియుడగు ఇంద్రుని కొరకు నిన్ను ఈ ఖర స్థానమున స్థాపించుచున్నాను.

    (సోమ రసమును 'ఉక్థ్య' మను పాత్రలోనికి తీసికొని, ఆ పాత్రను ఖర ప్రదేశమున పెట్టవలెను.)

                                     పదమూడవ అనువాకము

    వైశ్వానరాగ్ని - దివికి ముఖము వంటి సూర్యుని వలె తేజరిల్లుచున్నాడు. అతడు భూమి మీద విరామము ఎరుగడు. యజ్ఞకర్తలను అనుగ్రహించువాడు. యజ్ఞకర్తల సత్కార అర్హుడు. అట్టి వైశ్వానరాగ్నిని స్తుతించుచున్నాము.

    దేవతలు అటువంటి అగ్ని ముఖమున ఆహుతులు అర్పించుటకు చమసరూప సోమపాత్రలను - వాయువు మున్నగు స్థానములను ఏర్పరచినారు.

    సోమమా! నిన్ను ఉపయామ స్థాలియందు - వైశ్వానరాగ్ని కొరకు - గ్రహించుచున్నాను.

    ధ్రువ గ్రహమా! నీవు స్థిర నివాసము గలదానవు. ఆదిత్యాది పళ్లెరములందు గట్టిదానవు. అచ్యుతావామ్ అచ్యుతక్షిత్తమః - నశించని వాని యందు నశించనే నశించనిదానవు. ఈ ఖర స్థానము నీకు తావైయున్నది. వైశ్వానరాగ్ని కొరకు నిన్ను ఈ ఖర స్థానమునకు చేర్చుచున్నాను.

    (సోమము నిండిన ధ్రువ గ్రహమును 'ఖర'మున ఏర్పరచవలెను.)

                                   పదునాలుగవ అనువాకము

    ఉపయామమున ఉన్న సోమమా! నీవు చైత్రమవు. వైశాఖమవు. జ్యేష్ఠమవు. ఆషాఢమవు. శ్రావణమవు. భాడ్రపదమవు. ఆశ్వీయుజమవు. కార్తీకమవు. మార్గశీర్షమవు. పుష్యమవు. మాఘమవు. ఫాల్గుణమవు. అధిక మాసమవు. శూన్యమాసమవు. నిన్ను అహస్పత్య దేవత కొరకు గ్రహించుచున్నాను.

    (సోమమును ఋతుగ్రహమను పాత్రయందు నింపవలెను.)

                                   పదిహేనవ అనువాకము

    సోమము స్తోత్రయుతము. దేవతలు అభిలషించునది. అభిషతము. ఇంద్రాగ్నులారా! రండి. మీ సోమ భాగమును స్వీకరించండి.

    సోమమా! నీవు దారు పాత్రయందు - ఇంద్రాగ్నుల నిమిత్తము - గ్రహించబడుచున్నావు.

    పాత్రమా! ఖరము నీ స్థానము అగును. ఇంద్రాగ్నుల కొరకు నిన్ను ఖర స్థానమున స్థాపించుచున్నాను.

    (సోమము నిండిన ఋతుగ్రహపాత్రను ఖర స్థానమున ఉంచవలెను.)

                                      పదహారవ అనువాకము

    విశ్వేదేవతలారా! మీరు రక్షకులు. మానవ పోషకులు. సోమము సమర్పించిన యజమానులకు మునుపు ఫలములను ఇచ్చినవారు. మీరు విచ్చేయండి.

    సోమమా! నీవు దారు పాత్రయందు - విశ్వేదేవతల కొరకు - గ్రహించబడినావు.

    పాత్రమా! ఖరము నీ యొక్క స్థానమగును. విశ్వే దేవతల కొరకు నిన్ను ఖర స్థానమున స్థాపించుచున్నాను.

    (సోమ పాత్రను ఖర ప్రదేశమున ఉంచవలెను.)

                                       పదిహేడవ అనువాకము

    ఇంద్రుడు మరుత్తులతో కూడినవాడు. వృష్టి కలిగించువాడు. కోరికలు తీర్చువాడు. ప్రబల శత్రువులు ఉన్నవాడు. అరిభయంకరుడు. స్వర్గవాసి. దుష్టశిక్షకుడు. బలప్రదుడు. ఆ ఇంద్రుని ఈ యజ్ఞమునకు ఆహ్వానించుచున్నాము.

 Previous Page Next Page