ఆ ఫిల్మ్ ఎలా రిలీజ్ అయిందని ఆశ్చర్యపోయావుగదూ? ఆడ మోడల్స్ ని అసభ్యంగా చూపించవద్దని, వార్ని హీనపర్చవద్దని మొత్తుకునే సంస్థ ఒకటుంది. అడ్వర్ టైజింగ్ అథారిటీ ఆఫ్ ఇండియా' అని. కాని అది కాగితంపులి మాత్రమే. ఐక్యరాజ్యసమితి ఇరాన్ ని, ఇరాక్ ని కొట్టుకో వద్దురా మూఢుల్లారా అంటే వింటున్నారా అలాగే ఇది."
"సెన్సార్ బోర్డు అలాంటివాటిని ఎలా సర్టిపై చేస్తుంది" అడిగింది మంగళ కమలిని వైపు వింతగా చూస్తూ.
"సెన్సార్ బోర్డువాళ్ళు వున్నారు పాపం. వాళ్ళు తమ యాధాశక్తిని తాము తినేసి వాటిని వదిలేస్తారు. ఇదేం అన్యాయమని స్త్రీ సమానహక్కుల సంఘం అడిగితే, పాపం వాళ్ళు కోట్లు పెట్టి ఉత్పత్తిచేస్తుంటే, వాటిని అమ్ముకోటానికి ఈమాత్రం చూసీచూడనట్లు పోవాలన్నారు వీళ్ళూ అడిగారు. ఎవర్ని ఉద్దరించటానికి తయారుచేస్తున్నారని. నీళ్ళు నమిలారు. గొంగట్లో భోంచేస్తూ వెంట్రుకలు వేరుకోవటంలాంటిది. దుర్గంద భూయిష్టమైన ఈ సమాజంలో బ్రతుకుతూ తప్పులెన్నటం అనేది.
చూశావా ఏదో చెప్పబోయి ఏదో చెబుతున్నాను. పదిహేను సంవత్సరాల చేదు అనుభవాలు నన్ను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. ఇంతకాలం నన్నర్థం చేసుకునే ఆత్మీయులు దొరకక వాటిని చెప్పుకునే అవకాశం. దొరకక, తద్వారా బరువు తగ్గించుకునే అవకాశం రాలేదు. మనోహర్ ని, నిన్ను నా ఆత్మీయులుగా భావిస్తున్నాను. గనుకే ఇలా బయట పడిపోతున్నాను. ఏమైనా ఈ దుర్భరమైన జ్ఞాపకాలతో ఎక్కువకాలం బ్రతకలేనేమోనని అనిపిస్తోంది. ఈ మధ్య నాకు" కమలిని కళ్ళు తడిదేరాయి. ఆమెను ఆ స్థితిలో చూస్తున్న మంగళకు గుండెను పిండినట్లనిపించింది.
"అసలు విషయానికొస్తాను. ఆ ఫిల్మ్ లో నాతోపాటు యాక్టుచేసిన మోడల్ మీ తెలుగమ్మాయే. ఫిల్మ్ రెస్పాన్స్ థియేటర్ లో చూద్దామండి అంటూ గోలపెట్టింది. వద్దన్నా వినలేదు. అనుభవం తక్కువకావటంతో.
ఇద్దరం థియేటర్ కి వెళ్ళాం. అందులో ఇంగ్లీషు పిక్చర్ ఆడు తోంది. ఇంటర్వెల్ వరకూ యాడ్ ఫిల్మ్స్ వేశారు. ఆఖరి ఫిల్మ్ మాది. అది 90 సెకన్ల ఫిల్మ్ దాన్నే డబుల్ టైమ్ స్క్రీన్ చేసేలా రెండుప్రింట్లు జాయింట్ చేసి పంపించింది ఏజెన్సీ. 180 సెకన్లు మేం తెరమీద కనిపిస్తాం. ఆ టైమ్ చాలు మేము ప్రేక్షకుల మదిలో ముద్రించుకుపోవడానికి. పై పెచ్చు సినిమా హీరోయిన్స్ లా తెరమీద అద్భుతంగా, బయట అప్పలమ్మల్లా వుండం మేము. బయట కూడా అందంగానే వుంటారు మోడల్స్. దాంతో ఫిల్ములో యాక్టుచేసిన అమ్మాయి ఈమే అని నిజజీవితంలో తటస్థ పడితే కనిపెట్టడం బహు తేలిక.
ఇంటర్వల్ అయిపోగానే, థియేటర్స్ లో లైట్స్ వెలగగానే మమ్మల్ని గుర్తుపట్టేశారు. అంతే, వీధికుక్కల్లా మామీద పడ్డారు. రక్కారు, గిల్లారు, కొరికారు, ముద్దులు గుప్పించారు. స్త్రీ సిగ్గుపడుతూ దాచుకునే స్థానాల్ని నిర్థాక్షిణ్యంగా నలిపేశారు. వాళ్ళ చేతులు, వళ్ళు, నాలికలు మాపై స్వైరవిహారం చేశాయి. ఎవరు మమ్మల్ని అక్కడ రక్షించేది? కొన్ని వందలమంది అక్కడ వుండగానే, చూస్తుండగానే, అతి హీనమైన ఆ దుస్సాహసం చేశారు. అండలేని ఇద్దరు ఆడవాళ్ళను తమ భర్తలు హింసపెట్టారని వాళ్ళ భార్యలకు తెలిసినా, సనాతన సాంప్రదాయాల్ని పుణికి పుచ్చుకొని, నిలువెల్లా జీర్ణించుకున్న హిందూ స్త్రీలు రాజీపడి వారితోనే సంసారం చేస్తారు. వారివి రాజీ బ్రతుకులు గనుక. మమ్మల్నేం చేసినా మేం రాజీపడలేదు! అలోగే వాళ్ళు, సతీసుమతి, సతీసక్కుబాయి, సీతా, సావిత్రలాంటి పుక్కిటి పురాణాలు రాసి వాటిని పవిత్ర ఇతిహాసాలుగా ముద్రవేసి మన మొఖాల్న విసిరి, సెంటిమెంటు పరిధిలో మనల్ని సమాధి చేశారు ఈ మగాళ్ళు.
ఆ భీభత్సం నుంచి నేనైతే కొంతలో కొంత తప్పించుకోగలిగాను పాపం విజయ తప్పించుకోలేకపోయింది. దాంతో షాక్ తింది. రెండు రోజులకు రైలుకింద తలపెట్టి ఆత్మహత్య చేసుకుంది, జరిగిన అవమానానికి అదే పరిష్కారం అనుకొని, అది సిటీలైఫ్ కి అలవాటుపడ్డ పిల్లయినా, నార్తిండియన్ అయినా కొంతవరకు తట్టుకోగలిగేదేమో, కాని విజయ సున్నిత మనస్కురాలైన తెలుగుపిల్ల.
మెరిసే ఈ ప్రపంచాన్ని చూసి ముచ్చటపడి, నలుగురూ తన అందాన్ని మెచ్చుకుంటే, దాన్ని నాలుగు లక్షలమంది చూపించుకుందామనే అత్యాశ ఆమెను కబళించివేసింది. ఇప్పుడు చెప్పు ఏది మా ఇమేజ్? ఎక్కడ? మాకేకాదు సినిమా నటీమణుల్ని కూడా ఇలాగే చేస్తారు. పిచ్చికుక్కలకి దూరంగా, రాక్షస డేగలకు అతీతంగా స్టూడియోల్లో, ఎయిర్ కండీషన్డు రూముల్లో, యాడ్ ఏజెన్సీ బాస్ ళ ఫోటో గ్రాఫర్ల బెడ్ రూముల్లో, తెరమీద, టీవీలో, రేడియోలో, పత్రికల్లో, రోడ్లప్రక్క బోర్డుల్లో, లేదా పెద్ద సెక్యూరిటీ మధ్య స్టేజీల మీద వున్నంతవరకే మా ఇమేజ్ అదీ సెక్యూరిటీవాళ్ళు బుద్థిమంతులైతేనె. కంచే చేనుమేసిన సందర్భాలు లేకపోలేదు. ఎంతమాత్రం భద్రతలేని జీవితాలు మా మోడల్స్ వి.
ఇందుకు విరుద్ధంగా ఏ మోడలన్నా కదలల్లితే కక్కలేని కఠోరమైన నిజాల్ని మట్టుపెట్టడానికి మాత్రమే. అదేంకాదు మా ఫీల్డ్ మంచిదని చెబితే అది హిపోక్రసి మాత్రమే" చెప్పటం ఆపింది కమలిని.
ఆమె కళ్ళవెంట కన్నీళ్ళు జాలువారుతున్నాయి. "చూశావా మాకు కనీసం కన్నీళ్ళయినా వున్నాయి హృదయభారం దింపుకోటానికి.సినీ నటీమణులకు అవి కూడా వుండవు. ఎందుకంటే మేం ఏ యాడ్ ఫిల్మ్ లో చేసినా, ఏ స్టిల్ కి వర్క్ చేసినా ఏడవక్కర్లేదు. చచ్చేంత ఆనందంతో ప్రోడక్టు గొప్పదని చెబుతాం. కానుక కన్నీళ్ళు మిగిలిపోతాయి నిజజీవితంలో ఉపయోగించుకోవటానికి. పాపం వాళ్ళకైతే వివిధ రకాలైన విషాద పాత్రలు ధరించి, కన్నీళ్ళన్నీ సినిమాలకే ఖర్చు పెడతారు, వాళ్ళ సొంతానికేం మిగుల్చుకోలేని నిర్భాగ్యురాళ్ళు."
తన బాధలు చెప్పుకొని కమలిని హృదయభారం దింపుకోగలిగినా, ఆమె చేదు అనుభవాల్ని వినటంతో మంగళ హృదయం బరువెక్కింది.
"ఎప్పుడు విజయ గుర్తుకొచ్చినా నా గుండె బరువెక్కుతుంది. ఎందరి అమాయకురాళ్ళ ఉసురు పోసుకుంటుందో ఈ మాయాప్రపంచం."
"మీరేం అనుకోనంటే చిన్న ప్రశ్న" అది మంగళ కమలినివైపు సందేహంగా చూస్తూ.
"అడుగమ్మా.....సందేహం ఎందుకు?" అంది కమలిని ఆప్యాయంగా మంగళవైపు చూస్తూ.
"మీ వృత్తి గురించి మీరు ఇంతగా అసహ్యించుకుంటూ అందులోనే ఎందుకు కొనసాగుతున్నారు? ఇలా అడిగానని ఏం అనుకోవద్దు."
ఆ ప్రశ్నకు కమలిని విరక్తిగా నవ్వింది___తెరలు తెరలుగా, అలా నవ్వటం కమలిని ప్రత్యేకత. ఆ ప్రత్యేకతనే క్యాష్ చేసుకుంటారు ఫోటో గ్రాఫర్స్.
"చెబుతాను, ఇప్పుడు కాదు. కాని ఒకటి మాత్రం చెప్పగలను. అసహ్యించుకుంటూనే కొనసాగటంలో ఒక పరమార్దం వుంది. ఒక చిన్న రహస్యం కూడా అందులో దాగివుంది. ప్రస్తుతానికి చెప్పలేకపోతున్నందుకు క్షమించు. త్వరలోనే చెబుతాను? అదీ మీ ఇద్దరికే."
కమలినిపై జాలి, యాడ్ ప్రపంచంపై అసహ్యం కల్గింది మంగళకు. ఈ ప్రపంచంలో వుంటే మనూ కూడా యిలాగే మారవచ్చేమో! ఏది ఏమైనప్పటికి మనూని ఈ ఫీల్డునుంచి దూరంగా తీసుకుపోవాలి. అది తన తిరుగులేని నిర్ణయంగా స్థిరపరుచుకుంది మంగళ. అర్దరాత్రి కావటానికి ఇంకొద్ది నిమిషాలే వుంది. బయట సన్నని జల్లు వుండుండి పడుతోంది. దాని తాలూకు చలిగాలి రివ్వున వీస్తోంది. కరెంటు పోవటంతో గదంతా చీకటిగా వుంది.
మధు లేచి కిటికీ తలుపులన్నీ వేసివచ్చి క్రొవ్వొత్తి వెలిగించి పెట్టాడు? ఆ చిరువెలుగులో ఫోన్ వైపు చూస్తూ మనోహర్ కంప్యూటర్ కన్నా వేగంగా ఆలోచిస్తున్నాడు తన ప్రాజెక్టు గురించి.
లోన గదిలో పడుకున్న కమలినికి, మంగళకు కూడా నిద్రపట్టడం లేదు. నిశ్శబ్దంగా వున్న ఆ ఇంటి వాతావరణం భయం కలిగించేదిగా వుంది. మనోహర్ ఏం చెబుతాడో అది చేద్దామని మధు, ఎలా గెలవగలడని కమలినిమ్ పందెంలోంచి మనోహర్ తప్పుకొని తనతో వాల్తేరు వచ్చేస్తే బావుండని మంగళ. ముందుముందు ప్రదీప్ ఎలాంటి ఎత్తులేయ వచ్చని మనోహర్ ఆలోచిస్తూ వుండిపోయారు.
"మధు......కిరణ్, రాంభూపాల్ ని నమ్మవచ్చా?" ఆ గదిలో ఆవరించిన స్మశాన నిశ్శబ్దాన్ని చీల్చుకుంటూ వచ్చాయా మాటలు మనోహర్ నోటినుంచి.
వాళ్ళిద్దర్ని నమ్మే, వారికి పనికూడా అప్పగించాడు తనముందే. అంతలో ఈ ప్రశ్న వేశాడంటే ఈ చాలెంజ్ లో ఎవర్నీ నమ్మకూడదనే నిర్ణయానికొచ్చాడన్నమాట. మధు ఇలా ఆలోచిస్తూనే "కిరణ్ ని నమ్మవచ్చు. రాంభూపాల్ ని కూడా నమ్మవచ్చుగాని అతనికి అమ్మాయిలపిచ్చి ఎక్కువ. ఆ పిచ్చిలో అతనికి తెలియకుండానే కొన్ని పొరపాట్లు చేస్తుంటాడు సార్. ఫోటోలు తారుమారుకాకముందే వార్ని మోడలింగ్ కి పనికొచ్చే అమ్మాయిల్ని వెతికి పట్టుకొనేందుకు పంపించాను. ఇప్పుడు తప్పనిసరిగా మనం తరంగిణితోనే తీసి తీరాలి. అలాంటప్పుడు వార్నివెనక్కు పిలిపిస్తే పోతుంది గదా సార్......?"
మనోహర్ తలెత్తి మధువైపు చూచాడు. ఆ చూపుల్లో కాస్త బుర్ర ఉపయోగించన్న భావం కనిపించింది. దాంతో కొద్దిగా సిగ్గుపడి పోయాడు ఆ తర్వాత ఆలోచించాడు కాస్త తీవ్రంగా అప్పుడు తట్టింది ఫోటోలు మారకముందైనా కిరణ్, రాంభూపాల్ వెతికి పట్టుకునే మోడల్స్ వాళ్ళతో వర్క్ చేయాలని అనుకోలేదు. అప్పటికే రహస్యంగా సోఫియాని తన మోడల్ గా నిర్ణయం తీసుకున్నాడు. అయినా వారికి వర్క్ అప్పజెప్పాడు. దీని వెనుక ఏదో మాస్టర్ ప్లాన్ వుందనిపించింది మధుకి. కాని అడగలేదు....ఆలోచిస్తూ వుండిపోయాడు.
అంతలో ఫోన్ గణగణమని మ్రోగింది. ఎక్కడో ఆలోచిస్తుండి పోయినా, అసంకల్పిత ప్రతీకార చర్యలా మనోహర్ చెయ్యి ఫోన్ ఎత్తింది.
"హలో సర్.....పెయింట్ లారంట్ లైన్లో వున్నారు సార్....." అంది ఆపరేటర్.
* * *
అర్దరాత్రి పన్నెండున్నర అవుతోంది. ఇంకా కరెంటు రాని కారణాన వీధులన్నీ గాడంధకారంలో మునగదీసుకున్నట్లున్నాయి. వర్షం జోరున కురుస్తూనే వుంది. ఎక్కడా మనిషి జాడలేదు. మనోహర్ కారు హెడ్ లైట్స్ కాంతి గాడంధకారాన్ని చీల్చుకొంటూ పోతోంది అమిత వేగంతో. మనోహర్ చేతిలో కారు ఆటబొమ్మలా మారిపోయింది. వర్షపు నీటితో నిండిపోయిన గుంటలు వచ్చిన దగ్గరల్లా కారు బంతిలా ఎగిరిపడుతోంది. మరల బాస్ ఆఫీసుకు ఎందుకు బయలుదేరాడో అర్ధం కాలేదు మధుకి. చలికి మునగదీసుకుని కూర్చున్నాడు ఫ్రంట్ సీట్ లో మనోహర్ ప్రక్కన.
"మధు.....మన లైబ్రరీలో ఓగ్ మేగజైన్స్ (వరల్డ్ టాప్ ఫేషన్ మేగజైన్) అన్నీ వున్నట్లేనా.....?"
"ఉన్నాయ్ సార్, మీరు అప్పుడప్పుడు వాటిని రిఫర్ చేస్తుంటారని బైండింగ్ చేయించి పెట్టాను."
"సెయింట్ లారెంట్ ఫోన్ లో తరంగిణి గురించి చిన్న సమాచారాన్ని అందించాడు. దానితో ఆమె గురించి పరిశోధన ఇంకొంచెం ముందుకు వెళ్ళచ్చు......"
కారు పుట్ బాల్ లా ఎగిరిపడింది. ఇద్దరి తలలు టాప్ కి తగిలి నెప్పిఅనిపించింది. అయినా అదేం లెక్కచేయకుండా కారు అదే స్పీడ్ లో పోనిస్తున్నాడు మనోహర్.
"నేను రేపు ప్యారిస్ వెళుతున్నాను. రావడానికి రెండు మూడు రోజులు పట్టవచ్చు. ఈలోపు నువ్వు బొంబాయి వెళ్ళిరావాలి. ఈనెలాఖరు వరకు ఇద్దరం సిటీలో వుండకపోవచ్చు. అయినా ఇక్కడ పనులు ఆగకూడదు. మనం ఇక్కడ నమ్మవలసింది మన చందూ ఒక్కడినే. కనుక చందూకి అవసరమైన డబ్బు, సూచనలివ్వు. ఆఫీసు యాధావిథిగా జరిగేలా చూడమను."
"కానీ......సార్.......ఆఫీస్ బాయ్"
"డోంటాక్ రబ్భిష్....రేపటినుంచి అతను ఆఫీస్ బాయ్ కాదు. నా ప్రయివేట్ సెక్రటరీ. అవతల మనిషిలో టాలెంట్ గమనించి కూడా అతన్ని పైకి తీయకపోవడం మన అసమర్థత, అవివేకం అవుతుంది. ఇద్దరు గజ ఈతగాళ్ళు కూడా రక్షించలేని రూపాను చందూ చాకచక్యంగా రక్షించాడు. రూపాకి ఏదన్నా జరిగుంటే మనం తల ఎత్తుకోగలిగేవాళ్ళం కాదు. అతన్ని గమనించావా?" అడిగాడు మధువైపు చూస్తూ మనోహర్!
మధు మాట్లాడలేదు.
"యూ ఇడియట్ అబ్జర్వేషన్ వుండాలని చాలాసార్లు చెప్పాను నీకు. నీ పక్కన తిరిగే వాళ్ళనే గమనించడంలేదు. చందూ మాత్రం మనల్ని బాగా స్టడీ చేస్తున్నాడు. అన్నింటికిమించి నేనంటే స్వామిభక్తి పుష్కలంగా వుంది. నేనే ఎప్పుడో ఒకప్పుడు ప్రమోషన్ యిద్దామనుకుంటున్నాను. అది ఈ రోజు ఒక సమగ్ర రూపానికి వచ్చింది. అతనికి ఆ పోస్టులో చేయటం ఇబ్బందిగా వున్న డైరెక్టుగా అడగలేక అలా వుండి పోయాడని నా అభిప్రాయం.
ఇప్పుడు ఆఫీసుకు పోగానే అతన్ని పర్సనల్ సెక్రటరీగా ప్రమోట్ చేస్తున్నట్లు నోట్ టైప్ చేయి. రేపది ఆఫీసులో సర్క్యులేట్ చేయి" అన్నాడు మనోహర్.
కారు పేరడైజ్ సెంటర్ దాటింది.
"మధూ......"
"సార్!"
"నీకు ప్రదీప్ ని దెబ్బతీయాలని వుంది. అవునా?"
"అవును సార్" అన్నాడు హుషారుగా ఏదైనా ఛాన్స్ ఇస్తాడేమో నన్న ఆశతో.
"రేపు బొంబాయిలో దిగగానే ఉమెన్ ఈక్వల్ రైట్స్ సంస్థ చైర్ వుమన్ శాంతి షినాయ్ ని కలువు. ప్రదీప్ ఇంద్రాసింగ్ తో తీయించిన టైర్స్ యాడ్ ఫిల్మ్ గురించి చెప్పు చాలు. అర్ధమైందా?" పెదవులమీద చిరునవ్వు మెరుస్తుండగా చెప్పాడు మనోహర్.
మధుకి కొండెక్కినంత సంబరంగా వుంది. తెలివిగలవాళ్ళు ఎప్పుడూ తమచేతికి మట్టి అంటకుండా అవతలివాణ్ని ఆధారాలు దొరకకుండా చావుదెబ్బ తీస్తారు. అలాంటి అవకాశమే యిచ్చాడు మనోహర్ మధు చక్రవర్తికి.
కారు ఆఫీసు ముందు ఆగింది. కారుని చూసి పరుగెత్తుకొచ్చిన ఘూర్కాకి తమ యజమాని ఆ రాత్రి, అదీ వాతావరణం బొత్తిగా బాగోలేని సమయంలో అన్నిసార్లు ఆఫీసుకు ఎందుకు వచ్చాడో అర్ధంగాక బుర్ర గోక్కున్నాడు. మనోహర్ సరాసరి రెండో అంతస్థులోని ఆఫీసుముందుకు వచ్చి నిలబడ్డాడు. మధు తాళం తీయగానే , కుడివైపు మూడో గదిముందు ఆగాడు. అదే మనోహర్ ఆఫీస్ లైబ్రరీ. తరంగిణి గురించి మరికాస్త సమాచారం దొరకవచ్చన్న ఆతృత మనోహర్ లో క్షణక్షణానికి పెరిగిపోతోంది. ఆ సమయంలో తరంగిణి గురించి పూచికపుల్లంత సమాచారం దొరికినా దాన్ని పట్టుకు ముందుకెళ్ళాలని మనోహర్ తహతహ లాడిపోతున్నాడు.
మనోహర్ కీ ఇవ్వగానే మధు లైబ్రరీ రూమ్ తెరిచాడు. లైబ్రరీ కీ మాత్రం ఎప్పుడూ తనవద్దే వుంచుకుంటాడు మనోహర్ గదిలో వరుసగా వున్న ఐరన్ షెల్ఫ్ ల్లో రకరకాల ఫ్యాషన్ మేగజైన్స్, వరర్డ్లైవ్ స్టెయిల్స్ మేగజైన్స్ , ఎడ్వర్టెయిజింగ్ కి సంబంధించిన పుస్తకాలు వరుసగా పేర్చి వున్నాయి.
మధు కళ్ళు ఫ్యాషన్ మేగజైన్స్ వుండే షెల్ఫ్ మీద పడ్డాయి. వెంటనే అక్కడకు వెళ్ళాడు మనోహర్ కూడా. చెరోవైపు నుంచి ఇద్దరు ఈమధ్య వచ్చిన ఓగ్ మేగజైన్స్ కోసం చకచకా వెతకటం ప్రారంభించారు. 1984 జూన్ సంచిక దగ్గర్నుంచి జూలై, ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్ సంచికలను మెరుపువేగంతో చూస్తూ ఇంకా ముందుకు వెళుతున్నాయి మనోహర్ కళ్ళు, చేతులు.
* * *
అర్దరాత్రి ఒంటిగంటవుతోంది. బెడ్ రూమ్ లో వున్న కమలిని, మంగళ నిద్రపట్టక వచ్చి డ్రాయింగ్ రూమ్ లో కూర్చున్నారు. మనోహర్, మధు వెళ్ళిన దగ్గర్నుంచి అక్కడే అలాగే కూర్చుండిపోయారు, ఇద్దరూ మాట్లాడటంలేదు. మనోహర్ కోసం ఎదురుచూస్తూ అలాగే వుండిపోయారు. అంతలో ఫోన్ మ్రోగింది. ఆ శబ్దానికి ఉలిక్కిపడ్డారు ఇద్దరూ. ఆ టైమ్ లో ఫోన్ ఎవరు చేసినట్లు? పరిస్థితి అంతా అయోమయంగా అనిపించింది. చివరకు మంగళ ఫోన్ ఎత్తింది. కాని ఏం మాట్లాడలేదు. ఫోన్లో కంఠం గరుకుగా వుంది.