"నీకేమన్నా మతిపోయిందా మనోహర్? ఊరు, జాడ లేని ఒక అమ్మాయి మీద ఆశలు పెట్టుకుంటున్నావ్. ఒకవేళ ఆమె దొరికినా మోడల్ గా అంగీకరిస్తుందన్న నమ్మకమేమిటి? ఆమె ఒప్పుకున్నా ఆమె తల్లిదండ్రుల మాటేవిటి?"
"హొప్......మేడమ్.....హొప్.....నేను నిరాశావాదినిగాదు."
"కావచ్చు.....కాని."
"మేడమ్.....మంచి హైట్ గదా? కాంప్లెక్షన్ గులాబిరంగు ఆయుండాలి. విశాలమైన కళ్ళు, చాకోలెట్ ఫేస్, గుడ్ లు కింగ్, సోఫియానే తలదన్నేట్లుగా వుంది. అయామ్ లక్కీ."
"ఆమె దొరికితే......దొరికినా ఒప్పుకుంటే యు ఆర్ లక్కీ" అంది మంగళ మనోహర్ కడుపులో పొడుస్తూ.
"మధు స్ర్కీన్ వైపు చూడు జాగ్రత్తగా ఆమె చేతికి వాచీ వుంది గదా?"
"అవును సార్!"
"సూక్ష్మాతి సూక్ష్మాన్ని పసిగడుతున్న అతని కళ్ళు కళ్ళా.....లేక కెమేరా లెన్స్ లా? అనిపించింది మధుకి.
"బూతద్దం తీసుకో. దగ్గరకు వెళ్ళి ఆ వాచీ ఏ కంపెనీదో చూడు."
"నీకేమన్నా మతిపోయిందా మనూ!?" అంది మంగళ.
"విల్ యు ప్లీజ్ షటప్......చూస్తే సైలెంట్ గా చూడు. లేదంటే హాల్లోకి వెళ్ళు డోంట్ డిస్టర్బ్ మై కాన్ సెన్ట్రేషన్" అన్నాడు కోపంగా మంగళవైపు చూస్తూ.
సాధారణంగా ఎప్పుడూ కోపం తెచ్చుకోని మనోహర్ కోపంగా చూసేసరికి మంగళకు బాధగా అనిపించి విసురుగా లేచి వెళ్ళిపోయింది.
"సిటిజన్ వాచీ సార్, లేడీస్ వాచ్" అన్నాడు మధు.
"వెరీగుడ్.....లేడీస్ సిటిజన్ వాచ్ టాప్ సైడ్ గ్లాసు ఫ్రేమ్ సైజెంతుంటుంది?"
"నో ఐడియా సార్."
మనోహర్ ఠక్కున లేచి హాల్లోకి నడిచాడు హడావుడిగా. మంగళ సోఫాలో ముడుచుకు కూర్చునుంది. మనోహర్ కు జాలనిపించింది. ఆమె దగ్గరకు వెళ్ళి తలపై ముద్దెట్టుకున్నాడు. మంగళ తలెత్తి చూసింది. నవ్వుతూ కనిపించాడు మనోహర్.
సారీరా.....నీ వాచీ ఇలా ఇవ్వు" అన్నాడు.
అంటూనే ఆమె చేతికున్న సిటిజన్ వాచీ తీసుకొని ప్రాజెక్టింగ్ రూమ్ లోకి వెళ్ళాడు.
"మధు ఇదిగో వాచీ. దీని గ్లాసును కొలువు ఎంతుంటుందో" అంటూ దాన్ని మధుకిచ్చాడు. మధు టేప్ తో దాన్ని కొలిచి "రెండు సెంటీ మీటర్లుంది సార్" అన్నాడు తిరిగి ఇచ్చేస్తూ.
"మనోహర్ దాని కొలతెందుకు?" అడిగింది కమలిని.
"అడగొద్దు మేడమ్! అయ్యగారికి ఊరికే కోపం వస్తుంది" అంటూ వెనుకనుంచి వచ్చి మరల మనోహర్ ప్రక్కన కూర్చుంది మంగళ. మనోహర్ నవ్వుకున్నాడు.
"ఆ వాచీ టాప్ రెండు సెంటీమీటర్లు పెరిగేవరకూ స్క్రీన్ మీద ఫోటోను ఎన్ లార్జీ చేసుకుంటూపోతే, ప్రపోరనేట్ గా ఆమె బాడీ కూడా పెరిగే అవకాశం వుంది. దాన్నిబట్టి ఆమె రియల్ హైట్. మోసర్ మెంట్స్ తెల్సుకోవచ్చని."
అప్పటివరకూ సరదాగా, సిల్లీగా ఈ పనులన్నీ చేస్తున్నాడని భావించిన మంగళ ఆ రీజనింగ్ విని స్టన్ అయిపోయింది. చాలా కరక్టు వేలో ఆలోచించుకుంటూ పోతున్నాడు మనోహర్. "మధు.....నేను ప్రొజెక్టర్ ను ఆపరేట్ చేస్తాను. నువ్వు స్క్రీన్ దగ్గరకు వెళ్ళు. నేను ఫోటోని ఎన్ లార్జ్ చేస్తూ పోతూంటాను. వాచీ గ్లాసు రెండు సెంటీమీటర్లకు సరిపడగానే స్టాప్ చెప్పు" అంటూ సోఫాలోంచి లేచి ప్రొజెక్టర్ దగ్గరకు నడిచాడు.
మధు టేప్ తో స్క్రీన్ ముందు నిలబడ్డాడు. మనోహర్ ప్రొజెక్టర్ లో ఫోటో ఫోకసింగ్ ఎన్ లార్జ్ చేస్తూ, స్క్రీన్ మీద ఇమేజ్ పెరగసాగింది.
మధు స్క్రీన్ మీద వాచీ పడినచోట టేప్ పట్టుకొని చూస్తున్నాడు కొద్ది క్షణాలు గడిచాయి.
"స్టాప్" అన్నాడు.
మనోహర్ ప్రొజెక్టర్ ని వదిలేసి స్క్రీన్ వైపు చూశాడు. ఫోటో లైఫ్ సైజుకి వచ్చినట్లుగా అనిపించింది.
"కరెక్టుగా వుందా మధు?"
"ఉంది సార్."
"ఆమె మెసర్ మెంట్స్ తీసుకో మధు" అంటూ వచ్చి సోఫాలో కూర్చున్నాడు. అప్పుడర్థమయింది మధుకి. బాస్ ఆ స్లయిడ్ ని ఎందుకు తీయమన్నాడో. ఏదైనా పనిచేసేప్పుడు, చిన్నపనయినా సరే అనుమానం వస్తే తీర్చుకోవాలంటాడు మనోహర్.
"మెజర్ మెంట్స్ ఎందుకు సార్?" సీరియస్ గా స్క్రీన్ పైనే చూస్తూ అన్నాడు మధు.
"ఆమె మెజర్ మెంట్స్ తెలుసుకుంటే కాస్ట్యూమ్స్ కి ఆర్డర్ ఇవ్వచ్చు."
"కాని సార్ ఆమె పేరు తప్ప మరింకేం తెలియవు మనకు. దొరుకుతుందన్న ఆశకి ఆధారం ఏమాత్రం లేదు. అలాంటప్పుడు....." సందేహిస్తూ ఆగాడు మధు.
"దొరుకుతుందన్న ఆశాభావంతోనే ప్రయత్నిద్దాం. మన ప్రయత్నంలో సిన్సియారిటీ, తెలివితేటలుంటే తప్పక దొరుకుతుంది. దొరకటానికి చాలారోజులు పట్టవచ్చు. దొరికాక తాపీగా అప్పుడు కాస్ట్యూమ్స్ ఆర్డర్ ఇచ్చి, ఎదురుచూస్తూ కూర్చోవటం తెలివితక్కువతనం" అన్నాడు మనోహర్.
మధు వెంటనే స్క్రీన్ మీదే ఆమె కొలతలు తీసుకున్నాడు. అవి చూసి "36__24___36 అన్నమాట. ఫెంటాస్టిక్ మెజర్ మెంట్స్." అంటూ ప్రోజెక్టర్ ని ఆఫ్ చేసి లైట్స్ వేశాడు.
ఇప్పుడు మనోహర్ మొఖంలో సంతృప్తి, ఆనందం కనపడుతోంది.
"మనూ.....భోంచేద్దామా?" అంది మంగళ.
"చేద్దాం.....చేద్దాం......బాగా ఆకలిగా వుంది. మన ముగ్గురికి సరే......మరి మేడమ్ సంగతి?"
"రా విజిటబుల్స్ పాలు వున్నాయి" అంటూ డైనింగ్ హాల్లోకి నడిచింది.
నలుగురూ డైనింగ్ టేబులు ముందు కూర్చున్నారు. భోంచేస్తూనే హఠాత్తుగా లేచిపోయాడు మనోహర్. వడివడిగా ముందు గదిలోకి వచ్చి ఫోన్ ఎత్తి ఇంటర్నేషనల్ బుకింగ్ డైల్ చేసి "వాటెబవుట్ ప్యారిస్ ఫోన్ కాల్?" అడిగాడు. మరో గంటపడుతుందని సమాధానం యిచ్చింది ఆపరేటర్. చికాగ్గా ఫోన్ పెట్టేసి మరలా వచ్చాడు.
భోంచేయటం పూర్తికాగానే మనోహర్, మధు వచ్చి హాల్లో వున్న ఫోన్ దగ్గర కూర్చున్నారు. కమలిని, మంగళ బెడ్ రూంలోకి వెళ్ళి పోయారు.
* * *
"మోడల్స్ ను, అందులోను ముఖ్యంగా ఫిమేట్ మోడల్స్ ను ముప్పతిప్పలు పేట్టి మూడు చెరువుల నీళ్ళు తాగిస్తుంది ఈ యాడ్ జీవితం. అవి తట్టుకొని మిగిలితే ఏదన్నా ఇస్తేగిస్తే కొంత కీర్తిని వాటా పెడుతుంది సొసైటీ.
ఆవిడ వర్క్ ఉపయోగపడినకొద్ది అది 'మనీ' గా మారినప్పుడు అందులో కొంత కష్టార్జితం మోడల్ కే దక్కుతుంది.
వర్క్ ఆవిడ బతికి బట్టకట్టడానికే గాక___ఎంతో ఎత్తుకు ఎదిగితే అప్పుడు ఈవిడ మా అమ్మాయే సుమా! అఖండురాలు అని ఆశ్చర్యపడుతుంది సమాజం. ఈ విజయం వెనుక విజయాలు, పరాజయాలు వాటి అడుగున శ్రమ, బాధ, అవమానం సంశయం, దోపిడి, కర్కశత్వం, రాక్షసత్వం, రాజకీయాలు, అసూయా, దుర్భరమైన వేదన- వెరసి జీవితపు వెలుగుల చివర వేదాంతం మిగులుతుంది మోడల్ కు" చెబుతూ, చెబుతూ ఒకింతసేపు ఆగి గుండెలనిండా వూపిరిపీల్చుకొని సుదీర్ఘమైన తన అనుభవాల దొంతరల్ని గుర్తు తెచ్చుకొనే ప్రయత్నంలో బాధతప్త హృదయిని అయి అంతలోనే వాటిని మరొకరితో పంచుకొని గుండెలబరువును దింపుకోగలుగుతున్న తృప్తితో మరలా మెదలెట్టింది కమలిని.
మంగళకు యాడ్ వరల్డ్ గురించి తెలుస్తున్న కొత్త కొత్త విషయాలు వింటుంటే కొన్ని కోట్లమందికి తెలియని సరికొత్త ప్రపంచాన్ని చూస్తున్నట్లనిపిస్తోంది.
"పసిపిల్లవాడుగానూ, మూర్ఖుడిగానూ, జంతువుగానూ ఉండకుండా ఒకమనిషిగా ఉండడం ఎంత అవసరమో అంత బాధాకరం, కష్టం కూడా.
అలాగే ఈ మెరుపుల మరకలప్రపంచంలో, వెలుగునీడల సయ్యాటలో, సుఖదుఃఖాల సంధిలో మోడల్ గా తమ అస్థిత్వాన్ని అపవిత్రతకు దూరంగా కాపాడుకోవటం కూడా అంతే కష్టం, అంతే బాధాకరం."
"కాని మీకున్న ఇమేజ్ చాలా గొప్పది కదా" అంది మంగళ ఆమెను ఇంకా మాట్లాడించాలని.
"హు....ఇమేజ్.....మా ఇమేజ్ చేతుల్లో రాళ్ళతోమూగిన పిచ్చి వాళ్ళ మధ్య వున్న అద్దాలమేడలాంటిది. ఆ పిచ్చివాళ్ళు పిచ్చి ముదిరి రాళ్ళు విసరనంత వరకే మా అద్దాలమేడ బ్రతుకులు."
చాలామందిలా తనూ అదొక గ్లిట్టరింగ్ వరల్డ్, వారికి సుఖ,సంతోషాలే వుంటాయి అనుకొంది తప్ప వారి జీవితాల వెనుక యింత విషాదం వుంటుందని మంగళ ఊహకు అందని విషయం.
"ఓసారి ఏమయిందో తెలుసా? నేను, మరో మోడల్ విజయ ఒక యాడ్ ఫిల్మ్ లో యాక్టుచేశాం. అది ఒక బ్లేడ్ కంపెనీకి చెందిన ఫిల్మ్. ఆ బ్లేడ్ తో గడ్డం చేసుకుంటే అందమైన ఆడవాళ్ళు వెంటపడతారనే ఇడియాటిక్ ఫిల్మ్. దానిలో అసభ్యతా, అవపరానికిమించిన శృంగారంతో చూపించాడు ఫీమేల్ మోడల్స్, అంటే మమ్మల్నే.
నిజంగా ఎంత అవమానం స్త్రీలకు! వ్యక్తిత్వాన్ని చూసి ప్రేమించే స్త్రీలు కేవలం ఆ కంపెనీ బ్లేడ్ తో గడ్డం చేసుకొంటే___ఆ రాస్కెల్ వెనక పడతారా? ఎంత చీఫ్ గా ప్రాజెక్ట్ చేస్తున్నారో చూశావా? చింపరేం ఈ ఫిల్మ్ వేసే థియేటర్ తెరని, తగలెట్టరేం ఆ ఫిల్మ్ ని. అది జరగదు. ఎందుకంటే ఆడదంటే మొగవాడి దృష్టిలో కేవలం సుఖం తీర్చుకునే అందమైన, ఆడించినట్లు ఆడే యంత్రం, అందమైన మాంసంముద్ద.
మగవాడి దృష్టిలో ఆడది సెక్స్ సింబల్ అనే వెధవాలోచన ఉన్నంతకాలం యిది తప్పదేమో! దాని తప్పినట్లున్నాను కదూ. ఏదో చెప్పబోయి ఏదో చేపాను.
ఆ ఫిల్మ్ లో మా యిద్దరి అందాల్ని దాదాపు ముప్పాతిక నగ్నంగా చూపించారు, అది రిలీజ్ అయింది."
"రిలీజ్ అయిందా?" ఆశ్చర్యంగా అడిగింది మంగళ చీదరింపుగా.
"ఆహా......మహాభాగ్యంగా....పెద్ద హిట్ యాడ్ ఫిల్మ్ కూడా అయింది. ఆ బ్లేడ్లు విపరీతంగా అమ్ముడుపోతున్నాయి. ఆ బ్లేడులో ఉన్న నాణ్యతనుబట్టికాదు____ఆ అందాల్ని ఎరగా చూపిస్తూ మేం కొనమంటున్నాంగా ,అ అందుకని, దానిలో నిజమైన నాణ్యత ఉంటే మేం లేకపోయినా పోతాయిగాని అంతగా కావు.
వినియోగదారుల్లో ఈ బలహీనత ఉన్నంతకాలం మేం వాళ్ళ సరుకులు అమ్మిపెట్టే యంత్రాలగానే వుంటాం. మాకు సిగ్గు, బిడియం. వ్యక్తిత్వం వుండవు. వుండకూడదు. ఏదైనా మ్యారేజ్ బ్యూరో ప్రకటన ఇస్తూ మమ్మల్ని సంప్రదిస్తే ఇంత అందమైన అమ్మాయిలు మీ భార్యలయ్యేట్లు చేస్తాం అని మమ్మల్ని చూపిస్తే సందర్భోచితంగా వుంటుంది. కాని బ్లేడ్ కీ, ఆడవాళ్ళకీ ఏమిటి సంబంధం? గడ్డం చేసుకునే వారికి పదునుగా, నునుపుగా, మృదువుగా తెగే బ్లేడ్, ఎక్కువసార్లు గడ్డం చేసుకునేంత పదును ఉన్న బ్లేడయితే చాలదా? వాటికి మేం అంగాంగ ప్రదర్శన చెయ్యాలా? ఒక్కసారి విగయోగదారులు తమని తాము సమీక్షించుకుంటే ఎంత తప్పుడు భ్రమలకు లోనవుతున్నారో తెలుస్తుంది. కాని ఎవరికుందా టైమ్? వినియోగదారుడు కొనే వస్తువుపై మంచీ, చెడుల విచక్షణ దాకా వార్ని పోనివ్వకుండా చేయటమే పబ్లిసిటీ ప్రధానోద్దేశం-చాలా వస్తువుల వరకు.