"వీళ్ళిద్దరి పేర్లు శాయన్న, రంగమ్మ అన్నమాట." తల పంకిస్తూ సోఫాలో కూర్చుంది శృతి.
శృతి కూర్చున్న హాలు పెద్దది. రెండు సోఫాసెట్లు వేసివున్నాయి. గోడలకి నిలువెత్తు ఫోటోలున్నాయి. మరీ పాత ఫోటోల్లో మనుషులకి చమ్కి దుస్తులు, పులిమీసాలు, నడుంకి కత్తి, అట్టహాసమంతా వుంది. తర్వాత ఫోటోల్లో మనుషులకి దోరటోపి, కాళ్ళముందు చచ్చినపులి, చేతిలో తుపాకి మెలిపెట్టిన సన్నని మీసాలు వున్నాయ్. కొన్ని గ్రూప్ ఫోటోలున్నాయ్. అవిగాక సీనరీ ఫోటోలు అదే గోడకి వాజుల్లో పూలగుత్తులు, మరికొన్ని రంగు వాజుల్లో కరెంటు బల్బులు, అద్దాల బీరువాల్లో దేశవిదేశాలవి ఎన్నో రకాల బొమ్మలు, నెలపై కళ్ళు చెదిరే ఎరుపు డిజైన్ కార్ పెట్- అన్ని కలిపి ఆ హాలు పాత కొత్తల మేలు కలయికతో తమాషాగా వుంది.
అన్నింటినీ పరిశీలనగా చూస్తున్న శృతి వెనుక దర్వాజాలోంచి ఎవరో వచ్చినట్లయి తల తిప్పి చూసి వులిక్కిపడింది.
సన్నగా అతిపొడుగుగా స్కెలి టెస్ లా వున్న వ్యక్తి చేతులు కట్టుకుని నిలబడి వున్నాడు. పగలు చూస్తే పెద్ద వాళ్ళు కూడా హడలిపోయేటంత వికార చూస్తే పెద్ద వాళ్ళు కూడా హడలిపోయేటంత వికార రూపం. బిర్రుగా కట్టిన పంచ వదులుపాటి బనీను విచిత్రవ్యక్తిలా వున్నాడు. కళ్ళార్పకుండా శృతినే చూస్తున్నాడు, చూపుల్లో ఏ భావం తెలియటం లేదు.
"అబ్బ ఎంత వికార స్వరూపం! కవురు కప్పెసినట్లు ఆ రంగు, జెండాబొంగులా ఆ పొడుగు, పిచ్చి రోగం వున్నట్లు అలా చూస్తాడేం, అనుకుంది శృతి.
ఆ వ్యక్తి కదననూ లేదు. మాట్లాడించనూలేదు.
మెత్తటి సోఫాలో కూర్చున్న శృతికి ముళ్ళమీద కూర్చున్నట్లయింది. అసహనంగా కదులుతూ వుండిపోయింది.
కొద్దిసేపు తర్వాత ఎవరో వస్తున్న అలికిడయింది. ఆ వ్యక్తి చటుక్కున లోపలికి తప్పుకున్నాడు.
అదే హాలునుంచి మేడమీదికి వెళ్ళటానికి రెండు పక్కలనుంచీ మెట్లున్నాయి. ఎడమవేపు మెట్లమీద అడుగుల చప్పుడు వినపడింది. వెంటనే మెట్లు దిగి వస్తున్న రఘునందన్ కనపడ్డాడు.
శృతి సోఫాలోంచి లేచి నుంచుంది.
"ప్రయాణం బాగా సాగిందా?" రఘునందన్ చిరునవ్వుతో దగ్గరకొస్తూ అడిగాడు.
"ఆ....."
"మా కారు రిపేరులో వుంది. లేకపోతే నేనే తీసుకువచ్చేవాడిని." అంటూ శృతికూడా సోఫాలో కూర్చుంది.
రంగమ్మ కాఫీ తెచ్చిపెట్టి వెళ్ళింది.
రఘానందన్ తీసుకో అని చెప్పిన తర్వాత కాఫీ కప్పు అందుకుని నెమ్మదిగా తాగుతూ కూర్చుంది శృతి.
` "నీ చిన్నమ్మ ఏమీ పేచీ పెట్టలేదుకదా?"
"చిన్నమ్మా?" అని వెంటనే తెలివి తెచ్చుకుంది. "ఆవిడ డబ్బు మనిషి. పేచీ ఎందుకు పెడుతుంది? నెలనెలా ఎక్కువ మొత్తం డబ్బు పంపమని మరీ మరీ చెప్పింది అసలు చిన్నమ్మ......"
"అమ్మగారు వస్తున్నారు." అంటూ రఘునందన్ లేచి నిలబడ్డాడు.
శృతి చెపుతున్నది ఆపేసి కప్పు బల్లపై పెట్టి తానూ లేచి నిలబడింది. అమ్మగారంటే ఆమె కెన్నేళ్ళుంటాయో, వళ్ళంతా బంగారం దిగేసుకుని వుంటుందేమో, జమిందారిణి కదా? అనుకుంది.
మెత్తని చప్పుడు చేయని చెప్పల్స్ తో తల ఎత్తి ఠీవిగా నడుస్తు వచ్చింది రాణి నళినీదేవి.
బంగారు రంగు ఛాయ, వత్తయిన నల్లని కురులు, నలబై ఏళ్ళలోపు వయసు ఆమె అందంతో పదేళ్ళు తగ్గినట్లు వుంది. చేతినిండా బంగారు గాజులున్నాయి. మెడలో ఒకే ఒక ముత్యాలహారం నల్లచారల కాశ్మీర్ షాల్ కప్పుకుని హుందాగా వచ్చి నిలబడింది.
నళినీదేవిని చూస్తూనే కొయ్యబారిపోయింది శృతి.
తనని చూసి ఆ పిల్లెందుకలా బిగుసుపోయిందో నళినీదేవికి అర్థం కాలేదు. శృతిని తీక్షణంగా చూస్తూ నొసలు ముడేసింది.
"మిస్ శృతీ!" అన్నాడు రఘునందన్.
చలనం వచ్చింది శృతిలో తను చేసిన పొరపాటేమిటో అర్థమయింది. తెలివి తెచ్చుకొని చాలా సహజంగా అంది. "ఓహ్. మీ అందం అద్భుతం, క్షమించాలి. ఈ పిల్ల కొత్త లేకుండా మాట్లాడుతుందేమా అనుకుంటారేమో. సభ్యత లేకుండా అలా చూస్తూ రాయిలా నిలబడ్డాను. ఆడవాళ్ళ అందానికి ఆడవాళ్ళే మైమమరచి చూస్తారన్నదానికి ఇప్పుడు నేనే ఇదే తార్కాణం. నావల్ల పొరపాటుంటే మరోసారి క్షమించాలని కోరుతున్నాను." అంటూ తలవంచుకుంది.
నళినీదేవి మహాసౌందర్యవతి అంటూ శృతి అన్నదానిలో ఆ ఒక్కటే నిజం, మిగతాది కల్పన.
తను అందగత్తెనని నళినీదేవికి అణువణువూ గర్వమే. ఇప్పుడు శృతి మాటలు ఆనందంతో పొంగి పోయేటట్లు చేశాయి. అది సహజమేలే అన్నట్లు మృదువుగా నవ్వి ఠీవిగా సోఫాలో కూర్చుంటూ "నీ పేరు శృతి కదూ! కూర్చో అంది.
శృతి నెమ్మదిగా సోఫాలో కూర్చుంది.
"ఓహ్. ఎంత గండం గడిచింది! ఆమె తన్ని గుర్తించలేదు. ఆరోజు తను చూసింది ఈమెనేనా? తన కళ్ళు తనని మోసం చెయ్యవు ఈమెనే.....ఈమెనే ఇదెలా సాధ్యం?"
శృతి ఆలోచనలని చెదరగొడుతూ "రఘునందన్ వివరాలు చెప్పే వుంటాడు, అంది నళినీదేవి.
"చెప్పారు" ముక్తసరిగా అంది శృతి.
"దీనిలో బలవంతమేమీ లేదు."
"నా కిష్టమయి వచ్చాను. నా కిబ్బందేమీ లేదు. నేనే మీ కిబ్బందిగా తోచిననాడు నన్ను మీరు పంపించేయవచ్చు," వినయంగా అంది శృతి.
నళినీదేవి తల పంకించి శృతిని కొన్ని ప్రశ్నలు వేసింది.
నిదానంగా నమ్రతగా సోఫాలో ఒదిగి కూర్చుని జవాబులు చెప్పింది శృతి.
రఘునందన్ మౌనంగా కూర్చున్నాడు.
"స్వాతిగది మేడమీద వుంది. మొదటిసారి తన కొత్త స్నేహితురాలిని వంటరిగానే కలుస్తానంది, వెళ్ళు రఘు నందన్! అమ్మాయి గదిదాకా తీసుకువెళ్ళి విడిచిరా" అంటూ నళినీదేవి లేచి నిలబడింది.
సోఫాలోంచి లేచి సూట్ కేసు అందుకుంది శృతి.
"సామాను ఇక్కడే వుండనియ్యి. స్వాతిగది పక్కనే నీ గది ఏర్పాటు చేశాను. నౌకరు నీ గదిలో సామాను చేరుస్తాడు" అంది నళినీదేవి.
శృతి సూట్ కేసు కింద పెట్టింది.
శృతిని దింపి ప్రయివేట్ రూమ్ లోకి ర రఘునందన్! తూర్పువేపు పొలాల గురించి మాట్లాడాలి" అంది నళినీదేవి.
"అలాగే అమ్మాజీ!" గౌరవ మర్యాదలు పుట్టిపడే స్వరంతో అన్నాడు రఘునందన్.
శృతిని వెంటబెట్టుకుని రఘునందన్ మేడమీదకు దారి తీశాడు.
మేడమెట్లెక్కుతున్న శృతిని చూస్తూ "ఈ పిల్లకి సౌమ్యత, చదువు. చక్కదనం అన్నీ వున్నాయి" అనుకుంది నళినీదేవి.
18
"ఇదే చిన్నమ్మగారుండే గది. లోపలికి వెళ్ళు" మేడ మెట్లు ఎక్కి పైకి వచ్చిన రఘునందన్ ఓగది ముందు ఆగి అన్నాడు.
శృతి ఓ అడుగు ముందు కేసింది.
"మళ్ళీ కలుద్దాం." అని రఘునందన్ వెనుతిరిగాడు.
శృతి నెమ్మదిగా అడుగులేస్తూ గదిలో అడుగుపెట్టింది. అయితే గుమ్మం దాటుతూనే మరి ముందుకి వెళ్ళక గుమ్మానికున్న కర్టెన్ పట్టుకు నుంచుండిపోయింది.
హంసతూలికా తల్పంలాంటి మంచంమీద దిండ్లు ఆధారంతో ఓరగా కూర్చుని వుంది స్వాతి.
నళినీ దేవి రూపురేఖలు ముమ్మూర్తులా పుణికి పుచ్చుకున్న స్వాతి గిలకల కిందదాకా చీర వుండటంవల్ల ఆ కూర్చున్న భంగిమ అందంగా వుందిగాని అవిటితనం తెలియనివ్వటంలేదు. ఎండకన్నె ఎరుగనికన్నియ కావటంవల్ల కాబోలు మల్లెపువ్వులా తెల్లగా సుకుమారంగా వుంది.
స్వాతి కిందనుంచీ పైదాకా శృతిని పరీక్షగా చూసి "ఆగిపోయావేం, రా!" అంది.
నెమ్మదిగా గుమ్మం దగ్గరనుంచి కదిలివచ్చింది శృతి.
"కూర్చో" అని "నీ పేరు శృతికదూ?" అంది స్వాతి.
"ఊ" అని స్వాతి పరీక్షగా చూసింది శృతి.
స్వాతి మల్లెపూవు తెలుపుకాదని, పాలిపోయిన శరీరవర్ణంవల్ల అలా కనిపించిందని గ్రహించింది శృతి.