Previous Page Next Page 
పెట్టితిసిచూడు పేజి 20

    "ఈ రాత్రికి పారేస్తా కదా?"

    "రేపు ఉదయం నుంచీ చేస్తాను."

    "మరి ఈ రోజు?"

    "తద్దినం పెట్టడం ఖర్చు, శ్రమతో కూడిన పని. హోటల్లో భోంచేసి ఇంటికి వెళదాము. రాత్రికి పళ్ళుతిని పాలు తాగుదాము" ఏడ్వలేక నవ్వుతూ జవాబు ఇచ్చింది వెంకుమాంబ.

    "ఖర్మ" అన్నాడు కోదండరామయ్య.

                          11

    సాయంత్రం అయిదు పది.

    "చాలా బాగుంటుంది పిన్నిగారూ!" అంది పంకజం.

    "మీరైనా చెప్పండి బాబాయిగారూ!" అంది మనోరమ.

    "నేను చెప్పటం మా ఆవిడ వినడం అంటూ వున్నట్లయితే ఈడాబా వున్న స్థానంలో అయిదంతస్తుల మేడ లేపేవాడిని" కోదండరామయ్య నవ్వుతూ జోకు వేశాడు.

    ఆయన అన్నదానికి ఎవరూ నవ్వకపోవటంతో జోకు తుస్సుమంది. ఆయన కూడా వాళ్ళు తనమాటలకి నవ్వాలని పేల్చలేదు. తనలో మార్పేమీ లేదు. మామూలుగా వున్నానన్న భావం చూపించటానికి అదో వెర్రి వేషం అంతే.

    "మనసు బాగుండలేదు. ఈసారికి నన్ను వదిలేయండి" అంది వెంకుమాంబ.

    "మనసు బాగుండలేదా?" పంకజం తెల్లబోయినట్లు అడిగేసరికి వెంకుమాంబ తెలివి తెచ్చుకుంది.

    "మనసు కాదమ్మాయ్ శరీరం. ఒంట్లో రుగ్మత ప్రవేశిస్తే మనసు చికాకుగానే వుంటుంది కదా? ఓపక్క చెవిపోటు, మరోపక్క కాళ్ళు లాగటం. ఈ పూటంతా రెస్ట్ గా పడుకుంటే రేపటికి అదే సర్దుకుంటుంది" అంది.

    "వాళ్ళు బలవంతం చేయబట్టి అక్కడే భోంచేశాము. అప్పటినుంచీ మొదలు నాకూ కడుపులో అంత బాగుండలేదు" చేత్తో పొట్ట నిమురుకుంటూ చెప్పాడు కోదండరామయ్య.

    "సినిమాకి పిన్నిగారు రానంటున్నారు. మనంకూడా ఈ రోజుకి ఆగి రేపు వెళితే ఎలా వుంటుందంటావ్?" పంకజం అడిగింది.

    "వెళదామని అనుకున్నాము కదా! సరే నీ ఇష్టం మానేద్దాము" అయిష్టంగా అంది మనోరమ.

    "నాకోసం మీరు ఆగితే నా మనసు మరీ కష్టంగా ఉంటుంది. ఈసారికి మీరు వెళ్ళిరండి" అంది వెంకుమాంబ.

    ఇదే మాట కోదండరామయ్య అన్నాడు.

    భార్యాభర్తలు గట్టిగా చెప్పటంలో మనోరమ, పంకజం అయిష్టంగానే ముఖంపెట్టి సినిమాకి బయలుదేరారు.

    కోదండరామయ్య వెంకుమాంబకిఫ్రీగా ఇంట్లో మాట్లాడుకోవటానికి వాళ్ళు సినిమాకి వెళితే బాగుండునని వుంది.

    అలాగే.

    తామిరువురూ ఫ్రీగా మాట్లాడుకోవాలంటే ఇంట్లో కుదరదు. ఏదో ఒక వంకన బయటికి వెళ్ళాలి. వీళ్ళేప్పుడు సినిమాకి వెళ్ళినా వెంకుమాంబ వస్తుంది. భార్యాభర్తలు వెళితే మాత్రంరాదు. హిందీ సినిమాలకి కూడా రాదూ. చాలా బాగున్న హిందీ సినిమాకి నూటికొకదానికి వెళుతుంది. కథ పంకజం వినిపిస్తుంది తెలుగులో అనువాదం చేసి.

    ఎందుకయినా మంచిదని హిందీ సినిమా ప్లానువేసుకుని పిన్నిగారిని రమ్మని అడిగారు పంకజం, మనోరమ. ఆవిడ రాను అంది. వీళ్ళకి కావాల్సిందీ అదే. మనం అడిగినట్లూ వుండాలి. ఆవిడ రానట్లూ ఉండాలి. చివరికి జరిగింది అదే.

    రోగి పాలు కావాలన్నాడు! వైద్యుడు అవే తాగు నాయనా అన్నాడు.

    మనోరమ, పంకజాల పధకం ఫలించింది.

    వీళ్ళిద్దరూ సినిమాకి వెళితే తామిద్దరూ తెరిపిగా మాట్లాడుకోవచ్చని వెంకుమాంబ, కోదండరామయ్య అనుకున్నారు.  

 Previous Page Next Page