Previous Page Next Page 
కాలాన్ని వెనక్కి తిప్పకు పేజి 20


    తల్లి, తండ్రి వెళ్ళాక యింటికొచ్చిన గౌతమ్ తో ' అమ్మానాన్న దుమ్ము దులిపి వెళ్ళారు. ఇలా  యిద్దరం ఉన్నందుకు, నీవోస్తే నీతో పెళ్ళి గురించి మాట్లాడాలనుకున్నారు నీవెందుకు రాలేదు.'
    'అందుకే రాలేదు. యీ పెద్దవాళ్ళేప్పుడూ పెళ్ళి అన్నమాట తప్ప మరోటి మాట్లాడరు. అపుడే పెళ్ళేమిటి యింకా పూర్తిగా సెటిల్ కాకుండా - ఎనార్ధం అయింది ఉద్యోగంలో చేరి, యింకా పాతికేళ్ళన్నా నిండలేదు - నాలుగు డబ్బులు వెనకేసుకోవాలి. ఓ ప్లాట్, ఓ కారు ఏమీ లేకుండా యిప్పటినించి పెళ్ళేమిటి?' చాలా తేలిగ్గా కొట్టి పారేశాడు. చిత్ర మొహం కాస్త చిన్నపోయింది. పోనీ యిపుడు కాదు, యింకో రెండేళ్ళగి చేసుకుందాం మనం అని అనకూడదా, మీ వాళ్ళకి చెప్పు, కొన్నాళ్ళు ఆగి చేసుకుంటాం' అన్న భరోసా యివ్వకూడదా? గుప్పెడంత గుండె యింకా ముడుచుకుంది. తల్లీ దండ్రి చెప్పినట్లు లివింగ్ టుగెదర్ మీద చూపిన ఉత్సాహం పెళ్ళి పెరేత్తేసరికి తగ్గిపోతుందా మగాళ్ళకి? చిత్ర మొహం ముడుచుకోవడం చూసి 'ఏయ్ ఏమిటలా చూస్తున్నావ్? అమ్మాయిగారికి పెళ్ళి మీదకి పోయిందా మనసు, అమ్మ నాన్న చేసిన బ్రెయిన్ వాష్ పనిచేస్తున్నట్టుంది.' జొకింగ్ గా అన్నాడు. 'అమ్మ , నాన్న అన్నారని కాదు.... మన గురించి చుట్టూ ఏం అనుకుంటున్నారో వింటే .... యీ సెక్రటరీ గాడున్నాడే వాడే మామయ్యకి అంతా చెప్పాడు.....సంసారులుండే ఇళ్ళు, ఇలాంటివి సహించం, యింటి ఓనర్ కి చెప్పి ఖాళీ చేయిస్తాం అంటూ ఎగిరాడుట" ఆ రాస్కెల్ పనా యిది. వుండు వాడి పని చెప్తా" ఆవేశంగా లేచాడు.
    'చాల్లే వాడితో గొడవ పడితే మనకే నష్టం - అమ్మ నాన్న గట్టిగా చెప్పారు. ఆర్నెల్ల నించి కల్సి వున్నారు, ఒకరంటే ఒకరికి అర్ధం అయింది. ఇద్దరూ ఉద్యోగాలు చేస్తున్నారు ఇంకా ఆలస్యం వద్దు అన్నారు' గౌతమ్ విసుగ్గా చూశాడు.
    'అబ్బ, ఎంత చదివినా ఉద్యోగాలు చేసినా మీ ఆడవాళ్ళకి ఎప్పుడూ పెళ్ళి గోలే. పెళ్ళయితే తప్ప లైఫ్ కి సెక్యూరిటీ లేదనుకునే సగటు ఆడదానికి, నీకు తేడా ఏముంది?' హేళనగా అన్నాడు . చిత్ర మొహం ముడుచుకుంది. యింకే అనాలో తెలియక 'సరేలే ఆలోచిద్దాం- ఇపుడే అంటే కుదరదు. పెళ్లకే ముంది ఎప్పుడంటే అప్పుడే చేసుకోవచ్చు' సర్ది చెపుతున్నట్లన్నాడు."

                                                  *    *    *    *  

    గౌతమ్ ఈ మధ్య మారాడని అనిపిస్తుంది చిత్రకి. ఆ ప్రేమ మైకం, ఉదృతం తగ్గింది - నిద్ర సరిపోక , ఆఫీసులో పని సాగకపోవడంతో వీక్ ఎండ్స్ ని పరిమితం చేసుకున్నారు, శృంగారానికి - ఆఫీసులో పనెక్కువై వంట చెయ్యాలంటే బద్ధకం అనిపిస్తుంది. వంట చేయడం తన డ్యూటీ అన్నట్లు గౌతమ్ వంటింటి వైపు రాకుండా దర్జాగా పేపరో, పుస్తకమో చదువుకుంటూ కూర్చోవడం చూస్తె చిత్రకి వళ్ళు మండుకొస్తుంది. పైగా వంటకి వంకలు ....కట్టుకున్న పెళ్ళాం మీద ఎగిరినట్టు బట్టలుతికినవి, ఇస్త్రీ వి లేకపోతే విసుక్కోడం, వినివిని ఓ రోజు చిత్ర "ఏమిటలా మొగుడిలా అధారిటీ చేస్తున్నావు. నీ బట్టలు నేను రెడీ చెయ్యాలా/ యిస్త్రీ పెట్టక్కడ వుంది చేసుకో" అంది అరుస్తూ. గౌతమ్ మొహం ముడుచుకుని విసురుగా యిస్త్రీ చేసుకుని బట్టలు వేసుకుని టిఫిను తినకుండా వెళ్ళిపోయాడు. రెండు రోజులు మాట్లాడకుండా అలిగిన అతన్ని మళ్ళీ చిత్ర ప్రసన్నం చేసుకోవాల్సి వచ్చింది. ఇంకోరోజు సాయంత్రం అఫీను నించి వస్తూనే తలనొప్పితో పడుకుంది - వంట చెయ్యలేదు. గౌతమ్ వస్తూనే ఆకలి అంటూ వచ్చాడు ఎనిమిది గంటలకి - చిత్ర చిరాగ్గా 'వంట చేయ్యలేదు' నాకు బాగులేదు. నీవు చెయ్యి. కుక్కరు పడేసి ఫ్రిజ్ లో నిన్న కూర, పచ్చడి వున్నాయి వేడి చెయ్యి అంది. 'నాకాకలేస్తుంది యిప్పుడు నే చెయ్యాలా.' చాలా చిరాగ్గా మొహం పెట్టి , ఏదో హోటల్ కి పోయి తింటా వంట నా వల్ల కాదు' అంటూ విసురుగా వెళ్ళిపోయాడు. చిత్ర మనసు చివుక్కుమంది. తనేం తింటుంది అని కూడా అడగకుండా, తనని రమ్మనకుండా అలా వంటరిగా వెళ్ళిపోయాడని ఉక్రోషం వచ్చింది. ఓ గంటన్నర తర్వాత చేతిలో దోష పొట్లాం పట్టుకుని వచ్చాడు. 'ఇదిగో నీకోసం దోష తెచ్చాను; అన్నాడు. చిత్ర చురచుర చూసింది. తనక్కడ శుభ్రంగా కావల్సినవి తిని వచ్చాడు - పోనీ తనూ యింటికి తెచ్చుకుంటే ఇద్దరూ కల్సి తినేవారుగా.- ఆమాట పైకి అనకుండా ఉండలేకపోయింది. ఆకలి చల్లారిన గౌతమ్ తేలిగ్గా నవ్వేస్తూ 'దోశ చల్లారిపోతే బాగుండదని తినేసి నీకు తెచ్చాను, దానికే ఇంత కోపమా' అన్నాడు.
 చిన్న తగవులు , అలకలు ఎక్కువయ్యాయి. - ఒకరి నొకరు ఆకర్షించుకోవాలి యింప్రేస్ చెయ్యాలన్న ఆరాటం తగ్గింది. పెళ్ళయిన కొత్త జంట పాతబడి సంసారం సాగిస్తున్న దంపతులలా తయారయింది - గౌతమ్ విసుక్కున్నా, కొప్పడ్డా కట్టుకున్న పెళ్ళాం ననుకుంటున్నాడు అనిపించేడు చిత్రకి - చిత్ర దెబ్బలాట పెట్టుకుని అలిగితే 'యీవిడ అలకలు తీర్చడానికి కట్టుకున్న మొగుడినా' అనిపిస్తుంది గౌతమ్ కి - ఒకరిలో మరొకరికి లొసుగు లేక్కువ కనిపిస్తున్నాయి. మైనస్ పాయింట్లు, వీక్ పాయింట్లు బయటపడ్తున్నాయి - కాని ఇద్దరికిద్దరూ బయటపడకుండా , 'ఇదేనా నీ ప్రేమా' అని రెండో వారు నెపం వేసే అవకాశం  యివ్వకుండా గుంభనంగా వున్నారు.
    ఆరోజు గౌతమ్ ఆఫీసుకి అతని తండ్రికి హార్ట్ అటాక్ వచ్చిందని ఫోను రాగానే బయలుదేరి వెళ్ళాడు.
    ఈరోజు తీరిగ్గా వెనక్కి తిరిగి చూసుకుంటుంది చిత్ర- యిద్దరి సహచర్యం ఆరంభమయి ఏడాది దాటింది. యింకా సాగదీయకుండా గౌతమ్ ని ఖచ్చితంగా పెళ్ళి గురించి అడగాలి. తల్లి తండ్రి ఆదివారం ఫోనులో అరగంట యిదే విషయం పై వత్తిడి తెస్తున్నారు. వాళ్ళడిగారనే కాక తనకీ ఈ మధ్య గౌతమ్ వ్యవహారం తెల్సుకోవాలనిపిస్తుంది. చిత్ర అతను రాగానే మాట్లాడాలని నిర్ణయించుకుంది.

                                                 *    *    *    *

    గౌతమ్ రావడమే చిరాగ్గా వచ్చాడు. 'ఎలా వుంది మీ డాడీకి' చిత్ర అతని చేతిలో షోల్డర్ బ్యాగు అందుకుంటూ అడిగింది. హార్ట్ ఎటాక్ లేదు ఏం లేదు . సేమ్ ఓల్డ్ స్టోరీ - మన సంగతి తెలిసి తిట్టడానికి పిలిచారు. నీవసలు మా నాన్న గారి అడ్రసు మీ వాళ్ళకి ఎందుకు చెప్పావు?' చిత్ర మీద ఎగిరాడు.
    'నేనేం అడ్రసు యివ్వలేదు. మీ నాన్నగారి పేరు, ఎక్కడ పనిచేస్తారు అని కాజువల్ గా అడిగితె పూనాలో మీ నాన్నగారి పనిచేసే కంపెనీ పేరు చెప్పాను."
    "యింకేం ఆ కంపెనీలో టాప్ పొజిషన్ లో వున్న ఆయనని పట్టుకోడం ఏం కష్టం - ఫోన్ చేసి మన సంగతి చెప్పి, మీ అబ్బాయికి మా అమ్మాయికి పెళ్లి జరిపించాలి త్వరలో' అన్నారుట.  సోఫాలో కూర్చుని షూస్ లెస్ విప్పుకుంటూ అన్నాడు. 'పోనీ చేసేసుకుందామా. ఇటు, అటు అంతా గొడవ గొడవ చేస్తున్నారు. వెనక నించి అతని భుజాల చుట్టూ చెయ్యి వేసి తలకి తల ఆన్చి గోముగా అంది. గౌతమ్ చిరాగ్గా చేయి తీసేసి, 'స్టుపిడ్ , చేసుకోమంది నిన్ను కాదు, అన్నాడు . చిత్ర మొహం కళ తప్పింది. 'నీవేమన్నావు?' సూటిగా చూసి అడిగింది. గౌతమ్ చూపు తప్పించాడు. "ఏమంటాను నా మాట అసలు వాళ్ళు వినిపించుకుంటేనా? వాళ్ళు ఖచ్చితంగా చెప్పేశారు. పెళ్ళి కాకుండా కాపురాలు చేసే పిల్లని చచ్చిన కోడలిగా అంగీకరించమన్నారు. పెళ్ళికి చూడాల్సింది, నచ్చాల్సింది అందాలు ఒకటే గాదు, అబ్బాయి, అమ్మాయిలే కాదు, సాంప్రదాయాలు యిటు అటు కుటుంబాలు చూడాలిట- పెళ్ళి కాకుండా మొగపిల్లలతో కాపురం వలెగబెట్టే అమ్మాయి పెళ్ళి తర్వాత సవ్యంగా కాపురం చెయ్యదట."
    చిత్ర నల్లబడిన మొహంతో కింద పెదవి కొరుకుతూ "మరి నీవు చెప్పలేదా, మనం ప్రేమించుకుంటున్నామని , పెళ్ళి చేసుకుంటామని"
    "నే చెప్పకముందే వాళ్ళ తెల్సిందిగా." ఆ అమ్మాయిని నిజంగా నీవిష్టపడితే ముందే చెప్పాల్సింది. ఆ అమ్మాయి ఇలా నీతో కాపురం వెలిగించే ముందే నిన్ను పెళ్ళి చేసుకోమని అడిగి వుంటే అలాంటి అమ్మాయిని కోడలిగా అంగీకరించడానికి మాకేం అభ్యంతరం వుండేది కాదు. ఆడపిల్ల అంత తెగించి, బరితెగింపుగా పెళ్ళి ప్రసక్తి లేకుండా నీతో ఏడాదిగా వుందంటే ఆ అమ్మాయి కారెక్టర్ ఎలాంటిదో తెలుస్తుంది. అలాంటి పిల్లనా నీవు చేసుకునేది' అని దులిపి పారేశారు.
    చిత్ర మొహం మరింత నల్లబడింది. 'అలా అంటుంటే వింటూ వూరుకున్నా వన్నమాట?' ఉక్రోషంగా అంది. 'ఏం చెయ్యను, అసలు వాళ్ళు నాకు మాట్లాడే అవకాశం యివ్వలేదు. వాళ్ళకి సాంప్రదాయం , కుటుంబం ముఖ్యం అట - అలాంటి మంచిపిల్లని వాళ్ళు చూసి వచ్చారుట. మహారాష్ట్ర బ్రాహ్మణ అమ్మాయినే చేసుకోవాలన్నారు. తల్లి దండ్రి కావాలంటే ఆ అమ్మాయిని చేసుకోవాలన్నారు. అలా మాట వినకపోతే వాళ్ళకి నాకు సంబంధం వుండదు. ఆస్థి మొత్తం అనాధ శరణాలయానికి రాసి పారేస్తాం అని బెదిరించారు.'    
    చిత్ర చిత్రంగా చూసింది. 'ఆ బెదిరింపులకి లొంగిపోతావా, అర్ అల్ రెడీ లొంగిపోయావా' గౌతమ్ మొహంలో హావభావాలు వెతుకుతూ అంది గౌతమ్ తలదించుకున్నాడు. 'చిత్రా , మనం ఎంత ప్రేమించుకున్నా తల్లిదండ్రులని కాదని పెళ్ళి చేసుకుంటే భవిష్యత్తులో సుఖంగా వుండగలమా? నేనొక్కడినే మా వాళ్ళకి - మా అమ్మ ఎంత ఏడ్చిందో, అలా వాళ్ళని బాధపెట్టి మనం హాయిగా వుండగలమా అన్పిస్తుంది ఆలోచిస్తే ' చిత్రకి కోపం నసాళానికి అంటింది. "అవును పాపం , తల్లితండ్రి నీకే వున్నారు. అయినా ఓ ఆడపిల్ల కోసం కోటి రూపాయల ఆస్తి వదులుకుంటారా మీ మగవాళ్ళు. ఆ మారాటి ఆమ్మాయి నా కంటే బాగున్నట్టుంది. అంచేత నీకు తల్లి తండ్రి మీద భక్తీ ఎక్కువైపోయింది పాపం" వ్యంగ్యంగా అంది. గౌతమ్ కళ్ళు వాల్చుకున్నాడు. చిత్ర అతని మోహంలో భావాలు వెదుకుతూ రెండు నిమిషాలు చూసి అతను మాట్లాడకపోవడం చూసి గిరుక్కున తిరిగి బెడ్ రూమ్ లోకి వెళ్ళి అతని బట్టలు, సామాన్లు సూట్ కేస్ లో , షోల్డర్ బ్యాగులో పడేసి తీసికొచ్చి వీధి తలుపు తీసి బయటపడేసి ఇంకా వెళ్ళచ్చు అన్నట్టు మండుతున్న కళ్ళతో నడుం మీద చేతులు పెట్టుకు నిల్చుంది. గౌతమ్ నల్ల బడ్డ మొహంతో ఏదో చెప్పబోతే  చేత్తో వారించింది. ఇప్పటికే తన ప్రేమ, ఎమోషన్స్, శక్తి, డబ్బు అన్నీ చాలా ఖర్చు పెట్టింది. ఇంకొక మాట కూడా మాట్లాడి తన ఎనర్జీ ఎమోషన్స్, ప్రేమని వృధా పరచదలచుకోలేదు చిత్ర.

                                                                                                       ***   

 Previous Page Next Page