Previous Page Next Page 
మోడల్ పేజి 20


    మధుకి ప్రదీప్ ని గొంతు పిసికి చంపేయాలన్నంత కోపం వచ్చింది ఆ అవకాశం వస్తే బావుంటుందనుకొన్నాడు.

    "నిన్న షూటింగ్ జరుగుతుండగా ఓ వ్యక్తి పొడమాటునుంచి అంతా గమనించాడు. ఫోటోలు కూడా తీసాడు. అంటే రూపా చెల్లెలిని మనం మోడల్ గా తీసుకున్నట్లు తెల్సి ఆపని చేసాడా? లేక రూపా  మన మనిషని చేసాడా?"

    "మనం ఫైల్లో సోఫియా ఫోటోల దగ్గర ఆమె ఎవరయింది అడ్రస్సు  ఇవ్వలేదు. కానుక సోఫియా రూపా  చెల్లెలని తెలిసే అవకాశం లేదుసార్."

    "యు ఆర్ రైట్. మనం అదొక మంచిపని చేసాం. లేకుంటే ఈపాటికి ప్రదీప్  మనుష్యులు ఢిల్లీ వెళ్ళి వుండేవారు."

    "అతను చూసి వెళ్ళవచ్చుగా...ఫోటోలు ఎందుకు తీసినట్లు?"

    "ఒడ్డునుండి రూపా ఉన్న పడవ ఎంత దూరంలో వుందో తెలుసుకొనేందుకయి ఉంటుంది. కెమేరాఉన్న స్థలంనుంచి, ఆబ్జెక్టుఉన్న స్థలాన్ని అంచనా వేసుకోగలిగితే, ఫోటోనిబట్టి ఒడ్డునుంచి పడవ ఎంత దూరంలో ఉందో కాస్త అటూ ఇటూగా తెల్సుకోవచ్చు. నిన్న ఆ విషయాన్ని గమనించికూడా ఈ ఫోటోళ తారుమారు గొడవలోపడి దాన్ని నిర్లక్ష్యం చేసాను. నా నిర్లక్ష్యం మూలంగా ఒక నిండు ప్రాణం బలయ్యేది" నుదురు కొట్టుకున్నాడు బాధగా మనోహర్.

    "సార్! మనం ఇలా చూస్తూ కూర్చుంటే ప్రదీప్ అది మన అసమర్ధతగా భావించి మరీ చెలరేగావచ్చు. మీరు  ఊ అంటే దెబ్బకు దెబ్బ తీస్తాను" అన్నాడు పళ్ళు పటపట కొరుకుతూ ఆవేశంగా.

    "ఇప్పుడు మనక్కావల్సింది ఆలోచన. ఆవేశంకాదు మధు మనం ఈ ఛాలెంజీలో గెలిచి దాన్ని వైల్డ్ ఫైర్ లా విస్తరింపచేస్తేచాలు. అదే అతనికి సమాధి. అహం దెబ్బతిన్న ప్రదీప్ ఈ ఫీల్డ్ నుండి పారిపోతాడు అతను పోతే మన ఫీల్డ్ కి మంచి రోజులొచ్చినట్లే. సో.....మనంఅలాంటి దేబ్బతీద్దాం. అతను వేసే దెబ్బలకు అప్రమత్తంగా ఉంటూ, వాటిని కాసుకుంటూ మార్చి 31న చావుదెబ్బ తీద్దాం" అన్నాడు స్టీరింగ్ మీద నుంచి ఎడంచేయితీసి మధు భుజం మీద వేసి అభిమానంగా నిమురుతూ.

    "నాకు అర్ధంకాని విషయం ఒకటే మధు."

    "ఏమిటి సార్?"

    "రూపా ఈరోజు షాట్ లో పడవ అంచుపై నిలబడుతుందని, ఆమె ధరించే కాస్టూమ్స్ లో భాగంగా ఆమె నడుమునుంచి పూసలదండ నీళ్ళలోకి వ్రేలాడుతుందని, తన్మయంగా కూల్ డ్రింక్ చుక్కలు నాలికపైకి వంపుకుంటుందనే విషయం స్ర్కిప్ట్ లోనే ఉంది. అది నీకు, నాకు, రూపాకి తప్ప మరెవరికీ తెలియదు. కాని  అది వారికెలా తెల్సిపోయింది? అది తెల్సిపోబట్టే అతను నీళ్ళలో ఉన్నట్లుగా ఎవరు గమనించే అవకాశం లేకుండా పోయింది. అదే లేకుంటే అతను పడవ అంచువరకు తన చేతిని చాపి రూపా కాలును పట్టుకోవాల్సి వచ్చేది. అది రూపా గమనించకపోయినా మిగతా మోడల్స్ చూసే అవకాశం ఉండేది. ఎలా.....జరిగింది? ఎలా బయటకు పొక్కింది....?" ఆలోచిస్తూనే కారును ఇంటిముందు ఆపాడు.

    మధుకి జరిగిన సంఘటనల్ని తలుచుకుంటుంటే భయంగా లేదు. థ్రిల్లింగ్ గా వుంది. ఛాలెంజ్ లో గెలిచి తీరాలనే పట్టుదల, ఉత్సాహం రెట్టింపవుతున్నాయి అతనిలో. కరాటే, స్విమ్మింగ్, హార్స్ రైడింగ్. మోటార్ సైకిలింగ్ లో శిక్షితమైన శిక్షణ పొందిన మధుకి వాటిని పర్సస్ ఫుల్ గా  ఉపయోగించుకొనే చాన్స్ ఎప్పుడొస్తుందా అని ఎదురు చూస్తున్నాడు చాలాకాలంగా. మనోహర్ ఒక్క చాన్స్ యిస్తే ప్రదీప్, కైలాష్ ళ కాళ్ళు చేతులు విరిచేయాలని వుంది. మనోహర్ సరాసరి ప్రాజెక్టింగ్ రూమ్ లోకి నడిచాడు. మధు ఆ వెనుకనే ప్రాజెక్టింగ్ రూమ్లోకి వెళ్ళాడు. మనోహర్  ఏం చేయబోతున్నాడో తెల్సుకుందామనే ఆతృతతో కమలిని, మంగళ కూడా లోనికెళ్ళారు.

    "స్లయిడ్ ప్రొజెక్టర్ లో పెట్టి స్ర్కీన్ మీద ప్రాజెక్టుచేయి మధు" అంటూ కూర్చున్నాడు.

    మంగళ వచ్చి మనోహర్ ప్రక్కనే కూర్చుంది. ఆ ప్రక్కనే కమలిని కూర్చుంది. వారిపై పోసారి చూసి, స్ర్కీన్ వైపు తలత్రిప్పుతూ మంగళ నెత్తిమీద ఒకటి వేశాడు చిలిపిగా. మంగళ చేయిఎత్తి, ప్రక్కనే కమలిని, ప్రొజెక్టర్ దగ్గర మధువుండటంతో ఆగిపోయింది.

     

    మధు ఒక స్లయిడ్ పెట్టి ప్రాజెక్టు చేశాడు. అంతకుముందే గదిలోని లైట్ ని ఆఫ్ చేశాడు మనోహర్. గదంతా చీకటిగా వుంది. స్ర్కీన్ మాత్రమె వెలుగుతో నిండిపోయింది.

    స్ర్కీన్ మీద నిండుగా తరంగిణి కనబడుతోంది. కుడినుంచి, ఎడంవైపుకి విసురుగా వెళ్తున్నట్లుగా వుంది. మూవింగ్ ఆబ్టేక్టును ఫోటో తీసినట్లుగా ఉంది ఆమె ప్రక్కనే మరో అయిదారుగురు మాట్లాడుకుంటూ నడుస్తున్నట్లుగా వుంది, చాలా ఎత్తుగా వుంది. పొడవాటి కురులు ఫ్రీగా వదిలేసినట్లుగా వున్నాయి. జీన్ పాంట్ లో చీజ్ లో కాటన్ షర్ట్ టక్ చేసుకుంది. నెత్తిమీద ఫ్రెంచ్ టోపీని స్టయిల్ గా ఓ ప్రక్కకువంచి పెట్టుకున్నట్లుగా ఉంది. ఏదో పనిమీద ఇటు తిరగగా, అప్పుడు తీసినట్లుగా మోము మూడొంతులు కనిపిస్తోంది.

    "మేడమ్......మీకేమనిపిస్తోంది ఆమెను చూస్తుంటే.....?" అడిగాడు కమలినిని.

    "ఫెంటాస్టిక్ హైట్.....గుడ్ ఫీచర్స్......సూపర్స్ అనాటమీ" అంది కమలిని స్ర్కీన్ వైపే చూస్తూ.

    "ఆమెను చూస్తూంటే మీకు ఒక యాడ్ గుర్తొచ్చి వుండాలి."

    కమలినికి అర్థంకాలేదు.

    "ఫ్రెంచి పెర్ ప్యూమ్ 'చార్లీ' కి ఇచ్చిన యాడ్ డిజైన్ గుర్తుకు రావటం లేదూ?"

    "య్యా.....యూఆర్ పర్ ఫెక్టిలీ రైట్. మిస్టరీ' హీరోయిన్ బుకె కరోలిన్ లా వుంది. యు ఆర్ ఇంటిలిజెంట్ మనోహర్. ఎక్కడ  ఏ యాడ్ చూసినా ఠక్కున దానికి పోలికవున్న మరో యాడ్  గురించి చెప్పగలవు. అందుకే మేం మోడల్స్ గా మిగిలిపోయాం. నువ్వు మోడల్ మేకర్ వయ్యావు."

    స్ర్కీన్ వైపే పరిశీలనగా చూస్తున్న మనోహర్. "మధు ఆమె నడుం ప్రాంతంలో దూరంగా ఒక బోర్డ్ అస్పష్టంగా కనిపిస్తోంది గమనించావా?"

    "యస్.....సార్....."

    "స్లెయిడ్ సెంటర్ ని ఎన్ లార్జ్ చేయి."

    మధు స్లెయిడ్ పైన, క్రింద బ్లాక్ పేపర్ తో ఒపెన్ చేసి మధ్య భాగాన్ని పెద్ద సైజ్ లో ప్రాజెక్టు చేశాడు.

    మనోహర్ కళ్ళు మెరిశాయి.

    స్ర్కీన్ మీద బోర్డ్ స్పష్టంగా కనిపిస్తుంది.

    "మధు రాసుకో నేను కొన్ని ఇంగ్లీషు లెటర్స్ చెబుతాను....." అన్నాడు.

    మధు పేపర్, పెన్ తీసుకున్నాడు.

    "R......I....L.....W.....A.....T....U....N...N....E" మనోహర్ చెబుతూంటే పేపర్ మీద రాసాడు.

    "ఆ పేపర్ ఇలా ఇవ్వు" అన్నాడు మనోహర్.

    మధు పేపర్ ఇచ్చాడు.

    "ప్రొజెక్టర్ ఆఫ్ చేసి లైట్స్ వేయ్."

    మధు ఆ పని చేసివచ్చి మనోహర్ ప్రక్కన నిలబడ్డాడు.

    పేపర్ మీద "R......I....L.....W.....A.....T....U....N...N....E...అక్షరాలూ కనబడుతున్నాయి. "వీటిలో కొన్ని అక్షరాలు లేవు. అవి అక్కడ బోర్డ్ మీద చెరిగిపోయన్నా వుండాలి. లేదా ఆ కెమేరా మైస్యూట్ పర్టిక్యులర్స్ కేట్ చేయగలిగేది అన్నా అయుండదు. "రిల్వాటన్నె" అని  వస్తోంది వీటిని కలిపి చదివితే. దీనికి అర్థంలేదు. ఫోటో సబ్జెక్టుని స్టడీ చేయాలి. తరంగిణితోపాటు మరో అయిదారుగురు నడుస్తున్నారు. వారి నడకలో స్పీడ్ కనిపిస్తోంది. చేతుల్లో లగేజీ వుంది. దీన్నిబట్టి అది బస్  స్టాండ్ గాని, రైల్వేస్టేషన్ గాని అయ్యుండాలి. ఏమై వుంటాయి. ఆ మిస్సైన లెటర్స్?"

    "బస్ స్టాండ్ కి సంబంధించిన ఒక్క ఇంగ్లీషు లెటర్ ఈ లెటర్స్ లో లేదు. కనుక.....కనుక...."ఆగిపోయింది మంగళ.

    "మనకు అక్షరాలు లేందీ మొదటి Rకి Iకి మధ్య, ఐదో లెటర్ Aకి Tకి మధ్య పదప లెటర్ E తరువాత మొత్తాన్ని మరోసారి చదివాడు మనోహర్. అతని కళ్ళు మెరిసాయి. "RAILWA.....TUNNE" వీటికి మొదటి పదానికిY, రెండవ పదానికి L కలిపితే చాలు RAILWAY TUNNEL వస్తుంది అంటే ఇది సొరంగ రైలుమార్గం" సన్నగా విజిల్ వేసాడు మనోహర్ ఆనందంతో.

    "నువ్వేం సంతోషపడక్కర్లేదు. ప్రపంచంలో చాలా వున్నాయ్ భూగర్భ రైలుమార్గాలు ఏదని ఊహించగలవ్?" ఎకసెక్కంగా అంది మంగళ. ఆమెకీ గొడవలన్నీ చికాగ్గా వున్నాయ్. ఎంచక్కా పెళ్ళిచేసుకొని తను లెక్చరర్ గా, మనోహర్ ఏదన్నా స్టూడియో పెట్టుకుంటే హాయిగా విశాఖపట్నంలో సెటిల్ అయిపోవచ్చని వుంది.

    సృజనాత్మకతలేని ఓ సాధారణ మనిషిలా వూహించుకుంది మనోహర్ ణి మంగళ.

    నువ్వేం హేళన చేయక్కర్లేదు. అది కచ్చితంగా ఇండియాలోని భూగర్భ రైల్వేలైనే."

    "ఎలా మనోహర్?" దాని ఖచ్చితంగా ఎలా నిర్థారించాగలం?" అడిగింది కమలిని.

    "ఆమెతోపాటు వున్న ఐదారుగురు వ్యక్తుల్ని చూసారా? వారి వేషధారణ ఇండియన్స్ లా లేదు? మధు ఆ స్లయిడ్ మరలావేయ్."

    మధు మరలా స్లయిడ్ వేసాడు.

    "ఇప్పుడు చూడండి.....పైగా బ్యాక్ డ్రాప్ లో బెంగాలీ ఎక్స్ ప్రెస్ డైలీ పబ్లి సిటీకి చెందిన వాల్  పెయింట్ కనిపిస్తోంది. దాని ప్రక్కనే హజిమోలా ఆయుర్వేద  టానిక్ పెయింట్ కనిపిస్తోంది. బెంగాలీ డైలీ ఫారెన్ లో పోదు. ఖచ్చితంగా బెంగాల్లోనే  అమ్ముతారు. రీజనల్ లేంగ్వేజీ  డైలీ ఇతర రాష్ట్రాల్లో కూడా పోయే అవకాశంలేదు. పొటెన్షియాలిటీ వున్న ఏరియాలోనే పబ్లిసిటీ ఇవ్వటం మార్కెటింగ్ స్ట్రాటజీ కనుక అది కలకత్తా ఆయుండాలి.

    "ఇండియాలో మామూలు రైలుమార్గాలకే దిక్కులేదు. భూగర్భరైలుమార్గమొకటా?"

    "నిన్ను నోర్ముయ్ మన్నాను. అసలు మీ లెక్చరర్స్ కి టెస్ట్  బుక్కుల్లో వున్నదే గుర్తుండదు. టైమంతా ట్యూషన్స్ చెప్పుకోటానికి సరిపోతుంది. మోస్ట్ రొటీన్ జాబ్.

    నువ్వుత్త మొద్దువి. అందుకే నీ తలలో మట్టి వుందని అనేది" అన్నాడు మంగళవైపు కొంటెగా చూస్తూ. ఆ మాటలకి మంగళకు ఉక్రోషం వచ్చింది.

    "కలకత్తాలో సొరంగ రైలుమార్గం 1984 నవంబర్ లో ఓపెన్ చేశారు.....అందులో ప్రయాణించే భూగర్భరైలు ఎన్ ప్లనేడ్ స్టేషన్ నుంచి నాలుగు కిలోమీటర్ల దూరాన వున్న భవానీపూర్ ఏరియాలో గాని  పనుండి వుండాలి. లేదా ఫ్రెండ్సో, బంధువులో వుండాలి. మధు రెండో స్లయిడ్ వేయి" అంటూ ఆ కాగితాన్ని మడిచి జేబులో పెట్టుకున్నాడు.

    మనోహర్ లోని తార్కికబద్దమైన ఆలోచనకు మధు, మంగళ కమలికి మతులు పోతున్నాయి. ఒకదానికొకటి కలుపుకొని అలా అలా అల్లుకుపోతున్నాడు శరవేగంతో.

    బాస్  కలకత్తా  పంపిస్తే బావుండు......డిటెక్టివ్ లా శోధించి ఆమె జాడ  కనుక్కోవచ్చన మధు తెగ ఆరాటపడిపోతున్నాడు.

    ప్యారిస్ లో వున్నట్లు తెలిస్నా ఆ ఫోటోను స్లయిడ్ చేయమని ఎందుకన్నాడో, ప్రాజెక్టు చేయమని ఎందుకంటున్నాడో అర్థంకాలేదు మధుకి. మిగతా ఇద్దరికీ అంతే. కాని కారణం లేకుండా ఏ పని మనోహర్ చేయడనే గొప్ప నమ్మకం వుంది వారికి.

    రెండో స్లయిడ్ ప్రాజెక్టు చేసాడు.

    మనోహర్ స్క్రీన్ వైపు చూసాడు సునిశితంగా.

    "చూసారా మేడమ్! ఆమె చూపులు ఎంత ఎలిగెంట్ గా, ఎంత ధీమాగా వున్నాయో? సూప్ లో పడితే పడ్డానుగాని నేను చాలాకాలంగా  శోధిస్తున్న టాప్, స్టన్నింగ్ బ్యూటీ లక్షణాలన్నీ ఈమెలో వున్నాయ్. ఈమెను పట్టుకోగలిగి, ఫిల్మ్ తీసానంటే నా వృత్తిలో నాకు గొప్పమలుపు తగిలినట్లే."

 Previous Page Next Page