"అలా చెప్పినందుకు ఆ తర్వాత మీరు నన్నెంతో మెచ్చుకున్నారు" రోషంగా అంది వెంకుమాంబ.
"మనం ఇలా వాదులాడుతూ కూర్చున్నంత మాత్రాన తలకాయకి కాళ్ళోచ్చి నడిచిపోదు. అది గుర్తుంచుకో" గంభీరంగా అన్నాడు కోదండరామయ్య.
అదీ నిజమేననిపించింది వెంకుమాంబకి.
"అది చూసినప్పటినుంచీ నా బుర్ర పనిచేయటం మానేసింది. ఏం చేస్తారో మీ ఇష్టానుసారం చేయండి. కాని......దాని తలను మాత్రం ఇంట్లో పాతేయద్దు. అలా చేస్తే మాత్రం నాకు పిచ్చి పట్టడం ఖాయం."
"అలా నీవు శాంతంగా మాట్లాడితే ముందు నా బుర్ర లిరగటం మానేస్తుంది. అది మామూలు శవం తాలూకా తల కాదు. ఎవరో దారుణంగా హత్య చేసిన తల శవం తాలూకా తల, చేతులు మనింట్లో తగలడ్డాయన్న దారుణ విషయం పోలీసులకి తెలిసిందే అనుకో అసలు హంతకుడిని, అసలు కథని వదిలేసి కొత్తకధ అల్లి మన చేతికి బేడీలు తగిలిస్తారు పోలీసు వాళ్ళు కనుక....పెట్టి సారేస్తే మన పీకికి నేరం చుట్టుకోవచ్చు గాబట్టి పెట్టెని మనింట్లో పాతసామానుల కొట్లోపారేసి శవం తలకాయని చేతులని దేనిలోనన్నా పెట్టి ఎక్కడన్నా పారేసి వదిలించుకుందాము. నాకు తోచింది ఇది" కోదండరామయ్య వివరించాడు.
"బాగుంది. అలానే చేద్దాము. వెధవ పితలాటకం చుట్టుకుంది మన ప్రాణానికి!" ఉస్సురంటూ శలవిచ్చింది వెంకుమాంబ.
రాత్రి వెంకుమాంబ పడిపోవటంతో వెంటనే పెట్టె మూత వేశాడు కోదండరామయ్య. ఆ తర్వతః పెట్టెని మళ్ళీ తెరిచి చూడలేదు. ఆ పెట్టెలో అవయవాల మూట వుండడం గాని, లెటర్ వుండడంగాని తెలియదు. తల, రెండుచేతులు మాత్రమేననుకుంటున్నాడు.
"పక్కవాళ్ళకి అనుమానం రాకుండా మనం చాలా జాగ్రత్తగా వుండాలి" అన్నాడు కోదండరామయ్య.
ఆవులించకుండానే పేగులు లెక్కపెట్టే గడుగ్గాయిలు వాళ్ళు. తెల్లారి లేవంగానే ఆ పంకజం అడగనే అడిగింది. 'ఏంటి పిన్నిగారూ! ముఖం అలా పీక్కుపోయింది అని....' రాత్రి అన్నీ పీడకలలేను, నిద్ర పట్టలేదు అని చెప్పాను అని వెంకుమాంబ చెప్పింది.
ఆ తర్వాత ఎన్ని జాగ్రత్తలు తీసుకోవలసిందీ ఇరువురూ కలసి చర్చించుకున్నారు.
"ఇదంతా ఏకపాదంగాడు చేశాడు. పెట్టెని రైలులో పెట్టి చల్లగా జారుకుందామనుకున్నాడు."
"నిజమే! వాడి ఖర్మ కొద్దిగా కాలి పోలీసులకు చిక్కాడు మన ఖర్మ పూర్తిగా కాలి పెట్టెను ఎత్తుకొచ్చాము"
"తప్పయిపోయిందని చెంపలు వేసుకుని ఈ పెట్టెని ఏకపాదం రైలులో ఎక్కించాడని చెపితే! ఎలాగూ వాడు పోలీసుల దగ్గిరేకదా వుంది?"
"ఇలాంటి తెలివి తక్కువ ఆలోచనలు చేసి మనంకూడా శ్రీకృష్ణ జన్మస్థానం చూసే పని చేయకు. మీకు చెప్పంగానే సరికాదు. నిజానిజాలు పూర్తిగా మాకు తెలిసిందాకా మీరు కూడా మాకు అతిధులుగా వుండండని కటకటాల్లోకి తోస్తారు."
"పోలీసులు అంత దుర్మార్గులా?"
"ఆ.....మనమే ఈ హత్య చేశామని సాక్ష్యాధారాలు కూడా పుట్టిస్తారు.
"ఆ...." అంది వెంకుమాంబ నోరు తెరుస్తూ.
కోదండరామయ్య, వెంకుమాంబ అలా ఆలోచిస్తున్నారు. వాళ్ళ ఊహకి అందనిది ఒకటి వుంది.
అది ఏకపాదం విషయం
"మనం మాట్లాడుకోటం అయింది. ఇంక లేద్దాము" కోదండరామయ్య కూర్చున్న చోటు నుంచి లేస్తూ అన్నాడు.
వెంకుమాంబ లేచింది.
"ఇంటి కెళ్ళంగానే ఈ పూట వంట చేయటంలేదుగా?"
"శవాన్ని ఇంట్లో పెట్టుకున్నా? నేను బతికుండగా చెయ్యను."