Previous Page Next Page 
కాలాన్ని వెనక్కి తిప్పకు పేజి 19


    అలాంటి రోజుల్లో ఓ తెల్లారి ఏడుగంటలకి అపుడే లేచి బద్దకంగా నైట్ డ్రసులతో కాఫీలు తాగుతూ పేపర్లు చదువుతుంటే డోర్ బెల్ వినిపించి పనిమనిషనుకుని 'తీసే వుంది' అంది చిత్ర బద్దకంగా. తలుపు తీసుకువచ్చిన యిద్దరిని చూసి బద్ధకం ఎగిరిపోయి ఒక్క ఉదుటున లేచి నిలబడ్డారిద్దరూ "మీరా' అని మాత్రం అనగల్గింది. షర్టు లేకుండా ఉత్తి పైజమాతో వున్న గౌతమ్ గాభరాగా లేచి బెడ్ రూమ్ లోకి వెళ్లి షర్టు వేసుకొచ్చి ఒక్క క్షణం సందిగ్ధంగా నిలబడి 'వస్తా యిప్పుడే వస్తా' అంటూ చెప్పులేసుకు బైటికి వెళ్ళిపోయాడు.
    తెల్లమోహంతో నిలబడ్డ చిత్రని అనుమానంగా, తీక్షణంగా చూస్తూ 'ఎవరతను'? అంది సావిత్రి. చిత్ర కాస్త తడబడి, మా ఫ్రెండ్ , కొలీగ్' అంది అప్పటికి కాస్త కూడదీసుకుని. ఏమిటిలా చెప్పాపెట్టకుండా హటాత్తుగా వచ్చారు? తల్లి చేతిలో షోల్డర్ బ్యాగు అందుకుంటూ బెడ్ రూములో పెట్టి స్టౌ మీద నీళ్ళు పెట్టింది. మొహాలు కడుక్కున్నారా. కాఫీ యివ్వనా' మాములుగా అంది . "కాఫీ సరే అతనెవరు? రెట్టించింది సావిత్రి. ఈసారి కాస్త నిలదొక్కుకుని నిర్లక్ష్యంగా చూస్తూ "' చెప్పగా, మా కొలీగ్' అని ' యిక్కడే వుంటాడా ఆ కొలీగ్. యీ యింట్లోనే వుంటాడా?' శ్రీహరి కళ్ళు తీక్షణం గా వున్న మాట వ్యంగ్యంగా వుంది.    
    "నీవిక్కడ వేలగబెడ్తున్న వ్యవహారం తెల్సి వచ్చాం. విన్నది అబద్దం కాదని చూడగానే తెల్సింది.' సావిత్రి తీక్షణంగా అంది. చిత్ర జవాబివ్వలేదు. మీ మామయ్య కృష్ణ ఆఫీసు పని మీద యీ వూరోచ్చి నిన్ను చూద్దామని వుమెన్స్ హాస్టలు కి వెడితే నీవక్కడ లేవని, మారిపోయావని , మీ అపార్ట్ మెంట్ అడ్రస్ యిచ్చారుట. యిక్కడికి వస్తే నీ వింట్లో లేవుట. - నీవు, ఎవరో మగ అబ్బాయి కల్సి వుంటారని, మొదట పెళ్ళి కాలేదంది- ఆ అబ్బాయి మొదట్లో వచ్చి పోయేవాడు, ఇప్పుడు ఏకంగా ఇంట్లో వుంటున్నాడు అని బిల్డింగ్ సెక్రటరీ చెప్పాడట -' ఇదేం పద్దతండి, పెళ్లి కావాల్సిన పిల్ల మర్యాదస్తులుండే అపార్ట్ మెంట్స్, మాకూ ఆడపిల్లలున్నారు మీరు చూస్తె అయినింటి వాళ్ళలా వున్నారు మీ అమ్మాయికి చెప్పండి, లేదంటే మేమే ఇంటి ఓనర్స్ కి కంప్లయింట్ యివ్వాలనుకుంటున్నాం?" అన్నాడుట అమర్యాదగా.
    'ఛా, ఛా....చదివింది ఉద్యోగం చేసుకోమంటే యింత బరితెగింపా? యిదే ఫారెననుకుంటున్నావా? లీవింగ్ టు గెదర్ చేస్తుంటే చుట్టూ జనం వూరుకోడానికి, మీ మామయ్య చెప్తుంటే తల ఎత్తుకోలేకపోయాం. ఎవరన్నా ఏమనుకుంటారన్న భయమన్నా లేకుండా యింత తెగింపా ' - శ్రీహరి మొహం కోపం .....అవమానంతో ఎర్రబడింది.
    'చేసిన ఘనకార్యం చాలు, జరిగిందేదో జరిగింది యిప్పటికయినా పెళ్ళి చేసుకోండి ఆర్నెల్లు కలిసి వున్నారుగా, ఇద్దరికీ ఒకరి గురించి ఒకరికి తెల్సిందిగా యింక చేసుకోవచ్చుగా ' సావిత్రి రాజీ ధోరణిలో అంది.
    'ఏమో యింకా ఆ విషయం నేనాలోచించలేదు. మేం యిద్దరం పెళ్ళి విషయం అనుకోలేదు ' చిత్ర పెడసరంగా అంది.
    'అనుకోకపోతే యిప్పుడనుకొండి. చేసుకునే ఉద్దేశం లేకపోతే జరిగింది చాలు, నలుగురి నోళ్ళలో పడింది చాలు. యివన్నీ కట్టి పెట్టింక - నిన్ను చదివించి ఉద్యోగానికి పంపడం మా తప్పయిందని మేం బాధపడే స్థితికి తీసుకురాకు' శ్రీహరి కఠినంగా అన్నాడు. చిత్ర తండ్రి చూపుల నించి తప్పించుకుని 'అమ్మా, నే ఆఫీసుకు వెళ్ళాలి. ఫ్రిజ్ లో పాలు, పెరుగు, కూరలున్నాయి. వంటింట్లో అన్నీ వున్నాయి. ఏం కావాలో 'చేసుకో' టవలు పట్టుకుని స్నానానికి బయలుదేరింది. 'ఈరోజుకి శలవు పెట్టు . ఆ అబ్బాయిని రమ్మను . మనం మాట్లాడాలి."= ' ఇప్పటికిప్పుడు శలవంటే కుదరదు. సాయంత్రం మాట్లాడచ్చు" అప్పటికి తప్పించుకుంది.
    ఆఫీసుకెళ్ళగానే గౌతమ్ ఫోన్ చేశాడు. 'మైగాడ్ అలా మీ వాళ్ళు హటాత్తుగా వచ్చేసరికి గాభరా పడ్డ్డాను. వున్నారా యింకా.'
    'ఆ .... తలవాచేట్టుగా చివాట్లు పెట్టారు. సాయంత్రం నీ తల వాయగోట్టడానికి పిలవమన్నారు." చిత్ర చిలిపిగా అంది. 'అలా పారిపోయావేమిటి. బట్టలేనా లేకుండా ఎలా మానేజ్ చేశావు. ఎక్కడున్నావు యిప్పుడు ' అడిగింది.
    కుమార్ రూము కెళ్ళాను. వాడి బట్టలు తొడుక్కునే ఆఫీసు కెళ్ళాలి. నా బట్టలు, ఏముంది? ఉయ్ విల్ ఫేస్ దెమ్ , ఎప్పటికయినా తప్పదుగా'
    "వద్దు బాబూ, నాకు ఎంబ్రాసింగ్ గా వుంటుంది వాళ్ళు వెళ్ళాక ఫోన్ చెయ్యి'
    'ఏయ్ డోంట్ బి స్టుపిడ్ పిరికివాడిలా పారిపోవద్దు, సాయంత్రం రా'
    "చూద్దాం" ఫోను పెట్టేశాడు.
    సాయంత్రం గౌతమ్ వస్తాడనుకుంది - రాలేదు . 'ఇలా మాట్లాడడానికి రమ్మంటేనే రానివాడు నిన్ను పెళ్ళాడుతాడా' అని తల్లిదండ్రులిద్దరూ దుయ్యబట్టారు. యిద్దరూ కల్సి హోతోపదేశాలు చేశారు. పెళ్ళి బంధం లేని ఏ స్త్రీ పురుష బంధమూ నిలవదని ఊదరగొట్టి చెప్పారు.
    'చూడు చిత్రా, మన పెద్దలు వెర్రివాళ్ళయి, ఆలోచనలేక వివాహ వ్యవస్థ ఏర్పరచలేదు. అనాది మానవుని కాలంలో వివాహ వ్యవస్థ ఏర్పడక ముందు ఒక  పురుషునికి ఒక స్త్రీ అన్నది ఎందుకు ఏర్పరచారు. పురుషులంతా తమకి వచ్చిన స్త్రీలని పీడించుకుతిని వారి అవసరాలకి వాడుకుని వదిలేయడం. ఆ స్త్రీ నిస్సహాయంగా పురుషునికి లొంగిపోవడం, వారి అవసరం తీరాక ఏ పురుషుడు ఆమెని పట్టించుకోకపోతే తన పోషణ తనే చూసుకోవడం, గర్బం దాలిస్తే తండ్రెవరో తెలియని స్థితి. అలా పుట్టిన బిడ్డ ఎవరికీ చెందక ఆ బిడ్డ పోషణ భారం. ఆ కష్టం అంతా స్త్రీ ఒక్కతే భరించాల్సి రావడం చూసి పెద్దలంతా అలోచించి పశుపక్ష్యాదులు సైతం జత కట్టించదగ్గిర నుంచి రెండూ కలిసి పుల్లలేరి గూడు కట్టుకుని ఆడపక్షి గుడ్లు పొదుగుతుంటే మగపక్షి ఆహారం అందించడం , పిల్లలయ్యాక అడ - మగ పక్షులు , జంతువులు రెండూ కల్సి పిల్లల్ని సాకి పెద్దచేసి అవి ఎగిరే వరకు కల్సి వుండి తమ బాధ్యత నెరవేర్చడం చూసి వాటి నించి పాఠం నేర్చుకుని ఒక పురుషునికి ఒక స్త్రీ సూత్రం ఏర్పరచుకుని పిల్లల బాధ్యత ఆ యిద్దరీది అన్న నిర్ణయానికి వచ్చి వుంటారు. ఇద్దరూ కలిసి పిల్లలని సాకడంతో ఆరంభమై కాలక్రమేణా వివాహ వ్యవస్థ ఆరంభమై వుండొచ్చు. పురుషుడు బాధ్యతాయుతంగా ప్రవర్తించడానికి వివాహ వ్యవస్థ ఏర్పడింది. ఏ పురుషుడు వివాహ బంధం లేనిదే స్త్రీ బాధ్యత తీసుకోడు - వివాహ బంధం లేకుండా ఏ స్త్రీ బరువు బాధ్యతలు అంగీకరిస్తాడా? రేపొద్దున నీకు ఏ కడుపో వస్తే తనే ఆ బిడ్డకి తండ్రినని అందరి ఎదుట అంగీకరించే బాధ్యత వహిస్తాడా! అలా తండ్రి ఎవరో తెలీని పిల్లలని ఏం అంటారో తెలుసా! బాస్టర్ చిల్డ్రన్! చిత్రా సమాజంలో బతుకుతున్నప్పుడు సమాజానికి కొన్ని కట్టుబాట్లుంటాయి. అవి అతిక్రమిస్తే ఏ సభ్య సమాజమూ వూరుకోదు. మా యిష్టం అనడానికిది అడవి కాదు - చిత్రా అతను నీకిష్టమయితే పెళ్ళి చేసుకో , మాకేం అభ్యంతరం లేదు. నీకు నచ్చినవాడిని చూసుకో మా అంగీకారం ఉంటుంది. అంతే కానీ ఇలా విచ్చల విడితనం ఎవరూ అంగీకరించరు. బిఫోర్ ఇటీజ్ టూ లేట్ - త్వరగా ఓ నిర్ణయానికి రా' శ్రీహరి చాలా శాంతంగానే చెప్పదలచింది గట్టిగా చెప్పాడు.
    'చిత్రా - నీవు చేసిన ఈ పనితో యింక మేం నీకు సంబంధాలు చూసే స్థితి లేదు - ఏ తల్లి తండ్రి పెళ్ళి కాక ముందు కాపురాలు వెలిగించిన్ పిల్లని కోడలుగా యిష్టపడరు. యింక ఎవరిని చేసుకున్నా నీవే చేసుకోవాలి. ఈ మగాళ్ళ సంగతి నీకు పూర్తిగా తెలియదు. లివింగ్ టు గెదర్లకి అభ్యంతరాలుండవు- అదే పెళ్ళి చేసుకుందాం అనేసరికి అమ్మ, నాన్న, సంప్రదాయం గుర్తు వస్తాయి. ఈ కల్సి వుండడాలు ఎన్నాళ్ళు - మోజు తీరగానే నిన్నెలా వదుల్చుకుందామనే చూస్తాడు మగాడు - నూటికో కోటికో ఓ మంచివాడుండచ్చు. నిన్ను నిజంగానే ప్రేమించిన వాడు దొరికితే అదృష్టవంతురాలివే' ఈ గౌతమ్ ని నీవిష్టపడ్డావు కనుక అతనితో పెళ్ళి ప్రస్తావన తీసుకురా. ఏమంటోడో విని గ్రహించుకో. యింకా ఆలస్యం చేయకు. సావిత్రి హితవు చెప్పింది. వాళ్ళిద్దరి మాటల్లో కొంత నిజం వుందన్నది మొదటిసారి గుర్తించింది చిత్ర.
    
                                                 *    *    *    *

 Previous Page Next Page