Previous Page Next Page 
అహో! విక్రమార్క పేజి 20


    "ఎస్. ఇట్స్ నేచురల్ ఫినామినా... అయితే?" అన్నాడు ప్రొఫెసర్.

 

    "అలాగే ఆత్మ కూడా భౌతికదేహ వాంఛలతో, లక్ష్యసిద్ధితో కుతకుతలాడే ఆత్మ మరుజన్మని కోరుకుంటుంది. అవునా ప్రొఫెసర్?"

 

    దానికేం సమాధానం చెప్పాలో వెంటనే ఆయనకు తోచలేదు. అందుకే అలా అన్నాడు.

 

    "మే బి... మే నాట్ బి"

 

    చిన్నగా నవ్వాడు విశ్వాత్మ.

 

    "మే బి ఈజ్ నాట్ కరెక్ట్... మస్ట్ బి...." సీరియస్ గా అన్నాడు విశ్వాత్మ.

 

    ఈ విషయంలో విశ్వాత్మతో చాలాసేపు ఆర్గ్యూ చెయ్యగలడు ప్రొఫెసర్ రామకృష్ణారావు.

 

    అయితే అనూహ్యమైన మానసిక మార్పులకు లోనవుతున్న విశ్వాత్మతో ఆర్గ్యూ చేయదలుచుకోలేదు రామకృష్ణారావు. దానిక్కారణం విశ్వాత్మలోని మార్పులకు వృద్ధాప్యమే ప్రధానమైన కారణమని భావిస్తున్నాడాయన. అందుకే విశ్వాత్మవైపు ఆపాదమస్తకం ఆశ్చర్యంగా చూశాడాయన.

 

    "ప్రొఫెసర్ రామకృష్ణారావ్ మీకిపుడెన్నేళ్ళు?"

 

    "యాభై అయిదు"

 

    "మీ అబ్బాయికి?"

 

    "ముప్పైరెండు"

 

    "పెళ్ళయిందా?"

 

    "మీకు వెడ్డింగ్ కార్డు పంపాను. మీరు రాలేదు. మా అబ్బాయి సంవత్సరం క్రితం పెళ్ళయింది"

 

    "మీ అబ్బాయికి పిల్లలు కలిగారా?"

 

    "మా కోడలు ప్రస్తుతం ఎనిమిది నెలల గర్భవతి" చెప్పాడు రామకృష్ణారావు- అసలు అవన్నీ విశ్వాత్మ ఎందుకడుగుతున్నాడో అర్థంకాక.

 

    "మీకు మనవడో, మనవరాలో పుడితే ఏం పేరు పెడతారు?" అడిగాడు విశ్వాత్మ.

 

    "మనవడే పుడతాడు.... ఎందుకంటే స్కానింగ్ చేయించాం...." అన్నాడాయన.

 

    "గుడ్ పుట్టబోయే మీ మనవడికి నేనిప్పుడే పేరు పెడుతున్నాను. పెట్టమంటారా?"

 

    "అంతకంటే ఆనందకరమైన విషయం వుండదు. మీరే పేరు పెడితే ఆ పేరునే ఖాయం చేస్తాను. చెప్పండి"

 

    ఒక్కక్షణం సాలోచనగా సీలింగ్ ఫ్యాన్ వైపు చూసి చెప్పాడు విశ్వాత్మ.

 

    "ధృతకుమార్... బాగుందా?"

 

    "చాలా బావుంది... మావాడికి ఆ పేరే పెడతాను."

 

    "మర్చిపోరు కదా... నాకు ప్రామిస్ చెయ్యండి" విశ్వాత్మ ఎందుకో చెయ్యి ముందుకు సాచాడు ఒట్టు పెట్టమన్నట్టుగా.

 

    "నేను మీకు ప్రామిస్ చెయ్యడమేమిటి... ఇట్స్ ఎన్ ఆర్డర్... నా మనవడికి అధికారికంగా నేను పెట్టే పేరు ధృతకుమార్...." విశ్వాత్మ చేతిలో చెయ్యివేసి చెప్పాడు రామకృష్ణారావు.

 

    చాలా స్వల్ప విషయానికి సంబంధించి విశ్వాత్మ తన చేత ఒట్టు పెట్టించు కోవడం చాలా ఆశ్చర్యంగా అనిపించింది ఆ ప్రొఫెసర్ కి.

 

    "డియర్ ప్రొఫెసర్... నా చేష్టకు ఆశ్చర్యపోతున్నారు కదూ? తప్పదు. ఎందుకంటే నేను పునర్జన్మ పొందాక ఎవర్నో పోల్చుకోవాలంటే భవిష్యత్తు కోసం కొన్ని గుర్తుల్ని తయారుచేసుకోవాలిగా ఏవంటారు?" అన్నాడు.

 

    ఈ మహానుభావుడికి పిచ్చి బాగా ముదిరిందని అనుకున్నాడు మనసులో రామకృష్ణారావు లోలోనే నిట్టూరుస్తూ. మరో అరగంట గడిచాక, రామకృష్ణారావు లేచి నిలబడ్డాడు.

 

    "థాంక్యూ మైడియర్ ఫ్రెండ్... మళ్ళీ మనం కలుస్తామో లేదో తెలీదు. నేను కలవటానికి వీలుపడదు. బికాజ్ ఐ యామ్ కౌంటింగ్ మై లాస్ట్ అవర్స్- మీరు కలవడానికొస్తే నేనుండను. ఒకవేళ కొన్నివందల సంవత్సరాల తర్వాత మనం ఎదురెదురుగా వున్నా పోల్చుకోలేని పరిస్థితుల్లో వుంటాం..." భవిష్యత్తులోని పునర్జన్మను తలుచుకుంటూ అన్నాడు విశ్వాత్మ.

 

    లాభం లేదు. ఈయన్ని కొన్నాళ్ళు సైకియాట్రిస్ట్ పర్యవేక్షణలో వుంచడం మంచిది. మనసులోనే అనుకుంటూ కరచాలనం చేస్తూ, విశ్వాత్మవైపు చూశాడు ప్రొఫెసర్ రామకృష్ణారావు.

 

    విశ్వాత్మ కళ్ళలో తడి. ఆ తడికి కారణం రామకృష్ణారావుకి తెలీదు. ముప్పైయేళ్ళ సాహచర్యానికి ఇదే ఆఖరి కలయిక అని పరోక్షంగా చెప్పడం.

 

    రామకృష్ణారావు వెనుతిరిగాడు- "మైడియర్ ప్రొఫెసర్! మీ మనవడి పేరు ధృతకుమార్... మరిచిపోకండి" మరోసారి పెద్దగా గుర్తుచేశాడు విశ్వాత్మ.

 

                                *    *    *    *

 

    జీవితంలో విలువైన కాలాన్ని ఆలోచనలతో కొలుస్తున్నాడు విశ్వాత్మ.

 

    తెల్లవారుజాము మూడుగంటలు దాటింది.

 

    ఆ రోజు తను పుట్టినరోజు. తేదీల ప్రకారం తను గొప్పగా జరుపుకునే ఆ పుట్టినరోజునాడు, వరుసగా గతంలో జరిగిన అరుదైన, అద్భుతమైన మరుపురాని సంఘటనలెన్నో గుర్తుకొచ్చాయి విశ్వాత్మకి.

 

    ప్రొఫెసర్ రామకృష్ణారావు వెళ్ళిపోయాక, మళ్ళీ వచ్చిన పరాంజపే... పుట్టినరోజుని వైభవంగా జరపాలని తన ఫ్యాక్టరీలో పనిచేసే ఉద్యోగస్తులు తీసుకొన్న నిర్ణయాన్ని తనతో చెప్పడం, తను కాదనడం గుర్తు వచ్చింది విశ్వాత్మకు.

 

    చనిపోయే ముందురోజు పుట్టినరోజేమిటి? నాన్సెన్స్... చిరాకు పడ్డాడు కూడా.

 

    తనవైపు అదోరకంగా చూస్తూ పరాంజపే వెళ్ళిపోవడం గుర్తు కొచ్చిందతనికి. వీళ్ళందరూ తనని పిచ్చివాడని అనుకోడానికి అవకాశం వుంది కదా!

 

    తను పిచ్చివాడా?

 

    నెమ్మదిగా విశ్వాత్మ పెదవులు విచ్చుకున్నాయి. అది నవ్వుగా మారడానికి అట్టే సమయం పట్టలేదు.

 

    మృత్యుహాసం వెనుక జనన ప్రతీక...

 

    తనెందుకు పుట్టినరోజు జరుపుకోకూడదు? ఆఖరి పుట్టినరోజునాటి విశేషాలను తలుచుకొని, పునర్జన్మలో ఆనందించటానికి అవకాశం వుంటుంది కదా!

 

    బెడ్ రూమ్ డోర్ తెరిచి వరండాలో కొచ్చాడు. మేడమెట్లు దిగుతూ కుంటుతున్న కుడికాలివైపు బాధగా చూసుకుని తనను తాను ఓదార్చుకున్నాడు.

 

    మెట్లక్రింద, కుడివైపున విశాలమైన డ్రాయింగ్ రూం. విశాలమైన ఆ గదినిండా ప్రపంచంలోని నలుమూలల నుండి తన భార్య వైదేహి కోసం సంపాదించిన అద్భుతమైన కళాఖండాలు అందంగా, అపురూపంగా అమర్చబడి వున్నాయి.

 

    కాసేపు భార్య జ్ఞాపకాల కళారాధనలో తన మధురస్మృతుల అలల్ని నెమరువేసుకుంటూ గడిపాడు విశ్వాత్మ. అర్ధనిమిలితంగా ఎంతసేపు గడిపాడో తెలీదు. పచ్చని, పల్చని కాంతి ఒంటికి తగిలేసరికి కళ్ళిప్పాడు. గవాక్షంలో సూర్యోదయం.

 

    తలుపు దగ్గర ఏదో ఆకారం సన్నగా కదిలిన చప్పుడికి తల తిప్పాడు విశ్వాత్మ. మళ్ళీ పరాంజపే.

 Previous Page Next Page