Previous Page Next Page 
అహో! విక్రమార్క పేజి 21


    ఈసారి చిరాకును వ్యక్తం చేయక "కమాన్ పరాంజపా..." ఆత్మీయంగా పిలిచాడు విశ్వాత్మ.

 

    లోనికొచ్చిన పరాంజపే చేతిలోని ఖరీదైన పుష్పగుచ్చాన్ని విశ్వాత్మ చేతిలో వుంచి, గౌరవంగా నమస్కరించి-

 

    "మెనీ... మెనీ.... హేపీ రిటర్న్స్ ఆఫ్ ది డే సర్..." అన్నాడు.

 

    "థాంక్యూ పరాంజపా.... నిన్ను నువ్వు అడిగినదానికి ఇవాళ జవాబు చెబుతున్నాను. నా బర్త్ డేని వైభంగా సెలబ్రేట్ చెయ్యి. ఫ్యాక్టరీ కార్మికులందరికీ డబుల్ బోనస్ ఇవ్వమని చెప్పు. అన్నదానం చేయించు. నీ యిష్టం.... ఫైనాన్స్ మేనేజర్ ని అడిగి నీకెంత కావాలో తీసుకో"

 

    ఆ మాటలకు షాక్ తిన్నాడు పరాంజపే. విశ్వాత్మ సంతోషాన్ని అంచనా వేయటానికి ప్రయత్నిస్తున్నాడతను.

 

    "గో...గో...గో.... అండ్ డు...." విశ్వాత్మ మాటతో వెనుదిరిగాడు పరాంజపే.

 

                                                *    *    *    *

 

    విశ్వాత్మ సంపాదనలో న్యాయం, ధర్మం వున్నాయి. కార్మికులు అడక్కుండానే మంచి జీతాలు, ఇళ్ళు, స్కూల్స్ ఏర్పాటు చేసేవాడు. ఆ కృతజ్ఞత ఆయనకింద పనిచేసిన ప్రతివారిలో వుంది.

 

    ఆయనంటే వారికి దేవుడితో సమానం. అందుకే విశ్వాత్మ పుట్టిన రోజుని వైభవంగా సెలబ్రేట్ చేశారు. ఫ్యాక్టరీ కార్మికులు, ఉన్నతాధికారులు.

 

    ప్యాలెస్ లో నౌఖర్లు పండుగ వాతావరణాన్ని సృష్టించారు. అందంగా అలంకరించబడిన డైనింగ్ టేబుల్ పై యజమానిపై వాత్సల్యంతో సిద్ధం చేసిన రకరకాల వంటకాలను విశ్వాత్మ తృప్తిగా తిన్నాడు.

 

    తన జీవితంలో అత్యంత ప్రత్యేకత సంతరించుకున్న ఆ పుట్టినరోజున ఉత్సాహంగా గడపాలని నిర్ణయించుకున్నాడు. తనకు గ్రీటింగ్స్ చెప్పడానికి వచ్చిన ప్రతివారితో హుషారుగా గడిపాడు. జోక్స్ కట్ చేశాడు. పిట్టకథలు చెప్పి నవ్వించాడు.

 

    ఎకనామిక్ టైమ్స్ రిపోర్టర్ కి స్పెషల్ గా ఇచ్చిన ఇంటర్వ్యూలో- "ప్రపంచంలో మీరు థ్రిల్ ఫీలైన అద్భుత క్షణాల గురించి చెప్పగలరా?" అని విలేఖరి అడిగిన ప్రశ్నకు-

 

    "నా మృత్యువు గురించి తెలుసుకోవడం" అని సమాధానం చెప్పి అతను షాక్ కు గురయ్యేలా చేశాడు.

 

    పగలంతా ఆత్మీయ వాతావరణంలో గడిపిన విశ్వాత్మ, సాయంత్రం తన పర్సనల్ రూంలోకి వెళ్ళిపోయాడు. వరుసగా పేర్చిన పుస్తకాల మధ్యలో రాజసింహాసనంలా రివాల్వింగ్ చైర్, దాని ముందు విశాలమైన టేబుల్.

 

    ఆ రూంలో పుస్తకాల వాసన చాలా విచిత్రంగా వుంది. విశ్వాత్మకు మనస్సు లోలోతుల్లో చాలా కసిగా వుంది. తన మరణానికి ముందు తను చేసే ఏర్పాట్లు చాలా పకడ్బందీగా జరిగిపోవాలి. తనెప్పుడూ అజేయుడిగా నిలబడాలి మరణించాక కూడా.

 

    విశ్వాత్మ మెదడుని ముట్టడించిన ఆలోచనలను ఛేదిస్తూ, సరిగ్గా అప్పుడు మొదలైంది బాధ, కుడిపాదంలో సుళ్ళు తిరుగుతూ ప్రమాదసూచికలా మొదలైన తీవ్రమైన నొప్పి క్రమ క్రమంగా వెన్నులోకి పాకుతోంది మృత్యువు చివరి హెచ్చరికకు నాంది.

 

    నుదుటికి పట్టిన చిరుచెమటని తుడుచుకుంటూ, చివరిదశ మొదలైంది అని గొణిగాడు విశ్వాత్మ.

 

    బాధను దిగమింగుకుంటూ లిక్కర్ క్యాబినేట్ వైపు నడిచాడతను. బాటిల్స్ పై అరలోంచి అతికష్టం మీద మందు బాటిల్ అందుకుని డాక్టర్ చెప్పిన దానికంటే దాదాపు సగం మందు ఎక్కువే తీసుకున్నాడు. చల్లారుతున్న నిప్పులా బాధ తగ్గుముఖం పడుతుండడంతో కళ్ళు మూసుకున్నాడతను కొద్దిసేపు.

 

    సరిగ్గా 7-25 నిమిషాలైంది. తలుపు తట్టిన శబ్దానికి "కమిన్..." అంటూ పిలిచాడు విశ్వాత్మ.

 

    "సారీ... డిస్టర్బ్ చేశానా?" అంటూ లోపలికొచ్చాడు సాత్యకి. విశ్వాత్మ లీగల్ ఎడ్వైజర్ సాత్యకి.

 

    విశ్వాత్మ, సాత్యకి వయస్సు దాదాపు ఒకటే. పైగా చిన్ననాటి నుంచి మిత్రులు కూడా. ఇద్దరి మధ్య గాఢమైన అనుబంధమేగాక, మంచి చనువు కూడా వుంది.

 

    నిశ్శబ్దంగా మునిలా కూర్చున్న విశ్వాత్మని చూసి తనలో తాను విస్మయం పొందాడు.

 

    అలా విశ్వాత్మని చూడడం అదే తొలిసారి అతను. అందుకే సాత్యకిలో ఏదో సందేహం.

 

    "విల్లు పత్రాలన్నీ పూర్తిచేసి తెచ్చావా...?" ఉత్సుకత నిండిన కంఠంతో అడిగాడు విశ్వాత్మ.

 

    తల పంకిస్తూ బ్రీఫ్ కేస్ తెరచి ఇచ్చాడు సాత్యకి. సాత్యకికి చాలా ఎక్సైటింగ్ గా వుంది. తనకు కొన్ని ఏళ్ళుగా విశ్వాత్మతో స్నేహం. కానీ భార్య మరణించాక అతనిలో చోటు చేసుకున్న విపరీతమైన మార్పులను ఎప్పటికప్పుడు ఆశ్చర్యంతో, ఆవేదనతో గమనిస్తున్నాడతను. విల్లు కాగితాలు తీసుకొని ఒకసారి తిప్పి చూశాడు విశ్వాత్మ. దాదాపు 48 పేజీల విల్లు.

 

    ఒరిజినల్ పత్రాలేగాక మరో అయిదు జిరాక్స్ కాపీలు వున్నాయందులో.

 

    ఆత్రుతతో నిండిన కళ్ళతో గుసగుసగా, ఉద్విగ్నంగా చదవడం ప్రారంభించాడు విశ్వాత్మ. అరగంటకాలం ఆ గది నిశ్శబ్దాన్ని కప్పుకుంది. చదవడం పూర్తయినట్టు కనుబొమలెగరేస్తూ తలెత్తాడు విశ్వాత్మ. సాత్యకి తను ముట్టించబోతున్న తొమ్మిదో సిగరెట్ ని అప్రయత్నంగా విరమించాడు.

 

    "ఇదంతా గమనిస్తుంటే నీకేమనిపిస్తోంది?" చాలా క్యాజువల్ గా అడిగాడు విశ్వాత్మ.

 

    "ఇది నీ సంపద, నీ ఇష్టం. వాస్తవంగా నీ కోరిక నెరవేరుతుందో లేదో తెలియదుగాని, నీ ఐశ్వర్యం తిరిగి నువ్వే పొందాలనుకోవడంలో తప్పేమీ లేదు. నువ్వు చేసిందదే..." అన్నాడు సాత్యకి. నవ్వుతూ తలూపాడు విశ్వాత్మ. కాసేపాగి చెప్పడం ప్రారంభించాడు.

 

    "నా ఆస్తులన్నిటిపైనా వచ్చే వడ్డీ, ఆదాయమంతా జ్ఞానభారతి ట్రస్టుకి చెందేలా రాశాను. ఈ ప్రపంచం నమ్మనీ, నమ్మకపోనీ నాకు లెక్కలేదు. కానీ అద్భుతం జరిగేరోజు రావడం తథ్యం.

 

    నాకు వచ్చిన కలప్రకారం పాతికేళ్ళయినా పట్టొచ్చు- ముప్పై ఏళ్ళయినా పట్టొచ్చు. నేను మళ్ళీ జన్మిస్తాను- ఈ ఆస్తికంతటికీ వారసుడినై వస్తాను"

 

    విశ్వాత్మ కళ్ళల్లో ఆత్మవిశ్వాసం ఓ వింత వెలుగులా ప్రకాశించి మాయమైంది. అతని ప్రగాఢమైన నమ్మకం. మూర్తీభవించిన విగ్రహం చూసి క్షణకాలం విస్తుపోయాడు సాత్యకి.

 

    "ఓ కలలా, నమ్మశక్యంలా లేదు కదూ...?" మళ్ళీ ప్రశ్నించాడతను.

 

    "నీ నమ్మకాన్ని గౌరవిస్తున్నాను విశ్వాత్మా....!" గౌరవంగా జవాబిచ్చాడు సాత్యకి.

 

    కాసేపు ఇద్దరి మధ్యా నిశ్శబ్దం అలుముకుంది.

 

    విశ్వాత్మ కళ్ళల్లోకి చూస్తూ 'వెళతా'నన్నాడు సాత్యకి.

 

    జవాబివ్వలేదు విశ్వాత్మ.

 

    "ఆత్మా వెళుతున్నా. రేపు ఎన్నిగంటలకు రమ్మంటావ్?" అడిగాడు సాత్యకి.

 

    "రేపా? చెప్పలేను. నేను వ్యక్తిగతంగా చేయాల్సిన పనులు చాలా వున్నాయి. వీలైతే రేపు నేనే ఫోన్ చేస్తాను" అన్నాడు విశ్వాత్మ.

 Previous Page Next Page