Previous Page Next Page 
అహో! విక్రమార్క పేజి 19


    "పునర్జన్మ విషయంలో నా సందేహాలను మీరు నివృత్తి చేయాలి" అంటూ కొన్ని ప్రశ్నలు వేశాడు విశ్వాత్మ. చెప్పడం ప్రారంభించాడు ప్రొఫెసర్.

 

    "పునర్జన్మను కొంతమంది నమ్ముతారు- కొంతమంది ఇల్యూజన్ గా కొట్టివేస్తారు. పునర్జన్మను మన హిందువులు, బౌద్ధులు, సింధీలు, ఆదివాసులు నమ్ముతారు. అమెరికాలోని వర్జీనియా యూనివర్శిటీ పారా సైకాలజీ డిపార్ట్ మెంట్ ప్రెసిడెంట్ డాక్టర్ ఇ.ఎన్.స్టీవెన్ సన్ భారత్, శ్రీలంక, బ్రెజిల్, ఆలస్కా మొదలైన సంస్కృతులు పునర్జన్మపట్ల నమ్మకం చూపించాయని తన పరిశోధనలో గుర్తించారు.

 

    "దీనికి సంబంధించి ఇండివిడ్యువల్ కేసులేమైనా వున్నాయా?" ప్రశ్నించాడు విశ్వాత్మ.

 

    "చాలా వున్నాయి. బిషన్ చంద్ అనే వ్యక్తికి గత జన్మలో ఏ జబ్బు వుండేదో, అదే జబ్బు ఈ జన్మలో కూడా వచ్చింది. కిందటి జన్మలో తుపాకి గుండు తగిలి మచ్చ ఏర్పడితే, ఆ మచ్చ ఈ జన్మలో కూడా అతనికి వుంది"

 

    "మచ్చలు కూడా పునర్జన్మ పొందుతాయా....?" ఆశ్చర్యంగా ప్రశ్నిస్తూ తన బుగ్గమీద వున్న గాయాన్ని తడుముకున్నాడు విశ్వాత్మ.

 

    కొన్ని సంవత్సరాల క్రితం బీహారులో విచిత్రమైన పునర్జన్మ కేసొకటి బయటపడింది. సుందరి అనే యువతి గత జన్మలో పాములను పెంచేది. పాములపట్ల ఆమె ప్రేమ ఈ జన్మలో కూడా కనబరిచింది. ఆమె చిన్నప్పుడు స్కూలునుండి తిరిగివస్తూ, ఇతర పిల్లలతోపాటు ఒక చెట్టు కింద ఆడుకుంటుండగా, అకస్మాత్తుగా ఒక పాము చెట్టుమీంచి కిందపడి గాయపడింది.

 

    ఇతర పిల్లలు భయపడి దూరంగా పారిపోగా, సుందరి ఆ పాముని ఎత్తుకుని దానికి సేవలుచేసి రక్షించింది. పాము కృతజ్ఞతను ప్రకటిస్తూ ఏమీ చేయకుండా వెళ్ళిపోయిందట.

 

    పూర్వజన్మ జ్ఞాపకాలు, మంచి చెడుల సంస్కారాలు, కోరికలు, అసహ్యాలు ఈ జన్మలో కూడా వుంటాయని అనేక కేసుక ద్వారా నిరూపణ అయింది.

 

    పూర్వజన్మ విషయంలో మహాత్మాగాంధీ ప్రత్యేకంగా ఒక కేసుని స్టడీ చేయడం జరిగింది.

 

    ఆ కేసు శాంతిదేవి అనే మహిళాకేసు. ఆమెకు గతజన్మ జ్ఞాపకాలు ఎక్కువగా వుండేవి. గత జన్మ సంతానం ఆమె వద్దకు వస్తుండేవారు. ఆమె వారికి సలహాలు యివ్వడం చేస్తోండేది. శాంతిదేవి కేసును స్టడీ చేయమని మహాత్మాగాంధీ, శ్రీదేశబంధు గుప్తా పర్యవేక్షణలో ఒక కమిటీని నియమించారు కూడా.

 

    గతజన్మ సంఘటనలు వర్తమానంలో ప్రతిఫలించడం అనే అంశంపైన అమెరికాలో పరిశోధనలు జరుగుతున్నాయి. సమ్మోహనం ద్వారా గత జన్మ వృత్తాంతం తెలుసుకుంటారు. ఈ కొత్త థెరపీని 'ఫాస్ట్ లైఫ్ రిగ్రేషన్స్' అంటారు.

 

    అమెరికాలో ఎడిగర్ కేసి అనే వ్యక్తి వుండేవాడు. ఆయన అనేక సిద్ధులు సాధించాడు. సమాధి అవస్థకు వెళ్ళి రోగాలకు కారణం, నివారణోపాయం కనుగొనేవాడు. గతజన్మ కర్మఫలాన్ని ప్రస్తుత జీవితంలో సమన్వయ పరిచేవాడు. ఆయన 1945లో మరణించాడు.

 

    ఒకసారి ఒక కాలేజీ యువకుడు ఢిల్లీలోని సీనియర్ డాక్టరైన ఎస్ దత్తారే దగ్గరకెళ్ళాడు.

 

    నా మనసు నిలకడగా వుండటం లేదు. కళ్ళ ముందెప్పుడూ ఏవో ఇమేజ్ లు ఏర్పడతాయి. వాటిని నేను ఆపలేకపోతున్నాను. అందువల్ల చదువు సాగటం లేదు అంటూ మొరపెట్టుకున్నాడు.

 

    డాక్టర్ దత్తారే అన్ని విషయాలు తెలుసుకున్న మీదట తెలిసిందేమిటంటే, గతజన్మ జ్ఞాపకాలు అతని వర్తమానాన్ని కప్పి వేస్తున్నాయి. అందువల్ల అతని మెదడు మొద్దుబారిపోతోంది.

 

    గతజన్మలో అతడు ఒక పూజారి, అతడు తన గ్రామం పేరు, అడ్రస్ అన్నీ చెప్పాడు. జిల్లా, తాలూకాతో సహా అతను చెప్పాడు. అక్కడకు వెళ్ళి దర్యాప్తు జరిపితే, అతడు చెప్పిన వివరాలన్నీ కరెక్టే అని తేలింది. కుర్రవాడు అక్కడకు వెళ్ళి, అందరినీ గుర్తుపట్టగలిగాడు. పేరు పేరునా పిలిచాడు.

 

    దత్తారే పరిశోధించిన ఇంకో కేసు జమీందారు భార్యకేసు. ఇద్దరు దంపతులు ఆయన దగ్గరకొచ్చారు. తనకు ఇంతకుముందే పెళ్ళయిందని పెద్ద పెద్ద పిల్లలున్నారని తనకు అనవసరంగా రెండో పెళ్ళి చేశారని ఆ ఇరవై ఏళ్ళ భార్య కంప్లయింట్ చేసింది.

 

    ఆ కేసు స్టడీ చేయగా పూర్వజన్మలో ఆమె ఓ జమీందారు భార్య అని తేలింది. ఆమె చెప్పిన వివరాల ప్రకారం ఆ ప్రాంతానికెళ్ళగా ఆమె చెప్పిందంతా నిజమని తేలింది. గత జన్మలోని ఆమె పిల్లలు పెద్దవాళ్ళయి వ్యాపారాలు చేసుకుంటున్నారు" చెప్పడం ఆపి విశ్వాత్మ కళ్ళలోకి చూశాడు ప్రొఫెసర్ రామకృష్ణారావు.

 

    "పునర్జన్మ పొందే ప్రతి వ్యక్తికీ గతజన్మ ఖచ్చితంగా గుర్తుకు వస్తుందా?" ప్రశ్నించాడు విశ్వాత్మ.

 

    "అస్పష్టంగానో, స్పష్టంగానో గుర్తుకొచ్చే అవకాశాలు వున్నాయి. ఛాయ మాత్రంగా కనిపించే ఇమేజెస్ ని గుర్తుపట్టగలిగే సంస్కారం, ఈ జన్మలో సదరు వ్యక్తికి వుండాలి. లేకపోతే పిచ్చివాళ్ళుగా మారే ప్రమాదం వుంది"

 

    "ఒక వ్యక్తికి తన పునర్జన్మ వుందని, తను మనిషిగా జన్మిస్తానని తెల్సిందనుకోండి, అప్పుడు గతాన్ని గుర్తు తెచ్చుకోవడానికి కొన్ని ఆధారాలు కల్పించుకోవచ్చు కదా" తన మనసులోని ప్రధాన సందేహాన్ని వ్యక్తపరిచాడు విశ్వాత్మ.

 

    పెద్దగా నవ్వాడు ప్రొఫెసర్ రామకృష్ణారావు. "నో మిస్టర్ విశ్వాత్మ. మీరు చెప్పేవి మనం సినిమాల్లోనూ, సాహిత్యంలోనూ చూస్తాం. సైన్సు వేరు, కల్పన వేరు.... నాకు తెలిసినంత మటుకు అలాంటి సంఘటన జరగలేదు."

 

    "ఇప్పటివరకూ జరగలేదు. ఇకమీదట జరగొచ్చు కదా" అన్నాడు విశ్వాత్మ.

 

    "గత జీవితం గుర్తుంచుకోవడానికి చేసే ప్రయత్నం వల్ల మనిషికేమిటి లాభం" ప్రొఫెసర్ ప్రశ్నించాడు.

 

    "నాలాంటివాడికి లాభం వుండొచ్చు కదా" అన్నాడు విశ్వాత్మ.

 

    "మీలాంటివారికా?" రామకృష్ణారావు ఒకింత ఆశ్చర్యంతో కళ్ళు పెద్దవి చేశాడు.

 

    " మామూలు మనుషులకు లాభం లేకపోవచ్చు. కానీ నాలాంటివాడికి గత జన్మలో సాధించిన జ్ఞానం, విజ్ఞానం గుర్తుండడం వుపయోగకరం కదా?"

 

    విశ్వాత్మ చెపుతున్న విషయం అర్థం కావడానికి రామకృష్ణారావుకు రెండు నిముషాలు పట్టింది.

 

    పారా సైకాలజీలో అపారమైన అనుభవమున్న ప్రొఫెసర్ రామకృష్ణారావుకి విశ్వాత్మ ప్రవర్తనేం అర్థం కావటం లేదు. తను విశ్వాత్మ ప్యాలెస్ కి ఎయిర్ పోర్టు నుంచి బయలుదేరి వస్తుండగా పరంజపా చెప్పిన విషయాల్ని, ప్రస్తుతపు విశ్వాత్మ ప్రవర్తనతో పోల్చి చూసుకుంటున్నాడు. బహు విచిత్రమైన కోరిక, ఆలోచనా ప్రపంచంలోనే ఎప్పుడూ ఎవరికీ రానటువంటి దిగ్భ్రాంతికరమైన యోచన.

 

    "మైడియర్ ప్రొఫెసర్... బ్రతికే క్షణాల నిండా మోహ, వ్యామోహాలు, ఆకర్షణ, వికర్షణలు, ఉద్రేకాలు, అనుభూతులు వున్నట్లే లక్ష్యమూ, గమ్యమూ కూడా వుంటాయి. ఈ జన్మలో నేను నా లక్ష్యాన్ని చేరలేకపోవడం, గమ్యాన్ని చేరుకోలేకపోవడం జరిగితే, పునర్జన్మలో వాటిని సాధించడానికి నా ఆత్మ తహతాహలాడుతుంది. తహతాహలాడే ఆత్మ, కుండలో కుతకుతలాడే అన్నం మెతుకుల్లాంటివి. ఆ కుండలోంచి అన్నం మెతుకులు బయటికి వచ్చే తీరుతాయి. అవునా?" ప్రశ్నించాడు విశ్వాత్మ.

 Previous Page Next Page