Previous Page Next Page 
సూపర్ స్టార్ పేజి 20


    చూస్తుండగానే ఊరేగింపు వరుసక్రమం తప్పిపోయింది.

    హంపీ కెమేరాని ఆన్ చేసింది.

    జూమ్ లో ముందు కెళ్ళిన ఆమె ఓ వ్యక్తి చేస్తున్న పనిని చూసి  షాక్ తింది.

    ఓ యువకుడు ఐస్ బండి నెట్టుకుంటూ ముందుకు వస్తూనే  ఆ బండిలోంచి బంతుల్లాంటి మెటీరియల్ తీసి చలాగ్గా రెండువేపులకు  విసురుతున్నాడు. ఆ బంతి నేలకు తగిలిన మరుక్షణం భగ్గున మంటలు రాజుకుంటున్నాయి.

    ఆమెకంతా అయోమయంగా ఉంది. జనాలు ఊరేగింపులో హడావిడిగా ఉంటే అతనెవరికి ఐస్ క్రీమ్ అమ్మాలనుకుంటున్నాడు?

    ఖచ్చితంగా అతని ఉద్దేశం అది కాదు.

    ఊరేగింపు చిన్నాభిన్నం చేసేందుకు అతను కావాలనే ఐస్ క్రీమ్  అమ్మే వాడిలా నటిస్తున్నాడు.

    కెమేరా అతని మీదకు వెళ్ళిపోయింది.

    ఎంతో నేర్పున్నవాడిలా.....ఎన్ని నెలలుగానో ప్రాక్టీసు చేస్తున్నా వాడిలా వడివడిగా విసురుతూనే ఉన్నాడు బంతుల్లాంటి పదార్ధాన్ని.

    జనాలు చెల్లాచెదురుగా అటూ, ఇటూ పరిగెడుతూనే ఉన్నారు.

    పోలీసులు వీర విహారం చేస్తూనే ఉన్నారు. అంతలోనే  మొదలయింది.....లూటీ....

    మెరుపు వేగంతో షాప్స్ వేపు వెళ్ళటం, క్షణాల్లో తాళాలు పగుల కొట్టటం- షట్టర్స్ ఎత్తటం-ఎవరి కందినవి వారు దోచుకొని తిరిగి ఊరే గింపులో కలిసిపోవటం-అంతా ఒక మాయలా ఉంది.....
   
    పోలీసులు......వాలంటీర్లు.....అందరూ అక్కడుండగానే యదేచ్ఛగా సాగి పోతోంది లూటీ.

    ఎంతో అనుభవం ఉన్న వాళ్ళలా మెరుపువేగంతో లూటీ చేసుకుపోతున్నారు.

    ఎంతో అనుభవం ఉన్న వాళ్ళలా మెరుపువేగంతో లూటీ  చేసుకుపోతున్నారు.

    పోలీసులు బిత్తరపోయి అటూ ఇటూ పరిగెడుతున్నారు తప్ప లూటీని ఆపే ప్రయత్నం చేస్తున్నట్లు కనిపించటంలేదు.

    ఊరేగింపు యాథావిధిగా, అవేవి తనకు పట్టవన్నట్లుగా కదిలిపోతూనే ఉంది.

    క్యాసెట్ అయిపోతూనే మరో క్యాసెట్ లోడ్ చేస్తూనే ఉన్నాడు హంపీ ప్రక్కనున్న వ్యక్తి.

    పరిస్థితి అంత భయానకంగా ఉన్నా ఏ మాత్రం భయపడకుండా షూట్ చేసుకుపోతున్న హంపీని చూసి ఊరేగింపుకి ముందు భాగాన ఉన్న భక్తులు ఆశ్చర్యపోతున్నారు.

    ఒక పథకం ప్రకారం బంగారపు షాపులు, జ్యూయలరీ షాప్స్ నిరాఘాటంగా దోచుకోబడుతూనే ఉన్నాయి.

    హంపీ ఊపిరి పీల్చటం కూడా మర్చిపోయినట్లు కెమేరాలోంచి చూస్తూ లూటీని చిత్రీకరించుకుపోతోంది.

    ఊరేగింపు అబిడ్స్ లోకి ప్రవేశించింది. అప్పటివరకు గాడ్రేజ్ షోరూమ్ బిల్డింగ్ మీద నిశ్శబ్దంగా ఉన్నయూనిట్-2 పని చేయటం ప్రారంభించింది. విల్సన్ అప్రమత్తంగా ఊరేగింపును వివిధ కోణాలనుంచి జూమ్ ఉపయోగిస్తూ తన కెమేరాలో నిక్షిప్తం చేసుకుపోసాగాడు.

    భక్తిపారవశ్యంలో మునిగి భజనలు చేస్తూ, లయబద్దంగా నాట్యం చేస్తున్నా భక్తుల్ని, చిత్ర విచిత్రమైన రీతుల్లో తయారు చేసిన వినాయక విగ్రహాల్ని షూట్ చేసుకుంటూనే సడన్ గా, ఎదురుగా ఉన్న షాప్స్ మీదకు కెమేరాను పాస్ చేసాడు విల్సన్.

    ఓ విగ్రహం ప్రక్కన భక్తుడిలా నించుని బజన చేస్తున్నా దాదా దృష్టి ఊరేగింపు ముందు భాగాన ఉన్న హంపీ వ్యాన్ మీద పడింది సడన్ గా.

    కెమేరాను ఆపరేట్ చేస్తున్న హంపీని చూసి ఓ క్షణం కంగారు పడ్డాడు దాదా.

     తిరిగి అంతలోనే అలవోకగా తలతిప్పి తన అనుచరులకేసి చూసాడు.

    వాళ్ళు ఊరేగింపుతో సంబంధం లేనట్లుగా షాప్స్ ని బ్రద్దలు కొట్టేస్తున్నారు.

    ఇచ్చిన సూచనల ప్రకారమే అందరూ తలలు బాగావంచుకొని లూటీ చేసుకుపోతున్నారు. కొద్ది క్షణాలు అతనికేం చేయాలో తోచలేదు. ఊరేగింపు క్రమంగా అబిడ్స్ దాటి నిజాం కాలేజీ గ్రౌండ్స్ దగ్గరకు వచ్చేసింది.

    అంతే.....ఆ మరుక్షణం బాబూఖాన్  ఎస్టేట్స్ బిల్డింగ్ నాలుగో ప్లోర్ లో ఉన్న యూనిట్- 3 పనిచేయటం ప్రారంభించింది.

    లక్షలాది జనం..

    నేల ఈనిండా అన్నట్లున్నాయి రోడ్లన్ని. ఎవరు ఎవర్నీ పట్టించుకొనే పరిస్థితుల్లో లేరు.

    పబ్లిగ్గా....పట్టపగలు లక్షలాది సొమ్ము యధేచ్చగా లూటీ అయిపోతున్న పట్టించుకున్న నాధుడే లేకుండాపోయాడు.


                      *    *    *

    "మొత్తం ఎంత.....?"

    "సుమారు కోటీ ఇరవై లక్షలుండవచ్చు."

    ఆ గది నిశ్శబ్దంగా ఉంది.

    అక్కడ ఇద్దరే వ్యక్తులున్నారు.

    ఒకరు జయధీర్, రెండు దాదా....

    "రేపటి ఉదయానికి ఎవరివాటా వారి కందాలి. లెక్కలు సరిగ్గా ఉండాలి."

    "అలాగే సార్"

    "ఎనీ ప్రాబ్లమ్?"

    చిన్న అనుమానం ఉందిసార్. మిమ్మల్ని గోవాలో తన కెమేరా లోకి ఎక్కించుకున్న యువతే ఈరోజు ఊరేగింపుకు అగ్రభాగాన ఉండిఅన్ని దృశ్యాల్ని షూట్ చేసుకుంది. అప్పటికీ మనవాళ్ళు వంచిన తలలు ఎత్తకుండానే లూటీ చేసారు. కాని పొరపాటున ఎవరన్నా ఆమె కెమెరాకు దొరికిపోయారేమోనని అనుమానంగా ఉంది సార్."

    జయధీర్ కొది క్షణాలేం మాట్లాడలేదు. దాదా అతని సూచన కోసం ఎదురు చూస్తూండిపోయాడు.

    "ఆ యువతి ఎవరోగాని డాషింగ్ గా ఉందే: ఎనీ హౌ.....ఆమె  షూట్  చేసిన క్యాసెట్ త్వరలోనే మన చేతుల్లోకి వచ్చేయాలి. అందుకు అవసరమైతే...." జయధీర్ మిగతా మాటలు పూర్తి చేయలేదు.

    దాదా అర్థమయిందన్నట్లుగా తలూపి లేచాడు.

   
                      *    *    *

    దివ్యతేజ బిల్డింగ్స్ ముందు దాదాపు పాతిక మంది దాకా  నిరీక్షిస్తున్నారు. వాళ్ళంతా హంపీ టెలీ సీరియల్ లో నటించేందుకు ఇంటర్యూ కోసం వచ్చినవాళ్ళు.

    అది ఉదయం పదిగంటల సమయం. చిన్నపాత్రయినా హంపీ డైరెక్షన్ లో నటించటమంటే ప్రెస్టేజ్ గా ఫీలవుతుంటారు టీవీ ఆర్టిస్టులు.

    ఇంటర్వ్యూ మొదలయి అరగంటయింది. ఒక్కో ఆర్టిస్టుని లోపలకు  పిలిపించి ఓరల్ ఇంటర్వ్యూ చేసి, సంతృప్తి చెందితే స్క్రీన్ టెస్టు చేస్తున్నారు వెంటనే.

    అప్రూవ్ అయిన సీరియల్ లోని రెండు డైలాగ్స్ చెప్పమని వారి ఎక్స్ ప్రెషన్స్ ని, మూమెంట్స్ ని, డైలాగ్ డెలివరీని వీడియో కెమెరాతో చిత్రీకరిస్తున్నారు.

    అలా ఆ తతంగం మధ్యాహ్నం రెండుగంటలవరకు కొనసాగింది.

    హంపీ మోములో అలసట కనిపిస్తోందేగాని, తృప్తి కనిపించటం లేదు.

    "మేడమ్.....మనకు కావల్సిన ఆర్టిస్టుల్లో సగమైనా దొరికినట్లేనా?" విల్సన్ ఆర్టిస్టుల అడ్రస్సులున్న ఫైల్ ని వరుస క్రమంలో పేరుస్తూ అడిగాడు.

    "ముందు హీరో, హీరోయిన్ క్యారెక్టర్స్ మెయిన్. ఎంతో ఆశగా ఎదురుచూసాను. ఆ పాత్రలకు తగ్గ నటీనటులు దొరుకుతారేమోనని.....ప్చ్..... ఏం లాభం లేదు. టీవీ మీద వ్యామోహంతో, పాపులారిటీ వస్తుందనే ఆశతో ఇంటర్వ్యూకి వచ్చినవాళ్ళే తప్ప ఆ ఇన్ స్టింక్ట్ ఉన్న వాళ్ళు బొత్తిగా లేరు. ప్రొఫెషనల్ ఆర్టిస్టులు లేరు మిస్టర్ విల్సన్.

    హిందీ సీరియల్స్ కి ఎంతటి అద్భుతమైనా ఆర్టిస్టులు దొరుకుతున్నారు......? ఏ సీరియల్ లో చూసి నా, ఏ ఆర్టిస్టుని చూసినా సరిగ్గా ఆ పాత్రకు తగ్గట్లుగా  ఉంటారు.

    వారిలో తపన, పట్టుదలకూడా కనిపిస్తుంది. చాలా కేజువల్ గా చేసుకుపోతున్నట్లుగా కనిపిస్తారు.

    మన దగ్గరో......డైలాగ్ చెబితే ఎక్స్ ప్రెషన్ ఉండదు-

    ఎక్స్ ప్రెషన్ ఉంటే డైలాగ్  మర్చిపోతారు.

    మోస్టు డిజ్ గస్టింగ్! హంపీ చిరాకును వ్యక్తం చేసింది.

    "పోనీ.....హీరో పాత్రకి ప్రశాంత్ ని, హీరోయిన్ పాత్రకు నందినినే పెట్టుకొని మిగతా పాత్రలకు కొత్తవార్ని పెట్టుకుంటే కొంతవరకు బెటరేమో ఆలోచించండి."

    హంపీ ఏం మాట్లాడలేదు.

    పైగా స్పాన్సర్స్ దొరకటంకూడా అంత తెలిగ్గాలేదు. ప్రశాంత్ ని, నందినిని పెట్టుకుంటే సుశీల్ కుమార్ స్పాన్సరర్ ని చూసి పెట్టవచ్చు. ఇప్పటికే ఎన్నో స్క్రిప్టులు అప్రూవ్ అయి స్పాన్సరర్స్ దొరక్క షూటింగ్ కి నోచుకోలేదు. లోకల్ గా ఎవరినన్నా  స్పాన్సరర్స్ ని చూసినా వాళ్ళిచ్చే డబ్బుతో సీరియల్ ని బాగా తీయలేం. ఒక్కసారి ఆలోచించి చూడండి" ఫైల్ క్లోజ్ చేస్తూ అన్నాడు విల్సన్.


                                           *    *    *

    స్మశానంలో ఆ సంఘటన జరిగిన దగ్గర్నుంచి బస్ లో  నిశ్శబ్దం పేరుకుపోయింది.

    తనను వెతుక్కుంటూ తన తల్లి సిటీకి రావటం, తను దొరికే లోపే దిక్కుమాలిన చావుకు గురికావటం, ఆ శవం ఇద్దరు అష్టదరిద్రులకు దొరకటం, వాళ్ళు దాన్నడ్డం పెట్టుకొని చందాలు వసూలు చేసుకోవటం తలచుకొని అనిల్ కుమిలిపోయాడు.

    ఆ స్థితిలో అనిల్ ని పలకరించే ధైర్యం మిగతా ఇద్దరికీ లేకపోయింది.

    ఆ సంఘటన జరిగిన సాయంత్రానికి నారాయణ్ ద్వారా  శిరీషకు విషయం తెలిసి చాలా బాధపడింది.

    అనిల్ ని ఓదార్చాలని ఉందామెకు. పసివాడ్ని.....కన్నతల్లి ఒడిలోకి తీసుకొని ఓదార్చినట్లు ఓదార్చాలనే ఉంది. కాని ఏదో బెరుకు.

    ఇప్పుడా ఇద్దరూ బస్ దగ్గర్లోనే ఉన్న ఓ చెట్టు క్రింద కూర్చునున్నారు. కాలం నిశ్శబ్దంగా వార్ని పెనవేసుకు కరిగిపోతోంది.

    జాలి అంటే ఆమెకసహ్యం.

    జాలి పడటం అంటే అయిష్టం. అందుకే ఆమె అనిల్ ని చూసి బాధపడుతోందే తప్ప జాలి పడలేకపోతోంది.

    "నేను నీమీద జాలిపడను మిస్టర్ అనిల్.....మనిషి తలచుకుంటే ఏపనినైనా చేసి బ్రతకవచ్చు- తనను నమ్మిన వాళ్ళను బ్రతికించుకోవచ్చు. గొప్పగా బ్రతికించుకోలేక పోవచ్చు..... మీ అమ్మగారు చనిపోయినందుకు నాకూ బాధగా ఉంది. కాని ఒక మనిషి ఇంత దయనీయంగా బ్రతకక్కర్లేదు. మిమ్మల్ని నమ్ముకొన్న మీ అమ్మను పోషించలేకపోయారు. మీ వెంట  మీ స్నేహితురాలిగా వచ్చిన నన్ను జులాయిల నుంచి రక్షించలేక పోయారు. కనీసం రక్షించే ప్రయత్నం చేయలేకపోయారు. ఎంతటి దయనీయమైన స్థితిలో ఉన్నారు మీరు? ఒక యువకుడు తన ప్రక్కనున్న స్నేహితురాల్ని రక్షించుకోలేక పోయాడంటే ఎంత అవమానకరమైన స్థితి! మిమ్మల్ని విమర్శిస్తున్నానను కోకండి.....ఒక్కసారి ఆత్మ విమర్శ చేసుకోండి చాలు..." 

 Previous Page Next Page