వినాయక నిమజ్జనం ప్రారంభమయ్యే స్పాట్ నుంచి నిమజ్జనం అయ్యే టాంక్ బండ్ వరకు ఊరేగింపు సాగే రూట్ ని మార్క్ చేసి ఉన్న మేప్ ని టేబుల్ మీద హంపీకి ఎదురుగా ఉంచాడు విల్సన్.
హంపీ పెన్సిల్ చేతిలోకి తీసుకొని "అబిడ్స్ లో ఒక యూనిట్ ఎరేంజ్ చేయాలి. అబిడ్స్ మొత్తం కవర్ చేయగలిగేలా ఓ ఎత్తయినా బిల్డింగ్ గుర్తుంచండి..." అంది మేప్ కేసే చూస్తూ.
విల్సన్ టేబుల్ మీదకు వంగుతూ.
"అబిడ్స్ మొత్తం కవర్ చేయాలంటే సెకండ్ కెమేరాని గాడ్రేజ్ షోరూమ్ బిల్డింగ్ పై ఏర్పాటు చేయాలి మేడమ్" హంపీ గాడ్రేజ్ షోరూమ్ బిల్డింగ్ ని మార్క్ చేసి సి-2 అని రాసి "నెక్ట్స్" అంది.
నెక్ట్స్...... బషీర్ బాగ్.....గాంధీ మెడికల్ కాలేజీ రోడ్.... లిబర్టీ సెంటర్.....కవర్ కావాలి." మేప్ లో గుర్తించిన రూట్ నే చూస్తూ అన్నాడు విల్సన్.
"అప్పుడు.....బాబూఖాన్ ఎస్టేట్స్ బిల్డింగ్ ని ఎన్నుకోటం బెటరేమో?"
"అఫ్ కోర్స్...." అన్నాడు విల్సన్.
హంపీ పెన్సిల్ తో సి-3 అని వ్రాసి "యూనిట్ నాలుగు లిబర్టీ సెంటర్ లో అరేంజ్ చేస్తే బావుంటుందేమో?" అంది హంపీ సాలోచనగా.
"లిబర్టీ సెంటర్ లో ఏ బిల్డింగ్ పైనో డిసైడ్ చేస్తే నాకో ఐడియా ఉంటుంది మేడమ్."
"డేటా మెటిక్ కార్పొరేషన్ బిల్డింగ్ అయితే బావుంటుంది.
"ఓకే మేడమ్....."
"ట్రైల్ వేస్తే బావుంటుందేమో?"
"మీ ఇష్టం మేడమ్...."
"అయితే అరేంజ్ చేయండి. ఈరోజు ఓసారి ట్రైల్ వేసి చూద్దాం..." అంది మేప్ ని మడుస్తూ.
విల్సన్ మేప్ ని చేతిలోకి తీసుకుంటూ "నేనా ఏర్పాట్ల లో ఉంటాను మేడమ్" అంటూ వెళ్ళేందుకు ఉద్యుక్తుడవుతుండగా "ఒన్ మినిట్..... అంటూ సొరుగులోంచి కొంత డబ్బుతీసి విల్సన్ కి అందించింది.
ఆ హాల్లో ఇరవైమంది సాయుధులైన వ్యక్తులున్నారు. ఇప్పుడా హాలంతా నిశ్శబ్దంగా ఉంది.
జయధీర్ సీరియస్ గా అటూ, ఇటూ పచార్లు చేస్తున్నాడు.
"ఎవరు ఏ షాప్ ని దోచుకోవాలో గుర్తుందా?" జయధీర్ మొహం ఎవరికీ కనిపించటం లేదు. గంభీరమైన అతని కంఠమే వినిపిస్తోంది.
తల వంచుకొని సీరియస్ గా పచార్లు చేస్తున్న అతని సగం మొఖాన్ని హేట్ కప్పేస్తోంది.
"గుర్తుంది సార్" అందరూ ఒక్కసారే ముక్త కంఠంతో అన్నారు.
"నెంబర్ త్రీ....."
"ఎస్ సర్"
"నీ షాప్ నెంబర్.....?"
"సెవెన్.....సేఠ్ అరవింద్ లాల్ జ్యూవెలరీ షాప్"
"నెంబర్ సెవెన్.....?"
"షాప్ నెంబర్ నైన్...."
"డిస్టెన్స్...."
"ఊరేగింపునుంచి సరీగ్గా పదకొండు అడుగులు"
"ఎలా ఓపెన్ చేస్తావ్....?"
జయధీర్ పచార్లు చేస్తూ ప్రశ్నిస్తున్నాడు.
"హేండ్ గ్రెనేడ్....."
"వెరీ గుడ్ "
హాల్లో తిరిగి నిశ్శబ్దం అలుముకుంది. దాదా మౌనంగా చూస్తూ కూర్చున్నాడు.
"నెంబర్ టూ....." జయధీర్ తిరిగి అన్నాడు.
"షాప్ నెంబర్ త్రీ...."
నెంబర్ టూ కళ్ళుమూసి తెరిచే లోపే జయధీర్ చేతిలోని స్టిక్ అతని మొఖాన్ని తాకింది విసురుగా వచ్చి.
అతను తప్పుచెప్పి ఉంటాడని అందరికీ అర్థమై పోయింది.
"ఈ వృత్తిలో ఉండేవాళ్ళు అప్రమత్తంగా ఉండాలని లక్షసార్లు చెప్పాను" జయధీర్ మాటలు తీక్షణంగా ఉన్నాయి.
తప్పుచేసినవాడిలా అతను తల వంచుకున్నాడు.
"మరలా చెప్పు....'
అక్కడున్న అందరి వెన్నులో చలి పట్టుకొచ్చింది.
"షాప్ నెంబర్ ఒన్"
దట్స్ రైట్" అన్నాడు జయధీర్ తల పంకిస్తూ.
ఎవరి షాప్ వారికే గుర్తు లేక తాము కంగారు పడుతుంటే ఇరవై మంది నెంబర్స్, వారికి ఎలాట్ చేసిన షాప్స్ నెంబర్స్ కూడా కరక్టుగా చెప్పేస్తున్నాడు: అందుకే ఇంటర్నేషనల్ స్థాయి క్రిమినల్ అయ్యాడు.
జయధీర్ ని చేస్తున్న ఆ ఇరవై మంది మనసుల్లో మెదిలే భావాలవి.
"దాదా......సెకండ్ బ్యాచ్ ని లోపలకు పిలుపు" జయధీర్ శాసించాడు.
సెకండ్ బ్యాచ్ కి చెందిన ఇరవై మంది వ్యక్తులు లోపలకు వచ్చి జయధీర్ కి సెల్యూట్ చేసి స్టిఫ్ గా నించున్నారు.
"నెంబర్ ఒన్....."
"ఎస్.... సర్....."
"ఎవరి దగ్గరి నగలు తప్పిస్తావ్?"
"నెంబర్ సెవెన్ సార్"
"వెరీ గుడ్"
తిరిగి హాల్లో నిశ్శబ్దం అలముకుంది.
"మరొకరు ఏం చేస్తున్నారన్నది ఇంకొకరికి అనవసరం. ఎవరికీ అప్పగించిన పని మాత్రమే వారు చేయాలి.... అదీ మీకిచ్చిన టైమ్ లోపే.....మరో విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఫిల్మ్ డెవలప్ మెంట్ కెమేరాకి గానీ, టెలివిజన్ కెమేరాకి కాని పొరపాటున కూడా దొరక కూడదు. సాధ్యమైనంత వరకు తలలు సగం వంచుకొని మీ మీ పనులు పూర్తిచేసుకు పోవాలి. ఏమాత్రం తలెత్తినా- పొరపాటున ఆ టైమ్ కే ఏ కెమేరా అయినా జూమ్ చేస్తే మీ మొఖాలు.... మీ మూమెంట్స్ స్పష్టంగా రికార్డు అయిపోతాయి. బీ కేర్ ఫుల్.....మీకిచ్చిన టైమ్ లోపల షాప్ లోని నగలన్నిటినీ మీ సొంతం చేసుకోలేక పోయినా అక్కడ ఆగకూడదు. ఇక్కడ టైమ్ సెన్స్ చాలా ముఖ్యం.....ఊరేగింపులో ఉండే పోలీసులు లూటీ అయిన ప్రతిషాప్ దగ్గర ఆగిపోతారు.....ఆ విధంగా లిబర్టీ సెంటర్ కి వచ్చేసరికి మఫ్టీలో వాళ్ళు పల్చబడిపోతారు.....మరో ప్రమాదం కూడా ఉంది. కొంతమంది ప్రెస్ ఫోటో గ్రాఫర్స్ ఎంత రిస్కైనా తీసుకొని మంచి దృశ్యాల్ని ఎక్స్ పోజ్ చేసుకుంటారు. కనుక ఎవరి చేతిలోనైనా కెమేరా కనిపిస్తే చాలు...... ఆ వేపుకు ఫేస్ చేయవద్దు. ఒకవేళ ఫేస్ చేయవలసి వస్తే మీకు ముందు, మీ ముఖానికి అడ్డం వచ్చేలా ఎవరినన్నా అడ్డం పెట్టుకోవాలి..... బీ కేర్ ఫుల్ ....బీ అలర్ట్. విష్ యూ బెస్టాఫ్ లక్...."
నలభై మంది లేచి నుంచుని సెల్యూట్ చేసి బయలు దేరబోతుండగా జయధీర్ తిరిగి అన్నాడు.
"ఒకవేళ పొరపాటున ఎవరైనా పోలీసులకు దొరికితే మౌనంగా ఉండిపోవాలే తప్ప మన పథకం గానీ దాని వెనుకవున్న వ్యక్తులు గాని బయటకు రాకూడదు..... ఒకవేళ వస్తే.....ఫలితం చాలా దారుణంగా ఉంటుంది......" జయధీర్ హాల్లోంచి నిష్క్రమించాడు.
అతని పదకాలన్నీ అలాగే ఉంటాయి. పథకమంతా గొలుసులా పన్నినా.....ఎక్కడ ఏ లింకు దొరికినా అక్కడతో ఆ గొలుసు నుంచి ఆ లింక్ వేరుపడేలా ఉంటుందే తప్ప- తీగలాగితే డొంకంతా కదిలేలా ఉండదు.
దానికోసమే ఎవరి డ్యూటీ వరకే వాళ్ళు చేయాలి అని జయధీర్ శాసించేది.
"రేపు సాయంత్రానికి మన చేతిలో కోటి రూపాయలుంటాయి.....
ఈ ఆపరేషన్ లో పాల్గొంటున్న ఒక్కొక్క వ్యక్తికి యాభై వేలు అందించు. వాళ్ళు రెండు నెలల వరకు అజ్ఞాతంగా ఉండిపోవాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ బాహ్య ప్రపంచంలో తిరగారాదు. పోలీసుల్ని అసమర్ధులుగా లెక్క వేయరాదు. ఆ...వాళ్ళేం.....చేస్తారనే అహం మనలో ఉండకూడదు. ఎప్పటికీ రాకూడదు..... గుర్తుంచుకో దాదా...." జయధీర్ బయటకు నడుస్తూ అన్నాడు.
* * *
ఆ రోజు వినాయక నిమజ్జనం.....
నగరమంతా హడావిడిగా ఉంది.
నగర ట్రాఫిక్ కమీషనర్ ఓ ప్రక్క- లా అండ్ ఆర్డర కమిషనర్ ఓ ప్రక్క వారివారి ఏర్పాట్లలో హడావిడిగా ఉన్నారు.
సరీగ్గా ఉదయం పదకొండు గంటలకు ఊరేగింపు ఓల్డ్ సిటీలో ప్రారంభమైంది.
ఊరేగింపుకి అగ్రభాగాన హంపీ వ్యాన్ నెమ్మదిగా ముందుకు సాగింది.
మారుతీ మినీ వ్యాన్ వెనుక భాగాన ఉండే డోర్ పైకిలేపి అక్కడ కెమేరా ఫిక్స్ చేసుకొని కూర్చుంది హంపీ. ఆమె ప్రక్కనే ఇద్దరు అసిస్టెంట్స్ మిగతా అరేంజ్ మెంట్స్ చూసేందుకు సిద్ధంగా ఉన్నారు.
ఆమెకు ఓ ప్రక్క ఐదారు క్యాసెట్ లు సిద్దంగా వున్నాయి.
ఊరేగింపు ప్రశాంతంగానే ప్రారంభమైంది.
అప్పటికే జయధీర్ మనుష్యులు ఊరేగింపులో కల్సిపోయి ఉన్నారు.
యూనిట్-2 గాడ్రేజ్ షోరూమ్ బిల్డింగ్ పై సిద్దంగా ఉంది. దాని వెనుక విల్సన్ సిద్దంగా ఉన్నాడు.
యూనిట్-3 బాబూఖాన్ ఎస్టేట్స్ ఐదవ ఫ్లోర్ లో సిద్దంగా ఉంది. దాని వెనుక భవానీ సిద్దంగా ఉన్నాడు.
యూనిట్-4 లిబర్టీ సెంటర్ లో డే టామెటిక్స్ కార్పోరేషన్ బిల్డింగ్ పై సిద్దంగా ఉంది.
హైద్రాబాద్ వినాయక నిమజ్జనాన్ని కళాత్మకంగా చిత్రించేందుకు అందరూ అప్రమత్తంగా ఉన్నారు.
ఊరేగింపు ఎలాంటి గందర గోళాలు, అవాంతరాలు లేకుండానే మొజాంజాహి మార్కెట్ వరకు వచ్చింది.
ఊరేగింపును పహరా కాస్తున్న వందలాది పోలీసులు, మప్టీలో ఉన్న పోలీసు సిబ్బంది అప్రమత్తంగా నలువైపులకు చూస్తూ ముందుకు సాగుతున్నారు. కాని.....అందరికీ భయంగానే ఉంది......ఏవేపునుంచి ఏ క్షణాన ఏ ప్రళయం ముంచుకొస్తుందోనని.
తప్పట్ల హొరు....నినాదాల జోరు....
భక్తి పారవశ్యం..... పరవళ్ళు తొక్కుతోంది:
ఉన్నట్టుండి ఊరేగింపులో కలకలం చెలరేగింది. హంపీ ఉలిక్కిపడి కెమేరా ఆఫ్ చేసి రెండు వేపులకు పరికించి చూసింది.
ఓ చోట జనం బాగా గుమికూడినట్లు కనిపించింది.
అంతే.....వెంటనే కెమేరాని స్టాండ్ లోంచి పైకితీసి భుజంమీద ఆనించుకుంది.
సడన్ గా నిప్పు ముద్దలు నాలుగైదు గాల్లోకి ఎగిరి రోడ్ కి రెండు వేపులా ఉన్న షాప్స్ మీద పడ్డాయి. ఒక్కసారి జనాలు హాహాకారాలు చేశారు.