ఆమె లేచింది.....
అతనలాగే నిశ్శబ్దంగా మోకాళ్ళ మధ్య తల వంచుకుని ఉండిపోయాడు.
ఆమె మౌనంగా తనుపనిచేసే ఇంటివేపుకు సాగిపోయింది.
* * *
"అతను ఓ మామూలు మనిషి, చిన్న సంఘటనకు సయితం చలించి పోయే మనిషి, మరొకరి జోలి అతనికి అనవసరం. తన పనేదో తను నిశ్శబ్దంగా చేసుకు పోగల మంచి మనిషి. కళ్ళ ఎదురుగా అన్యాయం జరుగుతున్నా, మోసం జరుగుతున్నా భయంగా, సిగ్గుగా తలవంచుకొని వెళ్తాడే తప్ప ఎదిరించలేడు ప్రతిఘటించలేడు. అలాంటి పాత్ర ఇందులో హీరోది. అలాంటి హీరో విచిత్రమైన పరిస్థితుల్లో స్పందించి పోతాడు. క్రమంగా అతనిలోతార్కికం పెరుగుతుంది. ధైర్యం ఊపిరి పోసుకుంటుంది. ఆత్మవిశ్వాసం ప్రోది చేసుకుంటుంది. అప్పటి వరకు కనీసం ప్రేమించిన యువతికి అడుగు దూరంలోనైనా నిలబడేందుకు జంకే పిరికివాడు-గట్టిగా మాట్లాడటానికి కూడా భయపడే దుర్భలుడు- ఆ సంఘటన తర్వాత ఎదిరిస్తాడు- తెగిస్తాడు- అన్యాయంపై తిరగబడతాడు- అక్రమాన్ని సమాధి చేస్తాడు.
మొదటి ఎపిసోడ్ లో బిడియంగా, భయంగా, పిరికి తనంగా, న్యూనతగా కనిపించాలి. రెండో ఎపిసోడ్ లో అతనిలో పరిశీలన, ఆలోచన కనిపించాలి. మూడో ఎపిసోడ్ లో అతనిలో సంపూర్ణమైన మార్పు వస్తుంది. అప్పటినుంచి అతని నటనలో, ఉచ్ఛారణలో, మూమెంట్ లో ఉద్వేగం, ఉత్సాహం, ఉద్రేకం కనిపించాలి. చాలా అద్భుతమైన పాత్ర అది-మీరు దానికి ప్రాణ ప్రతిష్ట చేయాలి..... ఒక తపస్సులా, యజ్ఞంలా ఈ పాత్రలో నటించాలి. మొదట్లో అతని కళ్ళలో అమాయకత్వం, పసితనం కనిపించాలి. ఆ తరువాత పొగరు, మొరటుతనం, తెగింపు కనిపించాలి. అంటే తెల్లగాఉన్న కనుగ్రుడ్లు ఎరుపు జీరను సంతరించుకోవాలి. లాగే కదలికలో సైతం వందశాతం కాంట్రాస్ట్ కనిపించాలి. ఈనాడు సమాజంలో ఎందరో దౌర్భల్యులకు ప్రతీకగా కనిపిస్తుంది ఆ పాత్ర, ఎలా ఉంటే- ఎలా మారితే నెగ్గుకు రాగలరో అసలెలా ఉండాలో ఆ పాత్రలో కనిపించాలి. ఈనాటి ప్రతి యువకుడు ఆ పాత్రలో తనను చూసుకొని తృప్తిపడాలి. ప్రతి క్షణం ఆ ప్రాతలో తనను ఐడెంటిపై చేసుకోగలగాలి. నా కెరియర్ ను, నా జీవితాన్ని, నా సర్వస్వాన్ని ఫణంగా పెట్టబోతున్నాను...."
ఉద్వేగంలో ఆపైన ఆమె మాటలు తడబడ్డాయి. ప్రశాంత్ ఎప్పుడూ ఆమెలో అంత ఆవేశాన్ని చూడలేదు.
"తప్పకుండా-అంతమంచి పాత్రకు నన్నెన్నుకోవటం నాకానందంగా ఉంది. నాకు తెలుసు మీ చేతిలో అదో అద్భుతమైన సీరియల్ అవుతుందని మీరు చెప్పినట్లుగానే దాన్నో తపస్సులా భావించి చేస్తాను.... ఈ దేశ యువత నేను వేసే పాత్రను ఐడెంటిఫై చేసుకొనేలా చేస్తున్నారంటే అది నాకు ఒక నటుడిగా ఎంత పాపులారిటీని, ఇమేజ్ ని తెచ్చి పెడుతుందో నేనూహించ గలను. మీకు నా మీద, నా నటనమీద అంత నమ్మకం ఉండటం నాకు చాలా గర్వంగా ఉంది. డిఫెనెట్ గా ఇది సెన్సేషన్ అవుతుంది. ఆనందాన్ని వ్యక్తం చేస్తూ అన్నాడు ప్రశాంత్.
"పోతే....అందులో తల్లి చనిపోయినపుడు హీరో పాత్ర హండ్రెడ్ పర్సంట్ ఇన్ వాల్వు అయి నటించాలి. అది మూడో ఎపిసోడ్ తో వస్తుంది. అదే సీరియల్ మొత్తానికి లైఫ్. ఎందుకంటే ఆ ఇన్సిడెంట్ తోనే అతనిలో చిత్రమైన అనూహ్యమైన మార్పు వస్తుందో. సో.....రేపోసారి మనం అది షూట్ చేద్దాం ట్రైల్ వేసి చూద్దాం ఎలా వస్తుందో. రేపు స్మశానంలో షూటింగ్ ఎరేంజ్ చేస్తున్నాం. చితిమామూలే కట్టెలు అన్నీ పేర్చి ఒక తల్లికి కొడుకు ఎలా కర్మకాండ చేస్తాడో అలాగే చేసి చూద్దాం... ఈ రాత్రికి మీరు మెంటల్ గా ప్రిపేర్ అవండి. ఓ వేపు చితి మంటలు మింటి కెగుస్తుంటాయి. ఆ మంటల కావల మీరుంటారు. మిమ్మల్ని ఎంతగానో ప్రేమించే మీ కన్న తల్లి చనిపోయింది. మీకు ఆమె తప్ప వేరే ఆధారం లేదు. మీ సర్వస్వం ఆమె. అంత గొప్ప అచాట్ మెంటున్న కన్నతల్లి చనిపోయినప్పుడు ఒక కన్నకొడుకు ఎలా రియాక్ట్ అవుతాడో బాగా ఆలోచించి ప్రిపేర్ అవండి. వీలయితే ఈ రాత్రికి రిహార్సల్స్ చేయండి. ఆ సీన్ పడకపోతే సీరియల్ మొత్తం ప్లాప్ అవుతుంది. ఎలా నటించాలి? ఏమిటి అన్న విషయాలేం నేను మీకు చెప్పను. చెప్పక్కర్లేదు కూడా. మీరు మంచి అనుభవమున్న నటులు. యూ కెన్ డూ వెరీవెల్....."
ప్రక్కనే ఉన్న విల్సన్, భవాని నిశ్శబ్దంగా వింటున్నారు హంపీ చెప్పే సూచనల్ని.
సరిగ్గా ఇదే టైమ్ లో ప్రభు ఆ రోజు దినపత్రికలన్నిటిని ముందేసుకొని వినాయక నిమజ్జనం సందర్భం జరిగిన లూటీ వివరాల్ని వివిధ కోణాల నుంచి పరిశీలిస్తున్నాడు.
ఇంత పకడ్బందీగా లూటీ జరిగిందంటే అది ఖచ్చితంగా మాస్టర్ క్రిమినల్ ఇంటిలిజెంట్ బ్రెయిన్ లోంచి పుట్టిన పథకమే అయుంటుంది.
మెరుపు దాడులు చేయించటంలో జయధీర్ కున్న ప్రావీణ్యం అసాధారణమైనది.
ఒకవేళ జయధీర్ ఇక్కడ ప్రత్యక్షమయ్యాడా.......
ఊరేగింపును షూట్ చేసిన వాళ్ళలో హంపీ ఉంది. ఆమె సాధారణంగా మామూలు సంఘటనల్ని అతి మామూలు పద్దతుల్లో షూట్ చేయదు. డెఫినిట్ గా ఆమె కెమేరా లూటీని ఎక్స్ పోజ్ చేసుంటుంది.
ఆ ఆలోచన రాగానే ఒకింత ఆశ్చర్యపోయాడు. ఏక్సిడెంటల్ గా ఆమె కెమేరాకి దగ్గరగా వచ్చి వెళ్తున్నాడు జయధీర్. అది కేవలం కాకతాళీయమే కావచ్చు.
తీగ హంపీ.....
ఆమెను నిర్ణయానికొచ్చిన ప్రభు లేచి తన ముందున్న ఫైల్స్ ని కాన్ఫిడెన్షియల్ రాక లో ఉంచి బయటకు సాగిపోయాడు.
* * *
సాయంత్రం నాలుగు గంటల సమయం. హంపీ యూనిట్ మొత్తం స్మశానానికి తరలి వచ్చింది.
ఒక డమ్మీ బొమ్మను తయారుచేసి దానికి తెల్లటిచీరచుట్టి అప్పటికే పేర్చిన చితిమీద పరుండబెట్టారు.
విల్సన్ కెమెరా దగ్గరున్నాడు.
భవానీ లైటింగ్ అరేంజ్ మెంట్స్ చూస్తున్నాడు. మేకప్ మేన్, కాస్ట్యూమర్ హీరో ప్రశాంత్ ని షాట కి ప్రిపేర్ చేస్తున్నారు.
రెండు కార్లు, అవుడ్దోర్ వ్యాన్, పదిహేనుమందియూనిట్ సభ్యులతో స్మశానమంతా నిండిపోయి హడావుడిగా ఉంది.
హంపీ కేవలం ట్రైల్ కోసం ఇన్ని ఏర్పాట్లు చేయటం యూనిట్ సభ్యులందరికీ ఆశ్చర్యంగా ఉంది.
"మిస్టర్ ప్రశాంత్ షాట్ రెడీ" అంది హంపీ పెద్దగా.
ప్రశాంత్ టక్కున చైర్ లోంచి లేచి చితి దగ్గరగా నడిచాడు.
యూనిట్ బాయ్ వెళ్ళి కట్టెల మీద కిరోసిన్ చల్లి చటుక్కున ప్రక్కకు తప్పుకున్నాడు.
ప్రశాంత్ కళ్ళు మూసుకొని ఆ మూడ్ లోకి వెళ్ళేందుకు ప్రి పేర్ అవుతున్నాడు.
విల్సన్ ని ప్రక్కకు తప్పుకొమ్మని హంపీ కెమేరా వెనక్కు వెళ్ళి నిల్చుంది.
కొన్ని క్షణాలు నిశ్శబ్దంగా దొర్లిపోయాయి. అప్పుడు కళ్ళు తెరిచాడు ప్రశాంత్.
అతని కళ్ళిప్పుడు ఎర్రగా ఉన్నాయి.
మొఖం విచారంగా ఉంది.
ప్రపంచంలోని బాధంతా అతని మొహంలోనే గూడు కట్టుకున్నట్లుంది.
"టేక్ చేద్దామా?" హంపీ మరోసారి పెద్దగా అంది.
ప్రశాంత్ ఓకే అన్నట్లు సంజ్ఞ చేశాడు. గంటక్రితం హంపీ ఇచ్చిన సూచనల ప్రకారమే పనులు జరిగిపోతున్నాయి.
ఒకతను వెళ్ళి కాలుతున్న కొరివిని ప్రశాంత్ కి అందించాడు.
మరొకతను వెళ్ళి ప్రశాంత్ తలను నీళ్ళతో పూర్తిగా తడిపేసి వచ్చేశాడు.
షాట్ కి రంగం సిద్ధమయిందని అక్కడున్న అందరికీ తెలిసిపోయింది.
విల్సన్ చటుక్కున చితి దగ్గరకు వెళ్ళి లైట్ ని చెక్ చేసుకొని హంపీకి ఓకే అన్నట్లు తెలియజేసి ఫ్రేమ్ లోంచి తప్పుకున్నాడు. కెమేరాను అప్పటికి ట్రాలీ మీదకు ఎక్కించటం పూర్తయింది.
హంపీ కెమేరా ప్లాట్ ఫామ్ మీదకు ఎక్కి కెమేరా వెనక్కు వచ్చి ఫీల్డ్ ని ఓసారి చూసుకొని సంతృప్తిచెంది కుడిచేతిని గాల్లోకి ఊపింది.
కెమేరా ఆన్ అయింది.....
చేతిలోమండుతున్న కట్టెతో ఉన్న ప్రశాంత్ క్రమంగా చితి దగ్గరకు వచ్చి కొద్దిక్షణాలు చితికేసి చూసి ఒక్కసారి బావురు మన్నాడు.
ప్రక్కనున్న ఓ కో ఆర్టిస్టు ప్రశాంత్ ను అనునయిస్తూ, ఓదార్చుతూ ఉండగా అతను చితిమీదకు పోతున్నట్లు ముందుకు అడుగులు వేయటం, కో ఆర్టిస్ట్ అతన్ని తిరిగి ఆపటం..... అతను మరింతగా విలపిస్తూ చితిదగ్గరకు వెళ్ళి దానిమీద పడిపోవటం, కో ఆర్టిస్ట్ తిరిగి ప్రశాంత్ ను ఓదార్చి చితికి దూరంగా తీసుకుపోవటం- అంతా సహజంగా జరిగిపోతోంది.
కెమేరా నిశ్శబ్ధంగా ట్రాలీ మీద ముందుకు కదిలింది.
యూనిట్ సభ్యులంతా ఆసక్తిగా ప్రశాంత్ నటనను చూస్తున్నారు.
కెమేరా ఇప్పుడు సరిగ్గా ప్రశాంత్ కు నటనను చూస్తున్నారు.
అప్పుడే పొద్దు ఏటవాలుతోంది. పశ్చిమాద్రిన ఎర్రటి ఏటవాలు పొద్దు మనోహరంగా కనిపిస్తోంది. దానిముందు ప్రశాంత్......అద్భుతంగా ఉంది కంపోజిషన్......
ట్రాలీమీద కొంతదూరం ప్రయాణించిన కెమేరా ఇప్పుడు నిశ్చలంగా ఉంది.
కో ఆర్టిస్ట్ ప్రశాంత్ ని చితికి నిప్పంటించమని సూచించాడు.
అతను బాధను నటిస్తూనే చితికి నిప్పంటించాడు.
అంతే....భగ్గున మంటలు మింటికెగసాయి.
కెమేరా తిరుగుతూనే ఉంది.
మంటల్లోంచి ప్రశాంత్ ముఖాన్ని జూమ్ చేసింది హంపీ.
అతని మొఖంలో పలుకుతున్న ప్రతి భావాన్ని సునిశితంగా తనలో నిక్షిప్తం చేసుకుపోతోంది కెమేరా.
మండుతున్న చితిమంటలు.
తల్లిని పోగొట్టుకున్న ప్రశాంత్ లోని బాధ, దుఃఖం ఆవేదన స్పష్టంగా రికార్డయిపోతున్నాయి.
కెమేరా తిరిగి కదిలింది.
వివిధ భంగిమల్లో ఆ దృశ్యాన్ని అద్భుతంగా చిత్రీకరిస్తోంది హంపి.
క్షణాలు..... నిముషాలు....
గడిచిపోతూనే ఉన్నాయి.