విరిజల్లు
__ యామినీ సరస్వతి
శ్రీవాణీ గిరిజల కరుణాకటాక్షాలతో వర్ధిల్లుతున్న దేశమైనా ఇంకా ఇక్కడ స్త్రీకి మనశ్శాంతి దొరకటంలేదు__
జీవితంలో సుఖాన్నీ, శాంతినీ ఒకేసారి అనుభవించకలేక ఆశోపహతులై జీవిత పథాన్నుంచి అశాంతితో నిష్క్రమిస్తున్నారు. కోరుకున్నది చేరువకాక, చేరువయ్యేది కోరుకున్నది కాక అటు శారీరకంగా ఇటు మానసికంగా సుఖశాంతులకు దూరమై జీవితానికి దూరమయ్యే పరిస్థితి సంభవిస్తోంది.
కరుణాళుడైన భగవంతుడేనాడీ స్త్రీ జనాన్ని దయజూస్తాడోగానీ, లేకుంటే నిరాశా నిస్పృహలతో నిట్టూర్పుల వేడితో, మందే మనస్సుతో తనువుని మండించుకోవడం అంతవరకూ ఆగదు. అనుక్షణం కాలుతున్న మనస్సుతో ఆరని అగ్నిజ్వాలలవంటి కోరికలతో అహరహం చిత్తశాంతి లేకుండా మనస్సునీ, మనిషినీ ఒక్కచోట నిలువనీయకుండా చేసే సంఘటనతో ఎలా నెగ్గుకుని వస్తున్నారో అది ఆ భగవంతుడికే తెలియాలి కానీ మనవమాత్రుడికి అర్ధమయ్యేదికాదు.
ఇవన్నీ ఇలా పంచాగ్నుల్లా దహిస్తున్నా వీటన్నిటికీ మధ్య శ్రమజీవికి ఓ ఘడియ గాఢనిద్ర లభ్యమైనట్లు భగవానుడి సంస్మరణలో, సేవలో, ఆరాధనలో మాత్రమే వీరికి ఓ క్షణం శాంతి లభ్యమవుతుంది. తృప్తిగా ఊపిరి పీల్చుకునే ఘడియలవే.
అశాంతియుతమైన జీవితంలో అల్లకల్లోలమైన జీవనంలో ఆరాటం అధికమైన జీవనగమనంలో వారికి తోడూ-నీడా మార్గదర్శి అన్నీ ఆ భగవానుని చల్లని చూపే. ఆర్ద్రమయిన ఓ చల్లని మనస్సు, ఓ చల్లని హస్తం, ఓ తీయని పల్కు, ఇదే వారికి శాంతిదాయకాలు. ఆ శాంతే వారికి సుఖంకూడా అవుతుంది.
* * *
ఉలికిపాటుతో లేచాడు వేణు.
భయంకరమైన కల జీవితంలో ఎవరికీ అటువంటి స్థితి ఏనాడూ సంభవింపరాదని మనస్వులు మనస్వినులు నోరుకునే నిత్య సత్యం లాంటి పరిస్థితి.
అగమ్యగోచరంగా, ఆవేదనాపూరితంగా, అశాంతియుతంగా, అరాచకకారణంగా వుందాస్థితి.
కళ్ళు తెరిచి చూశాడు...
అలవాటైన గది...మల్లెపూలతో అలంకృతమైన మంచం...మనోహరి మనస్సులాంటి పానుపు...ఇంకా ఆరీఆరకుండా వాసనని మెల్లమెల్లగా వెదజల్లుతున్న అగరువత్తులు, అదే బల్లపై అందంగా, ఆకర్షవంతంగా చూస్తూనే తినాలనిపించి నోరూరించే రకరకాల పిండివంటలు... గోడలమీద రకరకాలుగా పలు వేషాలలో... పలుదేశాలలో గోపాంగనలతో సత్యా, రుక్మిణులతో రాసక్రీడలు సలిసే ముగ్ధమోహన గోపాలుని చిత్రపటాలు రసికతకు చిహ్నాలు.
రాత్రంతా ఒక వింతైన మత్తుతో గడిచిపోయింది. ప్రియురాలి సాన్నిధ్యంలో జీవితమంతా గుర్తుంచుకోతగ్గ మధుర ఘడియని అనంతరం మధుమత్తతో నిద్రించాడు.
సుఖానుభవ అనంతరం స్వప్నం.... తీయని కలలు కనవలసినవేళలో మనస్సుని భగ్గుమనిపించేంత భయంకరమైన కల...
ఆ స్వప్నం తలుచుకుంటేనే మనస్సంతా చికాకైపోయింది. ఆలోచనారహితంగా మొద్దుబారిపోయింది. సుఖానికీ, దుఃఖానికీ పరిధులు ఎక్కడున్నాయో తెలియరాని వేదాంతాతీయమైన స్థితి ఏర్పడింది. తలత్రిప్పి చూశాడు.
సావిత్రి...అందంగా బరువుగా సుఖానుభూతిని వేలార్చే ప్రశాంత వదనంతో నిద్రపోతుంది. మెల్లగా ఆమె చేయిని ప్రక్కకి తొలగించాడు.
అతనిమీద చేయివేసుకొని హాయిగా నిద్రపోతోంది. చేయి తొలగించటంతో కొంచెం కదలి అటుగా తిరిగి పడుకుంది.
చల్లని మంచినీటిని నంచుకుని పుక్కిలించి వేశాడు. నోరంతా చేదుగా వుంది...ప్లాస్కు తెరిచి ఓ గ్లాసులోనికి పాలు వంచుకుని మెల్లిగా త్రాగేశాడు.
ప్రక్కనే ఉన్న ఓ కుర్చీని కిటికీ దగ్గరగా లాక్కుని కిటికీలోకి కాళ్ళు బారుగా చాపి కూర్చున్నాడు. బరువుగా కళ్ళు మూతలు పడబోతున్నాయి. ఆపుకోవాలనుకున్నా సాధ్యం కాలేదు.
కళ్ళు మూసుకుని మెలకువగా పడుకున్నాడు. స్వప్నం విషయం గుర్తుకి రాసాగింది.
ఎవరో భయంకరంగా నవ్వుతున్నారు__ముఖమంతా వికృతంగా చేసి పెదవులు చివర్లదాకా పోయేట్టు కళ్ళు చికిలించి కనుబొమ్మలు ముడివడి నవ్వుతున్నాడు. అతని ముఖాన్ని చూస్తేనే భయం వేస్తుంది. ఒళ్ళు జలదరిస్తుంది.
అతనికి ఎదురుగా ఉన్న అమ్మాయి భయంతో దుఃఖంతో కోపంలో గజగజా వణికిపోతోంది. ఆమె చెయ్యి పట్టుకుని లాగుతూ మధ్య మధ్య ఏదో వాగుతూ గట్టిగా నవ్వుతున్నాడు. పిడుగులు కురిసినట్టు మాటలు__ చేయిపట్టుకుంటేనే ఒళ్ళు గగుర్పొడిచింది...నవ్వుతుంటే ఒళ్ళు జలదరిస్తుంది...ఇంకా...ఇంకా...పైగా శూలాలతో గుచ్చినట్టున్న కర్ణ కఠోరమైన మాటలు గూడానా?