Previous Page Next Page 
సంసారంలో శ్రీశ్రీ పేజి 19

    అప్పుడే అనుకుంటాను. నేను భయంకరమైన  టైఫాయిడ్ తో వచ్చే ప్రాణం పోయే ప్రాణంగా ఉంటూండగా  మా ఇల్లు వేలంలో  అమ్మిపారేశారు. ఆ పని మా నాన్నే చేసివుంటే_మా అప్పులు తీరిపోవడంతోపాటు మాకంత ఇబ్బంది కూడా వుండేదికాదు.

    ఆ ఇంటి పునాదులు స్వయంగా మా అమ్మ తవ్విందిట. రాళ్ళూ  రప్పలూ  ఇసకా మోసిందిట. ఈ సెంటిమెంట్ తో మా నాన్న  చెయ్యనన్న పని అప్పులవాళ్ళు  చేసేశారు.

    మా నాన్న  ఎందరికో  ఎన్నో ఉపకారాలు చేశాడు. హెడ్ మాస్టర్ గా ఎందరికో  చదువులు చెప్పించి ఎందరినో పాస్ చేయించాడు. చివరికి ఏమయింది?

    ఈ ఉపకారాలు పొందినవాళ్ళంతా  తనను ఉద్దరిస్తారనో, లేక చేదోడువాదోడుగా ఉంటారనుకునో  ఆయన చెయ్యలేదు. ఆయన స్వభావం  అటువంటిది.

    మాకు డబ్బులు  ఇవ్వాల్సిన  అప్పులవాళ్ళంతా ఏదోమిషమీద ఎగవేశారు. మా నాన్న ఎవరికీ అప్పులు మిగల్చలేదు. నాకు ఆస్తీ మిగల్చలేదు.

    మనలో వుండే మంచితనాన్ని  అనువుగా తీసుకొని  అందరూ మనల్నే చులకనగా  చూస్తారు. అందుకే కోపంలేని నాకు  ఈ సమాజం పేరెత్తితేనే అరికాలిమంట నెత్తికెక్కుతుంది" అన్నారు.

    "ఏమిటేమిటి? మీకు కోపంలేదా?" అన్నాను.

    "అబ్బ_వుండు సరోజా! ఆ తరువాత  మా ఇంట్లో  సామాన్లకి  కాళ్ళూ చేతులూ  వచ్చాయి.

    మా సుభద్రమ్మ  పోవడంతోనే మాకు దరిద్రం  ప్రారంభమైందనుకుంటాను. ఒక చిన్న అద్దెఇంట్లో  వుండేవాళ్ళం. ముసిల్ది కొత్తగా  కాపరానికి వచ్చిన రోజులవి. చాలామంది మనసుకి  తగిలే గాయాల్ని మరచిపోతారు. ఒంటిమీద  చిన్నదెబ్బపడితే  తల్లడిల్లిపోతారు. ఆ విధంగా  నన్నెవరూ  నొప్పించకున్నా  అంతకు మించిన చిత్రహింసల్ని  అనేక విధాలుగా జీవితం  నాకు ప్రసాదించింది.

    నాకు ముసిల్దంటే  ఎందుకిష్టమో చెప్పనా_నా  కోసం  ఏం చెయ్యమన్నా చేస్తుంది.

    ఇంత అల్లరిపెట్టి మనిద్దర్నీ  గుగ్గిళ్ళు  వేసినట్టు వేసేసిందా_చివరికి మన పెళ్ళికి అంగీకరించిందా లేదా?" అన్నారు.

    "అది సరేనండి. మనం బెంగుళూరు వెళుతున్నట్టు  ఆవిడతో  చెప్పారా?" అని అడిగాను.

    "నేను మాత్రం వెళుతున్నానని  చెప్పాను. అది నమ్మితేగా? 'ఇంకా ఎందుకండీ దాస్తారు? అది లేకుండా  మీరు వెళతారంటే  నేను నమ్ముతానా? మీరు వదిలినా  అది వదులుతుందా? ఇద్దరూ వెళ్ళండి. నాకేమీ అభ్యంతరం లేదు. కానీ ఒక కండిషన్_అంది. 'ఏమిటది' అని అడిగాను.

    "దాన్ని మీరు బెంగుళూరు  తీసుకువెళితే  నన్ను, అమ్మాజీని  రష్యా తీసుకెళ్ళా"లని  అంది. నేను సరేనన్నాను" అని చెప్పారు.

    "అంటే మీరు రష్యా వెళతారా ?" అని అడిగాను.

    "వెళ్ళినప్పుడు మాటే సరోజా! ఇంకో మాట చెపుతున్నాను విను. ఏదైనా మాటలమీద దాని గురించి  వస్తే నేనే చెప్తాను. కానీ నువ్వుమాత్రం ఏమీ అడగకూడదు. ఆ ప్రిన్సిపుల్ పెట్టుకో. లేకుంటే  జీవితం నరకమవుతుంది" అన్నారు.

    "నేను అంత పిచ్చిగా నా జీవితాన్ని  నరకం  చేసుకోను. మీరేం భయపడకండి. కానీ మీ రష్యా ప్రయాణంలో  చిన్న మార్పు" అన్నాను. "ఏమిటది?" అన్నారు.

    "మీరూ ,మీ ఆవిడా, అమ్మాయి తప్పకుండా  రష్యా వెళ్ళండి. నాకేమీ అభ్యంతరం లేదు. పోతే చేతినిండా  మీ ముగ్గిరికి సరిపడేటట్టు  అన్ని ఖర్చులతో  డబ్బుంటేనే  వెళ్ళాలి. రష్యా ప్రయాణం కోసం  ఇల్లూ, వాకిళ్ళూ, కార్లూ తాకట్టు  పెట్టి వెళతానంటే మాత్రం  నేను తప్పకుండా వెంటపడతాను, తప్పదు" అన్నాను.

    "అలాగే. అయినా  వెళ్ళినప్పుడు  మాటకదా....దాని కిప్పట్నుంచి డిస్కషన్ ఎందుకు?" అన్నారు.

    "ఏవండీ_ఇంకో సందేహం. చాలా రోజులుగా  అడగాలనుకుంటూ  మరచిపోతున్నాను. మీ ఎడం మోచేతిమీద అంత పెద్ద మచ్చ  వుందే_అదేమిటండీ" అని అడిగాను.

    "అదా_మా తమ్ముడు  కొండబాబు  చనిపోయాడని  చెప్పానుగా? వాడు చనిపోయిన పదోరోజు  యలమంచిలి  వెళ్ళాను. యలమంచిలో  ఓ గుండంలో స్నానంచేశాను. అప్పుడే పెద్ద గండం తప్పింది నాకు. స్నానం చేస్తూ  ఓ రాయిమీద కాలు జారి నీట్లో  పడిపోయాను. అందరూ దగ్గరలో వున్నారు కాబట్టి బతికిపోయాను. అయితే ఈ మోచేతికే  పెద్ద దెబ్బ తగిలి  రక్తం బాగా పోయింది. ఆ మచ్చేఇది" అన్నారు.

    "మీ నాన్నగారిచేత మీరు ఎప్పుడయినా  దెబ్బలు తిన్నారా?" అని అడిగాను.

    "మా నాన్న  నన్ను  ఎప్పుడూ కొట్టలేదు. అయినా ఓసారి  తినాల్సి వచ్చింది. మా నాన్న చాలా శాంతం. అయినా హెడ్మాస్టరవడంవల్ల  ఆయనంటే  అందరికీ హడల్.

    మా స్కూల్లో  కుర్రాళ్ళమందరం  ఓసారి  సమ్మె చేశాం. అప్పుడు నా వయసు పదకొండో. పన్నెండో. వాళ్ళందరికీ  నేనే నాయకత్వం  వహించాను. మర్నాడు  హెడ్మాస్టర్ గా  మా నాన్న కుర్రాళ్ళందరికీ  ఒక్కొక్క బెత్తపు దెబ్బ వేశాడు. ఆఖరికి  నన్ను కూడా పిలిచి దెబ్బ వేసి 'నువ్వేనా వీళ్ళందరిచేతా సమ్మె చేయించావు?' అని అడిగాడు. 'అవును' అన్నాను. 'అయితే  రెండో చెయ్యి పట్టు' అన్నాడు. పట్టాను. చుర్రుమని ఎంతో దెబ్బ పడింది. నా రెండు అరచేతులూ కందిపోయాయి.

    స్కూల్లో నన్ను కొట్టిన మా నాన్న రాత్రి ఇంట్లో ఏడుస్తూ  కూర్చున్నాడు. నన్ను దగ్గిరకి పిలిచి  రెండు చేతులూ చూశాడు. అప్పుడు చేతులు మామూలుగానే వున్నాయి. నన్ను ముద్దుపెట్టుకొని, నా చేతిలో రూపాయుంచాడు. నన్ను తొడమీద కూర్చోపెట్టుకొని_"ఇంకెప్పుడూ  కొట్టను  కానీ, ఏం బాబాయ్ నా మీద నీకు కోపమా" అని అడిగాడు. 'లేద'ని తలూపాను. కళ్ళు  తుడుచుకుంటూ  మా నాన్న  నవ్వేశాడు.  

 Previous Page Next Page