"అందరికీ గాడ్ ఫాదర్లుంటారు. నాకు ఫాదర్ గాడ్ మా నాన్నే. ఆయనే అమ్మా, దేవుడూ, పురోహితుడూ, గురువూ, నా జీవిత సామ్రాజ్యానికి సార్వభౌముడూ అన్నీ కూడా చిన్నప్పట్నుండీ నన్ను ఎవరి ఎలా పిలిస్తే వాళ్ళని అలాగే పిలవడం నాకు అలవాటు.
మా నాన్న దగ్గరుంటే ప్రపంచమంతటినీ కౌగిలించుకొనే భావన కలిగేది. 'నాన్న వున్నాడు నాకేమిటనే' ధీమాతో హాయిగా వుండేవాడిని.
నేను బి.ఏ. పూర్తిచేసి నిరుద్యోగిగా తిరుగుతున్నాను. అప్పటికే దరిద్రం అనే అంధకారంలో మేము మునిగిపోయాం. మా నాన్న చాలాసార్లు సముద్రంలోపడి చనిపోవాలనుకున్నాడట. అయితే తాను లేకుంటేనేనేమైపోతానోనన్న బెంగతో తీరందాకా వెళ్ళి కూడా ఆ ప్రయత్నం విరమించుకునేవాడు. నాకూ అప్పుడప్పుడు చనిపోవాలనిపించినా, చచ్చి సాధించేదేమిటని అనుకునేవాడిని" అని చెప్పారు శ్రీశ్రీగారు.
"ఏవండీ. మీ నాన్నగారు ఏ ఊరులో చనిపోయారండి" అని అడిగాను. "నేనూ, మా నాన్న, నా భార్య కలిసి మద్రాసులో నివాసం ఏర్పరచుకున్నాం. (శ్రీశ్రీగారు ఆ సంవత్సరం కూడా చెప్పారు. నాకు సరిగ్గా జ్ఞాపకం లేదు. కానీ 1940_49 మధ్య కాలంలో అని మాత్రం చెప్పగలను.)నాన్నకి చాలా జబ్బు చేసింది. డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళడానికి కూడా చేతిలో చిల్లిగవ్వలేదు.
అప్పుడు నా మిత్రుడొకాయన చెట్టియార్ రాయపేటలో వుండేవారు. అతడి భార్య పేరు లక్ష్మి. వాళ్ళు ఉభయులూ నన్నూ, మా ఆవిడ్నీ, మా నాన్ననీ ఆదరించి వారింట్లో అట్టేపెట్టుకున్నారు. మా ముగ్గురికీ భోజనాలూ, టిఫినులు అన్నీ పెట్టేవారు. నాలుగయిదేళ్ళు వాళ్ళ ఇంట్లోనే వున్నాం. ఆ పరిస్థితిలో ఆవిడ మమ్మల్ని ఆదుకోకుంటే మేమేమైపోయి వుండేవాళ్ళమో!
పెద్ద బతుకు బతికిన మా నాన్నను మా పరిస్థితులు చాలాకృంగదీశాయి. ఆరోగ్యం కూడా దెబ్బతింది. ఎన్నో మందులిప్పిచ్చాం. ఎందుకో డాక్టర్లకి చూపించాం ఎంతో డబ్బు ఖర్చుచేశాం. కానీ మా నాన్న మాత్రం కోలుకోలేదు. సరికదా కొన ఊపిరివరకూ నా గురించే బాధపడుతూ కన్నుమూశాడు.
మా నాన్న మరణం నన్ను మరీ కృంగదీసింది. ఆ సమయంలో లక్ష్మి, ఆవిడ భర్త చెట్టిగారోరూ మాకు ధైర్యం చెప్పి, 'మనమంతా కలిసే వుందాం మీరేమీ భయపడకండ'ని అలాగే మమ్మల్ని ఆదరించారు.
ఆ తర్వాతే 'ఆహుతి' డబ్బింగ్ చిత్రం చేశాను. నేనూ మా ఆవిడే మిగిలాం. దానికి సంతానం కలగలేదు. రెండు మూడు కడుపులు పోయాయని దానికి దిగులు. నాకు బిడ్డనికనే ఆడది ఈ ప్రపంచంలో లేదని నా ఉద్దేశం" అన్నారు.
"అదిగో మళ్ళీ అదేమాట! నా బెట్ సంగతి మరచిపోకండి" అన్నాను.
"చూద్దాం. ఆ తర్వాతే 1949 లో అమ్మాజీని పెంచుకున్నాం. కొందరు ఈ పిల్లను మేము పెంచుకోవడం విషయంలో అసంతృప్తి వెలిబుచ్చినా రుక్మిణీనాథశాస్త్రి మాత్రం తనకే బాధా లేదన్నట్టు ఉండేవాడు.
అప్పుడు మేము రాయపేట నుండి మాంబలానికి మకాం మార్చేశాం. అక్కడ మా పెంపుడు పిల్ల తెగ ఏడ్చేది. దానివల్ల యింటిగలవాళ్ళతో గొడవ లొచ్చేవి. మా పక్క భాగంలోనే రుక్మిణినాథశాస్త్రి వుండేవారు. దాని ఏడుపు పిల్లల్లేని మాకు అమృతంలా వుండేది. ఆఖరికి అక్కడ నుండి ఇల్లు మారక తప్పలేదు. అప్పుడేనన్న మాట ఆరుగిరిమొదలి తెరువుమందపల్లికి మకాం మార్చేశాం.
ఆ పిల్ల పెంపకం కూడా కష్టమే అయింది. పాలు దొరకని టైములో పళ్ళ జ్యూస్, బిస్కట్లతో పెంచుకుంటూ వచ్చాం. 'ఆహుతి' పిక్చర్ తో ఆర్ధికంగా తేరుకోవడం ప్రారంభించామని చెప్పచ్చు. పెద్దగా ఆర్ధిక పరిస్థితి పెరిగిపోయిందనికాదు కానీ ఫరవాలేదు. నా పరిస్థితి మెరుగనిపించినా, ఆ పిక్చర్ మాత్రం గొప్పగా దెబ్బతినేసింది. దాని మూలంగానే హెచ్.ఎమ్ రెడ్డిగారి దృష్టిలో నేను పడ్డాను.
'బాగానేవుంది కానీ, పిక్చర్ అట్టర్ ఫెయిల్యూట్ అయిపోయిందయ్యా' అని సెంటిమెంట్ గా రెడ్డిగారు తన అభిప్రాయాన్ని వెలిబుచ్చినా, నా పాటలలో 'ప్రేమయే జనన మరణలీల' అనే పాట నిజంగానే బాగుందని గ్రహించి, కొత్తవాళ్ళకి అవకాశం ఇద్దామనే అభిప్రాయంతో తాను తీస్తున్న 'నిర్దోషి' చిత్రంలో నాకు అవకాశం ఇద్దామనే అభిప్రాయంతో తానుతీస్తున్న 'నిర్దోషి' చిత్రంలో నాకు అవకాశం ఇచ్చారు. ఆ విధంగా రెడ్డి గారి ఆస్థానంలో ప్రవేశించాను.
'నిర్దోషి' లో రెండుపాటలు, నాలుగైదు సీన్ లు రాశాను. రెడ్డిగారు తెలుగు, తమిళ భాషల్లో ఆ పిక్చర్ తీశారు. రెండు భాషల్లోనూ అది బ్రహ్మాండంగా ఆడడంతో రోహిణీ స్టూడియో నెలకొల్పి, నన్ను ఆ రోజుల్లో నెలకి మూడు వందల రూపాయల జీతం మీద పెర్మనెంట్ కవిగా నియమించారు.
రోహిణీ సంస్థతోపాటు ఎమ్.హెచ్.ఎస్. మూవీస్ గారి దగ్గర కూడా నేను నెలకి రెండు వందల రూపాయల జీతంమీద పనిచేస్తూ వుండేవాడ్ని. ఈ రెండూ కలిపి నెలకి అయిదు వందల రూపాయలు వచ్చేవి. ఆ రోజుల్లో అయిదు వందలంటే మాటలుకాదు. మా సంసారం హాయిగా ఉన్నదాంతో గడిచిపోయేది.
మేము కొంచెం తేరుకుంటున్నామనుకునే సమయానికి, మమ్మల్ని ఆదుకున్న లక్ష్మీగారి కుటుంబానికి గడ్డురోజులు ప్రారంభమయ్యాయి. మాకు కలిగిన దాంట్లోనే ఆవిడకి సహాయం చేస్తూ వుండే వాళ్ళం. మా రెండు ఇళ్ళూ ఒక ఇల్లయ్యింది.
కళ్ళముందే పరిస్థితులు మారిపోతుంటే మా లక్ష్మికూడా డీలా అయిపోయేది. ఒకరోజు మమ్మల్ని ఆదరించిన నా సోదరికి మేము ధైర్యం చెప్పి బుజ్జగించే పరిస్థితి వచ్చింది. ఇలాంటివాటిని లక్ష్యపెట్టేవాడ్నికాను నేను. అయితే కాలం చెప్పే గుణపాఠాల్ని మాత్రం అలక్ష్యం చెయ్యను. ఇంకా చెప్పాలంటే దాన్ని నేను ఓడిస్తున్నానని నాకు తెలుసు. విజయం దానిది కాదు. మానవుడిదే అవుతుంది.