నాకు మనసు మనసులో లేదు. ఏదో బెంగ_గుండెలో దడ_భయం! ఎయిర్లో దిగేసరికి ముఖం నీరసంగా తయారయ్యింది.
శ్రీశ్రీగారు నన్ను చూసి ఆశ్చర్యపోయారు.
"ఏమైంది సరోజా! ఎందుకలా వున్నావు? పోనీ వెనక్కి వెళ్ళిపోదామా" అని అడిగారు.
"వద్దండి" అన్నాను.
హోటల్ కి వెళ్ళడానికి కారు ఎక్కాం.
"ఏవండి" అని పిలిచాను.
"ఏమిటి?" అన్నారు.
"దార్లో మాత్రం బాటిల్ కొనకండి" అన్నాను.
"అలాగేలే" అన్నారు.
హోటల్ లో డబుల్ బెడ్ రూమ్ లో దిగాం.
ఆ రోజుల్లోనే మాకిచ్చిన రూము ఎంతో బాగుందనిపించింది.
బోయ్ వచ్చి మంచినీళ్ళు పెట్టాడు.
"ఇప్పుడు విస్కీ తెప్పించుకోనా?" అని అడిగారు.
"తెప్పించుకోండి" అన్నాను.
వేడినీళ్ళతో స్నానాలు చేశాం.
ఎవ్వరూ తోడులేకుండా శ్రీశ్రీగారితో ఊరువిడిచి మరో ఊరు ప్రయాణం చేయడం అదే మొదటిసారి.
అప్పటి మైసూరు ప్రయాణం....వగయిరా గత చరిత్ర కళ్ళముందు ఓసారి అలా మెదిలి మాయమైంది. నాలో నేనే నవ్వుకున్నాను.
శ్రీశ్రీగారు తాగినా భయంలేదు. తొంభైతొమ్మిదిన్నరపాళ్ళు ఒళ్ళు తెలీకపోవడం, పిచ్చివాగుడు....లాంటిది ఉండవు సరికదా ఇంకా హుషారుగా తెలివిగా వుంటారు.
ఒక పెగ్ వేసుకున్నారు.
"బీరు తెప్పిస్తాను. నువ్వుకూడా తాగరాదూ" అన్నారు.
"అమ్మ బాబోయ్_తాగడమే" అన్నాను.
"ఏం? ఇదేమైనా ఘోర అపరాధమా? ఎవ్వరూ చూడరులే. నీ దేవుళ్ళు వచ్చి శిక్షిస్తారన్న భయం అక్కర్లేదు" అన్నారు.
"తాగడం మహాపాపమండీ" అన్నాను.
"నీ ముఖం" అన్నారు.
ఇలా ఓ అరగంట వాదన గడిచింది.
"మీ పెళ్ళి చాలాగమ్మత్తుగా జరిగిందని_తర్వాతే చెప్తాలే అని అన్నారే_ఇప్పుడు చెబుదురూ" అన్నాను.
"ఏదో ఒకటి మాట్లాడాలిగా? ఇంకా గంటయినా కాలేదు. మూడు రోజులుండాలి. ఇది మంచి అవకాశం. చెప్పండి ప్లీజ్!" అన్నాను.
"పెళ్ళికి ఏ దేవుడి సాక్ష్యమూ అక్కరలేదు. ఈ రోజు మన పెళ్ళికి కూడా అందర్నీ పిలిచాం. వాళ్ళందరూ అనవసరం.
1925 లో నేను పదిహేనేళ్ళ వాడిని. నాకిస్తానన్న అమ్మాయి వయస్సు తొమ్మిది, పది సంవత్సరాలు.
మా నాన్న 'ఆ పిల్లను చేసుకుంటావా?' అని అడిగితే 'సరే' అన్నాను. మా అమ్మమ్మ వద్దంటే 'అలాగే' అన్నాను. 'తెల్లవారితే పెళ్ళ'న్నారు. మా కుటుంబంలో కొందరికి నేనా అమ్మాయిని చేసుకోవడం ఇష్టంలేదు. మా నాన్న ఉత్త అమాయకుడు. వెర్రిబాగులవాడంటే ఇంకా బాగుంటుంది. పెళ్ళివారింటికీ మా ఇంటికీ అట్టే దూరంలేదు.
నన్ను పెళ్ళికొడుకుని చేసి పంపిస్తానంటే మా అమ్మమ్మగారింటికి పంపారు. ఆ రోజే మా అమ్మమ్మ నన్ను విశాఖపట్నానికి దూరంగా వున్న బారువా గ్రామానికి మా పెద్ద బావని (ఆరుద్ర తండ్రి)తోడిచ్చి పంపించేసింది. అంటే_అక్కడ నన్ను దాచేశారన్నమాట.
నన్ను అక్కడ దింపేసి మళ్ళీ మా బావ విశాఖపట్నం వెళ్ళిపోయాడు. నేను ఒకరోజు బారువాలో వుండి అన్నం వండుకొని తిన్నాను. ఆ మరునాడు నా పెళ్ళి ఆగిపోయింది. విశాఖపట్నం అంతా గగ్గోలెత్తించేసి ఆత్మహత్య చేసుకుంటానని మా నాన్న అన్నాడట. పెళ్ళిటైము దాటిపోయిన తర్వాత సాయంకాలానికల్లా విశాఖపట్నం చేరుకున్నాను. పెళ్ళికూతురు నన్ను తప్ప మరెవ్వరినీ చేసుకోనంది. పెళ్ళికూతురి పూర్తిపేరు మూలా వెంకటరవణమ్మ.
ఆ మర్నాడు_రాత్రికి రాత్రి విజయనగరం సమీపంలోవున్న రామతీర్ధాల కొండమీద మా పెళ్ళి జరిగిపోయింది.
నాకు పెళ్ళి అవడం, మా దరిద్రం ప్రారంభం కావడం రెండూ ఇంచుమించు ఒకేమారు జరిగాయి. అందుకే ముసిల్ది (రవణమ్మగారు)దురదృష్ట జాతకురాలిని, ఇనుప పాదాలని, అది కాలు పెట్టడంతోనే మాకు కష్టాలు ప్రారంభమయ్యాయని మా బంధువులంతా అనేవారు" అని చెప్పారు.
"అప్పుడు మీరేమన్నారు?" అని అడిగాను.
"ఏమనడం ఏమిటి సరోజా! ఇంతకంటే అసందర్భం అయిన ఆరోపణ మరొకటుండదు. ఇద్దరం చిన్నవాళ్ళం. పదేళ్ళ అమ్మాయి. తను దరిద్రాన్నంతా మోసుకొచ్చి మా ఇంట్లో కుమ్మరించిందంటే నేనెంత మాత్రం ఒప్పుకోను. నేను ముందే చెప్పానుగా_నాకలాంటి సెంటిమెంట్లూ, ఛాదస్తాలూ లేవని.
ఎలాగైతేనేం_నాతోపాటూ, అష్టకష్టాలు పడింది. టీమ్ బన్నుతో కాలక్షేపం చేసిన రోజుకూడా లేకపోలేదు. అప్పుడెవరైనా వచ్చి మిమ్మల్ని ఆదుకున్నారా? అది కూడా ఖచ్చితమైన మనిషి. అంత కష్టంలోనూ ఒకరికొకరం తోడుగా వుండి కష్టాల్ని ఎదిరించామేకానీ ఎవర్నీ దేహీ అని అడుక్కోలేదు. దరిద్రాన్ని మేం కొరుక్కుతింటున్నామా లేక అది మమ్మల్ని కొరుక్కుతింటోందా అనిపించే రోజులు గడిపాం.
ఈ బాధ మా నాన్న గార్ని చాలా బాధ పెట్టింది. ఎప్పుడూ కళకళలాడే మా నాన్నముఖం దరిద్రపు బాధతో ఎంత పీక్కుపోయిందో నాకు స్పష్టంగా కనిపించేది. జీవితంలో అఖండమైన ఐశ్వర్యం అనుభవించి విశాఖపట్నంలో ఒక ఏలుబడి ఏలిన మా నాన్న క్రమంగా దరిద్రంలో క్షీణించిపోతూంటే మా బంధువులు కానీ మిత్రులు కానీ ఒక్కరు కూడా పట్టించుకోలేదు.