లివింగ్ టు గెదర్
అలవాటుగా కెనటిక్ హోండా పూలమ్మి గంప దగ్గిర ఆగింది. అంతలోనే, పూలెందుకు గౌతమ్ వూర్లో లేడుగా అన్పించి స్కూటర్ స్టార్ట్ చెయ్యబోతూ పూలమ్మి కళ్ళల్లో నిరాశ చూసి గౌతమ్ లేకపోతే పూలు పెట్టుకోకూడదా? పెట్టుకోకపోయినా ప్లేట్ లో పోసి డ్రాయింగ్ రూంలో పెడితే చక్కగా ఇల్లంతా సువాసన పరుచుకుంటుంది. మూర పూలు కొని స్కూటర్ స్టార్ట్ చేసింది చిత్ర.
మగరాయుడిలా క్రాపు చేయించుకు తిరిగే తాను యిప్పుడు జుత్తు పెంచి రెండు అల్లికలు అల్లి రబ్బరు బ్యాండు కట్టి సన్నజాజులు, మల్లెలు తురుముకోడం.. తనకే ఆశ్చర్యం అనిపిస్తుంది చిత్రకి. ఎంత మార్పు వచ్చింది గౌతమ్ తో సహచర్యం ఆరంభించాక. చిన్నప్పుడు తల్లి రెండు జడలు వేసి పూలు పెడితే పీకేసేది. చేతికి గాజులు వేయించుకునేది కాదు. గౌను తొడిగితే అన్నయ్యలా ప్యాంట్లు, షర్టు కావాలని ఏడ్చేది. ఆడపిల్ల లక్షణాలు లేవే నీకు మగరాయుడివి అనేది తల్లి. ఇంజనీరింగు చదువుతూండగా ఓనాడు జుత్తంతా కత్తిరించుకుని క్రాపు చేయించుకుని యింటికి రాగానే తల్లి లబోదిబో అంది. తండ్రి చాలా విముఖతతో మొహం చిట్లించాడు. అలాంటి తను గౌతమ్ అన్నాడని 'పూలెందుకు పెట్టుకోవు, సన్నజాజులు, మల్లెలు మంచి రొమాంటిక్ ఫీలింగిస్తాయి' అన్నాడని, అతనికోసం జుత్తు పెంచి పూలు పెట్టుకోవడం మొదలుపెట్టింది. అదిప్పుడు అలవాటుగా మారింది.
హోండా పార్క్ చేసి అపార్ట్ మెంట్ తలుపు తీస్తుంటే గౌతమ్ వూర్లో లేడన్న భావం ఏదో రిలీఫ్ నే ఇచ్చింది. అతనొస్తాడని గబగబ అలుపైనా తీర్చుకోకుండా ఫ్రెష్ అయి తయారవక్కరలేదు. అతను లేడు గనక ఏం వండాలి అతనికేం యిష్టం అన్న ఆలోచనక్కరలేదు. నిన్న సాయంత్రం వండిన వంట అతను తినకుండానే తండ్రికి హార్ట్ ఎటాక్ వచ్చిందని ఆఫీసుకి ఫోనోచ్చిందని హడావుడిగా ట్రావెలేజేంట్ తో టిక్కెట్టు తెప్పించుకుని బోంబే ఎక్స్ ప్రెస్ లో పూనా వెళ్ళిపోయాడు. ఫ్రిజ్ లో వున్నది తను తినేయచ్చు. వంటక్కరలేదు. తొందరగా పడుకుండి పోవచ్చు. బద్దకంగా దివాన్ మీదకి హ్యాండ్ బ్యాగ్, చున్ని విసిరేసి ఫ్రిజ్ లోంచి ఫాంటా గ్లాసులో వంపుకుని సిప్ చేస్తూ టి.వి. అన్ చేసింది. సాయంత్రం ఏం మంచి ప్రోగ్రాంలు వుండవు. విసుగ్గా టి.వి. ఆపేసి దివాన్ మీద తలగడలు అమర్చుకుని వాలింది.
గౌతమ్ వుంటే ఎంత తేడా? అతనోచ్చే లోపల గబగబ వంట చేసి , స్నానించి మంచి చీర కట్టుకుని, సన్నజాజి పూలు పెట్టుకుని వంటంతా డైనింగ్ టేబిల్ మీద సర్దేసింది. ఇంట్లో వున్నన్ని రోజులు యిటు పుల్లతీసి అటు ఎప్పుడూ పెట్టలేదు. తాగిన గ్లాసు, కప్పు కూడా ఎక్కడి కక్కడ అలాగే వదిలేసేది. తల్లి కేకలేస్తే నిర్లక్ష్యంగా దులుపుకుని వెళ్ళిపోయేది. వంటింటి పని బోరు -తినడం , చదువు, ఫ్రెండ్స్ తో తిరగడం, సినిమాలు, షికార్లు ఎంత కేర్ ఫ్రీగా తిరిగేది. రేపు పెళ్ళయి ఎలా కాపురం చేస్తుందో అనేది తల్లి కోపంగా. 'అందుకేగా పెళ్ళి వద్దంటున్నా , ఇల్లు, వంట, పిల్లలు, బోర్, పెళ్ళేవడికి కావాలి పొగరుగా అనేది.
ఇంజనీరింగు అయిందగ్గిర నుంచి పెళ్ళి పెళ్ళి అన్నగోల - తనకి ఎవరూ సంబంధాలు చూడక్కరలేదని , అలా పది నిమిషాలు చూసి పెళ్ళి చేసుకోనని, వీళ్ళని వాళ్ళని పిలిచి పెళ్ళి చూపులకి కూర్చోమంటే కూర్చోనని తనకి ఎవరన్నా కలిసి నచ్చితే మనసులు కలిస్తే ఎలాంటివాడో స్టడీ చేసి కాని పెళ్ళి చేసుకోను అని ఖచ్చితంగా చెప్పేసింది. చెప్పి చెప్పి విసిగి వూరుకున్నారు. ఎవరేలాంటి వారో నీవు అర్నేల్లో ఏడాదో స్నేహం చేసినా, తిరిగిన అర్ధం కాదు. ఆ మూడు ముళ్ళు పడి కాపురం పెడితే గాని అసలు రంగులు బయటపడవు. పెళ్ళయ్యే వరకు అంతా మంచివారే, పెళ్ళాం కానంత వరకు ప్రతి మగాడు ఆడపిల్లని ఇంప్రెస్ చేయడానికి, చక్కగా వుండేందుకు ప్రయత్నిస్తాడు. పెళ్ళి కాకుండా మగాడితో తిరిగి యిష్టమై నచ్చితే చేసుకుంటాను . లేకపోతే లేదు అని ఎక్స్ పెర్మెంట్లు చేయడానికి విదేశాలు కావివి. ఆ తరువాత నీవు కావాలన్న ఎవడూ చేసుకోడు. అనేది తల్లి. నచ్చచేప్పలేని నిస్సహాయతతో కోపం తెచ్చుకుని.
"పోనీలే, ఎవడూ చేసుకోకపోతే , అలా యిష్టపడి చేసుకునే వాడు దొరక్కపోతే అలాగే వుండిపోతా. పెళ్ళి కాకపొతే కొంప మునగదులే" ఉడుకు రక్తం వేడిలో వాదనకి దిగేది. తల్లి తనతో వాదించలేక విరక్తిగా వెళ్ళిపోయేది. ఆఖరికి తల్లి తండ్రి తనతో వేగలేక "నీ యిష్టం వచ్చిన వాడినే చేసుకో" ఆ చూసుకోడం, చేసుకోడం ఏదో త్వరగా చెయ్యి. పాతికేళ్ళు నిండకుండా చేసుకో. ఏ వయసుకా ముచ్చట ఆలస్యం అయితే అన్నీ ప్రాబ్లమ్స్.
"నచ్చినవాడు దొరికితే చేస్తాలెండి" నిర్లక్ష్యంగా అనేది.
వైజాగ్ లో గీతంలో కంప్యూటర్స్ ఇంజనీరింగు అయ్యాక మంచి జీతంతో హైదరాబాద్ లో 'ఇంటెలి' కంపెనీలో ఉద్యోగం వచ్చింది, ఉమెన్స్ హాస్టల్లో వుండేది . ఉద్యోగంలో చేరిన అరునెలలకి నచ్చినవాడు, మెచ్చిన వాడు దొరికాడు!
ఏదో ప్రాజెక్ట్ వర్క్ కోసం బొంబాయి నించి వచ్చిన గౌతమ్ తో పరిచయం - ఇద్దరూ కల్సి చేయాల్సిన ఆ ప్రాజెక్టు వర్క్ రెండు నెలల్లో పరిచయం స్నేహం గా మారింది. అతని ఐ.ఐ.టి తెలివి, కార్యదక్షత, ఆకర్షించగలిగే అతని హావభావాలు, మాటలు , అతని సెన్స్ ఫ్ హ్యూమర్ , యిద్దరిని ఒకటయిన అభిరుచులు ఇవన్నీ అతని పట్ల ఆకర్షణ ని పెంచాయి. దగ్గిరయ్యారు. మనసులు కలిశాయి. హోటలు డిన్నర్లు, షికార్లు, సినిమాలు, లేట్ నైట్ డాబా డిన్నర్లు, ఈలోగా అతని బొంబాయి ఆఫీసు అతన్ని హైదరాబాదు బ్రాంచి వర్క్ చూడమని ట్రాన్స్ ఫర్ చేసి తామిద్దరూ మరింత దగ్గర కావడానికి దోహదం చేసింది. గౌతమ్ తో విహరాలకి, అడ్డు వస్తుందని ఉమెన్స్ హాస్టల్ వదిలి సింగిల్ బెడ్ రూమ్ ఇల్లు అద్దెకు తీసుకుంది. స్వేచ్చ ఎక్కువయి దగ్గరతనం ఇంకా ఎక్కువయింది. సాయంత్రాలు వచ్చిపోవడం, యింట్లో ఇద్దరూ సరదాగా వండుకు తినడం....అప్పుడప్పుడు రాత్రి కబుర్లు చెప్పుకుంటూ వుండిపోయే వరకు ఇద్దరి సాన్నిహిత్యం చేరింది. అంతవరకూ స్నేహితుడితో రూము షేరు చేసుకున్న గౌతమ్ డైరెక్టుగా తన ఇంటికి మకాం మార్చేశాడు. "లివింగ్ టు గెదర్' కాన్సెప్ట్ మొదలైంది.
ఓ ఆరునెలలు ఇద్దరికిద్దరు చుట్టూ ప్రపంచం వుందన్న విషయం మర్చిపోయేంతగా ప్రేమానురాగాలతో మునిగితేలారు. సంఘం, లోకులు అన్న పదాలనేవి ఉంటాయని తెలియనట్లు, నియమాలు, కట్టుబాట్లు లేని విచ్చలవిడితనం, అదో రకం ధైర్యం, తెగువ నిల్చింది. ఆ ప్రేమ మైకం . ఓహ్! ఏం రోజులవి! ఏం రాత్రులవి! ఎన్ని వెన్నెల రాత్రులు బాల్కనీలో వెన్నెల నీడలో పరుపెసుకుని , పక్క మీద మల్లెలు జల్లుకుని , అగరొత్తులు వెలిగించి, పక్కన టేప్ రికార్డర్ మంద్ర స్థాయిలో గజల్స్ వినిపిస్తుంటే ఒకరి చేతుల్లో ఒకరు ఒదిగి విని మైమరచి, శారీరక కోరికని మించిన ఓ రసానుభూతి యిరువురిని ప్రేమానుభూతితో వశం చేసుకుని- అది చాలా సహజంగా , శారీరకంగా మరి....అనిర్వచనీయ భావోద్వేగం చుట్టుముట్టి.....అతను అలసి సోలిపోతే పమిట చెంగుతో అతని చెమట తుడిచి, ప్రేమగా పసివాడిలా అక్కున చేర్చుకుని తను- చెమటతో తడిసిన తన ముంగురులు సవరిస్తూ అతను. స్త్రీ పురుషుల మధ్య ప్రేమ వుంటే సెక్స్ కేవలం వాంఛగా కాక ఓ అపురూప అనుభూతినిస్తుందన్న సత్యం తెలుసుకున్న వైనం.....'నైట్ గౌనోద్దు వళ్ళంతా బురఖా వేసుకున్నట్లు ఏం బాగుంటుంది . చీరలో వున్న శృంగారం దేన్లో వుంటుంది. చీరకి, జాకేట్టుకి మధ్య వున్న నడుం వంపు మగవాళ్ళని ఎంత కవ్విస్తుందో మీకేం తెలుసు అంటూ ఆ ఖాళీ జాగాలో పియానో వాయించినట్లు అతని వెళ్ళ కదలికలు తనలో ఎన్ని ప్రకంపనాలు కల్గించేవో, కురులు విరబోసి నక్షత్రాలలాగా అక్కడక్కడ మల్లెలు అమర్చి నీలాకాశంలో తారలనడం - పాతకాలంలో శోభనం గదిలో మిఠాయిలు ఎందుకు పెడతారో అర్ధమయినట్లు - అర్ధరాత్రి అలసిపోయాను ఆకలేస్తుంది తినడానికేమన్నా వుందా అని పసిపిల్లాడిలా అడిగితె మొదటిసారి యిల్లంతా వెతికి బిస్కెట్లు పేకెట్టు తెచ్చుకుని ఇద్దరూ తినడం, అప్పటి నించి ఏదో ఒక స్వీటు ఫ్రీజ్ లో ఎప్పుడూ వుంచేది - ఎండాకాలం అయితే ఐస్ క్రీం అర్ధరాత్రి అవి తింటూ ఎడతెగని కబుర్లు చెప్పుకుంటూ రెండు మూడు గంటలకి ఒకరి చేతుల్లో ఒకరు నిద్రపోవడం , తెల్లరి కళ్ళు విడక పాలవాడు, పనిమనిషి తట్టే బెల్లు మోతలకి లేవక తప్పక లేచి ఎర్రబడ్డ కళ్ళతో ఆదరాబాదరాగా తయారై ఇన్ని పాలు పోసుకుని కారాన్ ప్లేక్స్ లేక రెండు బ్రెడ్ ముక్కలు నోట్లో కుక్కుకుని ఆఫీసుకి పరిగెత్తడం . నిద్రలేమితో బద్దకంగా నిస్తేజంగా తప్పని డ్యూటీ చేయడం, మళ్ళీ యింటికొచ్చి అతనోచే లోగా జిడ్డు మొహం , అతనికి కనపడరాదని ఫ్రెష్ గా ' ఉడుకులాం నీళ్ళలో వేసుకుని స్నానించి చక్కటి పల్చటి కోటా చీర కట్టుకుని, జాజులు తురుముకుని, టీ పెడ్తుండగా అతనోస్తే యిద్దరూ కల్సి బాల్కనీలో ఆరోజు ఆఫీసు ముచ్చట్లు చర్చించుకుంటూ టీ తాగడం- తరువాత ఇద్దరూ కల్సి సరదాగా వంట చేసుకోడం- అతను కూరలు తరుగుతుంటే - తను కుక్కరు పెట్టేది- తను పోపులు వేస్తుంటే అతను టేబిల్ సర్దడం - వంటలో ఓనమాలు రాని తను అతని కోసం ఆఫీసులో పెళ్ళయిన కొలీగ్స్ నడిగి అతనికిష్టమైనవి చేసి పెట్టాలని తాపత్రయపడడం, వంటల పుస్తకం కొని వచ్చీ రాని వంటలు చేస్తూ నీరు కారే వంట జోకులేసుకుంటూ తినడం 'తినడం ప్రాధాన్యం కాదు, చేసి మెప్పించాలనే మనసు ముఖ్యం. అనే గౌతమ్ పెద్ద మనసుని చూసి మురిసిపోవడం, అలా అనే అతన్ని మెప్పించాలని వంట నేర్చుకుని మూడు నెలల్లో ప్రావీణ్యం సంపాదించడం - వంట బోర్ అనే తను ఎంత మారింది! ఇంట్లో చిన్నమాట ఎవరన్నా అంటే పౌరుషంతో ఎగిరే తను గౌతమ్ యిన్ ఫ్లుయేన్స్ తో ఎంత మైల్డ్ గా, మోచ్యూర్డ్ గా మారింది. ఏదన్నా విషయం సీరియస్ గా తీసుకుని వెంటనే రియాక్ట్ కాకుండా చల్లబడ్డాక ఆలోచించాలని, ఎన్నెన్ని విషయాలు చెప్పి వప్పించి క్రమంగా తనలో మార్పు తెచ్చాడు. సెన్సాఫ్ హ్యూమర్ అంటే ఏమిటో అతని దగ్గిరే తెల్సుకుంది. తన అదృష్టం కొద్ది గౌతమ్ లాంటి యింటలేక్చువల్ సహచర్యం దొరికిందని పొంగిపోయింది. టోటల్ గా సరెండర్ అయిపొయింది. కట్టుకున్న భార్య కన్న మిన్నగా అతని బట్టలు కూడా ఉతకడానికి చిన్నపాటి అభ్యంతరం లేకుండా చేసేది. గౌతమ్ ని ఎలా మెప్పించడమా అన్నదే ధ్యేయం అన్నట్లుండేది.