Previous Page Next Page 
కరుణశ్రీ సాహిత్యము - 5 పేజి 19


    "కెడ తోడనీడలై క్రీడించు సచ్చాత్రు
    లింతకు నెంత చింతింతు రోక్కా"
    అని హిమాలయాల్లో చిక్కుకున్న ప్రవరుడు శిష్యుల కోసం పరితపిస్తాడు. ఇక్కడ గురుశిష్య సంబంధం ఉదాత్తరీతిలో సుస్పష్టం చేయబడింది.
    ఆదర్శగృహస్థుడైన ప్రవరుడు అతిధులనూ అభ్యాగతులనూ అమితమైన ఆసక్తితో ఆదరించి ఆశ్రయమిచ్చేవాడు. తైర్దికులైన అభ్యాగతులు వస్తున్నారన్న వార్త వినగానే వారికి ఎదురుగా వెళ్ళేవాడు. వారి పాదాలకు నమస్కరించి తన యింటికి తీసుకుని వచ్చేవాడు. శ్రద్దాశక్తులతో అర్ప్యపాద్యాదు లిచ్చేవారు. ఇష్టమృష్టాన్నాలతో సంతుష్టులను కావించేవాడు. వారు విశ్రాంతిగా కూర్చున్న సమయాన సమీపించి విసనకర్రతో మెల్ల మెల్లగా విసరుతూ భారత భూమిలో గల పుణ్యక్షేత్రాల విశేషాలను అడిగి తెలుసుకోనేవాడు. ఈ విధంగా చెప్పటం వల్ల భారతీయులైన గృహస్థుడు తన యింటికి వచ్చిన వారిని ఎలా ఆదరించాలో , ఏవిధంగా సత్కరించాలో వెల్లడించినట్లయింది.
    ప్రవరుని భార్య ఉత్తమ గృహిణి. ఆమె "కూకటుల్ కొలిచి చేసిన కూరిమి సోమిదమ్మ" ఆ యిల్లాలు అన్నపూర్ణాదేవి వలె ఎప్పుడు ఎంతమంది అతిధులు వచ్చినప్పటికీ ఏమాత్రం విసుగు లేకుండా కావలసిన పదార్ధాలు వండి వడ్డించేది. ఆ సాద్వీమణిని ఆంధ్ర కవితా పితామహుడు ఈ విధంగా అభివర్ణించాడు.
    
        వంద నలయచు వేవురు వచ్చిరేని
        నన్నపూర్ణకు నుద్దియౌ నతని గృహిణి;
        యతుధు లేతేర నడికి రేయైన బెట్టు
        వలయు భోజ్యంబు లింట నవ్వారి గాగ.
    
    బ్రహ్మచర్యం . గర్ధశ్యం, వానవ్రస్థం, సన్స్యాసం అనే నాలుగు ఆశ్రమాలలో గర్ధస్త్యం ఎంత గోప్పదో పెద్దనగారు సిద్దుని నోటివెంట ఘంటాపధంగా చెప్పించారు.  

        కెలకుల నున్న తలగేటి జున్ను గృహమేది
                    యజమాను డంకస్థితార్దపేటి
        పండిన పెరటి కల్పకము వస్తావ్యుండు
                      దొడ్డి బెట్టిన వేల్పుగిడ్డి కాపు
        కడలేని యమృతంపు నడబావి సంసారి
                      సవిధ మేరునగంబు భావనభర్త
        మరుదేశపధ మధ్యమప్రప కులపతి
                      యాకటి కొదపు సస్యము కుటుంబి
    
        బధిర పంగ్వధ భిక్షుక బ్రహ్మచారి
        జటి పరివ్రాజ కాతిధి క్షపణ కావ
        ధూత కాపాలికా ద్యనాధులకు గాన
        భూసురోత్తమ! గార్హస్త్యమునకు సరియే!
    చెవిటి కుంటి గుడ్డి మొదలైన వికలాంగులకూ, భిక్షుకులూ బ్రహ్మచారులూ వాన ప్రస్థులూ పరివ్రాజకులూ మొదలైన అనాధలకూ గృహస్థుడు, చేతికి అందుబాటులో ఉన్న తేనేపేర వంటివాడు. ఒడిలో ఒదిగిన ధన పేటిక వంటివాడు. పెరటిలో పండిన కల్పవృక్షం వంటివాడు. ముంగిటిలో కట్టిన కామధేనువు వంటివాడు. అమృతంతో నిండిన దిగుడు బావి వంటివాడు. చెంత నిలిచిన మేరు పర్వతం వంటివాడు. ఎడారిలో ఎదురైన చలివేంద్రం వంటివాడు. ఆకలి మంటను చల్లార్చే పంట వంటివాడు!
    అలాగే సన్న్యాసాశ్రమ ప్రాధాన్యం గురించి ప్రవరుని పలుకుల్లో ఇలా ప్రశంసింప చేశారు పెద్దన్నగారు. సిద్దునితో ప్రవరుడు పలుకుతున్నాడు -
    
    మౌనినాధ! కుటుంబ జంబాల పటల
    మగ్న మాదృశ గృహమేధి మంచలంబు
    నుద్దరింపంగ నౌషధ మొందు గలదె?
    యుష్మ దంఘ్రి రాజోలేశ మొకటి దక్క    
    వానిది భాగ్యవైభవము , వానిది పుణ్యవిశేష మెమ్మెయిన్
    వాని దవంధ్య జీవనము, వానిది జన్మము వేరు సేయ కె
    వ్వాని గృహంతరంబున భావదృసయోగిజనంబు పావన
    స్నానవిధాన్న పానముల సంతస మందుచుబోవు నిచ్చలున్.
    
    ఓ యోగీశ్వరా! సంసారమనే బురదగుంటలో దిగబడి పైకి లేవలేకున్న మా వంటి గృహస్థులను ఉద్దరించటానికి మీ వంటి మహానుభావుల పాదధూళి తప్ప మరొక్క టేమున్నది?
    మీ వంటి పుణ్యాత్ములైన యోగీంద్రులు ఎవని యింట్లో పాదం పెడతారో ఎవని యింట్లో ఆతిధ్యం అందుకుంటారో వాడే అదృష్టవంతుడు! వాడే పుణ్య పురుషుడు! వాని జీవితమే సార్ధకం! వాని జన్మమే ధన్యం!
    ప్రవరుడు ఎంతటి అతిదేయుదో అంతటి ఆహితాగ్ని . ఎంతటి ధర్మజ్ఞుడో అంతటి స్థితప్రజ్ఞుడు. ఎంతటి సౌందర్య వంతుడో అంతటి ఏకపత్నీవ్రతుడు. అంతటి సదాచారసంపన్నుడు. అందుకనే పెదన "వాని చక్కదనము వైరాగ్యమున జేసి కాంక్ష సేయు జారకామినులకు భోగబాహ్యమయ్యే" అని తన క్రాంత దృష్టిని ప్రకటించాడు.
    మనుచరిత్ర మహాకావ్యంలో మనకు కొట్టవచ్చినట్టుకనిపించేది ప్రవరుని నియమబద్ద నిష్కళంక  జీవితం. మహాకవి పెద్దన కావ్యారంభంలోనే విప్రపరుడైన ప్రవరుని ఆదర్శ స్వరూపాన్ని కనులకు కట్టిస్తాడు. "అలేఖ్యాతనూ విలాసు "డైన ప్రవరాఖ్యుడు "మకరాంక శశాంక మనోజ్ఞా మూర్తి" గా "భాషా పరశేషభోగి" గా నిర్మల ధర్మకర్మదీక్షా పరతంత్రుడు" గా 'అనారతాధ్యాపన తత్పరుడు" గా "శీలంబున్ గులమున్ శమంబు దమముం జెల్వంబు లేబ్రాయముంబోలన్ జూచి ఇతండే పాత్రుడని యే భూపాలుడీ వచ్చినన్ సాలగ్రామము మున్నుగా గొనని" సదాచారా సంపన్నుడుగా, "తరుణాగ్నిహోత్రి"గా, "అభ్యాగత సేవా పరతంత్రుడు " గా "చతురాస్యవంశ కలశోదధి పూర్ణశశాంకుడు" గా సాక్షాత్కరిస్తాడు.
    ప్రవరుడు సిద్దుని పాదలేప ప్రభావం వాళ్ళ హిమవత్పర్వటానికి వెళ్ళి అచ్చటి విచిత్రాలూ విశేషాలు అన్నీ చూస్తాడు. అచ్చటి మంచు వల్ల పాదాలకు పూసిన పసరు కరిగిపోతుంది. ఆ కొండ కొనలో చిక్కుపడి ఇల్లు చేరే మార్గం కోసం అన్వేషిస్తున్న ప్రవరుడికి వరూధిని కనిపిస్తుంది.
    ఆ "విద్యుల్లతా విగ్రహ", ఆ "శతపత్రేక్షణ", ఆ "చంచరీక చికుర", ఆ చంద్రస్య", ఆ "చక్రస్తని", ఆ మరున్నా రీశిరోరత్నం" యక్షతనయెందు జయంత వసంత కంతులను తలదన్నే ప్రవరుని సౌందర్యాన్ని తిలకించి పులకించి పోతుంది. అతని త్రోవకు అడ్డంగా వచ్చి నిలుచుంటుంది.
    విభ్రాంతుడైన ప్రవరుడు "ఎవ్వతే నీవు భీతహరిణేక్షణ?" అంటాడు. "నేను ప్రవరుడనే భూసురుణ్ణి ఇక్కడకు వచ్చి ఇరుకున పడ్డాను. మా ఊరికి దారి చూపించు. నీకు శుభం కలుగుతుంది." అంటాడు.
    ప్రవరుని పలుకులకు వరూధిని నవ్వు వస్తుంది. "ఇంతలు కన్నులుండ తెరువెవ్వరి వేడెడు భూసురేంద్ర?" అంటుంది. "ఔనులే , ఏకాంతంగా ఉన్న జవరాండ్రను ఇలాగే పలకరిస్తారులే! ఆయినా వచ్చిన మార్గం నీకు తెలియకపోవటమేమిటి? చాలు పరాచికాలు! నా పేరు వరూధుని. ఘ్రుతాచి , తిలోత్తమ, హరిణి, రంభ, శశిరేఖ, మొదలైన వారంతా నా ప్రాణసఖులు. మేము అప్సరసలం. ఓయి నవమన్మధుడా! నీవు మాకు అతిధివైనావు. మా యింటికి రా! ఆతిధ్యం అందుకో! అలుపు తీర్చుకో! అయ్యో పాపం! కుందనం వంటి మేను కందిపోయింది. ఒప్పులోలికే వదనం వడగాలికి వాడిపోయింది. రావయ్యా రా! మా గృహం పావనం చేయి" అన్నది ఆ చిన్నది.
    అందుకు ప్రవరుడు 'అమ్మాయీ! నీ మర్యాదకు సంతోషం. నేను మీ యింటికి రాకపోయినా వచ్చినట్లే భావించు. నేను తొందరగా ఇంటికి వెళ్ళాలి. మా ఊరికి దారి చెప్పు తల్లీ!" అన్నాడు.
    అతని మాటలకు వరూధిని చిరునవ్వు నవ్వి ఇలా అన్నది-
    
    "ఎక్కడి యూరు? కల్నిలువ కింటికి బోయేదనంచు బల్కేదీ
    వక్కట! మీ కుటీర నిలయంబులకున్ సరిరాకపోయెనే
    యిక్కడి రత్న కందరమూ లిక్కడి నందనచందనోత్కరం
    బిక్కడి గాంగ\సైకతము లిక్కడి యీ లవలీ నికుంజముల్?"
    "ఇదిగో ఇంకా దాపరికందేనికి? ఉన్నమాట చెబుతున్నాను విను. నా మనస్సు నీ మీద లగ్నమయింది. నన్ను విరహాగ్ని లో కూల దోస్తావో! కౌగిటిలో గౌరవిస్తావో!"
    ఆ మాటలు విని ప్రవరుడు "తరుణీ! ఇది ధర్మం కాదు. మా వంటి ధార్మికులైన బ్రాహ్మణులను కామించడం సరికాదు. నా జననీజనకులు వృద్దులు. నాకోసం భోజనం చేయకుండా ఎదురుచూస్తూ ఉంటారు. మా యింటి వద్ద అగ్నిహోత్రాలు ఆగిపోతాయి. దేతార్చన, అతిధిపూజ మిగిలిపోతాయి. నేను ఆహితాగ్నిని. నేను ఇంటికి చేరి తీరాలి" అన్నాడు. 

 Previous Page Next Page