Previous Page Next Page 
కరుణశ్రీ సాహిత్యము - 5 పేజి 18

 

                      మనుచరిత్రం - సందేశం
    
        నియతికృత నియమరహితాం
        హ్లాదైకమయీ మనన్య పరతంత్రామ్
        నవరసరుచిరాం నిర్మితి
        మాదధతీ భారతీ కవేర్ణయతి.
    
    విధికృతములైన నియమనిర్భంధముల కతీతమూ, ఆనందమయమూ, అనన్య పరతంత్రమూ, నవరసరుచిరమూ అయిన సృష్టిని సాగించే సత్కని సరస్వతి సర్వోత్మష్టమై విరాజిల్లుతున్నది.
    "రసోవైస" అన్నది ఉపనిషత్తు. "వాక్యం రసాత్మకం కావ్యమ్ " అన్నారు అలంకారికులు. ఈ రెండు వాక్యాలనూ సమన్వయించి చూస్తె సరసమైన కావ్యం పరమాత్మ స్వరూపమే అని స్పష్టమవుతుంది.
    
        వాక్కు పార్వతి; అర్ధ మీశ్వరుడు ; తద్ర
        సోర్ధ్రా సంబంధమే కావ్యమై తనర్చు;
        కావ్య సంసేవనంబు సంభావ్యమాన
        పార్వతీ పరమేశ్వరాభ్యర్చనంబు
    కవికుల తిలకుడైన కాళిదాసు "వాగార్దావివ సంపృక్తౌ వాగర్ధ ప్రతిపత్తయే" అని జగత్పితరులైన పార్వతీ పరమేశ్వరులకు వాగార్ధములతో రమ్యమైన ఔషమ్యం సమకూర్చి సమస్కరించాడు. అందువల్ల "ఉదాత్త కావ్య సంసేవనం ఉమామహేశ్వర సంభావనం" అనటంలో విప్రతిపత్తి లేదు.
    అలంకారిక శిరోమణి అయిన ఆచార్య మమ్ముటులవారు "కావ్య ప్రకాశం" లో కావ్యప్రయోజనాలను ఇలా పేర్కొన్నారు-
        కావ్యం యశసే అర్ధకృతే
        వ్యవహారవిదే శివేతరక్షతయే
        సద్య ; పరనిర్వ్రుతయే
        కాంతా సమ్మితత యోపదేశయుజే.
    కీర్తి ధనం మొదలైన సామాన్య ప్రయోజనాలను అలా ఉంచితే పద్య; పరనిర్యతి, ఉపదేశం కావ్యానికి పరమ ప్రయోజనాలని తేలుతుంది. అంటే కావ్యం ఆనందంతో పాటు సందేశాన్ని కూడా అందించాలని ఆచార్యుల అనుశాసనం. "విశ్వశ్రేయ; కావ్యమ్ " అన్న ఆదికవి అభిప్రాయం కూడా అదే.
    వేదం ప్రభుసమ్మితం. పురాణం మిత్రసమ్మితం. కావ్యం కాంతా సమ్మితం.
    "సత్యం వధ, ధర్మం చర, స్వాధ్యాయా న్న ప్రముదితవ్యమ్" అని ప్రభువు లాగా శాసిస్తుంది వేదం. "రామాదివత్ ప్రవర్తితవ్యమ్ న రావణాదీవత్" అని మిత్రుని వలె హితోపదేశం చేస్తుంది పురాణం. ఇక కావ్యమంటారా! ప్రియకాంతవలె చెంత చేరి హృద్యంగమాములైన మృదుమధురోక్తులతో సున్నితంగా సుందరంగా ప్రసన్నంగా రసార్ద్రంగా కర్తవ్యాన్ని స్పురింపజేస్తుంది!
    రామాయణ మహాకావ్యం చదువుతున్నప్పుడు సద్గుణసాంద్రుడైన శ్రీరామచంద్రుడు మనకు ఆదర్శంగా దర్శన మిస్తాడు. అలాగే మహాభారతం "ధర్మం జయిస్తుంది. అధర్మం నశిస్తుంది." అన్న సందేశాన్ని పఠితలకు అందిస్తుంది.
    హృదయ స్పందన రూపమైన ఆనందమే కావ్యానికి ప్రధానప్రయోజన మానుకున్నా ఆ ఆనందానికి సందేశం కూడా తోడైతే సువర్ణానికి సుగంధం అబ్బినట్లే మరి! పాఠకులకూ శ్రోతలకూ ఆనందాన్ని కలిగించేది ఉత్తమ కావ్యం. ఆనందంతో పాటు ఉపదేశాన్ని కూడా అందించేది ఉత్తమోత్తమకావ్యం.
    ఆంధ్ర సాహిత్యంలో రామాయణ మహాభారత భాగవతాల తరువాత అత్యధిక ప్రచారాన్ని పొందిన మహాకావ్యం అల్లసాని పెద్దన గారి మనుచరితం. ఈ మహా ప్రబంధం అనంతరం ప్రభవించిన ప్రబంధాలన్నిటికీ ఒబ్జబంతియై నిలిచి అల్లసాని వారికి 'ఆంధ్రకవితాపితామహ" బిరుదం చేకూర్చింది.
    కావ్యావతారికలోనూ , అశ్వాసాంత గద్యాలలోనూ పెద్దన కవీంద్రులు తన ప్రబంధాన్ని "స్వారోచిష మను సంభవం" అనే పేర్కొన్నారు. అయితే దీనికి "మనుచరిత్ర " అనే నామాంతరం కూడా ఉన్నది. ఈ నామమే ఎక్కువగా వాడుకలోకి వచ్చింది. పెద్దనగారే - "మనుచరిత్రం బందుకొనువేళ బురమేగ పల్లకి తనకేం బట్టి యెత్తే" అన్నారు.
    మనమంతా మనువుల సంతతివారం. కనుకనే మానవులం - మనుజులం- మనుష్యులం అయినాము. ఈ మనువులు పదునాలుగు మంది. ఇప్పుడు ఏడవ వాడైన వైవస్వత మన్వంతరం నడుస్తున్నది. మనువులలో మొదటివాడు స్వాయంభువమనువు. రెండవవాడు స్వారోచిష మనువు. ఈ సార్వోచిష మనువు జన్మ వృత్తాంతమే తన కావ్యంలో వర్ణించి దీనికి "స్వారోచిష మనుసంభవం" అనే సార్ధకనామం ఉంచారు పెద్దనగారు.
    అల్లసాని పెద్దన గారు ఆంధ్రభోజుడైన శ్రీకృష్ణదేవరాయల అభ్యర్ధన మేరకు "శిరీష కుసుమ పేశల సుధామయోక్తు "లతో తన కావ్యాన్ని తీర్చి దిద్దారు. ఈ మహాకావ్యంలోని అల్లిక జిగిబిగి, ప్రసన్న మధురమైన శైలీ కధా సంవిధానమూ , సన్నివేశ చరుత్వమూ , సంభాషణ నైపున్యమూ, పాత్ర చిత్రణమూ సహృదయ హృదయాలను ఆనందతరంగాలలో ఒలలాడిస్తా యనటంలో సందేహం లేదు. అయితే ఈ మహాకావ్యం ఆనందంతో పాటు ఎటువంటి సందేశాన్ని అందిస్తున్నదో అవలోకిద్దాం.
    "మాతృదేవో భవ", "పితృదేవోభవ", "ఆచార్యదేవో భవ", 'అతిధి దేవో భవ," అన్న సార్వకాలికమైన , సార్వజనీనమైన సూక్తులకు చక్కని భాష్యం తన ప్రబంధంలో పొందుపరచారు పెద్దనగారు.
    కుటుంబం అంటే ఎలా ఉండాలో ప్రబంధ ప్రారంభంలోనే మన కళ్ళకు కట్టించారు. చూడండి -
    
    యౌవనమందు యజ్వయు ధనాధ్యుడునై కమనీయకౌతుక
    శీవిధి గూకటుల్ గొలిచి చేసిన కూరిమిసోమిదమ్ము సౌ
    ఖ్యావహయై భజింప, సుఖులై తలిదండ్రులు గూడి దేవియున్
    దేవరవోలే నుండి యిలు దీర్పగ, గాపుర మెప్పు వానికిన్.
    యౌవనవంతుడైన ప్రవరుడు సోమయాజియై ,ఐశ్వర్యవంతుడై ఉన్నాడు. అతనికి ఈడూజోడైన భార్య సోమిదమ్మ. ఆమె అతనికి అన్ని విధాల 'అనుకూలవతి" యై సేవలు చేస్తున్నది. పార్వతీ పరమేశ్వరుల వంటి తల్లిదండ్రులు ఇంటి పనులన్నీ నిర్వహిస్తున్నారు. ప్రవరుడు హాయిగా కాపురాన్ని నడుపుకొంటూన్నాడు. ఇక్కడి ప్రవరుడి కుటుంబవర్ణన ఆంధ్రులందరికీ ఆదర్శప్రాయమైనదే.
    మరొక సన్నివేశంలో హిమవత్పర్వత ప్రాంతంలో తన పదాలకు సిద్దుడు పూసిన పసరు మంచుతో పాటు కరిగిపోయినప్పుడు -
    
        "నను నిముసంబు గానకయున్న నూరెల్ల
                    నరయు మజ్జనకు డెంతడలు నొక్కొ
        యెపుడు సంధ్యలయందు నిలువేళ్ళనీక న
                             న్నో మేదు తల్లి యెంతోరలు నొక్కో"
    అని ఎక్కడో సుదూరంగా ఉన్న తండ్రినీ, తల్లినీ తలుచుకొని ప్రవరుడు తల్లడిల్లటం వల్ల వారికీ అతని మీద ఉన్న వాత్సల్యానురాగాలతో పాటు అతనికి వారి మీద ఉన్న ఆదరాభిమానాలు సైతం అభివ్యక్తమైనాయి.
    ప్రవరుడి దినచర్యను వర్ణించేటప్పుడు ఆచార్యుడి స్వరూపం ఏ విధంగా ఉండాలో ఈ సీస పద్యంలో అల్లసానివారు అత్యంత సహజంగా ఆవిష్కరించారు.
    
        వరుణాతరంగిణి దరవికస్వర నూత్న
                         కమల కషాయ గంధము వహించి
        ప్రత్యూష పవనాంకురముల పైకొను వేళ
                             వామనస్తుతి పర్వతమున లేచి
        సచ్చాత్రుడగుచు నిచ్చలు నేగి యయ్యేట
                          నఘమర్షణ స్నాన మాచరించి
        సంధ్యాకృత్యము దీర్చి సావిత్రి జపియించి
                           సైకతస్థలి గర్మసాక్షి కెరగి
        ఫల సమిత్కుశ కుసుమాది బహుపదార్ధ
                       తతియు సుదుకిన మడుగుదోవతులు గొంచు
        బ్రహ్మచారులు వెంట రా బ్రాహ్మణుండు
                        వచ్చు నింటికి బ్రజ తన్ను మెచ్చి చూడ.
    ప్రవరుడు ప్రతిదినం ప్రాతఃకాలంలో చల్లని పిల్లగాలులు ఒంటికి తగులు తుంటే నిద్రలేచేవాడు. వామనస్తుతి చేసేవాడు. శిష్యులతో పాటు వరణానదికి వెళ్ళేవాడు. తలనిండా స్నానం చేసి, సంధ్యావందనం కావించేవాడు. గాయత్రీ మంత్రాన్ని జపించేవాడు. సూర్యభగవానుడికి భక్తితో నమస్కరించేవాడు. శిష్యులైన వటువులు పండ్లు, సమిధలు దర్బలు పూలతో పాటు ఉతికిన మడి బట్టలు తీసుకొని వెనుకనే వస్తుంటే తిరిగి తన యింటికి చేరుకోనేవాడు. ప్రజలంతా అతని నియమ నిష్టలకు మెచ్చుకొని నిత్యమూ అతన్ని అత్యంతమైన ఆదరాభిమానాలతో అవలోకించేవారు. అచ్చమైన ఆచార్యుడు ఎలా ఉండాలో దీనిని బట్టి మనకు అర్ధమవుతుంది -

 Previous Page Next Page